koodali

Saturday, March 22, 2025

కనీస అవసరాలు తీరాలి....

 

ఈ పోస్ట్ లోని విషయములు జనవరిలో వేసిన.. కొన్ని విషయములు ..పోస్టులోని విషయములే. ఆ పోస్ట్ పెద్దగా అవటం వల్ల, కొంతభాగాన్ని తీసి ఇక్కడ వేయటం జరిగిందండి.

....................

టెక్నాలజి అంటూ పోటీలు పడుతున్నారు కొందరు. టెక్నాలజీ కొంతవరకు అవసరమే కానీ, పర్యావరణహిత టెక్నాలజి ఉండాలి. .

 ప్రపంచంలో నైతికవిలువలకు హాని కలగని విధమైన టెక్నాలజి వాడకం కావాలి. ఉదా..సెల్ఫోన్ల ద్వారా అశ్లీలచిత్రాలు వంటివి మంచిదికాదు.

 ............

   ప్రపంచంలో మనుషులందరికీ ...ఆహారం, ఇల్లు, విద్య, వైద్యం, రక్షణ....ఇలాంటి కనీస అవసరాలు తీరాలి. 

 ...........

ఒక్క మొక్క నుండి అనేక విత్తనాలు ..ఆ విత్తనాల నుండి అనేక మొక్కలు..ఆ మొక్కల నుండి బోలెడు ఆహారం లభించేలా దైవం సృష్టిని చేసారు. ..

అయినా కూడా,   అందరికీ ఆహారం లభించేలా చేసుకోలేకపోతున్నారు. 

ఇప్పటికీ ప్రపంచంలో చాలామందికి సరిగ్గా ఆహారం లభించటం లేదు.

 కొందరేమో తినటానికి తిండిలేక, డబ్బులేక, ఉపాధిలేక కష్టపడుతున్నారు. 

చాలామంది మద్యం, మత్తుమందులకు బానిసలవుతున్నారు.  

డబ్బు ఉన్నా కూడా కొందరికి అనేక సమస్యలు ఉంటున్నాయి,  చాలామందికి మానసిక ప్రశాంతత ఉండటం లేదు.
 
 

ధనిక దేశాలలో కూడా చాలామంది అనేక సమస్యలతో బాధలు పడుతున్నారు.

 ప్రపంచంలో ప్రశాంతత లేనప్పుడు  ఏం లాభం?  

 సమాజంలో నేరాలు..ఘోరాలు జరగకుండా ఉండాలి. అందరూ ప్రశాంతంగా బ్రతకాలి. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండాలి. 

............

 మన దేశాన్ని శుభ్రంగా అందంగా చేసుకోవచ్చు కదా....రోడ్లను శుభ్రంగా చేయటం, రైల్వేస్టేషన్లు, బస్సు స్టాండ్లు, హాస్పిటల్స్..ఇలాంటి ప్రదేశాలు శుభ్రంగా ఉంచాలంటే చాలామంది వర్కర్స్ అవసరమవుతారు.

బోలెడు మొక్కలను నాటి, శుద్ధి చేసిన మురికి నీటిని వాటికి పోయవచ్చు. ఇలాంటివి చేస్తే దేశం శుభ్రంగా ఉంటుంది. చాలామందికి ఉపాధి లభిస్తుంది. ప్రజలు కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచేలా కఠినచర్యలు తీసుకోవాలి.

గిడ్డంగులలో దాచిన ఆహారదినుసులను పాడవకుం
డా  తక్కువధరకు పేదలకు అందిస్తే అందరికీ ఆహారం లభిస్తుంది. ఇవన్నీ చాలా చేయవచ్చు.

.................

 అంతా దైవము దయ.
 .....................

 కొన్ని పోస్టుల లింక్స్..

ఆసక్తి ఉన్నవారు క్రింద ఉన్న లింక్స్ వద్ద చదవగలరు.
 

 వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. 1   *******

  వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్....2   **********

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. .3    *************

 వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. ....4   *************



Friday, January 31, 2025

కొన్ని విషయములు..


ఈ పోస్ట్ పెద్దగా అవటం వల్ల, ఈ పోస్ట్ లోని కొంత భాగాన్ని మార్చ్ నెలలో పోస్ట్ చేయటం జరిగిందండి.
...........

ఈ రోజుల్లో, బ్రతుకుతెరువు కొరకు ఉద్యోగం అని కాకుండా, ఉద్యోగం కొరకు బ్రతకటం అన్నట్లు ఉంది వ్యవహారం.
 
ఈ మధ్య కొందరు పెద్ద కంపెనీల వాళ్ళు ఏమంటున్నారంటే, ఉద్యోగస్తులు మరిన్ని ఎక్కువ గంటలు పనిచేయాలని చెబుతున్నారు. త్వరగా ఇంటికెళ్ళటం వేస్ట్ అన్నట్లు, భార్యాభర్తలు ఎక్కువగా మాట్లాడుకోకూడదన్నట్లు కూడా కొందరు చెబుతారు.

 ఉద్యోగస్తులతో బాగా పనిచేయిస్తూ వేలకోట్లు సంపాదించే కంపెనీల వాళ్ళు ఇలా మాట్లాడటం అన్యాయం..

కొన్ని సంవత్సరాల క్రిందట పనిగంటలు పెరిగినదానికి వ్యతిరేకంగా విదేశాలలో కార్మికులు పోరాటం చేసారు. ఆ పోరాటాలకు గుర్తుగా మేడే జరుపుతారు.
 
 ఈ రోజుల్లో కంపెనీలు కొందరు ఉద్యోగస్తులను పని లో నుండి తీసివేస్తున్నారు..అది చూసి భయపడి, మిగతావాళ్ళు విపరీతంగా పనిచేస్తుంటారు.
...............

