koodali

Monday, March 13, 2017

ఓం.. కొన్ని విషయములు..


శ్రీలక్ష్మీదేవి  జయంతి సందర్భంగా శుభాకాంక్షలు.
లక్ష్మి అంటే డబ్బు మాత్రమే కాదు. పెద్దలు అష్టలక్ష్ముల గురించి తెలియజేసారు. 

ఇంకా  ఎన్నో చక్కటి విషయాలను తెలియజేసారు.
 ఇంటి ముందు ఆవుపేడతో కళ్ళాపి జల్లటం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని అంటారు.

ఆవుపేడ నీటితో కలిపి జల్లటం వల్ల ఇంటి పరిసరాల్లో ఉన్న చెడు బాక్టీరియా పోయి ఇంట్లో వాళ్ళకు అనారోగ్యాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా ! 

ఇంకా, స్త్రీలు కన్నీరు ఫెట్టిన చోట  సిరి ఉండదనీ అంటారు. ఈ విషయాన్ని గమనిస్తే ప్రాచీనులు స్త్రీలకు ఎంత ప్రాముఖ్యతను ఇచ్చారో తెలుస్తుంది.

ఈ విధంగా పెద్దలు ఎన్నో చక్కటి ఆచారాలను ఏర్పరిచారు.
...............................................
  క్రిందవిషయాలను ఈ పోస్ట్ వ్రాసిన చాలాకాలం తరువాత వ్రాసి ఇక్కడ పోస్ట్ చేసానండి.
 .................
  • చాలాకాలం క్రిందట ఒక దగ్గర కొన్ని విషయాలు చదివాను.

    మనదేశంలోనే ఒకదగ్గర ఒక ఆశ్రమంలా ఉందట. అక్కడ అనాధలైన పిల్లలను, కుటుంబానికి దూరంగా ఉన్న స్త్రీలను చేర్చుకుంటారట. ఐదుమంది లేక కొంతమంది పిలల్లను ఒక గ్రూపుగా చేసి, వారికి ఒక మహిళను తల్లిగా నియమించి ఒక కుటుంబంగా ఏర్పరుస్తారట. ఇలా నియమించేటప్పుడు ఆ మహిళకు పిల్లలను పెంచాలనే ఆసక్తి ఉండి, బాధ్యతలను ఇష్టంగా స్వీకరించే వారినే తల్లిగా నియమిస్తారట. 

     ఆ మహిళ ఆ పిల్లలను పెంచి పెద్ద చేస్తుందట. పిల్లలు ఆమెను అమ్మ అని పిలుస్తారట. యుక్తవయస్సు వచ్చిన అబ్బాయిలను వేరుగా అబ్బాయిల హాస్టల్లో ఉంచి చదివిస్తారట. వాళ్లు ఉద్యోగంలో చేరి వివాహం చేసుకుంటారట. పెద్దయిన అమ్మాయిలకు కూడా వివాహం చేస్తారట. పిల్లలు ఎప్పుడైనా తమను పెంచిన తల్లి వద్దకు వచ్చి వెళ్ళోచ్చట. ఈ పద్ధతిలో ఆసరాలేని ఒంటరి మహిళలకు, అనాధలైన పిల్లలకు ఆసరా లభిస్తుంది.
    ..............................
    నాకు ఏమనిపించిందంటే, ఆదాయం బాగా వచ్చే దేవాలయాల పర్యవేక్షణలో గోశాలలు నిర్వహించవచ్చు. ఇంకా, అనాధపిల్లలకు, ఒంటరి అయిన స్త్రీలకు ఆసరా ఇవ్వవచ్చు. 

    పురుషులూ మనుషులే. ఆసరాలేని వృద్ధులైన పురుషులకు కూడా ఆసరా ఇవ్వవచ్చు. స్త్రీలకు, పురుషులకు విడిగా ఉండేలా ఏర్పాట్లు చేయాలి. వీరిలో కొందరు పురుషులను అడిగి గోసంరక్షణకు, స్త్రీలను అనాధ పిల్లలను చూడటానికి సాయం తీసుకోవచ్చు. 

