koodali

Friday, July 1, 2011

చెప్పుకున్న విధానాలు ఆచరించటం వల్ల.......

 

 

శ్రీ పద్మనాభ స్వామి వారి దేవాలయంలో సంపద గురించి పదేపదే వార్తలలో చెప్పటం ఎందుకు ..అనిపిస్తుంది.నాకు..
............................................
 

సరే ,.ఇంతకు ముందు కొన్ని టపాలలో కుటుంబాలలో కలతలు రావటం గురించి చెప్పుకున్నాం కదండి.

ఒక 50 ఏళ్ళ క్రితం ఆడవాళ్ళు బయటకు వచ్చి సంపాదించటమనేది తక్కువగా ఉండేది. ఇప్పుడు సమాజం చాలా మారిపోయింది. ఇంకో 50 ఏళ్ళు అయితే ఇంకెన్ని మార్పులు వస్తాయో !


ఈ రోజుల్లో పెద్దవయసు వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కర్మకాలి వాళ్ళు బాత్రూం లో కాలుజారి పడో, లేక పక్షవాతం వచ్చో మంచానికి పరిమితం అయిపోయారనుకోండి. ఈ రోజుల్లో వాళ్ళను చూసే వారే తక్కువ.


భార్యాభర్తలు ఇద్దరూ బిజీ కదా ! ఈ రోజుల్లో చంటి పిల్లలను చూసుకోవటానికి కూడా పెద్దవాళ్ళకు తీరిక లేక పిల్లలను క్రచ్ లలో వేస్తున్నారు.

అది అలా ఉంచితే మీడియాలో వార్తలు చూస్తుంటే వివాహేతర సంబంధాలు, విడాకులు, వివాహవ్యవస్థ విచ్చిన్నమవటం , యువతరంలో సహజీవనం వంటివి పెరుగుతున్నట్లుగా అనిపిస్తోంది.

ఇంకా స్కూల్స్, కాలేజీలలో చదువుతున్న అమ్మాయిల పట్ల , ఆఫీసుల్లో పనిచేసే మహిళల పట్ల కొందరు మగవారి వేధింపులు, వీటిగురించి వింటున్నాము.

ఇవన్నీ వింటున్న భార్యలకేమో తమ భర్తల గురించిన బెంగ, భర్తలకేమో తమ భార్యల గురించిన బెంగ, తల్లిదండ్రులకేమో తమ పిల్లల గురించిన బెంగ ఉంటుంది.

ఇలా పరస్పర అనుమానాలు, భయాలతో ఎన్నో కుటుంబాల్లో గొడవలు జరగటం , అవి విడాకులకు దారితీయటం వింటున్నాము.


నాకు ఏమనిపిస్తుందంటే, కొంతకాలం క్రిందట అమ్మాయిలకోసం విడిగా పాఠశాలలు, కళాశాలలు ఉండేవి. మళ్ళీ ఆ పద్దతి వస్తే ఈ బాధలు సగమయినా తగ్గే అవకాశముంది.

ఇంకా , చదువుకున్న ఆడవాళ్ళు కొందరు ఒక గ్రూప్ గా ఏర్పడి చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చు. ( ప్రభుత్వం రుణం కూడా ఇస్తుంది. )

అందులో పేద, మధ్యతరగతి మహిళలను ఉద్యోగానికి తీసుకోవటం వల్ల వారికి సహాయం చేసినట్లు అవుతుంది.


పరిశ్రమలంటే కుటీరపరిశ్రమలు, జ్యూట్ సంచుల తయారీ, పచ్చళ్ళు, పిండివంటల తయారీ, ( డ్వాక్రా సంఘాలలా ), బట్టలపై అద్దకం, ఫాషన్ టెక్నాలజీ, ఇంకా రైతుల వద్ద పంట కొని ఉదా...వడ్లు కొని బియ్యం అమ్మటం, కందులు కొని కంది పప్పు చేసి అమ్మటం, టమేటో కొని ఎండబెట్టి అమ్మటం( వరుగులు ) ఇలా ఎన్నో చేయవచ్చు.