మనుషులు  డబ్బు కొరకు  పనిచేయటం కొరకే పుట్టలేదు. పనిచేసి డబ్బు సంపాదించటం జీవితంలో ఒక భాగం. మనుషులు దైవధ్యానం చేసుకోవాలి. గృహస్థాశ్రమంలో కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి.కుటుంబం అంటే ఎన్నో బాధ్యతలుంటాయి. సంతానాన్ని చక్కటి పౌరులుగా తయారుచేయటంలో తమ వంతు పాత్రను సరిగ్గా నిర్వహించాలి.

 
ఎవరైనా తాము ఆరోగ్యంగా ఉండటానికి కొంత సమయం కేటాయించుకోవాలి. చక్కటి చెట్లు, మొక్కలు పెంచుతూ ఆహ్లాదంగా ఉండవచ్చు. ప్రపంచంలో ఉన్న ప్రకృతిసుందరదృశ్యాలను చూసి ఆనందించవచ్చు. పర్యావరణాన్ని కాపాడటంలో కొంత సమయం కేటాయిస్తే మంచిది.

 
సమాజంలో కష్టాలలో ఉండేవారికి కొంత సేవ లేక సాయం చేయవచ్చు. ఇలా ఎన్నో ఉండగా, సమయం చాలక ఎందరో ఉరుకులు పరుగులతో జీవిస్తున్నారు. కొన్ని ఉద్యోగాల వారికి ఇంటికొచ్చినా, ఆఫీసువాళ్ళు ఫోన్లు చేసి పనులు చేయించుకుంటున్నారు.

 .....................
అనేకకారణాల వల్ల, కుటుంబసభ్యుల మధ్య కొన్ని గొడవలు వస్తుంటాయి.  
పనివత్తిడి వల్ల  కూడా కుటుంబాలలో గొడవలు జరిగి, వివాహబంధాలు విచ్చిన్నమవుతున్నాయి. ఈ రోజుల్లో చాలామంది  విచ్చలవిడి ప్రవర్తనకు ఇష్టపడుతున్నారు.
.....................

ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగులు సమయం చాలక ఒత్తిడితో అనారోగ్యం పాలవుతున్నారు. ఈ మధ్యన యువత కొందరు  పని ఒత్తిడితో ఉన్నపళాన చనిపోయారు. కొందరు ఉద్యోగస్తులు ఆహారం వండుకోవటానికి సమయం చాలక,బయట  ఆహారాన్ని తిని అనారోగ్యం పాలవుతున్నారు.

  ఈ రోజుల్లో ప్రజలకు ఉదయం, సాయంకాలం ఎండ తగలకపోవటం, శరీరానికి వ్యాయామం లేకపోవటం, సరైన ఆరోగ్యకరమైన ఆహారం లభించకపోవటం, వాతావరణకాలుష్యం..వంటి సమస్యలతో పాటు......
 
 ఎక్కువమంది ఎప్పుడూ సెల్ఫోన్లు, కంప్యూటర్లు వాడటం వల్ల రేడియేషన్ మరియు సెల్ఫోన్లను వేళ్లతో అదేపనిగా నొక్కటం వల్ల నరాల వ్యాధులు, మెడనొప్పి, కంటిసమస్యలు, తల దిమ్ము..వంటి సమస్యలు వస్తున్నాయి.
 
 కొంతకాలం క్రిందట ఐటీ రంగంలో పనిచేసేవారికి మెడనొప్పులు, భుజాల నొప్పులు..వంటివి ఎక్కువగా ఉండేవి. సెల్ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చాక, ఇప్పుడు చాలామందికి ఈ జబ్బులు వస్తున్నాయి.
 
 పిల్లలు కూడా ఆన్లైన్  ద్వారా పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇవన్నీ సరిదిద్దుకోకుంటే ఎవరూ ఏం చేయలేరు.

 
ప్రపంచంలోని ప్రతి ఒక్కరు ప్రపంచంలోని ప్రతి విషయాన్ని నేర్చుకోవలసిన అవసరం లేదనిపిస్తుంది.  ప్రపంచంలోని విషయాలన్నీ తెలుసుకోవాలనుకోవటం కూడా వ్యసనమే. ఎంతవరకు అవసరమో అంతవరకు తెలుసుకుంటే చాలు అనిపిస్తుంది.
  ..........
 

చాలామంది సంతానాన్ని పెంచే సమయం, ఓపిక లేదంటూ డేకేర్లలో వేస్తున్నారు. ఇంటివద్ద అల్లారుముద్దుగా పెరగవలసిన చంటిపిల్లలు బయట ఎక్కడో పెరుగుతున్నారు. కొందరు తల్లితండ్రి ఏమంటారంటే, పిల్లల కోసమే డబ్బు సంపాదిస్తున్నామని చెబుతుంటారు.

  మాటలు కూడా సరిగ్గారాని, వాళ్ళ బాధలు చెప్పలేని చిన్నవయస్సులో పిల్లల్ని బయట డేకేర్లలో వేసి, వాళ్ళకొరకు డబ్బు సంపాదిస్తున్నామని చెప్పటమేమిటో?
 
కొందరు పేరెంట్స్  పిల్లలను జాగ్రత్తగా చూసుకోవటం లేదని  కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తోంది. అది చాలా పాపం.  

 చంటి పిల్లలను పెంచడానికి చాలా ఓపిక అవసరం. తల్లితండ్రి కూడా ఓపికతో వ్యవహరించాలి. 

