అక్టోబర్ 13 ప్రకృతి విపత్తుల నియంత్రణ దినోత్సవం అంటున్నారు.
ఎండాకాలంలో విపరీతమైన ఎండలు ,అక్టోబర్లో కూడా ఎక్కువ ఎండలు, సకాలంలో సరిగ్గా వానలు పడకపోవటం, అకాలంలో అకస్మాత్తుగా విపరీతమైన వర్షాలు వచ్చి వరదలు రావటం..ఇలా వాతావరణం చిత్రవిచిత్రంగా మారటానికి మానవుల స్వయంకృతాపరాధాలు చాలావరకు కారణం.
ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి విపరీత వాతావరణమార్పులు వస్తున్నాయి.
మనదేశంలోనే చూస్తే ఆ మధ్య వచ్చిన సునామీ, అకస్మాత్తుగా వచ్చిన ఉత్తరాఖండ్ విలయం, ఈ మధ్య అనూహ్యంగా వచ్చిన కశ్మీర్ వరదలు , నిన్న,మొన్న జరిగిన విశాఖ తుఫాన్.. ఇవన్నీ చిత్రంగానే ఉన్నాయి..
ప్రకృతికి విరుద్ధంగా మానవాళి చేస్తున్న చర్యలకు నిరసనగా ప్రకృతి హెచ్చరికలు చేస్తూనే ఉంది. అయినా, మనుషులు సరిగ్గా పట్టించుకోవటం లేదు.
ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు కొంతకాలం బాధపడటం , తరువాత అన్నీ మర్చిపోయి మళ్ళీ ప్రకృతి వ్యతిరేక చర్యలు కొనసాగించటం జరుగుతోంది.
...........................
విశాఖలో వచ్చిన గాలివేగంవల్ల , కొన్ని చోట్ల మూసిఉన్న కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయంటున్నారు. గాలి వేగానికి అపార్ట్మెంట్స్ కూడా ఊగినట్లు అనిపించి ఇంట్లో ఉన్న సామాను కూడా కదిలిపోయాయట.
ఇంకా కొంచెం ఎక్కువ వేగంగా గాలి వీస్తే చాలా ఇళ్ళు పునాదులతో సహా కూలిపోయేవట. భగవంతుని దయ వల్ల మరింత వేగంతో గాలిరాలేదు. అందుకు దైవానికి కృతజ్ఞతలు.
.....................
టెక్నాలజి అవసరమే. అయితే, పర్యావరణాన్ని విధ్వంసం చేసేటంత స్థాయిలో దానిని వాడకూడదు కదా!
తుఫాన్ సందర్భంగా ప్రజలకు ఎంతో సహాయసహకారాలను అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
..............
ఈ మధ్య చాలా అపార్ట్మెంట్లు కార్ పార్కింగ్ కోసం బేస్మెంట్ వద్ద ఖాళీ జాగా వదిలి పైన ఇళ్ళు కడుతున్నారు. అంటే , ఒంటి స్థంభం మేడలాగా స్థంబాలపై ఇళ్ళు అన్నమాట.
ఒక మాదిరి భూకంపాలు వచ్చినప్పుడు గానీ, మధ్య స్థాయి తుఫాన్ గాలివేగానికి గానీ స్థంబాలపై నిలిచిన ఇలాంటి ఇళ్ళు ఊగిపోయే అవకాశాలు ఎక్కువ.
కార్ పార్కింగ్ వదలకుండా, క్రింద కూడా గోడలు, ఇళ్ళు ఉన్నట్లయితే ఇలాంటి కట్టడాలు ఊగిపోకుండా కొంతలోకొంత బలంగా ఉంటాయి.
అపార్ట్మెంట్స్ బేస్మెంట్ వద్ద కార్ పార్కింగ్ కు స్థలం వదలటం తప్పనిసరి అయితే , కనీసం పార్కింగ్ వద్ద గోడలు కట్టుకోవాలి.
..............
ఇక, భారీ భూకంపాలు, భారీ ఈదురు గాలులు వస్తే ఎలాంటి కట్టడం అయినా తట్టుకోవటం కష్టమే..
అలాంటి భారీ విధ్వంసాలు జరగకుండా ఉండాలంటే మానవులు ప్రకృతికి వ్యతిరేకమైన చర్యలను, పర్యావరణానికి హాని కలిగించే చర్యలను చేయకూడదు..
................
(ఒక విషయం ఏమిటంటే, ప్రకృతి విపత్తులు ఏర్పడే సూచనలు వచ్చినప్పుడు ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతాలలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తారు.
పునరావాస కేంద్రాలలో నెలసరి (పీరియడ్స్)తో ఇబ్బంది పడే ఆడవారూ ఉంటారు . వారికి ఎంతో అవసరం అయిన శానిటరీ నేప్కిన్స్ అందుబాటులో ఉంచాలి.)
( ఇలాంటి విషయాలు పైకి చెప్పాలంటే చాలా ఇబ్బందికరం .)
...............
కొండలను కొట్టివేయటం, గనుల పేరుతో భూమిని విచ్చలవిడిగా తవ్వేయటం, ఇష్టం వచ్చినట్లు నదులపై విద్యుత్ ప్రాజెక్ట్స్ నిర్మించటం, టెక్నాలజీ పేరుతో వాతావరణంలోకి విచ్చలవిడిగా కర్బన ఉద్గారాలను వదలటం..ఇలా ఎన్నో విధ్వంసక చర్యలతో వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఎన్నో మూగ జీవజాతుల కష్టాలకు కారణమవుతున్నారు.
తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటూ అదే అభివృద్ధి అనుకుంటూ ఉంటే , భవిష్యత్తులో మరింత మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుంది.. ఇప్పటికైనా మానవులు తమ అంతులేని కోరికలను తగ్గించుకుని జీవించటం నేర్చుకుంటే మంచిది.
No comments:
Post a Comment