ఇవన్నీ చేయటం కుదరకపోయినా ........ సమాజానికి ఏదైనా సహాయం చెయ్యాలని ఉండే ఆడవాళ్ళు సాయంత్రం పూట చుట్టుపక్కల పేద పిల్లలకు ట్యూషన్ చెప్పవచ్చు. తమకు తెలిసిన కుట్లు, అల్లికలు, ఫాబ్రిక్ పెయింటింగ్ నేర్పించవచ్చు.

ఆఫీసుల్లో ఆడవారికి నచ్చినట్లు టైమింగ్స్ ఉండవు కదా ! ఎప్పుడో ప్రొద్దున వెళ్ళి రాత్రికి రావలసి వస్తుంది.

అలా కాకుండా మహిళలే స్థాపించిన పరిశ్రమల్లో అయితే వారు తమకు తగ్గట్లు 10 నుంచి సాయంత్రం 4 వరకు మాత్రమే పనిచేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు.

ఆ విధంగా కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ఇంకా ఆఫీసు దగ్గర్లో చిన్న
క్రచ్ ఏర్పాటు చేసుకుంటే చంటి పిల్లల తల్లులు మధ్యలో ఒకసారి వెళ్ళి చూసుకోవచ్చు.


ఆ మధ్య నేను పత్రికలో చదివాను. ఒక పేరున్న బాంక్ వారు పూర్తిగా మహిళా ఉద్యోగులతో ఒక శాఖను బెంగళూరులో ఏర్పాటు చేశారట. అలాగే ఒక పరిశ్రమ వారు స్పేర్ పార్టులు తయారు చేసే ఒక యూనిట్ ను మహిళా ఉద్యోగులతో ఏర్పాటు చేశారట.

ఈ రోజుల్లో వైద్యులు, నర్సులు, అధ్యాపకులు వంటి కొన్ని రంగాలలో మహిళలు పనిచేయటం అవసరం.

ఈ రోజుల్లో మనుష్యుల్లో పడిపోతున్న నైతికవిలువల గురించి ఎన్నో సంఘటనలు వింటున్నా ... సమాజం పూర్తిగా పాడయిపోయిందని అనుకోకూడదు.

సంప్రదాయాన్ని పాటిస్తూ, పద్దతిగా ఉండేవారు ఎందరో ఉన్నారు.

సినిమా రంగంలోనే చూడండి. భానుమతి గారు తన హుందా ప్రవర్తన వల్ల ఎంత గౌరవాన్ని పొందారో.

రాజకీయాల్లో ,ఇంకా ఇతర రంగాల్లో కూడా కూడా మంచి పద్దతిగల మహిళలు, పురుషులు ఎందరో ఉన్నారు.

కొన్ని సంవత్సరాల క్రిందట ఒక పత్రికలో చదివానండి. ఒక టీనేజీ అమ్మాయి ఒక పేరున్న సినిమా హీరో ఇంటికి వచ్చిందట.

తనకు ఆయన అంటే చాలా అభిమానమని ఆఖరికి వాళ్ళింట్లో పని చేసి అయినా బ్రతికేస్తానని ప్రాధేయపడిందట.

అప్పుడు వారు ఆ అమ్మాయిని మందలించి ఆ పిల్ల తన కూతురితో సమానమని చెప్పి ఆ అమ్మాయిని ఇంటికి తిప్పి పంపించేశారట.

ఆ నటుని పేరు పత్రిక వారు రాయలేదు.

ఇలాంటి వారివల్లే నైతిక విలువలపై నమ్మకం ఇంకా మిగిలి ఉంది.

అయితే అన్ని రంగాల్లో లాగే సినిమా రంగంలో కూడా మంచితో పాటూ చెడు కూడా ఉంటుంది. అందుకని జాగ్రత్తగా కూడా ఉండాలి . ఈ రోజుల్లో ఇలాంటి వార్తలు ఎన్నో వింటున్నాము కదా !


పైన చెప్పుకున్న విధానాలు ఆచరించటం వల్ల కుటుంబానికి సమయం కేటాయించగలుగుతారు. మగవాళ్ళ వేధింపులకు భయపడే ఆడవాళ్ళకు రక్షణ లభిస్తుంది. ఇంకా భార్యాభర్తల మధ్య అనుమానాలు, అపార్ధాలు , తగ్గే అవకాశం ఉందని నాకు అనిపించిందండి.

 

No comments:

Post a Comment