 

కొన్ని డేకేర్ సెంటర్ల వాళ్ళు కూడా బాగానే చూసుకుంటారట. పిల్లలు అక్కడ తోటిపిల్లలతో ఆడుకుంటారు. అయితే, ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో..అర్ధం కావటంలేదు. పైకి అందరూ బాగానే మాట్లాడతారు. తల్లి దగ్గరుండి చంటిపిల్లలను ప్రేమగా చూసుకుంటే మంచిది.
 
చిన్నపిల్లల విషయాలలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
 .................
 
 కొన్ని ఆఫీసుల్లో ఉద్యోగులకు పనివత్తిడి తగ్గటం కొరకు అంటూ..ఆఫీసులోనే రకరకాల ఆహారం, వినోదం..వంటివి ఏర్పాటుచేస్తున్నారు.  ఇక, కొందరు ఉద్యోగులు ఇంటికంటే ఆఫీసులోనే బాగుందని ఆఫీసులోనే ఎక్కువసేపు పనిచేస్తుంటారు.

 ఈ రోజుల్లో పెంచుకున్న పనివత్తిడితో ఎవరికీ సరైన విశ్రాంతి ఉండటం లేదు.

అలాగని అందరూ పనులు మానేసి సోమరిగా ఉండకూడదు. అతిగా పనిచేసి అలసిపోకూడదు కాని, ఎవరి పనులు వారు చక్కగా నిర్వహించాలి.
.............................
 
యంత్రాలు లేని పాతకాలంలో ఒక వస్తువు తయారుచెయ్యాలంటే
కొన్నిరోజులు పట్టేది, చేయడానికి కొన్ని రోజులు పని ఉండేది.
 
ఇప్పుడు యంత్రాల సాయంతో అదేపనిని గంటలో చేస్తున్నారు.ఇందువల్ల నిరుద్యోగం పెరుగుతుంది. అదేపనిగా వస్తువుల తయారీ వల్ల ప్రపంచంలో ఉన్న సహజవనరులూ త్వరగా ఖర్చవుతాయి.

ఉపాధి..ఉద్యోగాల కొరకు అదేపనిగా పనిచేసి, అదేపనిగా వస్తువులను ఉత్పత్తి చేస్తూ పోతే, పర్యావరణం పాడయ్యి ప్రపంచానికి పెనుప్రమాదం వచ్చే పరిస్థితులు రావచ్చు.
 
 మనం వాడుతున్న కంప్యూటర్లు, ఏసీలు, ఫ్రిజ్లు..వంటి వాటివల్లకూడా ఓజోన్ పొర పల్చనయ్యే ప్రమాదముందని ఒక దగ్గర చదివాను. అప్పుడు ఓజోన్ పొర పల్చనయ్యి అతినీలలోహిత కిరణాలు భూమిపై వ్యాపించి కొత్త విపత్తులు రావచ్చు.

 అందువల్ల అతిని తగ్గించుకుంటే మంచిది.
  ...........................
 

Friday, January 17, 2025

కుంభమేళా లో...

 ..

కొందరు ఏమంటున్నారంటే, మహాకుంభమేళా లో అనేకమంది స్నానాలు చేయటం.. వంటివాటి వల్ల పొల్యూషన్ జరుగుతుందని గగ్గోలు పెడుతున్నారు. 


 వర్షాలు పడినప్పుడు భూమిపైన ఉన్న సుగంధాలు, దుర్గంధాలు,  మంచివి, చెడువి...కూడా..అనేకమైనవి ..వాననీటితో పాటు నదుల్లోనూ, కాలువల్లోనూ కలుస్తాయి..

 

మనుషులు బయట పడేసే వ్యర్ధాలు, చెత్తా, చెదారం,  పశుపక్ష్యాదుల మలమూత్ర విసర్జనలు, వాటి మృతకళేబరాలు.. వంటివి కూడా వాననీటితో పాటు నదుల్లోనూ, కాలువల్లోనూ కలుస్తాయి...

 

 మాంసాహారం కొరకు ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేలు, లక్షలుగా పశుపక్ష్యాదులను చంపి, మిగిలిన టన్నుల  వ్యర్ధాలను బైటపడేస్తారు.

 

ప్రపంచవ్యాప్తంగా సముద్రం.. బీచ్ ల వద్ద అనేకమంది స్నానాలు చేస్తారు. ...స్విమ్మింగ్ పూల్స్ లో చాలామంది ఈతకొడుతుంటారు. ...స్విమ్మింగ్ పూల్స్   నీటిలో బ్లీచింగ్ పౌడెర్.. వంటివి కలుపుతారు.

 

అయితే, నదుల్లో నీరు ఒకదగ్గర నుంచి ఇంకో దగ్గరకు దూరప్రాంతాలనుంచి పారుతూ చక్కగా ప్రవహిస్తుంది కాబట్టి,  బ్లీచింగ్ పౌడర్ ..వంటివి వేయరు. 


అందువల్ల,  ఎన్నో సంవత్సరాల కొకసారి నదిలో పుష్కర స్నానం చేయటం వల్ల సమస్యలు ఏమీ ఉండవు.....అయితే, నదీ స్నానాలలో సబ్బులు, షాంపూలు, ప్లాస్టిక్ కవర్లు..వంటివి వాడకూడదు.


కుంభమేళాకు వెళ్తే రోగాలొస్తాయని కొందరు అంటున్నారు..కొన్నాళ్ళక్రితం కరోనాతో ప్రపంచం అల్లాడిపోయింది. మరి కరోనా రోగం ఎందుకొచ్చినట్లు?