    దేవాలయాల నిర్వహకుల పర్యవేక్షణలో విద్య, వైద్యం కూడా అందించవచ్చు. తిరుమల దేవస్థానం వారి నిర్వహణలో విద్య, వైద్యం అందిస్తున్నారు. షిర్డి సాయి మందిర నిర్వాహకులు కొందరు విద్య, వైద్యం అందిస్తున్నారు. మరిన్ని దేవాలయాల పర్యవేక్షణలో ప్రజలకు విద్య, వైద్యం అందేలా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది.

    భక్తులు తిరుమలలో అన్నదానానికి విరాళాలు అందిస్తున్నారు.దేవాలయాల పర్యవేక్షణలో విద్య, వైద్యం, అనాధపిల్లలకు..కూడా సహాయం చేస్తారని అనిపిస్తుంది. దేవాలయాల నిర్వహకుల పర్యవేక్షణలో అయితే మంచిదని అనిపిస్తుంది.

    సమాజం బాగుండాలంటే..ఎవరూ అనాధలుగా ఉండకూడదంటే.. మనుషుల్లో నైతిక విలువలు పెరగాలి.

Friday, March 10, 2017

డబ్బు సంపాదన, కెరీర్.. .ఉంటే సరిపోతుందా ?


ఈ రోజుల్లో చాలామంది డబ్బు సంపాదించటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. డబ్బు వల్లే అన్ని సంతోషాలనూ పొందలేము కదా !


కొందరు వ్యక్తులు దేశం మీద పడి ఇతరుల సొమ్మును కాజెయ్యటం, బలహీనులను హింసించటం..వంటి పనులను చేస్తుంటారు. ఇలాంటి పౌరుల సంఖ్య ఎక్కువవటం వల్లనే ఇప్పుడు దేశం పరిస్థితి అద్వాన్నంగా తయారయింది.


ఇలా కాకుండా చక్కటి నైతికవిలువలతో కూడిన మంచి పౌరులు ఉంటే దేశంలో సౌభాగ్యం వెల్లివిరుస్తుంది... అయితే చక్కటి నైతికవిలువలతో కూడిన పౌరులు తయారవాలంటే ఎలా ?


చిన్నతనం నుంచీ పిల్లలను కంటికి రెప్పగా కాపాడుకుంటూ చక్కటి ఆహారాన్ని అందిస్తూ, నైతిక విలువలతో పెరిగేలా పెద్దవాళ్ళు  శ్రద్ధ తీసుకోవాలి.


తల్లితండ్రి పొద్దస్తమానం ఉద్యోగమో, వ్యాపారమో చేయటంలోనే తమ టాలెంటును చూపిస్తే ....పిల్లలను చక్కటి శారీరిక, మానసిక ఆరోగ్యం తో, నైతిక విలువలు కలిగిన పౌరులుగా తయారుచేసే బాధ్యతను ఎవరు స్వీకరిస్తారు ?

ఇప్పుడు చాలా విద్యాసంస్థలు కూడా డబ్బు సంపాదించటమే లక్ష్యంగా విద్యను ఉపదేశిస్తున్నాయి.

అందరికన్నా, పిల్లల పెంపకం విషయంలో తల్లితండ్రి బాధ్యత ఎంతో ఉంటుంది.

తండ్రి ఉద్యోగం లేక వ్యాపార బాధ్యతలలో ఉంటే కనీసం తల్లి అయినా ఇంటి బాధ్యతను తీసుకుంటే బాగుంటుంది.


తల్లి బిడ్దకు తొలి గురువు అంటారు. ఇప్పుడు చాలామంది తల్లులు దగ్గరుండి బిడ్డలను పెంచుకోవటానికి  కూడా సమయం లేక  బయటివారి వద్ద వదిలి ఉద్యోగాలకు పరిగెడుతున్నారు.

