koodali

Saturday, October 11, 2014

అంగారక గ్రహానికి యాత్ర..


వరాహస్వరూపుడైన  విష్ణుమూర్తి భూగోళాధిదేవత అయిన వసుంధరల (భూదేవి ) యొక్క  కుమారుడు  మంగళుడు....అని  ప్రాచీన  గ్రంధముల  ద్వారా  తెలుస్తోంది. 

( లక్ష్మీదేవికి వసుంధర అనే పేరు కూడా ఉంది.)

భూదేవి  కుమారుడు  మంగళుడు  అనే  విషయాన్ని  గమనిస్తే,  భూమికి  అంగారక   ( మంగళ ) గ్రహానికి   పోలిక  ఉండే  అవకాశముందని  తెలుస్తోంది.
..............

మంగళ గ్రహానికి ఉపగ్రహాన్ని  పంపే  విషయంలో విజయాన్ని  సాధించినందుకు  అందరికి  అభినందనలండి.


అయితే,  ఇలాంటి  సందర్భాలలో  కొందరు  నాస్తికవాదులు  రంగప్రవేశం  చేసి,  చూసారా ..   ఇంత  శాస్త్రసాంకేతికత  పెరిగినా ...ఇంకా  గ్రహాల  ప్రభావం  మానవుల  మీద  ఉండటం, కుజదోషం  అనే  విషయాలను  నమ్మటం మానెయ్యాలి  అంటారు.

కుజగ్రహ కక్ష్యలోకి  ఉపగ్రహాన్ని  పంపినంత  మాత్రాన ,  గ్రహాల ప్రభావం  మానవుల  మీద  ఉండకుండా  ఉంటుందా...దానికి  దీనికీ  సంబంధం  ఏమిటి ?

...................................

  పూర్ణిమ,  అమావాస్య  రోజుల్లో  చంద్రుని  యొక్క  ప్రభావం  వల్ల    సముద్రం  యొక్క  ఆటుపోట్లు  పెరగటం,  తగ్గటం  ఉంటుందంటారు. 

పూర్ణిమ, అమావాస్య  రోజుల్లో  మానవుల  ప్రవర్తనలో  కూడా  కొంత  తేడా  ఉండే  అవకాశముందని  పరిశోధనల  ద్వారా  తెలిసిన  విషయం.

 చంద్రుని  వద్దకు   వెళ్ళివచ్చినా  కూడా  భూమిపై  చంద్రుని  ప్రభావం  ఎప్పటిలాగే  ఉంది..... చంద్రుని  యొక్క  ప్రభావం  వల్ల  సముద్రం  యొక్క  ఆటుపోట్లు  పెరగటం,  తగ్గటం  జరుగుతూనే  ఉంది. 

  అలాగే  , కుజగ్రహానికి  వెళ్ళివచ్చినా  సరే,  కుజగ్రహం  యొక్క  ప్రభావం   ఉంటూనే  ఉంటుంది.

...................
గ్రహాల ప్రభావం  మానవుల  మీద  ఉంటుందని  ప్రాచీనులు  తెలియజేసారు.  ప్రాచీనులు  తెలియజేసిన   విషయాలు  నిజమేనని  ఆధునిక   పరిశోధనల  ద్వారా   కూడా  క్రమంగా  నిరూపించబడుతున్నాయి.  


జ్యోతిష్యం  కూడా  శాస్త్రమే. అందుకు  ఒక  చక్కని  ఉదాహరణ .. పంచాంగకర్తలు  పంచాంగం  ప్రకారం  లెక్కలు  వేసి   రాబోయే  గ్రహణాలను    ఎంతో  ముందే  చెప్పగలుగుతున్నారు  కదా!
........................ 

ఇక్కడ  బాధాకరమైన  విషయమేమిటంటే, ఆధునిక  శాస్త్రసాంకేతికత  విషయంలో  ఒక  విజయం  లభిస్తే,  అది ఆస్తికులకు  వ్యతిరేకం  అన్నట్లుగా కొందరు  మాట్లాడటం  జరుగుతోంది. 


 వాస్తవంగా  చెప్పాలంటే,  ఆధునిక  శాస్త్రవేత్తలలో  చాలామంది  దైవాన్ని  నమ్మేవాళ్ళున్నారు.     రాకెట్ వంటి  వాటిని  అంతరిక్షంలోకి  పంపేముందు ఆ  ప్రయోగం  విజయవంతమవ్వాలని  దైవాన్ని  ప్రార్ధించే శాస్త్రవేత్తలూ ఉన్నారు.


 సైన్స్ అంటే  నాస్తికులకు  మాత్రమే  సంబంధించినది  కాదు. సృష్టిలో  ఉన్న  సైన్స్  అంతా  దైవం  సృష్టించిందే  కదా!  

..................

శాస్త్రసాంకేతికరంగంలో  కొద్ది  ప్రగతి  సాధించగానే , కొందరు  ఏమంటారంటే,  దేవుడు  అంటూ  ఎవరూ లేరు ..అంటుంటారు. ఇలా  అనటం  సరైనది  కాదు.  ఇంకా,  ప్రాచీనులు  మనకు  అందించిన  విజ్ఞానాన్ని  తక్కువచేసి  మాట్లాడటం  కూడా సరైనది  కాదు.

మానవులు  విమానాన్ని  కనుగొనటానికన్నా  ముందే   పక్షులు  గాలిలో  ఎగురుతున్నాయి. నీటిలో  వెళ్ళే  సబ్  మెరైన్ల  కన్నా  ముందే  చేపలు  నీటిలో  ఈదుతున్నాయి. 

సృష్టిలో, మానవులతో  సహా  అన్నింటినీ  సృష్టించిన  సృష్టికర్తే  మొదటి  శాస్త్రవేత్త. 

దైవాన్ని  చులకనగా  మాట్లాడటం  తగనిపని.

  ప్రాచీనులు  మనకు  తెలియజేసిన  విజ్ఞానంలో  చాలా  విషయాలను  సరిగ్గా  అర్ధం  చేసుకునే  స్థాయికి  ఆధునిక  విజ్ఞానం  ఇంకా  ఎదగలేదు. 


 మనకు  అర్ధం  కాని  విషయాలన్నీ  మూఢనమ్మకాలే  అనుకోవటం  కొందరు ఆధునికుల  మూఢనమ్మకం.



2 comments:

  1. ఎవరి నమ్మకం వారిదీ! వారినలాగే ఉండమందాం!! వారి భావ స్వాతంత్ర్యాన్ని గౌరవించాలి కదా

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ప్రాచీన మహర్షులు ఎంతో విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు.

    ప్రాచీన విజ్ఞానాన్ని సరిగ్గా అర్ధం చేసుకోకుండా తక్కువచేసి మాట్లాడే వారి వ్యాఖ్యల పట్ల నాకు కలిగిన అభిప్రాయాన్ని వ్రాసానండి.

    ReplyDelete