*********

 ఆధునిక కాలంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి.   పారిశ్రామిక వ్యర్ధాలను, విషపదార్ధాలను,  నగరాలనుంచి వచ్చే డ్రైనేజ్ ను ...నదులలోకి, సముద్రంలోకి వదిలేస్తుంటారు..వాటివల్ల కలిగే నష్టాలు  చాలా ఉన్నాయి.

 

ఆధునిక పోకడలతో పర్యావరణం పాడయ్యింది. రసాయనాల పంటలు వాడి అనారోగ్యాలు వస్తున్నాయి. అనేక విష రసాయనాలు భూమిలోకి ఇంకి భూగర్భనీరు పాడవుతోంది.

 

 మనం వాడుతున్న కంప్యూటర్లు, ఏసీలు, ఫ్రిజ్లు..వంటి వాటివల్ల కూడా ఓజోన్ పొర పల్చనయ్యే ప్రమాదముందని ఒక దగ్గర చదివాను....గాలిలో కలిసే విషవాయువుల వల్ల కూడా  ఓజోన్ పొర రంధ్రాలు పడుతోందంటున్నారు. 

 

అప్పుడు ఓజోన్ పొర పల్చనయ్యి , అతినీలలోహిత కిరణాలు భూమిపై వ్యాపించి కొత్త విపత్తులు రావచ్చు.

 

 గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల విపరీతమైన వాతావరణ మార్పులు జరుగుతున్నాయి.

ఇలా చాలా జరుగుతున్నాయి. వీటి గురించి ఆలోచించితే మంచిది.

 

Sunday, January 12, 2025

మరికొన్ని విషయములు..

 

 మహా కుంభమేళా సందర్భముగా శుభాకాంక్షలండి.

***********

సమాజంలో అందరూ తమ బాధ్యతలను సరిగ్గా నిర్వహిస్తేనే సమాజంలో కష్టాలునష్టాలు తగ్గుతాయి....నైతికవిలువలకు, క్రమశిక్షణకు, శుభ్రతకు..అందరూ ప్రాధాన్యతను ఇవ్వాలి. 


సమాజం బాగుండాలంటే, చిన్నతనం నుంచే పిల్లలకు నైతికవిలువలను పాటించటం నేర్పించాలి. మంచి పౌరులుగా తయారుచేయాలి. 

 

 ఆధునికత పేరుతో పర్యావరణాన్ని  పాడు చేకూడదు.

 ఎక్కడపడితే అక్కడ చెత్త వేయటం, అన్ని ప్రదేశాలను మురికిచేయటం..వంటివి లేకుండా బాధ్యతగా ఉండాలి.

 ***********

భారతదేశంలో చాలామంది ప్రజలకు బస్సులు, రైళ్లు ఎక్కేటప్పుడూ, దేవాలయాలకు వెళ్లినప్పుడు, సినిమాలకు వెళ్ళినప్పుడు..ఇలా చాలాచోట్ల   నెట్టుకుంటూ  వెళ్లటం అలవాటయింది. చక్కగా ఒకరితర్వాత ఒకరు క్యూలో వెళ్తే మంచిది.

 

బస్సులు, రైళ్లు ఎక్కేటప్పుడూ....లోపలి వాళ్లు క్రిందకు దిగకముందే బయట ఉన్నవాళ్లు లోపలికి ఎక్కడానికి ప్రయత్నిస్తారు. ప్రయాణీకులు నెట్టుకోకుండా ఉండాలంటే, ప్రభుత్వాలు సరిపడినంత బస్సులు, రైళ్ళు వేయాలేమో... 

 

అయితే, కొన్ని బస్సులకు ఎక్కువమంది ప్రయాణీకులు ఉండరు. ప్రయాణీకులు లేక నష్టాలు వస్తున్నాయంటారు. కొన్ని బస్సులు కిక్కిరిసి ఉంటాయి. అలాంటప్పుడు ప్రయాణీకులు ప్రైవేట్ బస్సులను ఎక్కుతారు .రద్దీ ఎక్కువున్న రూట్లలో ఎక్కువ బస్సులు నడపాలి.

****************

 చాలామంది అధికారులు తమ పనిని తాము సక్రమంగా చేయటం లేదు. సమాజంలో అవినీతి, లంచగొండితనం, సోమరితనం, కుల, మత, ప్రాంతీయ..ద్వేషాలు ఎక్కువయ్యాయి.

 

 రాజకీయులను గమనిస్తే, అధికారం లోకి ఎలా రావాలా? అని కొందరు, అధికారం లోకి వచ్చిన తరువాత ప్రభుత్వం పడిపోకుండా ఎలా కాపాడుకోవాలో ? అని కొందరు, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలా? అని కొందరు,...

 

 ఎన్నికలు జరిగి అధికారంలోకి వచ్చి, వెంటనే  తరువాత జరిగే ఎన్నికల్లో ఎలా గెలవాలో? అనే ఆలోచనలతో కొందరు..ఇలా ఎవరికి వారు  పొద్దుపుచ్చటంతోనే కాలం గడిచిపోతోంది. ఇక ప్రజల కొరకు ఏమైనా చేయడానికి ఎవరికీ సమయం సరిపోవటం లేదు మరి.

  ***********

ఈ రోజుల్లో చాలామంది మనుషుల్లో  పాపభీతి తగ్గింది.

 కుటుంబ వ్యవస్థ  సరిగ్గా లేదు.   చాలామంది   స్త్రీలు, పురుషులు బాధ్యతలు లేకుండా స్వేచ్చగా జీవించడానికి ఇష్టపడుతున్నారు.

 

సెల్ఫోన్లు వచ్చి,  సోషల్మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చాక మంచితో పాటు చాలా చెడు జరుగుతోంది. 

  కొన్ని సినిమాలు, సీరియల్స్ వల్ల సమాజానికి చాలా హాని జరుగుతోంది.
 

