koodali

Monday, July 11, 2011

దేవుని సొమ్మును బయటకు తీయాలనే అర్హత మనకుందంటారా ?

 

ఇంతకు ముందు టపాలో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి సంపద గురించి వ్రాశాను.

స్వామి సంపద గురించి మాట్లాడేంత శక్తి నాకు లేకపోయినా ఏదో నాకు తోచినట్లు ఇంకొంచెం వ్రాయాలనిపించింది.

ఇంకా, మరి కొన్ని విషయాలు కూడా ...

దేని గురించి అయినా ఆశపడితే దాన్ని పొందే అర్హత మనకుందా ? అని ఆలోచించుకోవాలి.

లేకపోతే ఆ అర్హతను సంపాదించుకోవాలి.

శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయంలో ఇంకా తెరవని గదిలో ఇంకెంతసంపద ఉందో అని జనాల ఆశ.


ఆ సంపదను కూడా బయటకు తీయాలంటున్నారు. మనకు అలా అడిగే అర్హత ఉందంటారా ?

మనకు పెద్దల నుంచీ అందిన ఎన్నో అపురూప వస్తువులను మనం కాపాడుకోలేకపోయాము.

అందులో చాలా వరకూ విదేశీ దాడులవల్ల విదేశాలకు తరలి వెళ్ళిపోయాయి. ఇప్పటికీ వెళ్ళిపోతూనే ఉన్నాయి.

స్వదేశీయులు కూడా తక్కువవాళ్ళేమీ కాదు.

దేవుని పేరిట ఉన్న భూములు అన్యాక్రాంతమవుతున్నా కాపాడుకోవటం మనకు కుదరటం లేదు.

సమాజంలో అవినీతి, ఇంకా విదేశాలకు తరలిస్తున్న నల్లడబ్బును ఆపటం మన చేతకావటం లేదు.,

ఇవన్నీ ఇలా ఉంటే మరి, దేవుని సొమ్మును బయటకు తీయాలనే అర్హత మనకుందంటారా ?

ఇంతకాలం ఈ సంపద యొక్క రహస్యాన్ని గుట్టుగా కాపాడిన రాజవంశీకులకు ఈ దేవాలయాన్ని గురించి ,అక్కడి సంపద గురించి మాట్లాడి, నిర్ణయం తీసుకునే హక్కు ఉండాలి.

వారి నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉంది.

ఈ సంపద నేలమాళిగలో ఉన్నంతమాత్రాన అవి పాడయ్యే వస్తువులు కాదు.

వజ్రాలు, మణులు భూమిలో ఎంతకాలం ఉన్నా ఏమీకావు. బంగారం కూడా అంతే.

మహా అయితే వేల సంవత్సరాలు దాటితే ముద్దగా అవుతుందేమో ( నాకు సరిగ్గా తెలియదు. ) అంతేకానీ దానికి వచ్చే నష్టమేమీ లేదు.

అలాంటప్పుడు వాటిని బయటకు తీసి అపాత్రుల చేతిలో పొయ్యటం కన్నా, వాటిని అలా ఉంచెయ్యటమే మంచిది.

ఒక వార్తా పత్రికలో చదివానండి.

ఇలాంటి నిధుల ప్రచారం పుణ్యమా అని..

ఒక ఊరిలో
దేవాలయంలో నిధులున్నాయని ప్రచారం జరుగుతోందట.

ఆ గుడికి కూడా కాపలా పెట్టవలసి వచ్చిందట. ఈ అతి ప్రచారం ఎక్కడికి దారి తీస్తుందో !

ఏది ఎంతవరకో అంతవరకే ఉండాలి. అతి అనర్ధదాయకం.

మన పెద్దవాళ్ళు మనకు కొద్దిగా బంగారాన్ని ఇస్తేనే భద్రంగా దాచి వారసత్వ సంపదగా పిల్లలకు అందిస్తాము. .

