koodali

Wednesday, July 20, 2011

పురాణేతిహాసాల నుంచీ మనం ఎంతో నేర్చుకోవలసి ఉంది. ..........

 
ఓం.

ప్రాచీన గ్రంధాలలో ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి.

ఖగోళం, ఆయుర్వేదం, విశ్వం గురించి ,ఇంకా విశ్వంలోని ఇతర లోకాలగురించి ఎన్నో గొప్ప విషయాలను పెద్దలు ఈ గ్రంధాల ద్వారా మనకు అందించారు.

ఇవే కాకుండా  సమాజంలో ఏ విధంగా ప్రవర్తించాలి,ఏది ధర్మం, ఏది అధర్మం.......ఇలా ఎన్నో విషయాలను పురాణేతిహాసాల లోని కధల ద్వారా తెలియజేసారు.

ధర్మానికి, అధర్మానికి మధ్యన సన్నని గీత మాత్రమే ఉంటుంది.

అవన్నీ తెలియాలనే,
దైవము, పెద్దలు మనకు..ఎన్నో కధలను, ఉప కధలను, రకరకాల సంఘటనలను, వ్యక్తులను సృష్టించి,వాటి ద్వారా రాబోయే తరాలకు దిశానిర్దేశం చేశారు.

కొందరు ఏమనుకుంటారంటే ,పవిత్రమైన గ్రంధాలలో ఇలా చెడు సంఘటనలు, చెడ్డ వ్యక్తులు గురించిన విషయాలు ఉన్నాయి.

ఇలాటివి తెలుసుకొమ్మని పెద్దలు ఎందుకు చెప్పారో? అని అపార్ధం చేసుకుంటారు.

నాస్తికులయితే ఇవన్నీ చదివి వేళాకోళం చేస్తారు కూడా.

కానీ, చూడండి. ఆ కధలలో అంతా మంచే ఉంటే ..

ఉదా.. ఒక వ్యక్తి బాల్యదశ ఏ కష్టాలు లేకుండా గడిచి,
యవ్వనం ఇబ్బందులు లేకుండా గడిచి, వృద్ధాప్యం సుఖంగా గడిపి..జీవితాన్నీ చాలించారు..అని కధ చెప్పారనుకోండి.


కధ బాగుంటుంది.కానీ,అందరి జీవితాలు 
లాఉండవు కదా!

సమాజం అన్నాక ఎంతో వైవిధ్యం గా ఉంటుంది. భిన్న మనస్తత్వాల వారు ఉంటారు.

ఒకే వ్యక్తి ( వివిధ కారణాల వల్ల ) ఒకోసారి ఒకోరకంగా కూడా ప్రవర్తిస్తాడు.

ఇప్పుడు సమాజంలో చూడండి ..ఎన్నో నేరాలు.ఘోరాలు జరుగుతున్నాయి. మంచి సంఘటనలూ జరుగుతున్నాయి.

మంచివారూ ఉన్నారు , చెడ్డవారూ ఉన్నారు.

* మరి వీటన్నిటి మధ్య మనం ఎలా జీవించాలి ? ఏది ధర్మం ? ఏది అధర్మం ? ఎవరు చెబుతారు ? ....... అని అయోమయంలో పడకుండా,

* దైవం, పెద్దలు .. పురాణేతిహాసాలలోని పాత్రలు, సంఘటనల ద్వారా , ఈ జగన్నాటకంలో మనం ఎలా ప్రవర్తించాలో ,ఎలా ప్రవర్తించకూడదో , ఎలా ప్రవర్తిస్తే పర్యవసానం ఎలా ఉంటుందో ..మనకు దిశానిర్దేశనం చేశారు అనిపిస్తుంది.

అందుకే ఈ గ్రంధాలలో, లోకంలో ఉండే విభిన్న వ్యక్తిత్వాలూ, విభిన్న సంఘటనలు కనిపిస్తాయి.


* ఇంకా, పురాణేతిహాసాలలో గమనించితే , ఎంత గొప్ప వ్యక్తి అయినా , అధర్మంగా ప్రవర్తించినప్పుడు ....పర్యవసానంగా వారు ఎంతో కొంత బాధను అనుభవించటాన్ని మనం గమనించవచ్చు.

* సకలచరాచర జగత్తు రాగద్వేషాలతో నిండినదే..అని పెద్దలు తెలియజేసారు.

దేవతలు అంటే వారికి రాగద్వేషాలు ఉండవని మనకు ఒక అభిప్రాయం.

కానీ, దేవతలు త్రిగుణాతీతులు కాదు. అయితే దేవతలు సత్వగుణ సంభవులు.


మానవులు రజోగుణ సంభవులు. అంటే రజోగుణం ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు.