ఇక తొలి గురువైన తల్లి బిడ్డలకు జీవితపాఠాలను ఎప్పుడు నేర్పిస్తుంది.

తండ్రికి ఉన్న చెడ్డ అలవాట్లు కూడా కుటుంబముపై ఎంతో చెడు ప్రభావాన్ని చూపిస్తాయి.

డబ్బు సంపాదించటం జీవితంలో ముఖ్యమే కానీ, అది మాత్రమే కుటుంబానికీ, దేశానికి ముఖ్యం కాదు.
...............

భావితరాలు శారీరికంగా, మానసికంగా ధృఢమైన వ్యక్తులు తయారవాలంటే, పిల్లలకు టీనేజ్ వయసు వచ్చే వరకూ చక్కటి పుష్టికరమైన ఆహారాన్ని అందించాలి.

మన పాతతరాల వాళ్ళు సునాయాసంగా కొన్ని మైళ్ళు నడిచి వెళ్ళగలిగేవారు. ఇప్పటి తరం వాళ్ళలో ఎందరికి ఆ శక్తి ఉంది ?


పిల్లలకు చిన్నతనం నుంచే నీతికధలు వంటివి చెబుతూ ఉండాలి. ఏది మంచో, ఏది చెడో పెద్దవాళ్ళు చెబుతూ ఉండాలి. అలాగని వాళ్ళకు అసలే ఫ్రీ లేకుండా చేయకూడదు.

ఇప్పుడు చాలామంది పిల్లలు మీడియా ద్వారా ఎలాంటి అశ్లీల దృశ్యాలను చూస్తూ పెరుగుతున్నారో మనకు తెలుసు.

గత కొన్ని ఏళ్ళుగా స్త్రీలు, పురుషులు విపరీతంగా పనిచేస్తున్నారు.

దేశంలో పేదరికం ఎంతవరకూ తగ్గింది ? నిరుద్యోగం మరింత పెరిగింది. ఇతర సామాజిక సమస్యలూ పెరిగినట్లు అనిపిస్తోంది.

 నిర్భయ వంటి ఘటనలు , చిన్నపిల్లల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు ఎందుకు జరిగాయో అర్ధం కావటం లేదు.

ఇవన్నీ గమనిస్తే , ఇప్పటి సమాజానికి  ఆర్ధికాభివృద్ధి కన్నా ......నైతికాభివృద్ధి ఎక్కువగా అవసరం అనిపిస్తోంది.

ఈ దేశానికి ఎన్నో సహజవనరులైన సంపదలున్నాయి. అయినా దేశంలో పేదరికం ఉన్నదన్నా, ఎన్నో నేరాలు, జరుగుతున్నాయన్నా... మనుషుల్లో నైతికవిలువలు లోపించటం వల్లే.



స్త్రీలు .. పురుషులు..సమాజం..మరికొన్ని విషయాలు ..

కొందరు ఏమంటున్నారంటే, స్త్రీలు ఎన్నో రంగాలలో ముఖ్యమైన స్థానాలలో ఉంటే సమాజం బాగుపడిపోతుంది అని భావిస్తున్నారు . 

అయితే, గత ఏభై సంవత్సరాల నుంచీ గమనిస్తే, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు , మంత్రులు, ఎమ్మెల్యేలు..ఇంకా ఎన్నో ఉద్యోగాలు, వ్యాపారాలలో స్త్రిలు  పని చేసారు, పనిచేస్తూనే ఉన్నారు.

మరి, చాలామంది స్త్రీలు ఎన్నో రంగాలలో  ముఖ్యమైన పాత్రల్లో ఉన్నా కూడా.. సమాజంలో నేరాలు జరుగుతూనే ఉన్నాయి  కదా!స్త్రీల పట్ల వేధింపులు మరింత ఎక్కువయ్యాయనిపిస్తుంది. 