అలాంటిది ఇంత గొప్ప అపురూప వారసత్వసంపదను ఎంత అపురూపంగా దాచుకోవాలి !

మన ఖర్మ కొద్ది కొందరు ఈ సంపదను ఎలా ఖర్చుపెట్టాలీ ? అని ఆలోచిస్తున్నారు.

విదేశాల వాళ్ళు వారి పురాతన కట్టడాలను కూడా ఎంతో జాగ్రత్తగా కాపాడుకొంటారు.


ప్రజా సంక్షేమం కొరకు డబ్బు కావాలంటే మన దేశంలో బంగారపు నిల్వలు బాగానే ఉన్నాయట. (
ఒక వార్తా పత్రికలో చదివానండి. ) వాటిని వాడుకోవచ్చు.

అంతేకానీ, పెద్దల ద్వారా వచ్చిన వారసత్వ సంపదను అమ్ముకుని తినేస్తే బాగోదు కదా !


ఒక జమీందారు దగ్గర బోలెడు ఆస్తి ఉన్నా వారు ఎంతో నిరాడంబరంగా జీవిస్తున్నారనుకోండి ఎవరూ తప్పు పట్టరు.

ఆయన ఎంత నిరాడంబరుడో అని .. అందరూ మెచ్చుకుంటారు.


వారు ఉన్న ఆస్తి అంతా ఖర్చు పెట్టేస్తే ఎవరూ మెచ్చుకోరు.

ఆ సంపదను బయటకు తీయకుండా అలాగే ఉంచితే రక్షణ ఎలా ? అనుకోనవసరం లేదు.

పెద్దలు బాగా కట్టుదిట్టంగానే రక్షణ కల్పించారంటున్నారు.


మనకు చేతనయినంత వరకూ రక్షణ ఏర్పాటు చేసి ,
ఏది ఎలా జరగాలో అలా జరుగుతుందని... ఇక భగవంతుని మీదనే భారం వేయటం ఉత్తమం.


సామాన్య వ్యక్తిని నాకు తోచింది వ్రాయాలనిపించి వ్రాశానండి. తప్పులుంటే దైవం క్షమించవలెనని కోరుకుంటున్నాను.

రాజకుటుంబీకులు, పండితులు, పామరులు ఏం నిర్ణయిస్తారో ?

ఇంతకీ భగవంతుడు ఏం చేయదలుచుకున్నారో ?

ఇవే కాదు,
ఈ తరం వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాలుగా ఉన్న సహజవనరులను కూడా వేగంగా ఖాళీ చేస్తున్నారు .


ఈ సహజవనరులు ఏర్పడాలంటే ఎన్నో వేల సంవత్సరాల కాలం పడుతుందట.

అలాంటిది గత 200 సంవత్సరాల కాలంలో అభివృద్ధి పేరుతో, వనరులు అన్నీ ఖాళీ అయ్యే పరిస్థితిని తెచ్చాము.

ఇలా ఎంతకీ పెద్దలు మనకు ఇచ్చిన వాటిని వాడుకోవాలన్న తాపత్రయమే కానీ , మనం మన ముందు తరాల వాళ్ళకు ఏం ఇస్తున్నాము ? అంటే జవాబు ఉండదు.

మన పెద్దలు పచ్చటి ప్రపంచాన్నీ మనకు ఇచ్చి వెళ్ళారు. మరి మనము ?

ముందు ఆలోచన లేకుండా ఎంతకీ మన స్వార్ధం, మన అవసరాలు ఇదే గోల.

ఈ నాటి వారికి.. ఇంకా ,ఇంకా కావాలీ అన్నదే ప్రధాన సిద్ధాంతంగా కనిపిస్తోంది.

ఈ నాటి తరాలు చరిత్రలో అత్యంత స్వార్ధపూరిత తరాలుగా మిగిలిపోతాయేమో ?

అలా కాకుండా ఉండాలని ఆశిస్తూ..

 

No comments:

Post a Comment