రాక్షసులు, పశుపక్షాదులు తమోగుణ సంభవాలు. అంటే వారిలో ఆ గుణం అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు.


* పరబ్రహ్మ అయిన పరమాత్మ మాత్రమే త్రిగుణాతీతులు, వారు సగుణ గానూ ఉండగలరు. నిర్గుణ గానూ ఉండగలరు.

* అందుకే , మనల్ని సరైన దారిలో నడిపించమని పరమాత్మను శరణు వేడాలి.

ఒక న్యాయవాది న్యాయశాస్త్రాన్ని చదివేటప్పుడు , అందులో ఎన్నో రకాల నేరాల గురించి నేరస్తుల గురించీ తెలుసుకోవసి ఉంటుంది.

* అంతే కాకుండా, తప్పు చేయని వారిని ఎలా రక్షించాలో కూడా నేర్చుకోవలసి ఉంటుంది.

అంతే కానీ, నేను మంచివ్యక్తిని .కాబట్టి, నేరాలు వంటి చెడ్డ విషయాలు నేను వినను, చదవను.అంటే కుదరదు కదా!

అలాగే మనం కూడా ధర్మం అధర్మం గురించి తెలుసుకునే క్రమంలో ....

రాక్షసుల గురించి , అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల గురించి ,  వారు మంచివారిని వేధించిన సంఘటనల గురించి,  మానవ మనస్తత్వంలోని బలహీనతల గురించి కూడా ..పురాణేతిహాసాలలోని కధలలో తెలుసుకుంటాము.


ఒకోసారి మంచి వ్యక్తులు కూడా ఎన్నో కారణాల వల్ల అధర్మంగా ప్రవర్తించటం..దాని ఫలితంగా బాధలు పడటం వంటి సంఘటనలూ ఈ కధల ద్వారా తెలుసుకోవచ్చు.


ఇవన్నీ చదివితే మనుష్యుల్లో ఇలా విభిన్న స్వభావాలు ఉంటాయా ! అని ఆశ్చర్యం వేస్తుంది కూడా .

*ఈ కలికాలంలో పెరిగే అధర్మాన్ని పెద్దలు ఎప్పుడో ఊహించారు.

* కాబట్టే , ఇప్పుడు జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలు, తప్పులు, వ్యక్తుల మధ్య అసూయ,లోభం, అధికారంకోసం ఆరాటం, కీర్తి, డబ్బు, వీటికోసం ఎంతకయినా తెగించటం.. ఇవన్నీ పురాణేతిహాసాల కధల
ద్వారా తెలియజేసారు.


ఆ విధంగా లోకంలోని మోసం , అధర్మం నుంచీ జాగ్రత్తపడమని మనలను హెచ్చరించటానికే ..లోక హితం కోసం ఆ కధలను అలా వివరంగా చెప్పటం జరిగింది.

*
పురాణేతిహాసాల ద్వారా ... అధర్మానికి తాత్కాలిక విజయం...ధర్మానికి అంతిమ విజయం లభిస్తుందని మనం గ్రహించగలం.

చరిత్ర నుంచీ మనం పాఠాలు నేర్చుకోవలసి ఉంది.

భగవంతుని తీర్పు మనుష్యులు ఇచ్చే తీర్పులా సాక్ష్యం మీద ఆధారపడి మాత్రమే ఉండదు.

* ఒక వ్యక్తి పూర్వ జన్మ కర్మలు, ఇప్పడు చేస్తున్న కర్మలు , ఇంకా ఇతరత్రా ఎన్నో అంశాలను దృష్టిలో ఉంచుకొని భగవంతుని తీర్పు ఉంటుంది.

* పురాణేతిహాసాలలోని పాత్రల
ను , వారి పూర్వ కర్మ........ ఇలా ఎన్నో అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఎన్నో కోణాల నుంచీ ఆలోచించి రచించారు.

అందుకే పురాణేతిహాసాలు అపార్ధం చేసుకోవటం తప్పు.

* ( ఇలాంటి విషయాలు పెద్దల ద్వారా తెలుసుకోవటం తప్ప నాకు పెద్దగా పాండిత్యం లేదు.

అయితే మా ఇంట్లో వచనరూప " శ్రీ దేవీ భాగవతము." గ్రంధము ఉందండి. నాకు తెలిసినంతలో ఏదో ఇలా వ్రాస్తుంటాను.

ఇంతకుముందు కూడా కొన్ని టపాలు ( జూలై 5, 2010 )వ్రాశాను. ఇందులో పొరపాట్లు ఉంటే క్షమించవలెనని దైవాన్ని కోరుకుంటున్నానండి...)



No comments:

Post a Comment