koodali

Wednesday, October 3, 2012

అసభ్యకరమైన వస్త్ర ధారణ , దృశ్యాలు ....



 దుస్తులు  శరీర  రక్షణ  కోసం  వేసుకుంటారు.  ఇవి    ఎండ,  వాన,  చలి  నుంచి,  ఇంకా   ఇతరుల  దృష్టి  నుంచి   శరీరాన్ని  కప్పి  కాపాడతాయి.


అయితే,  ఈ  రోజుల్లో  కొందరు  స్త్రీలు  అసభ్యంగా  ఇతరులకు  శరీరాన్ని  ప్రదర్శించే  రీతిలో  దుస్తులు  వేసుకుంటున్నారు.  ఏమన్నా  అంటే  మాకు  నచ్చినట్లు    దుస్తులు  వేసుకుంటాము.  ఎవరికీ  అడిగే     హక్కు  లేదంటూ  దబాయిస్తున్నారు.  



 సమాజంలో   ప్రతిదానికి  కొన్ని    కట్టుబాట్లు    ఉంటాయి.   సమాజం  సజావుగా  సాగాలంటే  కొన్ని  కట్టుబాట్లు  ఉండాలి  కూడా.   నా  ఇష్టం  వచ్చినట్లు  రోడ్డు  పై  కారు  నడుపుతాను...... నా  ఇష్టం   వచ్చినట్లు  జీవిస్తాను.  అంటే    ఎవరూ   ఒప్పుకోరు.....  అంతా  మా  ఇష్టమే..  అంటే  కుదరదు  కదా  !



  బాంకుకు  డబ్బు  పట్టుకెళ్ళాలంటే  ఎంతో  జాగ్రత్తగా   సంచిలో  వేసి  ఎవరికంటా  పడకుండా  తీసుకెళ్తాం . అంతేకానీ,  అందరికీ   ఆ  డబ్బును   ప్రదర్శించుకుంటూ  తీసుకెళ్ళం  కదా !  దొంగలు  ఉంటారు ... బాంకులకు  వెళ్ళేటప్పుడు  డబ్బును  జాగ్రత్త  చేసుకోమని  పోలీసులు ,  ఇంట్లో  పెద్దవాళ్ళు  ఎన్నో  జాగ్రత్తలు  చెబుతారు. 


 
  మీరేమిటి  జాగ్రత్తలు  చెప్పేది  ?   అంతా  మా  ఇష్టం.....అని  వారిని  తూలనాడి ,  ఎవరిష్టం  వచ్చినట్లు  వాళ్ళు  ప్రవర్తిస్తే ,  ఏదైనా  జరగరానిది  జరిగితే ?..... మళ్ళీ  ఆ  పోలీసులను,  పెద్దవాళ్ళనే  సహాయం  కోసం  దేబిరించుకోవాలి.  మన మంచి  కోరి  చెప్పే  పెద్దవాళ్ళ  మాట  వింటే  మనకే  మంచిది.  డబ్బు ముఖ్యమైనదే  కానీ , స్త్రీ  జీవితం  మరింత  ముఖ్యమైనది.


కొందరు  ఏమంటారంటే,  నిండుగా  దుస్తులు  వేసుకునే  ఆడవారి  పట్ల   కూడా  అత్యాచారాలు  జరుగుతున్నాయి.  అసభ్యంగా  దుస్తులు  వేసుకోవటం  తప్పుకాదు ..... అంటూ  వాదిస్తున్నారు. ఆ  వాదన  తప్పు.



 డబ్బును  ఎంతో  జాగ్రత్తగా ఇనప్పెట్టెలో  పెట్టినా  ఒకోసారి  కొందరు  దొంగలు  ఇనప్పెట్టెను    పగలకొట్టి   దోచుకుపోతారు.  అలాగని  
ఇనప్పెట్టెలో  పెట్టటం  మానేయము  కదా  ! మరిన్ని తాళాలు వేసి  పెట్టెలో  దాస్తాము.



 చక్కగా  దుస్తులు  వేసుకున్న  స్త్రీలకు  కూడా,......
అనేక కారణాల  వల్ల , ఆపదలు  కలిగే  అవకాశం  ఉంది.  అంతమాత్రం  చేత    అర్ధనగ్నంగా  దుస్తులు  వేసుకు తిరిగితే  తప్పేమిటి  ?  అని  వాదించటం   హాస్యాస్పదం.  

ఇంకొక విషయం ఏమిటంటే, నిండుగా దుస్తులను ధరించిన స్త్రీల పట్ల కూడా అవమానకరంగా ప్రవర్తించడానికి  ప్రయత్నం చేసేవారున్న సమాజంలో, అర్ధనగ్నంగా ఉండేవారిని చూస్తే వారు మరింత రెచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది.

 
ఈ  రోజుల్లో,    కొన్నికధలు,  కొన్నిసినిమాల్లో  అసభ్య  వస్త్ర  ధారణ,  అసభ్య  దృశ్యాలు  ఎన్నో  ఉంటున్నాయి.    ఆధునిక  విజ్ఞానం  వల్ల  సెల్ ఫోన్లు,   అంతర్జాలం,    టీవీ  చానల్స్  వల్ల  అర్ధరాత్రి,  అపరాత్రి  అని  లేకుండా  ఎప్పుడూ  ఈ  అసభ్య  దృశ్యాలు   అందరికీ  అందుబాటులోకి  వచ్చేసాయి.  ఇవి  చూసేవారి  మీద   ఆ  ఎఫెక్ట్  ఎంతో  ఉంటుంది.  


ఇక  ఆ  ప్రభావంతో   పసి పిల్లలు,  పండు వృద్ధులు,  చక్కగా  దుస్తులు  ధరించే  స్త్రీలు  అని  తేడా  లేకుండా  అత్యాచారాలకు  గురయ్యే  అవకాశం  ఉంది.   అసభ్యంగా  దుస్తులు  వేసుకునే  ఆడవాళ్ళు  కూడా  ఇందుకు  మినహాయింపు  కాదు.

 శారీరికంగా  స్త్రీలు  పురుషుల  కన్నా  బలహీనులు  కాబట్టి ,  ఎంత  డేరింగ్  నేచర్  ఉన్న  ఆడవాళ్ళకయినా  ఇబ్బందులు  వచ్చే  అవకాశం  ఉంది.



