koodali

Monday, July 18, 2011

స్త్రీకి స్త్రీయే శత్రువా ? కాదా ?..

 

స్త్రీలు చాలా మంది పురుషాధిక్య ధోరణి వల్లే తమకు కష్టాలు వస్తాయి అనుకుంటారు.

సరే, స్త్రీలు అంటే గౌరవం లేకుండా స్త్రీలను పీడించే పురుషులు చాలా మంది ఉన్నమాట నిజమే.

కానీ, కేవలం మగవారి వల్లే స్త్రీలకు కష్టాలు వస్తున్నాయంటారా ?

స్త్రీల వల్లే తోటి స్రీలకు వచ్చే కష్టాల మాటేమిటి ?

అత్తా, కోడళ్ళ గొడవల్లో పోటీపడేది స్త్రీలే గదా !

ఒక స్త్రీ గర్భం ధరించటం కొంతకాలం ఆలస్యమయితే చాలు, ఇక గొడ్రాలు అంటూ విసిగించి వేధించేది అత్తగారు, ఆడపడుచులు, తోటిస్త్రీలు.... వారూ స్త్రీలే గదా !

పిల్లలు పుట్టి వారు అందరూ ఆడపిల్లలయితే , అందుకు కోడలినే తప్పుపట్టి కొడుకుకు ఇంకో పెళ్ళి చేయటానికి సిద్ధపడే అత్తగార్లు కూడా ఉంటారు.

స్కానింగ్ లో ఆడపిల్ల అని తెలిస్తే కడుపులో పిండాన్ని, వీలుకాకపోతే పుట్టిన తరువాత ఆ పిల్లను చంపేసే వాళ్ళలో ఆ ఇంటి ఆడవాళ్ళు కూడా పాత్రధారులే. .

ఇక కట్నం వేధింపులు, చావులు విషయంలో చెప్పనే అక్కర్లేదు.........

ఆ విషయంలో ఇంటి కోడలిని వేధించే వారిలో అత్తగారూ, ఆడపడుచుల పాత్ర ఎంతో ప్రధానమైనది. . .

ఇక కొందరు కోడళ్ళు కూడా తక్కువ వారేమీ కాదు.

పెళ్ళి అయిన మరుక్షణం నుంచీ ....... ఇక అత్తగారి మీద భర్తకు చాడీలు చెబుతూ భర్తను వారి తల్లిదండ్రులకు దూరం చేయటానికి ప్రయత్నం చేసే కోడళ్ళు ఎందరో ఉన్నారు.


ఇక కోడళ్ళు కూడా తమ తల్లి కోప్పడితే అంతగా బాధపడరు ..... అదే అత్తగారు కోప్పడితే సీరియస్ గా తీసుకుంటారు.

ఇక అత్తగారేమో తన కూతురుకు ఒక న్యాయం ....... కోడలికి ఒక న్యాయంగా ప్రవర్తిస్తారు.

అత్తగార్లు తాము ఒకప్పుడు కోడళ్ళమే అనీ......కోడళ్ళు తామూ కాబోయే అత్తలమే అని గుర్తు పెట్టుకున్న రోజున ఇంట్లో అందరికీ సుఖంగా ఉంటుంది.

అత్తాకోడళ్ళ మధ్యన ఈ గొడవలకు అభద్రతా భావం, తన చెయ్యే పైన ఉండాలనే పోటీ మనస్తత్వం ఇలా ఎన్నో కారణాలు.

కోడలికి అత్తగారు, అత్తగారికి కోడలు సపోర్ట్ గా ఉంటే ఎంత బాగుంటుంది !

ఇవన్నీ కాకుండా కొందరు మగవాళ్ళ వివాహేతర సంబంధ కారణంగా బాధలు పడేది .. మళ్ళీ స్త్రీయే.

ఇలా స్త్రీ కష్టాలకు తోటి స్త్రీయే కారణమవుతోంది.

స్త్రీలలో త్యాగమూర్తులూ ఉన్నారు...తనకు లభించని అదృష్టం ఇంకొక స్త్రీకి లభిస్తే అసూయతో కాపురాలు కూల్చే పడతులూ ఉన్నారు...

సెలెబ్రిటీలు అనే వారి విషయంలో చూస్తున్నాము కదా ! మగవారు భార్యకు విడాకులు ఇచ్చేసి వేరొక స్త్రీని వివాహం చేసుకుంటున్నారు.

కొన్ని సార్లు భార్య కూడా తాను ఇంకొకరిని వివాహం చేసుకుంటుంది.

ఇలా పిల్లలు పుట్టాక బాధ్యత లేకుండా... ఎవరి స్వార్ధం వారు చూసుకుంటున్నారు.

అలాంటి పిల్లలు వివాహవ్యవస్థ అంటేనే నమ్మకాన్ని కోల్పోతున్నారు.

పిల్లల సమస్యల గురించి సినిమాలు తీసే అమీర్ ఖాన్ వంటివారు .... ఇలాంటి పిల్లల సమస్య గురించి కూడా .. గొప్ప సినిమా తీస్తే ఎంతో బాగుంటుంది మరి.

ఇక, పిల్లలను పెంచేది
చాలా వరకూ తల్లులే గదా !

వారు పిల్లలను పెంచేటప్పుడు అమ్మాయి అయినా.... అబ్బాయి అయినా సమానమే అని పెంచాలి.

అంతే కానీ ఆడవారిని చెప్పుచేతలలో అణచి ఉంచాలని అబ్బాయికి చెప్పకూడదు...మగవారిని ద్వేషించేటట్లు అమ్మాయిని పెంచకూడదు.

ఇలా .. స్త్రీలు తోటి స్త్రీలను కష్టపెట్టకపోతే అదే చాలు. స్త్రీల బాధలు చాలా వరకూ తగ్గుతాయి..

2 comments:

  1. డబ్బు కోసం అర్ధ నగ్నం గా సినిమాల లొ నటించేది కూడా స్త్రీలే!

    ReplyDelete
  2. ఏమిటో ! ఇదంతా బాధగానే ఉన్నా, మీరు చెప్పింది కూడా .నిజమేలెండి...

    ReplyDelete