koodali

Monday, October 1, 2012

స్త్రీలు పురుషులు..ఇద్దరూ సమానమే .



సృష్టికి  ఆదిలో  ఒకే  శక్తి  రెండుగా  అయ్యి  కుడిభాగం  పురుషునిగా  ఎడమభాగం  స్త్రీగా  మారటం  జరిగిందని  పెద్దలు  అంటారు.  అలా  చూసినా  స్త్రీపురుషులు  సమానమే.  ఎవరూ  ఎక్కువా  కాదు  ఎవరూ  తక్కువా  కాదు. 

 శారీరిక  నిర్మాణం  ప్రకారం  ఇంటిని  చక్కదిద్దుకునే  బాధ్యతలు  స్త్రీకి  ,  బయట  తిరిగి  కుటుంబపోషణకు  సరిపడే  ధనాన్ని  సంపాదించే  బాధ్యత  పురుషులకు  అప్పగించారు. రెండు  బాధ్యతలు  గొప్పవే. 

..................
స్త్రీలకు  కుటుంబంలో   వేధింపులు    ఉన్నాయంటే  దానికి  కారణం  ఆమె  భర్త   మాత్రమే  కాకుండా,    తోటి  స్త్రీలైన  అత్తగారు,  ఆడపడుచుల  పాత్ర    కూడా   ఉండే  అవకాశం  కూడా  ఉంది.  ఆడపిల్లలే  పుట్టారని  కోడల్ని  రాచిరంపాన  పెట్టే  అత్తగార్లు  ఎందరో  ఉన్నారు. 

పురుష  సంతానం  లేని వారికి  ఉత్తమగతులు  ప్రాప్తించవు.  అని  కొందరు  అంటారు.  


కానీ,  రామాయణంలో  సీతాదేవి    తండ్రి  అయిన  జనకమహారాజుకు  పురుష  సంతానం  లేరు  కదా  !    అయినా  జనకమహారాజు  జీవన్ముక్తులైన  మహానుభావులు. 

భారతంలో ధృతరాష్ట్రునికి  ఎందరో  కుమారులు  కలిగినా  కూడా యుద్ధంలో  చనిపోయారు  కదా ! ఇలాంటి  పుత్రులు  పుడితే వారి పెద్దలకు సద్గతులు  కలిగే మాట  అటుంచి , దుర్గతులు  కలిగే  అవకాశం  కూడా   ఉంది. 


 ఇందువల్ల  మనకు  తెలిసేదేమిటంటే,   మానవులకు  ఉత్తమ  గతులు  ప్రాప్తించాలంటే,  కావలసినది  దైవభక్తి,  సత్ప్రవర్తన  అని  తెలుసుకోవాలి.  అంతేకానీ  వారికి  సంతానం  కలిగారా  ? లేదా ? కలిగితే  వారు  అమ్మాయిలా  లేక  అబ్బాయిలా  ?  అనే  విషయాల  మీద  పెద్దలకు  ఉత్తమగతి   ప్రాప్తించటం   అనేది   ఆధారపడి  ఉండదు  అని  తెలుస్తోంది . 
..................


   స్త్రీలకు  అన్యాయం  జరిగిపోయింది.  అరటాకు  ముల్లుపై  పడినా  ముల్లు  ఆకుపై  పడినా  ఆకుకే  నష్టం.  ఆడువారి  జీవితం  అరటాకు  లాంటిది   .అయ్యో  !  ఆడ వాళ్ళకు  అన్యాయం  జరిగిపోయింది ...  అని  కొందరు  వాపోతుంటారు. 



 కానీ,  నాకేమనిపిస్తుందంటే,  అరటాకు   పోలిక   పూర్తిగా  సరైనది  కాదు  కానీ,     ఆడువారి  జీవితం   మాత్రమే  కాదు   మగవారి జీవితం  కూడా  అరటాకు  లాంటిదే   అని.


 సరిగ్గా  అర్ధం  కావాలంటే,     గర్భం  ధరించి  సంతానాన్ని  కన్నందు  వల్ల  ఆ  సంతానం  తనకు  పుట్టిన  వారేనని  స్త్రీకి  చక్కగా  తెలుస్తుంది.  మరి  పురుషునికి    ఆ  నమ్మకం  కలగాలంటే  భార్య  ప్రవర్తన  ఎంతో  పద్ధతిగా,  హుందాగా ,  భర్తకు  ఆ  నమ్మకాన్ని  కలిగించే  విధంగా  ఉండాలి  .


ఈ  రోజుల్లో   సమాజంలో     వైద్యులుగా,  అధ్యాపకురాళ్ళుగా ,నర్సులుగా    ....ఇలా  కొన్ని  రంగాలలో    మహిళల  పాత్ర  సమాజానికి  ఎంతో  అవసరం . అయితే  మహిళలు  పద్దతిగా   తమ  పని  తాము  చేసుకుంటున్నా కూడా వారిపట్ల   చెడుగా   ఆలోచించే  పురుషులూ   కొందరు   ఉంటారు.   ఇలా    సమాజంలో  మహిళలకు  ఎన్నో   సమస్యలు,  ఆపదలు  పొంచి  ఉండే  అవకాశం  ఉంది.   అందుకని  మహిళలు  ఎంతో   జాగ్రత్తగా  ఉండాలి.  



  ఒకవేళ  ఖర్మకాలి  ఆడవారికి   ఏదైనా  ఆపద  జరిగితే,   అరటాకు  సామెత  ప్రకారం  చూసినా ,    స్త్రీతో  పాటూ  ఆమె  భర్తకు  కూడా  ఎంతో   నష్టం   కలుగుతుంది.   అందుకని  మహిళలు  ఎంతో   జాగ్రత్తగా  ఉండాలి.   ఇవన్నీ  గమనిస్తే,  ఇందుకే  కాబోలు  పూర్వీకులు  స్త్రీ  పురుషులకు కొన్ని   కట్టుబాట్లను   ఏర్పరిచారు   అనిపిస్తుంది.


అయితే,  స్త్రీ  పురుషులకు    పరాయి  వాళ్ళతో  మాట్లాడకుండా  కుదరదు  కదా  !  పరాయి  స్త్రీలను  మాతృసమానులుగా,  సోదరీ సమానులుగా   భావించమని  పెద్దలు  తెలియజేసారు.   అలాగే  పరపురుషులను   పితృసమానులుగా,  సోదర సమానులుగా   భావించమని  పెద్దలు  తెలియజేసారు.  ఈ  రోజుల్లో   కొందరు  ఇలా  భావించకపోవటం  వల్ల   ఎన్నో కుటుంబాల్లో   గొడవలు    చోటు   చేసుకుంటున్నాయి.  మధ్యలో  పిల్లలు  బాధలు  పడుతున్నారు. 


 పరాయి  వాళ్ళు  ఆత్మీయంగా  పలకరిస్తే ,  ఇక  ఉన్న  కుటుంబాన్ని  వదిలి  కొత్తవారితో  వెళ్లిపోయే  స్త్రీ  పురుషులు   కూడా   ఉంటున్నారు.



భార్యో,  భర్తో   తనకు    తగ్గట్లు  లేకపోయినా  పూర్వపు  జంటలు  విడిపోయేవారు  కాదు.   తమ  తెలివితో,  సహనంతో  అవతలి  వారిని  మార్చుకోవటానికి  ప్రయత్నించేవారు.  ఎంతకీ  మారకపోతే    తమ  ఖర్మ  ఇంతే.  అని  సరిపెట్టుకుని  జీవించేవారు.  


ఒకవేళ  మరీ  భరించలేకపోతే  విడిపోయి  , హుందా  అయిన    ప్రవర్తనను  కలిగి , పిల్లలను   జాగ్రత్తగా  పెంచుకుంటూ  జీవించేవారు.  వేరే  వివాహం  చేసుకునే  వారు  కాదు.    అందువల్ల  కనీసం  వారి  సంతానమైనా  భద్రంగా   జీవించేవారు. 

 కొందరు  పురుషులు  పిల్లలను  పెంచటం  గురించి  అని, వేరే  వివాహం  చేసుకునే  వారు.  స్త్రీలైతే  మళ్లీ వివాహం  చేసుకుంటే ,  వచ్చే భర్త  తన మొదటి  పిల్లలను  సరిగ్గా  చూస్తారో  చూడరో  అనే  భయంతో  తిరిగి   వివాహం  చేసుకోవటానికి  ఇష్టపడేవారు  కాదు. ( మొదటి వివాహం  వల్ల  కలిగిన  ఆడపిల్లలు ఉంటే , మరిన్ని  సమస్యలు  ఎదురయ్యే   అవకాశాలు  ఉన్నాయి.)

ఇప్పుడు  ఎవరిష్టం  వాళ్ళది  లాగా  నడుస్తోంది.  ఎప్పుడు.....  ఉన్న  అమ్మానాన్న  మారిపోయి   ఏ  కొత్త  అమ్మ  వస్తుందో  ?  ఏ  కొత్త  నాన్న  వస్తారో  ?  తెలియని  అభద్రతా  భావంతో  కొన్ని    కుటుంబాల్లో  పిల్లలు  ఉన్నారు.  పిల్లలకు  తమ  సొంత  అమ్మానాన్నతో  జీవించే  హక్కు  జన్మతః  వస్తుంది.   

తల్లితండ్రులు  అయిన  స్త్రీ  పురుషులు   తమ  హక్కుల  గురించి  మాట్లాడేటప్పుడు  ఈ  విషయం  గుర్తుంచుకోవాలి.  

......................

పూర్వం   స్త్రీ    తమ  కుటుంబాన్ని  చక్కదిద్దుకోవటం,  తమ  భర్త,  పిల్లల  అభివృద్ధి    ముఖ్యమనుకుంటూ  జీవించేది.   విడాకులు  అని  ఊహించటానికే  భయపడేవారు.  మరి  ఇప్పుడు  కొందరు  స్త్రీలు   విడాకులకైనా  సిద్ధపడుతున్నారంటే  బాధాకరంగా  ఉంది. 

అయితే,   కొందరు  పురుషులు  కూడా   భార్య  ఉండగా  పరాయి  స్త్రీల  కోసం  వెంపర్లాడుతుంటారు.  తన  భార్య  పరపురుషునితో  చనువుగా  మాట్లాడితే  పురుషులు  సహించలేరు.   అలాగే     తన  భర్త  పరస్త్రీలతో  చనువుగా  మాట్లాడితే  ఏ  భార్యకు  ఇష్టం  ఉండదు.  అని  పురుషులూ  గ్రహించాలి.   



భర్త  కొంచెం  ఆప్యాయంగా  పలకరిస్తే,  కొంచెం  పొగిడితే    చాలు   భార్య  పొంగిపోతుంది. కానీ,   కొందరు  భర్తలు  భార్యను  చులకనగా  చూస్తూ  పరాయి  వాళ్ళను  భార్య  వద్ద  పొగుడుతుంటారు.  అప్పుడు  ఆ  భార్య  మనస్సు  ఎంత  గాయపడుతుందో  వారు  ఊహించలేరు.  



కొందరు  పురుషులు   అభద్రతా  భావంతో   కావాలనే  భార్యను  చులకన  చేస్తారు.  అలా  చేస్తే  భార్య  అణిగి మణిగి  పడుంటుందని  వారి  అపోహ.  అలా    భార్య  మనసును  గాయపరచి   చక్కటి  సంసారాన్ని  పాడుచేసుకుంటారు.

 కొందరు  భార్యలు  కూడా  ఇంతే.  భర్త  వద్ద  పరాయి  వాళ్ళను  పొగుడుతారు.  అలా  భర్త   మనసును  గాయపరచి   చక్కటి  సంసారాన్ని  పాడుచేసుకుంటారు.

..............

మనం   బయట  వారిని  ఎందరినో  పొగుడుతాము.  ఎందరితోనో  సర్దుకుపోవలసి  వస్తుంది.  భార్యాభర్తలు  నువ్వు  గొప్పా......నేను  గొప్పా..అని  పోటీ  పడటం  వల్ల  వారి  జీవితాలే  పాడైపోతాయి. 


  బయట  అడుగుపెడితే    ఆఫీసుల్లో   పై  అదికారులతో,  తోటివారితో  మనకు  నచ్చినా  నచ్చకపోయినా  సర్దుకుపోక  తప్పదు.   ఎన్ని  ఆఫీసులు  మారినా  ఎక్కడైనా  ఇలాంటివారే  ఉంటారు. అందుకని  భార్యాభర్తలు  కూడా  సర్దుకుపోతే    వారి  జీవితాలే   సమస్యలు  లేకుండా  ఉంటాయి  కదా  !




6 comments:

  1. బయట అడుగుపెడితే ఆఫీసుల్లో పై అదికారులతో, తోటివారితో మనకు నచ్చినా నచ్చకపోయినా సర్దుకుపోక తప్పదు. ఎన్ని ఆఫీసులు మారినా ఎక్కడైనా ఇలాంటివారే ఉంటారు. అందుకని భార్యాభర్తలు కూడా సర్దుకుపోతే వారి జీవితాలే సమస్యలు లేకుండా ఉంటాయి కదా !
    ----------------------
    మీ ముగింపు చాలా బాగుంది.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    అవునండి. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యనే కొన్ని ఆలోచనలు కలవవు. అభిప్రాయ భేదాలు వస్తూంటాయి. పోతూంటాయి. తోడబుట్టిన వాళ్ళమధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి.

    ఒక వ్యక్తిలోనే చిన్నప్పుడు ఉన్న అభిప్రాయాలు పెద్దయ్యాక మారే అవకాశం ఉంది. జీవితంలో జరిగే సంఘటనలను బట్టి కూడా ఒకే వ్యక్తిలో అభిప్రాయాలు మారే అవకాశం ఉంది.

    ఇక ఎక్కడో పుట్టి , పెరిగిన భార్యాభర్తల మధ్యన అభిప్రాయభేదాలు రావటం అత్యంత సహజం.

    ReplyDelete
  3. వర్తమానం లో స్త్రీ పురుషుల సంబంధాల గురించి మీ వ్యాసం చక్కగా వివరించింది.ఇలాంటి సమస్యలపై మరిన్ని వ్యాసాలు వ్రాయండి.

    ReplyDelete
  4. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
  5. విడిగా స్త్రీ పురుషులు సగం సగమే .
    కలివిడి గానే పరిపూర్ణత్వం సిధ్ధించేది .
    అటువంటప్పుడు .....
    ఎక్కువ తక్కువల ప్రస్తావనే రాకూడదు మరి !
    మీ వ్యాసంలో సమంజస మైన అనేక అంశాలు చర్చించి ,
    సరయిన మార్గదర్శనం సూచించారు .
    అభినందనలు .

    ReplyDelete
  6. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    విడిగా స్త్రీ పురుషులు సగం సగమే .
    కలివిడి గానే పరిపూర్ణత్వం సిధ్ధించేది .
    అటువంటప్పుడు .....
    ఎక్కువ తక్కువల ప్రస్తావనే రాకూడదు మరి !.... చక్కగా చెప్పారండి.

    ReplyDelete