ద్యం, మత్తు పదార్ధాలు,  అసభ్యకరమైన దృశ్యాలకు, రెచ్చగొట్టే వార్తలకు చాలామంది ఆకర్షితులవుతున్నారు.  వీటి వల్ల ఎన్నో నేరాలుఘోరాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలి.

***********

ఈ రోజుల్లో చాలామంది మాంసాహారాన్ని తినడం ఎక్కువయ్యింది.  మనుషులకు చిన్న దెబ్బ తగిలినా, కష్టం వచ్చినా..తట్టుకోలేరు.

 మరి పశుపక్ష్యాదులవి ప్రాణాలు కావా? మనుషులు ఇతర జీవులను హింసించినప్పుడు, వాటికీ నొప్పి, బాధ, భయం..ఉంటాయి కదా.

 

కొందరు మాంసాహారాన్ని తినకపోయినా , ఇతరజీవులకు హాని కలిగే విధంగా ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగా కానీ ప్రవర్తిస్తారు.

 చాలామంది నిర్దాక్షిణ్యంగా పశుపక్ష్యాదులను చంపితింటారు. అయితే, తమకు ఏదైనా అనారోగ్యం వస్తే మాత్రం రక్షించమని దైవాన్ని కోరుకుంటారు. 

 

తాము ఇతరజీవులకు హాని చేస్తూ,   తాము మాత్రం ...నొప్పి, బాధ, భయం..లేకుండా జీవించాలని  ఆశపడటాన్ని ఏమనాలి?

పశుపక్ష్యాదులు  మూగజీవులు, బలహీనమైనవి కాబట్టి , మనుషులకు ఎదురుతిరగలేవు....అలా చనిపోయిన జీవుల ఉసురు తగిలి కూడా ప్రపంచంలో కష్టాలు వచ్చే పరిస్థితి ఉంటుంది.

****************

 మనశ్శాంతి కొరకు దైవపూజ చేసుకుందామంటే.. కొందరు,  ప్రతిదానికి అలా చేయకూడదు..ఇలానే చేయాలంటూ.. .లేదంటే అష్టకష్టాలు వస్తాయంటూ భయం కలిగేలా చెప్పేస్తుంటారు. ఇవన్నీ విని జనాలు అయోమయం అయిపోతున్నారు.

దేనికైనా నియమాలు తప్పకుండా ఉండాలి. అయితే, అవి అతిగా ఉంటే కష్టం. 


 ఇప్పటి సమాజంలో మనకు ఏం చేయాలన్నా అన్నీ సమస్యలు, సందేహాలు ఎక్కువైపోయాయి.

 అయితే,  కొందరు సమాజక్షేమం కొరకు ఎన్నో విషయాలను చక్కగా తెలియజేస్తారు.

*************

ప్రపంచంలో ప్రజలు కొందరు నూరేళ్ళు ఆరోగ్యంగా చక్కగా జీవిస్తున్నారట..వారిని పరిశీలిస్తే ..వాళ్లు రోజులో చాలా భాగం ఆరుబయట పనిచేసుకుంటారట. వారు కల్తీ లేని స్వచ్చమైన నీటిని.. ఆహారాన్ని తీసుకుంటారు కావచ్చు.

 
వారు..డబ్బు, సంపద, అధికారం కొరకు ఆరాటం లేకుండా జీవిస్తారు కావచ్చు... చక్కగా సులభంగా..హాయిగా దైవాన్ని ప్రార్ధించుకుంటారు కావచ్చు....పంతాలు, పట్టింపులు, కుల, మత, ప్రాంతీయ గొడవలు లేకుండా హాయిగా, సహజంగా జీవిస్తారు కావచ్చు....

 అందరూ నా మాటే వినాలని పట్టుదలలు, అధికారం కావాలని, బోలెడు డబ్బు సంపాదించాలని, బోలెడు వస్తువులు కొనాలని, కెరీర్లో ఎక్కడికో వెళ్ళిపోవాలని..  వారు తాపత్రయపడరేమో?

************

ప్రాచీన సనాతన భారతదేశంలో నైతికవిలువలతో కూడిన చక్కటి జీవనవిధానముండేది. చాలామంది వంద సంవత్సరాల పైన ఆరోగ్యంగా, చక్కగా జీవించేవారు.  ఈ మధ్య కాలంలో కూడా యోగులు కొందరు, కొన్ని వందల ఏళ్లు జీవించిన ఆధారాలున్నాయి.

***********

 మనం చక్కగా జీవించడానికి దైవం ఎన్నో సృష్టించి ఇచ్చారు. ఎన్నో మొక్కలు, కాయలు, పండ్లు, వరి, గోధుమ....వంటివి ఎన్నో సృష్టించారు. ....

ఎన్నో పువ్వులు, ప్రకృతి సుందర దృశ్యాలను కూడా సృష్టించారు. వీటన్నింటితో హాయిగా జీవించటం చేతకాక చాలామంది కష్టాలు పడుతున్నారు.

 **************

 లాస్ ఏంజలెస్ లో కార్చిచ్చు మండుతోంది. అంత పెద్ద దేశమైనా కూడా కార్చిచ్చు రగలకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవటం, వెంటనే ఆర్పటం చేయలేకపోతోంది..టెక్నాలజీతో ఏమైనా చేయొచ్చని కొందరు మాట్లాడతారు కానీ, టెక్నాలజీతో కొంతవరకే చేయగలం.... ప్రకృతి ముందు మనుషులెంత.. 

  *****************

చాలామంది డబ్బు, అధికారం..వంటివాటి కొరకు తాపత్రయపడుతూ సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు.