కొందరు స్త్రీలు ఏమంటున్నారంటే, అమ్మాయిలు, అబ్బాయిల పెంపకంలో తేడాలుండకూడదు,  అమ్మాయిలంటే  గౌరవం ఉండేలా అబ్బాయిలను పెంచాలి..అని డిమాండ్ చేస్తున్నారు.  అలాగే పెంచండి. ఎవరొద్దన్నారు ?


 తల్లి తన ఆడపిల్లలను, మగపిల్లలను సమానంగా పెంచి స్త్రీల పట్ల మర్యాదగా ఉండాలని అబ్బాయిలకు నేర్పించితే.. ..పెద్దయిన తరువాత అబ్బాయిలు అమ్మాయిలను గౌరవంగా చూస్తారు.


అమ్మాయిలు..అబ్బాయిలు  మధ్య సమానత్వం సంగతి అలా ఉంచితే..చాలామంది స్త్రీల మధ్యే  సహనం, సమానత్వం లేదు.

ఉదా.. కొందరు అత్తా, ఆడపడుచులు..ఇంటి కోడలిని వేధించటం..కొందరు కోడళ్ళు.. అత్తా,ఆడపడుచులను వేధించటం..ఇవన్నీ ఏమిటి ?

ఇక,  వివాహేతర సంబంధాల కేసులలో ..సాటి స్త్రీ కాపురాన్ని కష్టాలపాలు చేయటంలో వేరొక స్త్రీ పాత్ర కూడా ఉంటుంది కదా!

ఇంకో విషయం ఏమిటంటే , స్త్రీలు అందరూ మంచివాళ్ళు, పురుషులందరూ చెడ్దవాళ్ళు అనుకోవటం తప్పు.

 స్త్రీలలో కూడా కొందరు అవినీతిపనులు నేరాలు చేస్తున్నారు. అమ్మాయిలను మోసం చేసి వ్యభిచార గృహాలకు తరలించే కేసులలో కొందరు స్త్రీలు కూడా ఉన్న కేసుల గురించి వార్తలు వచ్చాయి.

 ఇవన్నీ గమనిస్తే ఏమనిపిస్తుందంటే ,  స్త్రీల కష్టాలకు  కొందరు పురుషులతో పాటు.. కొందరు స్త్రీలు కూడా కారణమే అని తెలుస్తుంది. 
 
సహజంగా స్త్రీలంటే సున్నితమనస్కులుగా ఉంటారంటారు. అయితే, అందరూ అలా ఏమీ ఉండరు. చెడ్డప్రవృత్తి కలవారు చాలామందే ఉంటారు.

శూర్పణఖ లాంటి స్త్రీలు సీతాదేవిలాంటి వారికి కష్టాలు తెస్తారు. శూర్పణఖ తన అన్న అయిన రావణుడితో సీతాదేవి  గురించి చెప్పి,  సీతాపహరణకు రావణుడిని ప్రోత్సహించింది.


 స్త్రీలు అసూయ వల్ల..  తమలో తాము పోటీ పడుతూ ఉంటే మగవారి ముందు చులకన అయ్యే అవకాశం ఉంది.  తద్వారా స్త్రీల పట్ల మగవారి పెత్తనం పెరిగే అవకాశం వస్తుంది.
*************

స్త్రీలు  ఇంటాబయట పని నెత్తినేసుకుని పనిచేయటం గమనిస్తే..ఇది స్త్రీల  విజయం కాదు ... ఇది పురుషుల గెలుపుగా అనిపిస్తోంది.


పాతకాలంలో స్త్రీలు ఇంటిపట్టున ఉండేకాలంలో పురుషులు పరాయి స్త్రీలతో మాట్లాడాలన్నా కష్టంగా ఉండేది. ఈ రోజుల్లో స్త్రీలను వేధించటం కొందరు పురుషులకు సులువయ్యింది.
...............

