koodali

Monday, July 1, 2013

జవానులు మన రక్షణకోసం కష్టపడుతుంటే అభినందనలతో సరిపెట్టేయటమేనా ? ..మరియు చిత్రాలు కూడా...

 
ఉత్తరాఖండ్  వరదల  సందర్భంగా  మన  రక్షణదళాల  వారు  అందించిన  ఆపన్నహస్తం  అద్భుతం,   జవానులు  అంతటితో  ఊరుకోరు.  మళ్ళీ  దేశరక్షణ  విధులను  నిర్వర్తిస్తారు. 

 జవానులు  సరిహద్దుల  వద్ద    దేశప్రజల  రక్షణ  కోసం  బాధ్యతలను  నిర్వర్తిస్తుంటే  మనము  ప్రశాంతంగా   నిద్రపోగలుగుతున్నాము.

వాళ్ళు   మన  రక్షణ  కోసం  సరిహద్దుల  వద్ద  కాపలా  కాస్తుంటే  మనం  ఏం  చేస్తున్నాము.......  సినిమాలు,  సీరియల్స్  లోని  నటీనటుల  గురించి  చర్చలు,  ఆలోచనలతో   కులాసాగా  బ్రతుకులను  వెళ్ళదీస్తున్నాము. 

జీవితంలో  వినోదం  ఉండవలసినదే.  అయితే  వినోదం  ఇప్పుడు  వ్యసనం  స్థాయికి  వచ్చేసింది.
..................................

పాత రోజుల్లో   ఎవరైనా  ప్రముఖ  వ్యక్తులు  మరణిస్తే  రెండుమూడు రోజులు  సంతాపదినాలను  పాటించేవారు.  అప్పుడు  రేడియోలో  భక్తిగీతాలు  వంటివి  మాత్రమే  వచ్చేవి.  వినోదకార్యక్రమాలను  ప్రసారం  చేసేవారు  కాదు. 

కాలం  మారింది.  ఇప్పుడు  ఎవరు  మరణించినా  పెద్దగా  పట్టించుకోవటం  లేదు.  ఉత్తరాఖండ్ లో  ఎంతోమంది  చనిపోయారు. 


పోయినవారు పోగా,   ఉన్నవారు  దిక్కుతోచక  గగ్గోలు  పెడుతుంటే   మనలో చాలామంది   మాత్రం  యధాప్రకారం  క్రికెట్,  సినిమా,  సీరియల్   ప్రసారాలు  చూడకుండా  ఉండలేకపోయాము. ..  ( జరిగిన  విషాదానికి  బాధపడుతూనే  . )

నేను  కూడా వినోద  కార్యక్రమాలను  చూసాను. ..  ( జరిగిన  విషాదానికి  బాధపడుతూనే  . ) 

 ప్రపంచం  చాలా  మారింది.  ఇప్పటికి  మనుషుల్లో    మానవత్వం  ,  ఇతరుల  బాధలకు  స్పందించే  గుణం  ,  పాపభీతి  ఇంకా  మిగిలే  ఉన్నాయి. అయితే,  భవిష్యత్తులో  మానవ  మనస్తత్వాలు   ఎలా  ఉంటాయో  ?

.................................... 


ఇంత విషాదం   జరిగినా  మనం  మారమా ? దేశంలో  ఇంత  అవినీతి,  ఇంత  పేదరికం,  ఇన్ని మురికివీధులు, ఇంత  వెనుకబాటుతనం  ఉన్నా  అవేమీ  మనకు  పట్టవా ?

భారతీయ  రక్షణ  దళాల  వారు   ఎంతో  కష్టపడి  బాధితులను  రక్షించారు. వాళ్ళను  చూసి  మనం  ఎంతో  నేర్చుకోవాలి.  దేశం  పట్ల  మన  బాధ్యతలను  మనము  సక్రమంగా  నిర్వర్తించాలి. 


 ఇప్పుడు  దేశప్రజలు  తమ   బాధ్యతలను  సక్రమంగా  నిర్వర్తించటం  లేదా  ?
అంటే ,  నిర్వర్తిస్తుంటే  దేశంలో    ఇంత పేదరికం, ఇంత  అవినీతి,   ఇన్ని  సమస్యలు,....  ఉండవు  కదా !


బాధ్యతలను  సక్రమంగా  నిర్వర్తిస్తున్నవారికి  వందనములు . 

  ఉత్తరాఖండ్ లో  వచ్చిన  విలయంలో  జవానులు   ఎంతో  కష్టపడ్డారు.  యంత్రాలలా  పనిచేసి  వేలమందిని  స్వస్థలాలకు  చేరవేశారు.  


 వాళ్ళు  అంత  కష్టపడుతుంటే    దేశాన్ని  బాగుచేయటం  కోసం  మనం  ఎందుకు  మన  వంతు  ప్రయత్నాన్ని  చెయ్యలేం  ?
  (  బద్ధకాన్ని,  సొంత  స్వార్ధాన్ని  కొద్దిగా  తగ్గించుకుంటే   ).
..............................

 భారత  రక్షణ  దళాల  వారు  ఎన్నో  కష్టాలకు  ఓర్చి  ప్రాణాలకు  తెగించి  బాధితులను  కాపాడారు.  . ప్రజలను   రక్షించే  ప్రయత్నాలలో  కొందరు  జవానులు  ప్రాణాలను  పోగొట్టుకున్నారు.  

ప్రాణాలను  కోల్పోయిన  జవానుల  యొక్క  కుటుంబసభ్యులు  ఎంతగా  తల్లడిల్లుతారో  కదా  ! 

 మన  సంతానం  వేరే  ఊరిలో  ఉంటే  మనం  ఎంతగానో  ఆలోచిస్తాము.  ఏ  కష్టమూ  రాకూడదని  కోరుకుంటాము.  మరి  సైనికుల  తల్లితండ్రులు,  మరియు   భార్యా  బిడ్డలు  తమ  వారి రక్షణ  కోసం  ఎంతగానో  ఆలోచిస్తారు  కదా  ! 

  జవానులు    మన  రక్షణకోసం  కష్టపడుతుంటే    అభినందనలతో  సరిపెట్టేయటమేనా  ? మనం  కూడా మనకు  చేతనైనంతలో ,  మన  పరిధిలో  సక్రమంగా  బాధ్యతలను  నిర్వర్తిస్తే   దేశంలోని  సమస్యలను  పారద్రోలటం  పెద్దపనేమీ  కాదు.

ఉత్తరాఖండ్  విలయంలో  బాధితులకు  సాయాన్ని  అందించిన  ప్రతి  ఒక్కరికీ ,  (  రక్షణదళాలు, పోలీసులు,   అధికారులు,  సేవాసంస్థలు,  స్వచ్చంద సేవకులు ...) అందరికి  కృతజ్ఞతలు. 


ఇతరులను  రక్షించే  సమయంలో   ప్రాణాలను  కోల్పోయిన  మహనీయులకు  నివాళులు.
...........................................


అయితే  ,  ప్రజలలో  ఈ సమయంలో   క్రికెట్  గురించి  ఆసక్తి  లేకుండా , వరదల   గురించి   బాధ   పడే వారూ  ఉంటారు .

 పై  చిత్రాన్ని  తయారు  చేసిన వారికి  కృతజ్ఞతలు. 

ఈ  బ్లాగ్ ను  ప్రోత్సహిస్తున్న  అందరికి  కృతజ్ఞతలు. 



2 comments:

  1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete