ఇంతకు ముందు కర్నూల్ లో వరదలు వచ్చినప్పుడు చాలా నష్టం జరిగింది. ఊరిలో చాలా బురద వచ్చింది. ఆ బురదను తీయటానికి చాలా రోజులు పట్టింది.... ప్రజలు ఎన్నో ఇబ్బందులను అనుభవించారు.
అలంపురం దేవాలయం వద్ద బురద చాలా రోజుల వరకు ఉన్నది. సుప్రసిద్ధమైన దేవాలయము వద్ద శుభ్రం చేయటానికి చాలా సమయం తీసుకోవటమనేది ఎంతో బాధాకరమైన విషయము.
.............................
ఇప్పుడు వైజాగ్లో వచ్చిన గాలివాన వల్ల కూడా చాలా నష్టం జరిగింది. చాలా చెట్లు పడిపోయాయంటున్నారు.
వైజాగ్లో కొన్ని సంవత్సరాల క్రితం అంటే సుమారు 1990 సమయంలో నేషనల్ హైవేకు ప్రక్కన ఎన్నో మొక్కలను నాటారు. అవన్నీ పెరిగి ఎంతో పచ్చగా ఉండేది వైజాగ్.
ఇప్పుడు చాలా చెట్లు పడిపోయాయంటే ఎంతో బాధగా ఉంది. మళ్ళీ అవన్నీ పెరగాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది.
................
చెట్లు వేర్లతో సహా కూలిపోయిన ప్రదేశంలో సహజంగానే గొయ్యి ఏర్పడుతుంది. ఆ చెట్టును సగం నరికి , వేళ్ళతో సహా తిరిగి అక్కడే నాటితే కొంతకాలానికి మళ్ళీ చిగురించే అవకాశం ఉంది. ముదురు కాండం కాబట్టి త్వరగా పెరిగి పెద్దవవుతాయి.
........................
ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా సహాయకార్యక్రమాలలో పాల్గొంటే పరిస్థితులు త్వరగా కుదుటబడటానికి అవకాశముంటుంది.
కర్నూలులో, వైజాగులో... ఎందరో ప్రజలు కూడా సహాయకార్యక్రమాల్లో పాల్గొనటం సంతోషకరమైన విషయం.
.............................
అయితే, కొందరు ప్రజలు కష్టాలలో ఉన్న ప్రజలకు సహాయం చేస్తే, మరికొందరు జనాలు కష్టాలలో ఉన్న ప్రజలను కూడా దోచుకుంటారు.
అసలే సరుకులు అందక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కొందరు వర్తకులు ఉన్న సరుకును దాచేసి ఎక్కువ ధరకు సరుకులను అమ్మటం దారుణం.
కష్టాలలో ఉన్నవాళ్ళకు అందే సహాయంలో కూడా అవినీతి పనులు చేసే వాళ్ళను ఏమనాలో అర్ధం కావటం లేదు.
ఎవరి పాపపుణ్యాలు వారికి జమ అవుతూనే ఉంటాయి. కష్టాలలో ఉన్న ప్రజలను కూడా మోసం చేసే వారు తగిన మూల్యాన్ని చెల్లించుకుంటారు.
...................
ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి కొన్ని ముందు జాగ్రత్తలను నేర్చుకోవచ్చు.
ఉదా..తుఫాన్ వస్తుందని ముందే తెలిసినప్పుడు ఉన్నత, మధ్య తరగతి ఆదాయ వర్గాల ప్రజలు నిత్యావసర వస్తువులను ( సుమారు వారానికి సరిపడా.. బియ్యం, పప్పులు, కూరలు, పాలపొడి ..వంటివి..) ముందే ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే తుఫాన్ తరువాత వెంటనే రోడ్డుమీద పడవలసిన అవసరం ఉండదు.
కొవ్వొత్తులు, సోలార్ దీపాలు, బ్యాటరీ లైట్స్ వంటివీ దగ్గర ఉంచుకోవాలి.
తుఫాన్ రాకముందే వాహనాలలో టాంక్ నిండా ఇంధనం నింపి ఉంచుకుంటే బాగుంటుంది.
అలాగని మరీ ముందు జాగ్రత్తగా బోలెడు వస్తువులను కొని నిల్వ చేస్తే మార్కెట్లో సరుకుల కొరత ఏర్పడుతుంది.
ఉన్నత, మధ్య తరగతి ఆదాయ వర్గాల వాళ్ళు కొద్దిగా నిత్యావసర వస్తువులను నిల్వ ఉంచుకుంటే..... ఇళ్ళు కొట్టుకుపోయి నిత్యావసర సరుకులకు కూడా డబ్బు లేని పేద ప్రజలకు సహాయం చేయటం ప్రభుత్వానికి తేలిక అవుతుంది.
.......................
ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా కరెంట్ లేనప్పుడు ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే.... నీటికోసం చేతితో కొట్టే బోరుపంపులు, నూతులు, ఉండవలసిన అవసరం ఉందనిపిస్తోంది.
ఇంటి పైన ఉండే సోలార్ పేనల్స్ కూడా గాలికి ఎగిరిపోయే ప్రమాదముంది కాబట్టి వాటి చుట్టూ కూడా కాంక్రీట్తో గోడలు కట్టుకోవాలేమో ? లేక సోలార్ పేనల్స్ను పైకప్పుకే బిగించేయాలేమో?
No comments:
Post a Comment