 జీవితంలో డబ్బు సంపాదనా..అవసరమే..కుటుంబాన్ని  చక్కదిద్దుకోవటమూ ముఖ్యమే.
రెండూ ముఖ్యమైన బాధ్యతలే.
..............

  ఇక,  పిల్లల పెంపకంలో తల్లితండ్రి ఇద్దరికీ బాధ్యత ఉంటుంది. 

భర్త తన భార్యను గౌరవంగా చూస్తే.. భార్య సంతోషంగా ఉంటుంది. ఆమె తన పిల్లలను చక్కగా చూసుకుంటుంది.

ఎప్పుడూ గొడవపడే భర్త ఉన్న భార్య ఆ బాధ వల్ల పిల్లలను సరిగ్గా చూసుకోలేదు. భర్త భార్యను కొడితే ఆమె ఆ కోపంతో పిల్లలను కొట్టే అవకాశం ఉంది.

 పిల్లలను శారీరికంగా, మానసికంగా చక్కటి పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించటం ఎంతో గొప్ప సమాజసేవ.

చక్కటి పౌరులు ఎక్కువగా ఉండే సమాజంలో సమస్యలూ తక్కువగానే ఉంటాయి.



Monday, March 6, 2017

స్త్రీలు..పురుషులు..సమాజం..



పాతకాలం స్త్రీలు భర్త సంపాదించి తెస్తే ఆ సొమ్ముతో ఇంటి బాధ్యతను నిర్వర్తిస్తూ పిల్లలను దగ్గరుండి పెంచుకుంటూ ఇంటి అజమాయిషీ నిర్వర్తిస్తూ హాయిగా ఉండేవారు.

అప్పటి స్త్రీలకు బంగారం రూపంలో కూడా సంపద ఉండేది. ఆ స్త్రీ ధనాన్ని పురుషులు వాడుకునేవారు కాదు.

ఈ రోజుల్లో చాలామంది మగవాళ్ళు ఏమంటున్నారంటే భార్య బాగా చదివి, పెద్ద ఉద్యోగం చేసి ఎక్కువ జీతం తెస్తూ , ఇంట్లో పెద్దవారిని  బాగా చూసుకుంటూ, పిల్లల్ని బాగా  చూసుకుంటూ, భర్తను బాగా చూసుకోవాలని  అంటున్నారు.ఎన్నో బాధ్యతల్ని స్త్రీల నెత్తిన వేస్తున్నారు.


కొందరు మగవారేమో .. స్త్రీలు ఎన్నో పనులు చేయగల శక్తిగలవారని పొగుడుతూ ఎక్కువ పనులు చెబుతున్నారు.


ఇక స్త్రీలేమో బయట ఎన్నో అభద్రతల మధ్య భయపడుతూ, ఇంటాబయట పనిచేస్తూ అనారోగ్యాలు తెచ్చుకుంటూ ..ఇదంతా స్త్రీల అభివృద్ధి .. అని భ్రమపడుతున్నారు. స్త్రీలు ఈ భ్రమల నుంచి బయటకు రావాలి.


అయితే,చాలామంది స్త్రీలు ఏమనుకుంటున్నారంటే , ఇంట్లోనే ఉంటే మళ్ళీ స్వేచ్చ కోల్పోతామేమోనని భయపడుతున్నారు.అలాంటి భయాలు అక్కరలేదు.


 ఇంటిపట్టున ఉండే వాళ్లు ఉండవచ్చు. ఇంటిపనులు పూర్తయి ఇంకా ఎక్కువ సమయం మిగిలి ఉండే స్త్రీలు గ్రూపులుగా ఏర్పడి సమాజ సేవకు సమయాన్ని కేటాయించవచ్చు..

లేక, కుటుంబ ఆదాయం పెరగటం కోసం డ్వాక్రా గ్రూపులు వలె  ఏర్పడి ఆదాయం పొందటానికి చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటుచేసుకోవచ్చు.


