koodali

Friday, October 24, 2014

స్వచ్చ భారత్ కల సాకారం కావాలంటే .


స్వచ్చ  భారత్  అంటే   వీధుల  శుభ్రత  మాత్రమే  కాదు. 

సమాజంలో  పెరుగుతున్న   అవినీతి..  అసభ్య  పోకడలు.. నైతికవిలువల  దిగజారుడుతనం  వంటి  విషయాలను  కూడా శుభ్రం  చేసుకోవాలి. 


వీధుల  పరిశుభ్రత  విషయాన్ని  గమనించితే...  


పరిశుభ్ర  భారత్  కోసం  ఈ మధ్య  చాలామంది  చీపుర్లు  పట్టుకుని  రోడ్లను  ఊడ్చేయటం  ఎంతో  సంతోషకరమైన  విషయం.


 సినిమా  వాళ్ళు,  రాజకీయనాయకులు,  మరికొందరు  సెలబ్రిటీలు  కూడా  రోడ్లను  ఊడుస్తున్న  దృశ్యాలను  వార్తలలో  చూస్తున్నాము. 


 అయితే  వీళ్ళు అప్పుడప్పుడు  రోడ్లను  ఊడ్చటం  వల్ల  మాత్రమే  పరిశుభ్ర  భారత్  ఎంతవరకు  వస్తుందో తెలియదు  ...  అయితే   ఈ  చర్యల  వల్ల ప్రజలలో  కొంత  చైతన్యం  వస్తుందన్నది  నిజమే . 


ఏ  సమస్యనైనా పరిష్కరించాలంటే  అప్పటికప్పుడు   కొన్ని తాత్కాలిక  చర్యలు  తీసుకుంటూనే  శాశ్వత  పరిష్కారానికి  కూడా  చర్యలను  చేపట్టాలి.  అప్పుడే  సమస్యలు  చక్కగా  పరిష్కారమవుతాయి. 


 శాశ్వత  పరిష్కారం  కావాలంటే  సమస్య  మూలం  నుంచి  శ్రద్ధ  తీసుకోవాలి.

.......................

స్వచ్చభారత్  సాధించే  విషయంలో  ప్రజలతో  పాటు   ప్రభుత్వానికీ  ఎంతో    బాధ్యత  ఉంది.


రోడ్లను  ఊడ్చటంతో  పాటు  అసలు  రోడ్లపైన  చెత్త  వేయకుండా  పటిష్టమైన  చర్యలను  చేపట్టాలి.  రోడ్లపై  చెత్త  వేసేవారి  పట్ల  అవసరమైతే  కఠినంగా  వ్యవహరించాలి.


 అదే  సమయంలో  చెత్త  వేయటానికి  సరిపడినన్ని డస్ట్ బిన్లను  కూడా  ప్రభుత్వం  ఏర్పాటు  చేయాలి. 


ప్లాస్టిక్  వేస్ట్  వేయటానికి  విడిగా  డస్ట్ బిన్లను   ఏర్పాటు  చేసి,   ప్లాస్టిక్  వ్యర్ధాలను  వాటికి  కేటాయించిన  డస్ట్ బిన్లలోనే  వేసేటట్లు  బాగా  ప్రచారం  చేయాలి. 


తిరుమలలో  ఇలాంటి  ఏర్పాట్లు  ఉన్నాయి.  రోజూ  వేల  మంది  భక్తులు  వస్తున్నా  కూడా  తిరుమల  చాలా  వరకూ  శుభ్రంగానే  ఉంటుంది.

................

చట్టాన్ని  పకడ్బందీగా  అమలుపరిచే  విధానం  ఉన్నప్పుడు  ప్రజలూ  సరైన  దారిలోకి  వస్తారు.


 చట్టాన్ని  సరిగ్గా  లక్ష్యపెట్టని  ప్రజలు  ఉన్నప్పుడు  కఠినమైన  శిక్షలు, వాటిని  సక్రమంగా  అమలుచేసే  వ్యవస్థ   కూడా   ఉండవలసిందే.


  ఉదా..ఇండియాలో  ఎక్కడపడితే  అక్కడ  చెత్త  పడేసే  ప్రజలు  కూడా  విదేశాలకు  వెళ్తే      ఎక్కడపడితే  అక్కడ  చెత్తను  వేయరు కదా ! ( అక్కడి  కఠినమైన  శిక్షలకు  భయపడి..)



కొన్ని  దేశాలలో  అయితే,  రోడ్లపై  చెత్త  వేసిన  వారికి  జరిమానా  విధించటంతో   పాటూ వారితోనే  రోడ్లను  శుభ్రం  చేయిస్తారట.( ఈ  పద్ధతి చాలా  బాగుంది. ) 

................

  ప్లాస్టిక్  వ్యర్ధాలను,  ఎలెక్ట్రానిక్  వ్యర్ధాలను ,  వంటింటి  నుంచి  వచ్చే  వ్యర్ధాలను  వేయటానికి  విడివిడిగా  డస్ట్ బిన్లను   ఏర్పాటు  చేయాలి. 


ప్రతి  వీధిలోనూ   ఈ  మూడురకాల  డస్ట్ బిన్లూ  ఉండాలి.


 ఇలాంటి  ఏర్పాట్లు  ఉన్నప్పుడు  ప్రజలు  కూడా  త్వరగానే  మారుతారు.

.....................

వీధులలో  ఉండే  ఆరుబయట  టాయిలెట్లు  గబ్బుకొట్టకుండా   ఉండాలంటే  టాయిలెట్లులో  నీటి  సౌకర్యం  ఏర్పరచాలి. పంపులలో  వచ్చే  నీరు  వృధా  పోకుండా  ఎప్పటికప్పుడు  వాల్వులను  పరిక్షిస్తూ  ఉండాలి.

వీధులలో  సులభ్ టాయిలెట్స్   తరహా  టాయిలెట్స్  మరిన్ని  ఏర్పాటు  చేయాలి.

..................
స్వచ్చ  భారతాన్ని   సాధించటానికి  మన  ప్రాచీనులు  ఎన్నో  చక్కటి  విధానాలను   అందించారు.

   ఉదా..పాతకాలంలో  ఎవరి  ఇంటిముందు వీధిని  వారే  శుభ్రం  చేసుకునేవారు.  ఆడవాళ్ళు  ఉదయాన్నే లేచి   ఇంటిముందు  ఊడ్చి,  కళ్ళాపి  చల్లి,  ముగ్గులు  వేసుకునేవారు.  


ఎవరి  ఇంటిముందు వీధిని  వారే  శుభ్రం  చేసుకుంటే  వీధులన్నీ  వాటికవే శుభ్రంగా  ఉంటాయి  కదా!

.....................

ప్రపంచం  పొల్యూట్  కావటానికి  ఆధునిక  టెక్నాలజీ  కూడా  కారణమే. 


 పరిశ్రమల  నుంచి  వచ్చే  రసాయన  వ్యర్ధాలను   నదులలో,  సముద్రాలలో  కలుపుతున్నారు.


ఇంకా, ఈ రోజుల్లో ప్లాస్టిక్ వంటి  త్వరగా  శిధిలం  కాని  వ్యర్ధాలు  ఎక్కువయ్యాయి.


 ప్లాస్టిక్  మరియు  ఎలక్ట్రానిక్   వ్యర్ధాలు   శిధిలం  కావటానికి  చాలా  కాలం  తీసుకుంటాయి. కుప్పలుగా  పేరుకున్న  ప్లాస్టిక్  వ్యర్ధాలు  నీటిప్రవాహాలకు  అడ్డుపడి  వరదలకు  కారణమవుతున్నాయి.

.................