 లోకంలో సంపదంతా కొందరు తమవద్దే ఉండాలని తాపత్రయపడుతుంటారు. ఒక్క కుటుంబమే వందలకోట్లు ఏం చేసుకుంటారో? సమాజంలో ఉన్న సంపద ..అందరి వద్ద కూడా ఉంటే..లోకంలో పేదరికం ఉండదు కదా..

ప్రపంచవ్యాప్తంగా  ఎన్నో గొడవలు జరుగుతున్నాయి.

**********

 చాలామంది  మనుషులు చేస్తున్న పాపాలు చూసి దైవానికి విసుగు కలిగి, ఎవరికర్మ వారిదని ఊరుకుని ఉంటున్నారేమో?

  అందరూ జాగ్రత్తగా మనస్సును అదుపులో ఉంచుకుంటూ జీవించడానికి ప్రయత్నించాలి.

 కొందరు మేము ఏ పాపాలు చేయలేదంటారు. కొందరికి తాము చేసే తప్పులు తప్పులుగా అనిపించవు. 

**********

 అయితే,  ప్రపంచంలో ఎంతో మంచిచేసేవాళ్లు కూడా ఎందరో ఉన్నారు. చెడ్డగా ప్రవర్తించినా కూడా తప్పు తెలుసుకుని మంచిగా మారుతున్నవారూ ఉన్నారు.  అందరూ మంచిగా ఉంటారని ఆశిద్దాము.

 ***********

 అందరూ నీతిగా జీవిస్తే ప్రపంచంలో ఇన్ని నేరాలు..ఘోరాలు వు. 

 దైవాన్ని నమ్మి భక్తితో ఉండేవారు ఎవరైనా మంచిగా జీవించాలి.  దైవభక్తి కలిగి ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నించాలి...అప్పుడే దైవకృపను పొందగలరు.

 లోకం అంతా ఎప్పుడూ శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను.


కొన్ని విషయములు..

 

 పండుగల సమయాల్లో దేవాలయాలకు భక్తులు ఎక్కువగా వస్తుంటారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి జనం బాగా వెళ్తారు.

 వైకుంఠ ఏకాదశి టికెట్ల కొరకు రద్దీ ఎక్కువై జరిగిన తోపుడులో కొందరు మృతిచెందారని, మరికొందరికి గాయాలయినట్లుగా వార్తల ద్వారా తెలుస్తోంది. 

 ఇలా జరగటానికి అనేకకారణాలుంటాయి. ఏం జరిగిందో అంతా దైవానికే తెలుస్తుంది.

జనం  బాగా ఎక్కువ వస్తే ఏం చేయాలో దేవాలయాలను నిర్వహించేవారు  అనేక   జాగ్రత్తలు తీసుకోవాలి.    బాగా ఎక్కువమంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలి. 

 

  సిబ్బందిని ఎక్కువగా నియమించితే ఎక్కువమందికి ఉద్యోగాలు కూడా వస్తాయి. సిబ్బంది  కూడా చక్కగా పనిచేయాలి. ..

ప్రజలు అందరూ కూడా జాగ్రత్తగా  ప్రవర్తించాలి.

 నిర్వాహకులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి...వీఐపి..దర్శనాలంటూ సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టటం సరైనది కాదు...అవి  తగ్గించితే చాలామందికి ఇబ్బందులు తగ్గుతాయి.

 

 దైవం వద్ద వీ ఐ పీ.. అని ఎవరూ ఉండరు...అయితే, సెలెబ్రిటీలు అనేవారు వస్తే  కొందరు జనాలు ఒకరినొకరు తోసుకుంటూ.. సెలెబ్రిటీ వెంటపడే ప్రమాదం లేకపోలేదు. సెలెబ్రిటీలు మనుషులే. వారికీ దైవదర్శనం చేసుకోవాలనిపిస్తుంది కదా..

 

  అందువల్ల,  వీ ఐ పీ దర్శనాలు  వారంలో   ఒక గంట చొప్పున , ముఖ్యమైన రోజులలో కొంత సమయం వారికి కేటాయించవచ్చు. లేదంటే, ఎలా కేటాయిస్తే బాగుంటుందో ఆలోచించి చేయాలి.

 

వీ ఐ పీలు.. ఇతర భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, దైవదర్శనం కొరకు తరచుగా కాకుండా, కొన్నిసార్లు మాత్రమే వస్తే బాగుంటుంది..వీఐపీలు తమతోపాటు బోలెడు మందిని తీసుకువస్తే, వాళ్ళను కూడా వీఐపీ సౌకర్యాలతో పంపకూడదు.

************

మేము ఈ మధ్యన పొరుగురాష్ట్రంలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రానికి వెళ్లినప్పుడు రద్దీ బాగా ఉంది. ఆ రోజున ముందుగా అనుకుని మేము వెళ్ళలేదు. కొన్ని కారణాలవల్ల అనుకోకుండా అప్పటికప్పుడు వెళ్ళాము. చాలా మందితో కిక్కిరిసి ఉంది. క్యూలలో తిరుగుతూ దైవదర్శనానికి చాలా సమయం పట్టింది.



 కొందరు ఓపికతో క్యూలలో నడుస్తున్నారు. కొందరు జనాలు గోలగా ఒక క్యూనుంచి ఇంకో క్యూలోకి దూకేసారు. అదంతా చాలా గాభరా అనిపించింది.అలాంటప్పుడు ఏమైనా తొక్కిసలాట జరిగితే ఏమవుతుందోనని భయం కలిగింది.

***********

ఎక్కువమంది జనం వచ్చినప్పుడు సహజంగానే ఎక్కువసమయం వేచిఉండవలసి వస్తుంది. అలా వేచి ఉండలేనప్పుడు రద్దీ సమయాల్లో రాకుండా ఉంటేనే మంచిది. ముఖ్యంగా చిన్నపిల్లలను తీసుకుని విపరీతమైన రద్దీ సమయాల్లో అసలు వెళ్లకూడదు.


క్యూలలో వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. క్యూలలో తోపుళ్ళు జరిగి ఎవరికైనా విషాదం జరిగితే వారు, వారి కుటుంబసభ్యులే కదా బాధలు అనుభవించాలి.


బాగా ఎక్కువసేపు క్యూలో ఉండలేక అసహనం, నీరసం కలుగుతాయి. ఇలాంటప్పుడు కూడా ప్రజలలో అసహనం పెరుగుతుంది.  

 
 కొందరు వాళ్లకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. ఇలాంటి కొందరివల్ల చాలామందికి కష్టాలు కలుగుతాయి.
..
................


తిరుమలలో ఇంతకుముందు కూడా రద్దీ ఉండేది. క్యూలలో కొందరు జనం తోసుకుంటారు. గేట్లు తెరవగానే ఒకేసారి గోలగా పక్కవాళ్ళను నెట్టేస్తూ వెళ్లేవారు ఉంటారు.


కొన్నిచోట్ల అటుఇటూ జనంతో ఆ క్యూలైన్ల మధ్య ఊపిరి ఆడనట్లు ఉంటుంది. బయటకు వెళ్ళాలన్నా పక్కన 
మెష్ లు పైవరకూ ఉంటాయి. వాటికి తాళాలు వేసి ఉంటాయి. తాళాలు తీయడానికి అక్కడ ఎవరైనా ఉన్నట్లు అనిపించలేదు. అలాంటప్పుడు ఏమైనా తొక్కిసలాట జరిగితే ఎలా..అని భయమేస్తుంది.

 

అయితే, క్యూలలో ఎంత రద్దీగా ఉన్నా కూడా,  దైవం దయ వల్ల తిరుమలలో ఇప్పటివరకూ ఎలాంటి విషాదం జరగలేదు.

***************

 తిరుమల భక్తులు వేచి ఉండే రూములలో ఒక్కో రూములో సగానికి బారికేడ్లు వేసి, భక్తులను కూర్చోబెట్టి తలుపులు తెరిచినప్పుడు అందరూ ఒకేసారే  రాకుండా, రూములో వారిని ఒక వరుసలో  రమ్మని..భక్తులను బయటకు పంపేటప్పుడు రెండు లైన్ల లో పంపుతూ..ఆ రెండులైన్లలో మాత్రమే భక్తులు ఉన్న కంపార్ట్మెంట్ గదుల నుండి...మూలవిరాట్టు వరకు వెళ్ళి దర్శనం చేయిస్తే బాగుంటుందనిపిస్తుంది.


 మూలవిరాట్టు వద్దకు వెళ్ళేముందు కొంతదూరంలో అన్ని క్యూలైన్లను కలిపేస్తే..  జనాలు నెట్టుకుంటూ దైవదర్శనం సరిగ్గా చేయలేరు. 

 

అలా కాకుండా, మొదటినుంచి.. మూలవిరాట్టు దర్శనం వరకు పక్కపక్కన ఉండే రెండు క్యూలైన్లలో మాత్రమే భక్తులు బయటవరకూ  వెళ్ళేలా చేస్తే బాగుంటుంది. 

ఒక్కో క్యూలైన్లో కూడా ఒకరితరువాత ఒకరు నడిచేలా చూడాలి.


 
భక్తులు ఒకరినొకరు నెట్టుకోకుండా క్యూలైన్ల వద్ద అక్కడక్కడా సెక్యూరిటీ సిబ్బందిని ఎక్కువమందిని నియమించాలి. 

గ్రిల్స్ కు తాళాలు వేసినా కూడా, ఆ తాళాలు అక్కడ ఉండే సెక్యూరిటి వద్ద ఉంచితే ఎప్పుడైనా అవసరం అనిపించినప్పుడు వెంటనే తాళాలు తీసేలా ఉండాలి... అక్కడి సిబ్బంది క్యూలో ఉన్నవారి బాగోగులు చూడాలి.

 

తిరుమలలో భక్తులకు ఎప్పటినుంచో ఎన్నో సౌకర్యాలను ఇస్తున్నారు. ఉదా..కంపార్ట్మెంట్లలోను, బయట వేచి ఉండే భక్తులకు ఆహారాన్ని, నీటిని అందిస్తున్నారు.

 

క్యూలైన్లో ఉన్న భక్తులకు పెద్దవారికి, చిన్నపిల్లలకు అర్జంటుగా బాత్రూం కు వెళ్లాలంటే గ్రిల్స్ తాళాలు తీసి, బయటకు వెళ్ళేవారికి ఒక టోకెన్ ఇచ్చి, మరల క్యూలోకి రావటానికి ఆ టోకెన్ చూపించితే లోపలికి పంపవచ్చు. కొన్ని క్యూలైన్ల పక్కనే టాయ్లెట్స్ ఉన్నప్పుడు వాటిని ఉపయోగించవచ్చు.

  *************

 క్యూలలో దైవదర్శనం విషయంలో బోలెడు మంది భక్తులకు దైవదర్శనం చేయించాలంటే ఎన్నో  విషయాలుంటాయి. ..నాకు తెలిసినంతలో, దేవాలయాలలో దైవానికి రోజూ నిర్వహించే పూజలు ఉంటాయి..అందువల్ల భక్తుల దర్శనానికి కొన్నిసార్లు బ్రేక్ ఇస్తారు....