పనిచేసే చోట  అందరూ మహిళలే ఉంటే లైంగిక వేధింపుల బాధలు ఉండవు.

సొంత పరిశ్రమలో కుటుంబాలకు అనువైనట్లుగా సమయాలు ఏర్పరుచుకోవచ్చు.


ఉదా..పరిశ్రమల వేళలు ఉదయం 10 నుండి సాయంత్రం 3 వరకు మాత్రమే ఉంటే ఉదయం ఇంటిపనులు పూర్తయి పిల్లలు స్కూళ్ళకు వెళ్ళిన తరువాత పరిశ్రమలకు వెళ్లి పిల్లలు స్కూళ్ల నుండి వచ్చే ముందే ఇంటికి వచ్చేయవచ్చు.

ఇలా స్త్రీలు ఏర్పాట్లు చేసుకుంటే అటు కుటుంబాన్ని చూసుకున్న తృప్తీ ఉంటుంది. ఇటు ఆదాయమూ ఉంటుంది. పనివేళలు తగ్గటం వల్ల స్త్రీల ఆరోగ్యమూ బాగుంటుంది.


జీవితంలో ఉన్నత ఉద్యోగం రావటం ..ఎక్కువ పేరు ప్రఖ్యాతులు రావటం గొప్ప విషయాలే కానీ, సమాజానికి చక్కటి శారీరిక, మానసిక దృఢత్వం కలిగిన పౌరులను తయారుచేసి అందించటం మరెంతో గొప్ప విషయం. 


రాబోయే తరాలు శారీరికంగా, మానసికంగా దృడంగా ఉంటేనే సమాజం చక్కగా ఉంటుంది.

రాబోయే తరాలు శారీరికంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే తల్లితండ్రులలో ఒకరైనా  .. పిల్లల పెంపకం, ఇంటి పనిపై ఎక్కువ సమయాన్ని కేటాయించవలసి వస్తుంది.


అయితే, ఎన్నో కోణాల నుంచి గమనిస్తే ఇంటిపని, పిల్లలపెంపకం..వంటివి ఎక్కువభాగం తల్లి చూసుకోవటమే సరైనది.

సంపాదన ముఖ్యమే కానీ, సమాజానికి మంచి పౌరుల అవసరం మరింత ముఖ్యం.
 
మంచి పౌరులు ఉన్నప్పుడు, సమాజంలో అత్యాశ, నేరాలు, ఘోరాలు తగ్గి సంపద సమాజంలో అందరికీ అంది సమసమాజం ఏర్పడుతుంది.



.ఎంతో శ్రమపడి కష్టపడుతూ పనిచేయటమే స్త్రీల అభివృద్ధి అనుకోవాలా?


 
కొంత పాతకాలంలో ఆడవాళ్ళు ఎక్కువగా ఇంటిపట్టున ఉన్న రోజుల్లో స్త్రీలు ఎన్నో కష్టాలు పడుతున్నారని భావించి ..బైటకు వచ్చి, విద్యను అభ్యసించటం, ఉద్యోగాలు చేయటం,వ్యాపారాలు చేయటం ఎక్కువయింది.


 సరే, మరి ఇప్పడు స్త్రీల పరిస్థితి ఎలాగుంది ?

ఈ రోజుల్లో స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలను గమనిస్తే ఏమనిపిస్తుందంటే,ఈ రోజుల్లో స్త్రీల పరిస్థితి పెనం పైనుంచి పొయ్యిలో పడినట్లు అనిపిస్తోంది.


ఈ రోజుల్లో ఎన్నో కేసుల గురించి వింటున్నాము. పాఠశాలలో కొన్నిలైంగిక వేధింపు కేసులు, ఉద్యోగరీత్యా పనిచేసే చోట కొన్ని లైంగిక వేధింపు కేసులు, పనుల వల్ల బయటకు వెళ్ళి వచ్చే సమయంలో రహదారుల వెంట వేధించే పోకిరీల వల్ల లైంగిక వేధింపులు,..సామూహిక అత్యాచారాల కేసులు..గురించి వింటున్నాము.



చాలామంది స్త్రీలు తాము సూపర్ విమెన్ అని నిరూపించుకునే ప్రయత్నంలో  పనులన్నీ నెత్తిన వేసుకుని ఇంటాబయటా విపరీతంగా కష్టపడుతున్నారు.

 తాము కష్టపడటం మాత్రమేకాకుండా స్త్రీలందరిని బయటకు రావాలంటూ ఎన్నో ప్రయత్నాలు చేసారు.



ఫలితంగా ఇప్పుడు పరిస్థితి ఏమయ్యిందంటే.. దాదాపు ప్రతిస్త్రీ ఇంటాబయటా కష్టపడవలసిన  పరిస్థితి ఏర్పడింది.

ఉద్యోగం చేయకుండా ఇంటిపట్టునే ఉండి ఇంటిపనులు నిర్వహించాలనుకునే స్త్రీలను తక్కువగా చూసే పరిస్థితి ఏర్పడింది.



కొందరయితే వంటింట్లో కుందేలు అంటూ హేళనగా మాట్లాడుతూ ఇంటిపట్టున ఉండే గృహిణుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు.

ఇదంతా స్త్రీల గొప్పదనం ..అని కొందరు స్త్రీలు అనుకుంటున్నారు కానీ, ఎక్కువగా లాభపడుతోంది పురుషులే.


మా దూరపు బంధువు ఏమన్నదంటే ,ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా కుటుంబంకోసం సంపాదించటం వల్ల మగవాళ్ళు పని చేయకుండా కుటుంబ భారాన్ని ఆడవాళ్ళపై పడేసి తప్పించుకు తిరుగుతున్నారని వాపోయింది.



ఆమె ఉద్యోగం చేసి సంపాదిస్తుంటే భర్త ఇల్లు పట్టకుండా తిరుగుతుంటాడట.

పాతకాలంలో ఆడవాళ్ళు ఇంటిపట్టున ఉండేరోజుల్లో మగవారికి ఆడవారిని వేధించటానికి అవకాశాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు మగవాళ్ళు స్త్రీలను వేధించటానికి సులువయింది.


ఆడపిల్లలకు నెలసరి రోజులో మరియు గర్భవతిగా ఉన్నప్పుడు..విశ్రాంతి ఎక్కువగా అవసరమవుతుంది.  అయితే ఈ రోజుల్లో , ఆరోగ్యం ఎలాగున్నా తప్పనిసరిగా పనికి వెళ్ళాల్సిన పరిస్థితి స్త్రీలకు దాపురించింది.


ఉదయమే లేచి హడావిడిగా పనులు చేసుకుని బయటకు పరిగెత్తాలి. షేర్ ఆటోల్లో ఆడ, మగ తేడా లేకుండా ఇబ్బందిగా కూర్చుని ప్రయాణించవలసి వస్తుంది.


నెలసరి సమయం అయినా, గర్భం దాల్చిన తొలినెలలయినా  బస్సుల్లో కొన్నిసార్లు నిలబడి కూడా  ప్రయాణించవలసి వస్తుంది. ఈ కుదుపులకు అబార్షన్ జరిగినా ఆశ్చర్యం లేదు.


సొంత కారులో ప్రయాణించాలన్నా భయపడే పిదపకాలం దాపురించింది.


ఇక పనిచేసేచోట ఎలాంటి వేధింపులు ఉంటాయో చెప్పలేం. ఇక, కొన్ని ఉద్యోగాలయితే స్త్రీలు అర్ధరాత్రి కూడా పనిచేయవలసి ఉంటుంది. 