  కొందరు  ఆడవాళ్ళయితే  ... ఆడవాళ్ళు  మగవాళ్ళతో    ఎప్పుడయినా , ఎలా  తిరిగినా .. ఫరవాలేదు.  అని   స్టేట్మెంట్స్  ఇస్తుంటారు.   ఇలా   స్టేట్మెంట్స్  ఇచ్చేవారికి  వారి  పిల్లలు  పెద్దయ్యాక  అప్పుడు  తెలుస్తుంది.       


     
        మరికొందరేమో ,  మగవాళ్ళు  ప్రాచీనకాలంలా   పంచలు  వేసుకుంటున్నారా  ?  మేమెందుకు  ప్రాచీన  కాలంలాగా  నిండుగా  దుస్తులు  వేసుకోవాలీ  ?  అని  ప్రశ్నిస్తుంటారు.

 మగవాళ్ళు  పంచలు  వేసుకోపోయినా  నిండుగా  పాంట్ షర్ట్  వేసుకుంటున్నారు.   కొందరు   ఆడవాళ్ళు  వేసుకునే  చిన్న  షార్ట్స్,  చిన్న  బనీను  అలా  నిండుగా  ఉండటం   లేదు  కదా  !

 ( ఉష్ణదేశాల్లోని  మగవారికి  పాంట్,  షర్ట్  కన్నా ,  పంచలే  ఆరోగ్యం  అట.  ఇది  వేరే  విషయం.  )


  అయినా  మగవారు  షార్ట్స్  మాత్రమే  వేసుకుని  వీధుల్లో  తిరిగినా  అసభ్యంగా  అనిపించదు.  ఆడవాళ్ళేమీ  వారిని  గమనించరు,  పట్టించుకోరు. 



  మగవాళ్ళు  పొట్టిదుస్తులు  వేసుకుని  తిరగటానికీ  ,   ఆడవాళ్ళు  మగవాళ్ళలా   పొట్టి  దుస్తులు  వేసుకుని   తిరగటానికీ   చాలా  తేడా  ఉంది  మరి.
 



  అసభ్యంగా  దుస్తులు  వేసుకుని  కనిపించే  సినిమాల్లోని  ఆడవాళ్ళని ,  మగవాళ్ళు  మెచ్చుకుంటూ   ప్రోత్సహించటం వల్ల  ఆనక  కష్టాలు  వస్తాయి.  అలా  ఉంటే  మగవాళ్ళకు  నచ్చుతుంది  కాబోలు .... అనుకునే  ఆడవాళ్ళూ  ఉంటారు.   అసభ్యంగా  దుస్తులు  ధరించే  అమ్మాయి  భార్యగా  వస్తే , అప్పుడు  అబ్బాయి   లబలబలాడటం  వల్ల  ఉపయోగమేమీ  ఉండదు.

  పరాయి ఆడవాళ్ళు అసభ్యకరమైన దుస్తులు వేస్తే చూడాలని ఉబలాటపడే మగవాళ్ళు కూడా తమ కుటుంబసభ్యులు వేసుకుంటే లబలబలాడతారు.
 అందరూ  ఇలాంటి  అసభ్య  వాతావరణాన్ని  గట్టిగా   వ్యతిరేకించినప్పుడే   ఇవన్నీ  తగ్గుతాయి.




Monday, October 1, 2012

స్త్రీలు పురుషులు..ఇద్దరూ సమానమే .



సృష్టికి  ఆదిలో  ఒకే  శక్తి  రెండుగా  అయ్యి  కుడిభాగం  పురుషునిగా  ఎడమభాగం  స్త్రీగా  మారటం  జరిగిందని  పెద్దలు  అంటారు.  అలా  చూసినా  స్త్రీపురుషులు  సమానమే.  ఎవరూ  ఎక్కువా  కాదు  ఎవరూ  తక్కువా  కాదు. 

 శారీరిక  నిర్మాణం  ప్రకారం  ఇంటిని  చక్కదిద్దుకునే  బాధ్యతలు  స్త్రీకి  ,  బయట  తిరిగి  కుటుంబపోషణకు  సరిపడే  ధనాన్ని  సంపాదించే  బాధ్యత  పురుషులకు  అప్పగించారు. రెండు  బాధ్యతలు  గొప్పవే. 

..................
స్త్రీలకు  కుటుంబంలో   వేధింపులు    ఉన్నాయంటే  దానికి  కారణం  ఆమె  భర్త   మాత్రమే  కాకుండా,    తోటి  స్త్రీలైన  అత్తగారు,  ఆడపడుచుల  పాత్ర    కూడా   ఉండే  అవకాశం  కూడా  ఉంది.  ఆడపిల్లలే  పుట్టారని  కోడల్ని  రాచిరంపాన  పెట్టే  అత్తగార్లు  ఎందరో  ఉన్నారు. 

పురుష  సంతానం  లేని వారికి  ఉత్తమగతులు  ప్రాప్తించవు.  అని  కొందరు  అంటారు.  


కానీ,  రామాయణంలో  సీతాదేవి    తండ్రి  అయిన  జనకమహారాజుకు  పురుష  సంతానం  లేరు  కదా  !    అయినా  జనకమహారాజు  జీవన్ముక్తులైన  మహానుభావులు. 

భారతంలో ధృతరాష్ట్రునికి  ఎందరో  కుమారులు  కలిగినా  కూడా యుద్ధంలో  చనిపోయారు  కదా ! ఇలాంటి  పుత్రులు  పుడితే వారి పెద్దలకు సద్గతులు  కలిగే మాట  అటుంచి , దుర్గతులు  కలిగే  అవకాశం  కూడా   ఉంది. 


 ఇందువల్ల  మనకు  తెలిసేదేమిటంటే,   మానవులకు  ఉత్తమ  గతులు  ప్రాప్తించాలంటే,  కావలసినది  దైవభక్తి,  సత్ప్రవర్తన  అని  తెలుసుకోవాలి.  అంతేకానీ  వారికి  సంతానం  కలిగారా  ? లేదా ? కలిగితే  వారు  అమ్మాయిలా  లేక  అబ్బాయిలా  ?  అనే  విషయాల  మీద  పెద్దలకు  ఉత్తమగతి   ప్రాప్తించటం   అనేది   ఆధారపడి  ఉండదు  అని  తెలుస్తోంది . 
..................


   స్త్రీలకు  అన్యాయం  జరిగిపోయింది.  అరటాకు  ముల్లుపై  పడినా  ముల్లు  ఆకుపై  పడినా  ఆకుకే  నష్టం.  ఆడువారి  జీవితం  అరటాకు  లాంటిది   .అయ్యో  !  ఆడ వాళ్ళకు  అన్యాయం  జరిగిపోయింది ...  అని  కొందరు  వాపోతుంటారు. 



 కానీ,  నాకేమనిపిస్తుందంటే,  అరటాకు   పోలిక   పూర్తిగా  సరైనది  కాదు  కానీ,     ఆడువారి  జీవితం   మాత్రమే  కాదు   మగవారి జీవితం  కూడా  అరటాకు  లాంటిదే   అని.


 సరిగ్గా  అర్ధం  కావాలంటే,     గర్భం  ధరించి  సంతానాన్ని  కన్నందు  వల్ల  ఆ  సంతానం  తనకు  పుట్టిన  వారేనని  స్త్రీకి  చక్కగా  తెలుస్తుంది.  మరి  పురుషునికి    ఆ  నమ్మకం  కలగాలంటే  భార్య  ప్రవర్తన  ఎంతో  పద్ధతిగా,  హుందాగా ,  భర్తకు  ఆ  నమ్మకాన్ని  కలిగించే  విధంగా  ఉండాలి  .


అయితే  మహిళలు  పద్దతిగా   తమ  పని  తాము  చేసుకుంటున్నా కూడా, వారిపట్ల   చెడుగా   ఆలోచించే  పురుషులూ   కొందరు   ఉంటారు.   ఇలా    సమాజంలో  మహిళలకు  ఎన్నో   సమస్యలు,  ఆపదలు  పొంచి  ఉండే  అవకాశం  ఉంది.   అందుకని  మహిళలు  ఎంతో   జాగ్రత్తగా  ఉండాలి.  


  ఒకవేళ  ఖర్మకాలి  ఆడవారికి   ఏదైనా  ఆపద  జరిగితే,   అరటాకు  సామెత  ప్రకారం  చూసినా ,    స్త్రీతో  పాటూ  ఆమె  భర్తకు  కూడా  ఎంతో   నష్టం   కలుగుతుంది.   అందుకని  మహిళలు  ఎంతో   జాగ్రత్తగా  ఉండాలి.   ఇవన్నీ  గమనిస్తే,  ఇందుకే  కాబోలు  పూర్వీకులు  స్త్రీ  పురుషులకు కొన్ని   కట్టుబాట్లను   ఏర్పరిచారు   అనిపిస్తుంది.


అయితే,  స్త్రీ  పురుషులకు    పరాయి  వాళ్ళతో  మాట్లాడకుండా  కుదరదు  కదా  !  పరాయి  స్త్రీలను  మాతృసమానులుగా,  సోదరీ సమానులుగా   భావించమని  పెద్దలు  తెలియజేసారు.   అలాగే  పరపురుషులను   పితృసమానులుగా,  సోదర సమానులుగా   భావించమని  పెద్దలు  తెలియజేసారు.  ఈ  రోజుల్లో   కొందరు  ఇలా  భావించకపోవటం  వల్ల   ఎన్నో కుటుంబాల్లో   గొడవలు    చోటు   చేసుకుంటున్నాయి.  మధ్యలో  పిల్లలు  బాధలు  పడుతున్నారు. 


 పరాయి  వాళ్ళు  ఆత్మీయంగా  పలకరిస్తే ,  ఇక  ఉన్న  కుటుంబాన్ని  వదిలి  కొత్తవారితో  వెళ్లిపోయే  స్త్రీ  పురుషులు   కూడా   ఉంటున్నారు.



భార్యో,  భర్తో   తనకు    తగ్గట్లు  లేకపోయినా  పూర్వపు  జంటలు  విడిపోయేవారు  కాదు.   తమ  తెలివితో,  సహనంతో  అవతలి  వారిని  మార్చుకోవటానికి  ప్రయత్నించేవారు.  ఎంతకీ  మారకపోతే    తమ  ఖర్మ  ఇంతే.  అని  సరిపెట్టుకుని  జీవించేవారు.  


ఒకవేళ  మరీ  భరించలేకపోతే  విడిపోయి  , హుందా  అయిన    ప్రవర్తనను  కలిగి , పిల్లలను   జాగ్రత్తగా  పెంచుకుంటూ  జీవించేవారు.  వేరే  వివాహం  చేసుకునే  వారు  కాదు.    అందువల్ల  కనీసం  వారి  సంతానమైనా  భద్రంగా   జీవించేవారు. 

 కొందరు  పురుషులు  పిల్లలను  పెంచటం  గురించి  అని, వేరే  వివాహం  చేసుకునే  వారు.  స్త్రీలైతే  మళ్లీ వివాహం  చేసుకుంటే ,  వచ్చే భర్త  తన మొదటి  పిల్లలను  సరిగ్గా  చూస్తారో  చూడరో  అనే  భయంతో  తిరిగి   వివాహం  చేసుకోవటానికి  ఇష్టపడేవారు  కాదు. ( మొదటి వివాహం  వల్ల  కలిగిన  ఆడపిల్లలు ఉంటే , మరిన్ని  సమస్యలు  ఎదురయ్యే   అవకాశాలు  ఉన్నాయి.)

ఇప్పుడు  ఎవరిష్టం  వాళ్ళది  లాగా  నడుస్తోంది.  ఎప్పుడు.....  ఉన్న  అమ్మానాన్న  మారిపోయి   ఏ  కొత్త  అమ్మ  వస్తుందో  ?  ఏ  కొత్త  నాన్న  వస్తారో  ?  తెలియని  అభద్రతా  భావంతో  కొన్ని    కుటుంబాల్లో  పిల్లలు  ఉన్నారు.  పిల్లలకు  తమ  సొంత  అమ్మానాన్నతో  జీవించే  హక్కు  జన్మతః  వస్తుంది.   

తల్లితండ్రులు  అయిన  స్త్రీ  పురుషులు   తమ  హక్కుల  గురించి  మాట్లాడేటప్పుడు  ఈ  విషయం  గుర్తుంచుకోవాలి.  

......................

పూర్వం   స్త్రీ    తమ  కుటుంబాన్ని  చక్కదిద్దుకోవటం,  తమ  భర్త,  పిల్లల  అభివృద్ధి    ముఖ్యమనుకుంటూ  జీవించేది.   విడాకులు  అని  ఊహించటానికే  భయపడేవారు.  మరి  ఇప్పుడు  కొందరు  స్త్రీలు   విడాకులకైనా  సిద్ధపడుతున్నారంటే  బాధాకరంగా  ఉంది. 

అయితే,   కొందరు  పురుషులు  కూడా   భార్య  ఉండగా  పరాయి  స్త్రీల  కోసం  వెంపర్లాడుతుంటారు.  తన  భార్య  పరపురుషునితో  చనువుగా  మాట్లాడితే  పురుషులు  సహించలేరు.   అలాగే     తన  భర్త  పరస్త్రీలతో  చనువుగా  మాట్లాడితే  ఏ  భార్యకు  ఇష్టం  ఉండదు.  అని  పురుషులూ  గ్రహించాలి.   



భర్త  కొంచెం  ఆప్యాయంగా  పలకరిస్తే,  కొంచెం  పొగిడితే    చాలు   భార్య  పొంగిపోతుంది. కానీ,   కొందరు  భర్తలు  భార్యను  చులకనగా  చూస్తూ  పరాయి  వాళ్ళను  భార్య  వద్ద  పొగుడుతుంటారు.  అప్పుడు  ఆ  భార్య  మనస్సు  ఎంత  గాయపడుతుందో  వారు  ఊహించలేరు.  



కొందరు  పురుషులు   అభద్రతా  భావంతో   కావాలనే  భార్యను  చులకన  చేస్తారు.  అలా  చేస్తే  భార్య  అణిగి మణిగి  పడుంటుందని  వారి  అపోహ.  అలా    భార్య  మనసును  గాయపరచి   చక్కటి  సంసారాన్ని  పాడుచేసుకుంటారు.

 కొందరు  భార్యలు  కూడా  ఇంతే.  భర్త  వద్ద  పరాయి  వాళ్ళను  పొగుడుతారు.  అలా  భర్త   మనసును  గాయపరచి   చక్కటి  సంసారాన్ని  పాడుచేసుకుంటారు.

..............

మనం   బయట  వారిని  ఎందరినో  పొగుడుతాము.  ఎందరితోనో  సర్దుకుపోవలసి  వస్తుంది.  భార్యాభర్తలు  నువ్వు  గొప్పా......నేను  గొప్పా..అని  పోటీ  పడటం  వల్ల  వారి  జీవితాలే  పాడైపోతాయి. 


  బయట  అడుగుపెడితే    ఆఫీసుల్లో   పై  అదికారులతో,  తోటివారితో  మనకు  నచ్చినా  నచ్చకపోయినా  సర్దుకుపోక  తప్పదు.   ఎన్ని  ఆఫీసులు  మారినా  ఎక్కడైనా  ఇలాంటివారే  ఉంటారు. అందుకని  భార్యాభర్తలు  కూడా  సర్దుకుపోతే    వారి  జీవితాలే   సమస్యలు  లేకుండా  ఉంటాయి  కదా  !



Friday, September 28, 2012

కొన్ని విషయాలు మరియు జీవవైవిధ్యం....

అంతర్జాతీయ  జీవ  వైవిధ్య  సదస్సు  మన  దేశంలో  జరగటం    సంతోషకరమైన  విషయం.

ప్రపంచంలో   ఎన్నో  జీవజాతులు   అంతరించి   పోతున్నాయంటున్నారు.  కొంతకాలం  క్రిందట  ఇళ్ళలో  పిచ్చుకలు  వంటివి  కనిపించేవి.  ఇప్పుడు  అంతగా  కనిపించటం  లేదు.  పెరిగిన  కాలుష్యం  వల్ల  వాటి  సంఖ్య  తగ్గిపోతోందట .


ఈ  మధ్య  మేము  కురువపురం  వెళ్ళినప్పుడు  అక్కడ  దేవాలయం  వద్ద  పిచ్చుకలు,  ఇంకా  ఇతర  పక్షుల    కిలాకిలారావాలతో  ఆ  ప్రదేశం  ఎంతో  ఆహ్లాదకరంగా  ఉంది.


కాలుష్యం  వల్ల  పశుపక్ష్యాదులకు  ముప్పు  కలుగుతుంటే  ఆ  కాలుష్యం   వల్ల   మనుషులకు  కూడా  ముప్పు  పొంచి  ఉన్నట్లే  కదా  !     ఇప్పటి నుంచైనా  తగు  జాగ్రత్తలు  తీసుకోకపోతే  అంతరించే  జాతుల్లో  మానవజాతి  కూడా  ఉంటుంది.


మనం  వాడే  రసాయనాలు    గాలిలో,   భూమిలో ,  నీటిలో  కలిసి ....  తిరిగి    ఆహారం  ద్వారా  మనలో  ప్రవేశించటం  వల్ల  ఎంతో  అనారోగ్యం  కలుగుతుంది.  ఇప్పుడు  మనుషులు  ప్రకృతికి  దూరంగా  వెళ్తూ  అదే    అభివృద్ధి   అని  భ్రమిస్తున్నారు. 


మనుషులకు  కోరికలు  ఎక్కువై,    తమకు  ఏం  కావాలో  తెలియని  అయోమయ  పరిస్థితి  ప్రస్తుతం  ప్రపంచంలో  నెలకొని    ఉంది.  ఎందుకో,  ఏమిటో  తెలియని  పోటీతో   ప్రపంచదేశాలు  పరిగెడుతున్నాయి.  


ఈ  పోటీని  అభివృద్ధి   అని  కొందరు   అపోహపడుతున్నారు.

 అయితే,   ఈ  పోటీ    సహజ  వనరులను  వేగంగా  వాడే  విషయంలో  జరుగుతున్న  పోటీ  అని  చెప్పుకోవచ్చు. 


 సహజవనరులు   ప్రకృతిలో   ఏర్పడాలంటే  వేల,  లక్షల  సంవత్సరాల  కాలం  పడుతుంది.  కానీ,  వాటిని  వాడేయటం  తేలిక.  గత  కొద్ది  సంవత్సరాల  కాలంలో  విపరీతమైన    వాడకం  వల్ల   బొగ్గు,  వంటి  ఇంధన  వనరులు  ఖాళీ  అయ్యే  పరిస్థితి  వచ్చింది.



  ఎన్నో  ఖనిజవనరులు  కూడా     వేగంగా  తరిగిపోతున్నాయి.  ఇవన్నీ  అయిపోయాక   ప్రపంచదేశాల  మధ్య  ఇక  పోటీయే  ఉండదు.

 (  అప్పటికి  మానవజాతి   అంతరించకుండా  మిగిలి  ఉంటే..  )

  మన  పూర్వీకులు  ఇంతలా  ఖనిజాలను  వాడినట్లయితే  మనకు  ఇప్పుడు  ఒక  చెంబు  గానీ,  తప్పేలా  గానీ  తయారుచేసుకోవటానికి  ఖనిజపదార్ధమే  ఉండేది   కాదు.  పాపం  వాళ్ళు  మనలా  విపరీతమైన  కోరికలు   కలవాళ్ళు  కాదు  కాబట్టి,  మనం  ఇంకా   వస్తువులను  వాడుకోగలుగుతున్నాము.  


వస్తువులు  తయారు  కావాలంటే  ఇనుము,  బాక్సైట్ ...... వంటి   పదార్ధాలు  కావాలి  కదా  మరి......పారిశ్రామిక  అభివృద్ధి  అంటూ  ఇలాగే   ఖనిజాలని    తవ్వుకుంటూ   పోతే    రాబోయే  తరాల వారికి  ఖనిజాలే  మిగలవు.  


ఇప్పుడు   ప్రపంచ  దేశాల  వద్ద  అంతగా  డబ్బు  లేకపోయినా  ,  పేదరికం,  నిరుద్యోగం,  ఆర్ధికమాంద్యంతో  సతమతమవుతున్నా   కూడా   , విపరీతమైన  .... ఆయుధపోటీలు,  అంతరిక్ష 
పోటీలు..  కొనసాగుతూనే  ఉన్నాయి.

ఈ  మధ్యే  అంగారకయాత్ర  కూడా  జరిగింది  కదా  !
  అంగారకుడు.. వరాహస్వరూపుడైన విష్ణు మూర్తికి  భూదేవికి  కలిగిన   పుత్రుడని 
పూర్వీకులు  చెప్పటం  జరిగింది.

   భూమిపై  ధ్రువప్రాంతాల  వద్ద    వాతావరణంలోనే   మనుషులు    ఉండలేరు. .  ఇక  ఇతరగ్రహాలకు  వెళ్ళి  అక్కడ   బాగు  చేసుకుని  స్థిరపడటం  జరిగేపనేనా  ?    దీనికయ్యే  అంతులేని  డబ్బుతో   భూమిపై  పేదరికాన్ని  పోగొట్టవచ్చు.    


భూమిపై   ఉన్న  ధృవప్రాంతాల్లో  నివాసాలు  గట్రా  ఏర్పాటు   చేస్తే  మాత్రం  అక్కడ   వేడి   పెరుగుతుంది.   


అప్పుడు    అక్కడి  మంచు  కరిగి ,   సముద్రపు  నీటి  మట్టాలు  ఒకటి  లేక  రెండు  అంగుళాలు  పెరిగినా  కూడా  భూమిపైన  ఎన్నో  ప్రాంతాలు,  నగరాలు  మునిగిపోతాయట.  కనుక  ధృవ  ప్రాంతాలకు    వెళ్ళకపోవటమే  మంచిది. 

 మనుషుల్లో ,  వస్తువులపై 
పెరిగిపోయిన   మోజు  వల్లే  ఇన్ని  సమస్యలు    వస్తున్నాయి.  మన  పూర్వీకులు   ఇన్ని  వస్తువులు  లేకపోయినా  చక్కగా  జీవించారు. 

ఇవన్నీ  ఆలోచిస్తే,   భూమిపై  ప్రాణికోటి  మిగిలి  చక్కగా  జీవించాలంటే   మనుషులు  తమ  కోరికలను  తగ్గించుకోక  తప్పదు.


  పారిశ్రామిక  కాలుష్యాల  వల్ల    పర్యావరణానికి  ఎంతో    హాని  కలుగుతోంటే,  భక్తి  పేరుతో  కూడా  కొందరు  పర్యావరణానికి  చేటు  తెస్తున్నారు.  


  పూర్వీకులు,   వినాయకచవితి  పండుగలో  పర్యావరణానికి  మేలు  చేసే  చక్కటి   ఆచారాలను  ఏర్పాటు  చేసారు.

  వానాకాలంలో   ఔషధీయుక్తమైన  పత్రితో  దైవాన్ని  పూజించటం  ,  తరువాత  ఔషధీయుక్తమైన   పత్రితో  సహా  మట్టితో  చేసిన   వినాయకుని  ప్రతిమలను  నీటిలో   నిమజ్జనం  చేయటం  వల్ల   నీటిలో  ఉన్న  చెడు  బాక్టీరియా  నశిస్తుంది.   ఆ  నీటిని  వాడే  ప్రజల  ఆరోగ్యం  చక్కగా    ఉంటుంది.


   పత్రిని   సేకరించటం  ,  పూజ  చేయటం  వల్ల  ఆ  పత్రి  యొక్క   ఔషధీకరణ  గుణాలు  వంటి  విషయాల  గురించిన  వివరాలు    పిల్లలకు  తెలిసేవి. 


అయితే ,  ఇప్పుడు  వినాయక  చవితికి  పత్రి  కన్నా  , రసాయన  రంగులను  వేసిన  విగ్రహాలను  నీటిలో  కలపటం  వల్ల  నీరు  కలుషితం  అవుతోంది.  రసాయన  రంగులను  వాడవద్దని    ఎందరో  చెబుతున్నా  కూడా ,  ప్రజలు  ఎందుకు  పట్టించుకోవటం  లేదో  అర్ధం  కావటం  లేదు.


మనుషులు  తమ  స్వార్ధాన్ని  తగ్గించుకుని  ఇతరజీవులను  కూడా  బ్రతకనిస్తేనే  దైవ  కృప  లభిస్తుంది.




Wednesday, September 26, 2012

ఒకసారి త్రిమూర్తులు మణిద్వీపానికి వెళ్ళి..కొన్ని విషయములు...


ఓం.

  కొందరు  ఏమంటారంటే,  సృష్టిలో   మొదట  ఏకకణ జీవులు, తరువాత   బహుకణ జీవులు, తరువాత పక్షులు,  జంతువులు,  మనుషులు  ఇలా .... క్రమంగా  తెలివితేటలు  యాదృచ్ఛికంగా    పెరగటం  జరిగింది , 


కాబట్టి,    మనుషులే  విశ్వంలో  గొప్పవారు  అంటారు.   మళ్ళీ  ఇతరగ్రహాలలో  మనకన్నా  తెలివిగలవారు  ఉన్నట్లు  సంకేతాలు  అందుతున్నాయి.   అనీ   అంటారు.

అయితే,  మనిషి   పుట్టుక  కంటే  ముందే  విశ్వంలో  సూర్యచంద్రులు, వాతావరణం,   గాలి,   నీరు ,   భూమికి  గురుత్వాకర్షణ  శక్తి  .....వంటివన్నీ  ఉన్నాయి.


మరి ,
మనిషి  కన్నా  ముందే  జీవుల  మనుగడకు   అవసరమైన  ఇవన్నీ  జీవులకోసం  అమర్చిందెవరు  ?  ఇంకెవరు  దైవం. 

ఈ  జగన్నాటకం  సాగటానికి  వీలుగా  ఎంతో  పద్ధతిగా  ఇవన్నీ  ఏర్పాటు  చేయబడ్డాయి. 

..................

ఒకసారి  త్రిమూర్తులు  మణిద్వీపానికి  వెళ్ళి  పరమాత్మ  అయిన  ఆదిపరాశక్తిని  దర్శించి  స్తుతించారు. 

అప్పుడు  బ్రహ్మదేవుడు..అమ్మా! నాదొక  చిన్న సందేహం ..అంటూ..


..ఏకమేవాద్వితీయం బ్రహ్మ. అని  కదా  వేదాలు  చెబుతున్నాయి.  అది  నువ్వా,  లేక  నీ  విభుడైన  పరాత్పర  మహాపురుషుడా  ?....  అని  ఎన్నో  విషయములను  అడుగగా.........

చతుర్ముఖా!  నాకూ నా  పురుషుడికి  భేదం  లేదు. ఎప్పుడూ  ఏకత్వమే.  అతడే  నేను. నేనే  అతడు.  భేదం  మతి  విభ్రమం. మా మధ్య  ఉన్న సూక్ష్మమైన   అంతరాన్ని  తెలుసుకున్నవాడు  నిస్సంశయంగా  సంసార విముక్తుడు.  బ్రహ్మం ఎప్పుడు  ఏకమే.  అద్వితీయమే.  ఏకమేవాద్వితీయం  బ్రహ్మ. సందేహం   లేదు.  కానీ సృజన  సమయంలో  ద్వైత  భావాన్ని  పొందుతుంది.  ఒకటే  దీపం  ఉపాధి  యోగం  వల్ల  రెండు  అయినట్టూ ,  నీడయే  అద్దంలో  పడి  ప్రతిబింబమైనట్టూ  మేము  ద్విధాత్వం  (  ద్వైత  భావం  )  పొందుతూంటాం. ......అంటూ ....పరమాత్మ  అయిన  ఆదిపరాశక్తి ,....   ఇంకా  ఎన్నో  విషయాలను  చెప్పటం  జరిగింది.

అలా  ఎన్నో  విషయాలను  బోధించి...త్రిమూర్తులతో....


.....విషమపరిస్థితి  ఏదైనా  ఎదురైనప్పుడు  నన్ను  స్మరించండి.  స్మరణ  మాత్రం  చేతనే  నేను  మీకు  దర్శనం  అనుగ్రహిస్తాను.  అలాగే  సనాతనుడైన  పరమాత్మను  కూడా  తలుచుకోండి.   మా  ఇద్దరినీ  తలుచుకుంటే  మీకు  కార్యసిద్ధి  నిస్సంశయంగా  కలుగుతుంది......... అని  కూడా  అభయప్రదానాన్ని  చేయటం  జరిగింది.


 ........................
  భూమిపైన  జీవుల   పుట్టుక  కంటే  ముందే    సూర్యచంద్రులు,   గాలి, నీరు ,   వాతావరణం,    భూమికి  గురుత్వాకర్షణ  శక్తి  .....వంటివన్నీ  ఉన్నాయి.  

మనిషి  కన్నా  ముందే  ఇవన్నీ  ఏర్పాటు  చేయబడి  ఉన్నాయి  అంటే ,   ఎంతో  గొప్ప  ఆలోచనాశక్తి  గల  శక్తి  ఎప్పుడూ   ఉన్నట్లు  స్పష్టంగా  తెలుస్తోంది.    ఇవన్నీ  జీవులకోసం  అమర్చిన  ఆ  శక్తినే  ఆస్తికులు  దైవం  అంటారు. 

 ఇవన్నీ  గమనిస్తే  సృష్టికి   కర్త    దైవం .... అని  స్పష్టంగా  తెలుస్తోంది.


  ఇక, ఆదిఅంతము  లేని  దైవం ,వంటి  విషయాల  గురించి  జగన్మాతాపితరులైన  పరమాత్మ ఆదిపరాశక్తికే  తెలుస్తాయి. 


 జగన్మాతా  పితరులైన   పరమాత్మ ఆదిపరాశక్తికి   అనేక  వందనములు.

వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.




Monday, September 24, 2012

ఆద్యంతములు లేని దైవం ఈ విశ్వాన్ని సృష్టించారు.

ఓం 

శ్రీ  వీరబ్రహ్మేంద్రస్వామి  వారు  అనేక  విషయాలను  తెలియజేసారు.   పిండం  యొక్క  అభివృద్ధి    వంటి  విషయములను  కూడా    చక్కగా  తెలియజేసారు.    పెద్దలు  తెలియజేసిన  విషయాలను,  వారి  విజ్ఞానాన్ని    గమనిస్తే   ఎంతో  ఆశ్చర్యంగా  ఉంటుంది. 


పెద్దలు  ఇంకా  ఎన్నో  విషయాలను  మనకు  తెలియజేసారు.


ఆధ్యాత్మికవాదులు,  ఆధునిక  శాస్త్రవేత్తలు  చెప్పేదాని  ప్రకారం    ...... పదార్ధాన్ని   శక్తిని   సృష్టించలేము,  నాశనం  చేయలేము  అని ,   తెలుస్తోంది  కదా  !     ఇవన్నీ  రూపాలను  మార్చుకున్నా    కూడా   ఎప్పుడూ  విశ్వంలో   ఉంటాయని  తెలుస్తోంది.


అంటే ,  ఆద్యంతములు   లేని  ఒక  మహాశక్తి   ఎప్పుడూ   నిత్యంగా    ఉంటుందని  మనకు  తెలుస్తోంది.  ఈ  శక్తి  ఊహాతీతమైన  అద్భుతమైన  ఆలోచనా  శక్తి  కూడా  ఉన్న  శక్తి. (  ఆలోచన  కూడా  ఒక  శక్తే  కాబట్టి..  ) అన్ని  శక్తులూ  కలబోసిన   ఈ మహా శక్తినే  ఆస్తికులు  దైవం  అని  భావిస్తారు. 


ఈ  మహా శక్తి  తన  సంకల్ప మాత్రం  చేతనే  విశ్వాన్ని  సృష్టించటం  జరిగింది.  ఈ  సృష్టిలో  అణువణువునా  సృష్టికర్త  అయిన  దైవం  ఉనికి  ఉంటుందట. 

...................
మనం  ఒక  పని  చెయ్యాలంటే  ఎంతో  ఆలోచించి  చేయవలసి  వస్తుంది.     ఇంత  పద్ధతిగా  ప్రపంచం  ఏర్పడిందంటే  దాని  వెనుక  ఎంతో  ఆలోచన   తప్పక  ఉంటుంది..... ఉండాలి  కూడా...  

  ఆలోచన  లేనప్పుడు  ఇంత  చక్కటి  సృష్టి  ఎలా  సాధ్యం  ?  అసలు   ఆలోచన  లేనిదే  ఏ  పనైనా  ఎలా  చేయగలం  ? 

కొందరు  భావిస్తున్నట్లు  ఆలోచన  అనేది  లేకుండా  యాధృచ్చికంగా  సృష్టి   జరగటం  అనే  దానికి  అర్ధం  ఏమిటి  ?  

నిర్జీవమైన , ఆలోచనలేని స్థితిలో యాధృచ్చికంగా సృష్టి ఎలా జరుగుతుంది ?    అది  సాధ్యం  కాని  విషయం.


  సృష్టిలో  ఆది  నుంచి  ఆలోచన  ఉంది.  అందుకే  దైవం  ఈ  సృష్టిని  తన  సంకల్పమాత్రం  చేతనే  సృష్టించారు....  అని  పెద్దలు  చెప్పి   ఉంటారు. 


 ఒక్క  వాక్యంలో   నా  అభిప్రాయం  ఏమిటంటే,     ఆద్యంతములు   లేని    దైవం   ఈ  విశ్వాన్ని  సృష్టించారు.

......................................

ఈ  విశ్వంలో  భూమి  ఒక  చిన్న  ప్రదేశం  మాత్రమే.  భూమిపై  ఉన్న  మనకు  తెలిసిన  విషయాలు  అత్యల్పం.  ఇతరలోకాల్లో ,  కేవలం  సంకల్పమాత్రం  చేతనే , ఎన్నో   పనులను  చేయగల  జీవులు  కూడా   ఉంటారట.  


 వారు   తమ  సంకల్పమాత్రం  చేతనే  తాము  కోరుకున్న  రూపాన్ని పొందగలగటం,    తమ  రూపాలను   తాము  కోరుకున్నట్లు  మార్చుకోవటం  వంటివి  కూడా   చేయగలరట.   వారే  అలా  చేయగలిగినప్పుడు    విశ్వం  లోని  అన్ని  లోకాలకు   సృష్టికర్త  అయిన  దైవం  తమ   సంకల్పమాత్రం  చేతనే  ఏమైనా  చేయగల  సమర్ధులు.


...............................
సంకల్పబలంతో  అసాధ్యాలు  చేయగలగటం  అనే  విషయాన్ని    కొందరు  ఒప్పుకోరు.  కానీ,   ఈ  రోజుల్లో  కూడా  మనం  చూస్తున్నాము.  కొందరు  తమ  సంకల్పబలం  చేత  ఎన్నో  అసాధ్యాలను  సాధ్యం  చేసి  చూపిస్తున్నారు.

  జుట్టుతో,  పళ్ళతో   లారీలను,  విమానాలను  లాగి  చూపిస్తున్నారు.  ఇవన్నీ  ఆధునిక  విజ్ఞానానికి  అంతుచిక్కని  విషయాలే.  ఏ  శక్తితో  వాళ్ళు  అలా  చేయగలుగుతున్నారు  ? 


 ఇలాంటి  చిత్ర విచిత్రాలెన్నో   ఈ  రోజుల్లో  కూడా    ప్రపంచంలో  జరుగుతున్నాయి.
........................

నాకు  తెలిసిన  విషయాలు  తక్కువ.  మన   శరీరం  ఎలా  పనిచేస్తుందో   మనకు  పూర్తిగా  తెలియదు.  అంతెందుకు.. మన  మనస్సు    ఎలా  పనిచేస్తుందో  మనకు  పూర్తిగా  తెలియదు. 


ఇక  విశ్వ  రహస్యాల  గురించి,  దైవ  రహస్యాల  గురించి  మనకు  పూర్తిగా  ఎలా  తెలుస్తుంది  ? అతి కొద్దిగా  తెలిసినా  ఇతరులకు  అర్ధమయ్యేటట్లు  వివరించటం  కొన్నిసార్లు  చేతకాదు.

  మనం  తినే  వస్తువు  రుచిని  ఇతరులకు  వివరించటం  సాధ్యం  కాదు  కదా  !  వస్తువు  రుచి  తెలియాలంటే  ఆ  వస్తువును  తామూ   రుచి   చూడాలి .


అలాగే  కొన్ని  ఆధ్యాత్మిక    విషయాలను  వివరంగా   తెలుసుకోవాలంటే  ఎవరికి  వారు  ప్రయత్నించి   తెలుసుకోవాల్సిందే.  ( ఉదా.... ధ్యానం  వంటి  విషయాల  ద్వారా...). గురువుల  ద్వారా   తెలుసుకోవచ్చు .

......................................

  కొందరు  మహానుభావులు   ఆధ్యాత్మిక విషయాలను  ఇతరులకు  చక్కగా  వివరించగలరు.  
ఉదా... అష్టావక్ర  మహర్షి    జనకమహారాజుకు   ఆధ్యాత్మిక విషయాలను    తెలియజేసిన  విధానం  అద్భుతమైనది.


Friday, September 21, 2012

హేతుబద్ధత...........


టీవీలో  ఒక  వినోదకార్యక్రమం  వస్తోంది. 


 ఆ  కార్యక్రమంలో  .....  కొన్ని  రోబోట్లు  తీరికవేళలో  కబుర్లు  చెప్పుకుంటున్నాయి. 

 ఒక  రోబోట్ , సాలోచనగా  ....  మనల్ని  సృష్టించినదెవరో  అంతుపట్టటం  లేదు.... అన్నది.


 ఇంకో  రోబోట్ ,....  మనల్ని  ఎవరూ  సృష్టించలేదు.  సృష్టికర్త  అంటూ  ఎవరూ  లేరు.  మనకు   మనమే  యాదృచ్ఛికంగా    జన్మించాము.  అన్నది.


ఈ  విషయం  మీద  రోబోట్లన్నీ  రెండువర్గాలుగా  విడిపోయాయి.   రోబోట్ల  వాదనలతో   అక్కడంతా   గోలగోలగా  తయారయింది.   


వేరే  గదిలో  కూర్చుని   , స్క్రీన్   మీద    రోబోట్ల  వాదనలను  గమనిస్తున్న ,   ఈ  రోబోట్లను     సృష్టించిన  శాస్త్రవేత్తలు  వినోదంగా   నవ్వుకున్నారు. 


 
వినోదకార్యక్రమం  సంగతి   అలా   ఉంచితే....

   దైవం, జీవులు.....శాస్త్రవేత్తలు , రోబోట్ల    పోలికలో   చాలా     తేడాలు   ఉన్నాయి. 
................
 
ఆస్తికులు  సృష్టిని  సృష్టించినది  దైవం  అని  భావిస్తారు.   నాస్తికులు  సృష్టి  యాదృచ్చికంగా  దానికదే   సృష్టించబడిందని   అంటారు. 


 ప్రతి  విషయంలోనూ   హేతుబద్ధంగా  ఆలోచించాలి  అని  వాదించే  భౌతికవాదులు  ,  సృష్టి  యాదృచ్ఛికంగా  దానికదే   ఏర్పడిందని  అనటంలో  హేతుబద్ధత  ?

యాదృచ్ఛికం  అనటం  కన్నా,  దైవమనే  మహాశక్తి  వల్లే  సృష్టి  ఏర్పడిందనటంలోనే  హేతుబద్ధత  ఉంది. 


 ఒక  రోబోట్    యొక్క  విడిభాగాలను  దూరంగా  విసిరేసి  ఒక  సంవత్సరం  గడిచిన  తరువాత  చూసినా,  ఆ  విడిభాగాలు  అలాగే  ఉంటాయికానీ,  వాటికవే  కలిసి  రోబోట్  గా  తయారవదు  కదా  !  ఎవరైనా  వ్యక్తి  ఆ  విడిభాగాలను  కలిపితేనే   రోబోట్  తయారవుతుంది.  


చిన్న  రోబోట్  విషయంలోనే  ఇలా  ఉంటే  ఇంత  గొప్ప  సృష్టి,    సృష్టి  కర్త  లేకుండా  దానికదే  యాదృచ్ఛికంగా  ఎలా  ఏర్పడుతుంది ?  అదీ  ఇంత  పద్ధతిగా....  చక్కటి  ప్రణాళిక  ప్రకారం....  



..గాలిలో  ఎగిరే  పక్షులకు  తేలికైన  రెక్కలు  ఉండటం,  నీటిలో  చేపలకు  ఈదటానికి  తగ్గట్లు  శరీరం  ఉండటం,  అతి  చిన్న  చీమకు  ఉండే  శ్రమశక్తి,     గతితప్పకుండా  వచ్చే  సూర్యచంద్రులు,  వాటివల్ల జీవించే  మొక్కలు,  భూమికి  గల  గురుత్వాకర్షణ  శక్తి .... 


..ఇంత   గొప్ప  
సృష్టి   దానికదే     యాదృచ్ఛికంగా  ఏర్పడిందని  అనటం  హేతుబద్ధత  అనిపించుకోదు.
 

ఈ బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న   అందరికి    అనేక    కృతజ్నతలండి .
 ............

Wednesday, September 19, 2012

ఓం....


* అందరికి వినాయక  చవితి శుభాకాంక్షలండి .

* శ్రీ గణేశ స్తుతి.

 
శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే..


 
ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి

దోషభేదికి బ్రపన్నవినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి

మంజువాదికి నశేషజగజ్జననందవేదికిన్

మోదకఖాదికిన్ సమదమూషకసాదికి సుప్రసాదికిన్.


 
* ఫలం: సర్వపాపనాశనం - సర్వ విఘ్ననాశనం-

  సర్వ వాంఛాఫలసిద్ధి.

* అచ్చుతప్పులు  వంటివి   ఏమైనా  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.