 

 ఇంకా, వీ ఐ పీ లు దర్శనాలంటూ మరికొంత సమయం బ్రేక్ ఉంటుంది. ఇక, ఇతర భక్తులకు దర్శనం కొరకు మిగిలే సమయం తక్కువగా ఉంటుంది.. ఇలాంటప్పుడు వేలాదిగా వచ్చే భక్తులు దైవాన్ని దర్శించుకోవాలంటే చాలా సమయం వేచి ఉండవలసి వస్తుంది.

********

 దైవదర్శనం ఎక్కువసేపు చేయాలని, చాలామంది మూలవిరాట్టు ముందు ఎక్కువసేపు ఉండాలనుకుంటారు. అయితే, మన వెనుక ఎందరో వేచిఉన్నారని గుర్తుంచుకుని ప్రవర్తించాలి. 

కొన్నిసార్లు కొందరు  సిబ్బంది ప్రజలను లాగేయటం కాకుండా, నిదానంగా పక్కకు జరపాలి.

  *********

ఎక్కడైనా ప్రమాదాలు జరగటానికి అనేక కారణాలుంటాయి. ఉదా..సరైన ప్రణాళిక లేక పోవటం వల్లగానీ, కొన్నిసార్లు వేసిన అంచనాలు తప్పటం వల్లకానీ, కొందరికి క్రమశిక్షణ..బాధ్యత సరిగ్గా లేకపోవటం వల్లకానీ, సమన్వయలోపం వల్ల కానీ, ఊహించని విధంగా అప్పటికప్పుడు సంఘటనలు జరగటం వల్లకానీ, ఎవరైనా కుట్ర చేయటం వల్లకానీ, ఇంకా మనకు తెలియని అనేక కారణాల వల్లకానీ..ప్రమాదాలు జరగవచ్చు. సరిగ్గా ఏం జరిగిందో దైవానికే  తెలుస్తుంది.

**************

 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో ఏళ్ళు గడిచినా కూడా, ఇంకా ఎన్నో సమస్యలు అలానే ఉన్నాయి.. సమాజం సరిగ్గా ఉండాలంటే.. ప్రజలు, అధికారులు, ప్రభుత్వాలు..అందరూ ఎవరి పనిని వారు సక్రమంగా నిర్వహించాలి.

 **********
వ్రాసిన వాటిలో ఏమైనా తప్పులుంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.


Thursday, October 3, 2024

పండుగల సందర్భంగా..

  

 శరన్నవరాత్రులు మరియు   శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు   మొదలవ్వబోతున్న  సందర్భంగా అందరికి శుభాకాంక్షలండి.

 

 

 

 

 

 

 

 

 

 

Wednesday, October 2, 2024

ప్రపంచంలోని జీవులు అన్నీ మంచిగా ఉండాలి...

 

 ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. కారణాలు ఏమైనాకానీ, ఇలా జరగటం అత్యంత బాధాకరం. అక్కడి ప్రజల పరిస్థితి తలచుకుంటే ఎంతో బాధగా ఉంది. 

 

 యుద్ధాలు జరుగుతున్న ప్రాంతాల వాళ్ళు ఎప్పుడు ఏమవుతుందో తెలియక, ఎప్పుడు ఏ బాంబులు మీద పడతాయో? కుటుంబంలోని వారు ఎటు చెల్లాచెదురవుతారో తెలియక  ఎంత భయంతో అల్లాడుతారో? కుటుంబంలోని పెద్దవాళ్లు చనిపోతే అమాయకులైన చిన్నపిల్లల పరిస్థితి ఏమిటి? ఇవన్నీ ఊహించుకుంటేనే ఎంతో బాధ కలుగుతోంది. 

 

యుద్ధాలు లేకుండా ఉంటేనే మన దగ్గర ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నాము. ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలు అల్లాడుతున్నారు..ఇంకో చోట యుద్ధాలు.. ఇదంతా ఏమిటో ? అర్ధం కావటం లేదు.

 

కొంతమంది పట్ల మరి కొందరు దాడులు చేయటం  కూడా  బాధాకరం. ఈ దాడుల సమయంలో పిల్లలు, పెద్దవాళ్లు భయంతో ఎంత అల్లాడిపోతారో.. తలచుకుంటే ఎంతో బాధ కలుగుతుంది. 

 

 ఎక్కడైనా ఏ ప్రజల పట్ల అయినా కూడా, ఆ విధంగా  దాడులు చేయటం బాధాకరం.

   మనుషుల మధ్య కొన్ని అభిప్రాయభేదాలు ఉంటాయి. గొడవలకు అనేక కారణాలుండవచ్చు. 

 

కొందరు ఇతరులపై ఆధిపత్యం కొరకు గొడవలకు, దాడుకు, యుద్ధాలకు సిద్ధపడతారు. కొందరు శత్రువుల నుంచి తమను రక్షించుకొనడానికి  యుద్ధాలు చేస్తారు. ఇంకా ఎన్నో కారణాలుండవచ్చు. 

  గొడవలు జరిగినప్పుడు .. ఎవరి కోణంలో వాళ్ళు ..మా అభిప్రాయమే సరైనది.. అంటారు.   ఎవరి వాదన వారిది.


కారణాలేమైనా, యుద్ధాల వంటి వాటి వల్ల ఎన్నో బాధలుంటాయి. అందువల్ల..దాడులు, యుద్ధాల వంటివి ఆగిపోతే బాగుంటుంది.

ప్రపంచంలోని జీవులు అన్నీ మంచిగా ఉండాలి. 

 ************

 కొన్ని విషయములు..link..

 ఓం, దైవానికి అనేక వందనములు...