 ఇక చిన్నపిల్లలున్న స్త్రీల పరిస్థితి మరీ ఘోరం. పిల్లలను  ఎక్కడయినా వదిలి పనికి రావలసి ఉంటుంది. అక్కడ పిల్లలు ఎలా ఉన్నారోననే ఆందోళనతో పనిమీద సరిగ్గా ధ్యాస ఉంచలేరు.


స్త్రీల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు కొన్ని కేసులు బయటలు వస్తున్నాయి. బయటకు రానివి ఎన్ని ఉన్నాయో? బైటకు చెప్పుకోలేక ఎందరు ఆడవాళ్ళు క్షోభ అనుభవిస్తున్నారో?


తెలివైన మగవాళ్ళు .. స్త్రీలు ఎంతో కష్టపడిపనిచేస్తారంటూ పొగిడి మరింత పనిచేయించుకుని లాభాలు పొందుతారు.


ఇంటాబయటా ఎంతో శ్రమపడి కష్టపడుతూ పనిచేయటమే స్త్రీల అభివృద్ధి అనుకోవాలా?


Friday, March 3, 2017

కృతజ్ఞతలు..అభినందనలు..శుభాకాంక్షలు. ..

 
ఈ మధ్యన భారతదేశం 104 ఉపగ్రహాలను ఒకేసారి విజయవంతంగా ప్రయోగించటం ఎంతో గొప్ప విషయం.


ఇస్రో వారు మరియు ఈ విషయంలో పనిచేసిన అందరూ అభినందనీయులు.


ఈ విషయం గురించి ఆలస్యంగా రాస్తున్నాను కానీ... నాకు కూడా ఆ రోజు చాలామంది భారతీయులలానే టెన్షన్ అనిపించింది.


(ఈ ఉపగ్రహాల వల్ల ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారుకదా!)


ప్రయోగం విజయవంతం అయ్యాక ఎంతో సంతోషం కలిగింది. 


 ప్రయోగం విజయవంతం కావాలని కొందరు శాస్త్రవేత్తలు శ్రీ వేంకటేశ్వర స్వామి పూజ చేసినట్లు వార్తల ద్వారా తెలిసింది.


 ప్రయోగం విజయవంతమైనది.అంతా దైవం దయ.దైవానికి కృతజ్ఞతలు..



ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నూతన భవనాలు ప్రారంభోత్సవం జరిగిన సందర్భంగా కూడా అందరికీ శుభాకాంక్షలు.





Wednesday, March 1, 2017

నైతికవిలువలు కలిగిన పౌరుల సంఖ్య పెరిగితే ...


ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల గురించి వింటుంటే సమాజం ఎటుపోతోందో అర్ధం కావటం లేదు.

మహిళలపై  అత్యాచారాలు జరగటం చాలా ఘోరం.

మరొక ఒక సంఘటనలో ఒక యువకుడు యాక్సిడెంట్ గురయ్యి రోడ్డుపై విలవిలలాడుతూ తమ కుటుంబసభ్యులకు ఫోన్ చేయమని ప్రాధేయపడుతూ ఫోన్ నంబర్ ఇచ్చినా చుట్టుప్రక్కల గుమికూడిన జనం స్పందించలేదట.

 కొందరయితే ఆ యువకుడు గిలగిలలాడుతుంటే సెల్ ఫోన్లో చిత్రీకిరిస్తూ ఉన్నారట. ఎవ్వరూ పట్టించుకోకపోవటం వల్ల ఆ యువకుడు అక్కడే మరణించాడట.


ఇవన్నీ గమనిస్తే ,మనుషుల్లో మానవత్వం మరుగునపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సమాజానికి తక్షణం కావలసింది నైతికాభివృద్ధి.


 చిన్నతనం నుంచి పిల్లలలో నైతిక విలువలు పెంపొందేలా పెద్దవాళ్ళు శ్రద్ధవహించాలి.
నైతికవిలువలు కలిగిన పౌరుల సంఖ్య పెరిగితే సమాజంలో నేరాలు-ఘోరాలు తగ్గుతాయి.