పాతకాలంలో  మార్కెట్  నుంచి  సరుకులను  తెచ్చుకోవటం  అనేది  తక్కువగా  ఉండేది. ఒకవేళ   బయట  నుంచి  సరుకులను  తెచ్చుకోవాలంటే    ఆకులతో  చేసిన  పొట్లాలలో  కట్టి  గానీ,  లేక  గిన్నెలలో  గానీ  పోసి ... గుడ్డ  సంచీలో  వేసి  ఇంటికి  తెచ్చుకునేవారు. 


 ఆకులు  ,  వస్త్రపు  సంచి  వంటివి  పర్యావరణంలో  సులభంగా  కలిసి  శిధిలమయిపోతాయి. అందువల్ల పాతకాలంలో  చెత్త  ఎక్కువగా  ఉండేది  కాదు.  

..............

ఈ  రోజుల్లో  సూపర్  మార్కెట్కు  వెళ్తే  ప్రతి  వస్తువూ   ప్లాస్టిక్  పాకెట్స్లోనే  పాక్  చేసి  ఉంటుంది.  ఒక్కొక్క  ఇంటినుంచి  నెలకు  వచ్చే  ప్లాస్టిక్  వ్యర్ధాలు   చాలానే   ఉంటాయి.


అందువల్ల,  ప్లాస్టిక్   వ్యర్ధాలను  పడెయ్యటానికి  ప్రత్యేకమైన  డస్ట్  బిన్లను  ఏర్పాటుచేసుకుంటే  మంచిది.

...................

ప్లాస్టిక్  పెట్రోల్ కు  సంబంధించిన పదార్ధమేనట..  అందువల్ల, ప్లాస్టిక్  వ్యర్ధాలతో  వాహనాలు  నడిచే  ఇంధనం  తయారీని  కనిపెట్టారు  కొందరు  ఔత్సాహికులు.  అలాంటి  వారిని  ప్రోత్సహించి  పెట్రోల్  నుంచి  ఇంధనం  తయారుచేస్తే  బాగుంటుంది.



 (  ప్లాస్టిక్ వ్యర్ధాల  నుంచీ తయారుచేసిన  ఇంధనం  వల్ల వాతావరణ  కాలుష్యం  పెరుగుతుంది  కానీ, ప్లాస్టిక్  వ్యర్ధాలను అలాగే  బయట పడేయటం  కన్నా  కొంతలో  కొంత  నయం  కదా !)

............

వీధులు  శుభ్రంగా  ఉండాలంటే,  పారిశుధ్య సంస్థలో ఎక్కువ  సంఖ్యలో   ఉద్యోగస్తులను నియమించాలి. ఇందువల్ల  కొంత  నిరుద్యోగ  సమస్యా  తీరుతుంది.


మనవాళ్ళు  ప్రతిదానికీ   డబ్బు  లేదు  అంటారు. కొత్తగా   ఉద్యోగాలు  ఇవ్వాలన్నా  డబ్బులేదు  అంటారు.


  దేశంలో  అవినీతికి  అడ్డుకట్టవేయాలి. నల్లధనం   విషయంలోనూ  పటిష్టమైన  చర్యలు  తీసుకోవాలి. 


సంపద  కొందరి  వద్దే   ఉండిపోకుండా  అందరికీ  అందేలా  చర్యలు  తీసుకోవాలి.  ఇవన్నీ  చేస్తే  డబ్బు  అదే  వస్తుంది.

...........

 చిన్నతనం  నుంచి  నైతిక  విలువల  పట్ల  గౌరవాన్ని  పెంచే  విద్యను బోధించితే  చాలా  సమస్యలు  పరిష్కారమవుతాయి.

    
ఇవన్నీ  సక్రమంగా  అమలు  కావాలంటే..   చిత్తశుద్ధి,  పట్టుదలా  ఎంతో  అవసరం.  పాలకులలో , ప్రజలలో  గట్టి  పట్టుదల  ఉంటే  స్వచ్చభారత్  కల సాకారమవుతుంది.
...............
ఈ బ్లాగ్ ను  ప్రోత్సహిస్తున్న  ప్రతి  ఒక్కరికి  కృతజ్ఞతలండి.


No comments:

Post a Comment