koodali

Monday, July 15, 2013

సమాజం సజావుగా నడవాలన్నా ఎన్నో వృత్తుల వారి అవసరం ఉంది.


ఒక  సినిమా  తీయాలంటే  దాని  వెనుక  ఎందరో  వ్యక్తుల  అవసరం   ఉంటుంది.   


 కెమెరామెన్, ఎడిటర్, సంగీతాన్ని ,  కధను,  మాటలను  అందించేవారు ,   లైట్  బోయ్స్,  మేకప్  వాళ్ళు,  ఆహారాన్ని , దుస్తులను   సప్లయ్  చేసేవాళ్ళు, వాహనాలను  నడిపేవారు...ఇలా  ఎందరో  సమిష్టిగా  కృషి  చేస్తేనే  సినిమా  ప్రేక్షకుల  ముందుకొస్తుంది. 

(  సమాజం  సజావుగా  నడవాలన్నా  ఎన్నో  వృత్తుల  వారి  అవసరం  ఉంది.  )

 ఇక సినిమాకు  నిర్మాత,  దర్శకుడు ,  ఇతర  నటీనటుల  కృషి  ఎంతో  ఉంటుంది.  అయితే, ప్రేక్షకులు  ఏం  చేస్తారంటే,  


  హీరోహీరోయిన్స్  ను   మాత్రమే  ఆకాశానికి  ఎత్తేసి  గౌరవిస్తారు.   వారికే  ఎక్కువ  పారితోషికమూ  లభిస్తుంది.

  అందరి  కష్టమూ  ఒకటే .  తెర  వెనుక  పనిచేసేవారు  కూడా  ఎంతో  కష్టపడతారు.  అయినా  వారికి  హీరోహీరోయిన్స్ తో  సమానంగా  పేరు  గానీ  డబ్బు  గానీ  రాదు.
......................................

ఒక  పెద్ద  వ్యాపారసంస్థ  ఉంటుంది  అందులో  చైర్మన్   ఆఫీసుకు  రాగానే  అందరూ  నిలబడి  విష్  చేస్తారు.  ఆ  సంస్థలో  చిన్న  ఉద్యోగి  వస్తే   ఎవరూ  విష్  చేయరు.

  ఆఫీస్  సరిగ్గా  నడవాలంటే  చైర్మన్,  క్లర్క్  ఇద్దరూ  అవసరమే ,  ఇద్దరూ  రోజంతా  కష్టపడతారు.  అయితే  ఇద్దరికీ  జనం  ఇచ్చే  మర్యాదల్లో  ఎంతో  తేడా,  ఇద్దరూ  అందుకునే  జీతభత్యాల్లో  విపరీతమైన  అంతరం.

.............................

ఒక  రోడ్  ప్రక్కన  బిచ్చగాడు  అద్భుతంగా  చిత్రాలు  వేస్తాడు.  జనం  చిల్లర  నాణేలు  ఆ  చిత్రం  పై  వేసి  వెళ్తారు.


ఒక  ప్రముఖ  వ్యక్తి  వేసే  చిత్రాలకు  అంతర్జాతీయంగా  గుర్తింపు  లభిస్తుంది.  ఎన్నో  అవార్డులు  లభిస్తాయి. 


  రోడ్డు  ప్రక్కన  చిత్రాలు  వేసే  అతనికి  ఏ  గుర్తింపూ  లభించదు.  ఏ  అవార్డులూ  అతనిని  వరించవు. 
...........................

ఇలా  ప్రపంచంలో  ఎన్నో  అసమానతలు  జరుగుతున్నాయి.  


ఈ  అసమానతలకు  కులంతో  సంబంధం  లేదు.  ఇప్పుడు  డబ్బు, అధికారం ఉన్న వారిదే  రాజ్యంలా  ఉంది.

డబ్బు,
అధికారం ఉన్న వాళ్ళు శూద్ర కులానికి చెందినా అందరూ గౌరవిస్తారు.

డబ్బు, అధికారం  లేనివాళ్ళు బ్రాహ్మణకులానికి చెందినా గౌరవించటం లేదు.

అందరికీ సమానంగా హోదా, జీతభత్యాలు ఉన్నప్పుడే ఈ అసమానతలు తొలగిపోతాయి. మరి ఇలా చేయటానికి ఎందరు ఒప్పుకుంటారు?


అందరూ సమానమే అనే వారు ..... రోజంతా కష్టపడే ఒక కూలీకి, రోజంతా కష్టపడే ఒక ఉన్నత  స్థాయి ఉద్యోగికి ఒకే రకంగా హోదా, జీతభత్యాలు ఇస్తే ఒప్పుకుంటారా ?

.................................................


13 comments:

  1. అసమానత సృష్టిలోనే ఉంది. దానిని మరింత పెచుకుని బాధపడకూడదు.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    పూర్వ కర్మానుసారం జన్మ లభిస్తుంది అంటారు.

    ReplyDelete
  3. 1)సినిమాలో లైట్ బాయ్ గానో మేకప్ మాన్ గానో పని చేయడానికి ఎందరో ముందుకొస్తారు. కాని హీరో/హీరోయిన్ గా చెయ్యటం అందరికీ చేతగాదు. ఎవరు బడితే వారు నటించిన సినిమాలు మీరు చూస్తారా? లేదే? (అఫ్ కోర్స్ నేను వంశాల చరిత్రతో వచ్చినవారి గురించి మాట్లాడట్లేదు). అందుచేత ముఖ్యమైన నటులకు, దర్శకులకు ప్రాముఖ్యత ఉంటుంది. మీడియా లో కనిపించే అతిని పట్టించుకోనక్కర్లేదు. పెద్ద హేరో లేక అతని తోక అయినంత మాత్రాన సినిమా గొప్పదనీ కాదు.
    2)ఒక వ్యాపార సంస్థలో చిన్న ఉద్యోగి గా చేరడానికి కాస్త చదువుంటే చాలు. కాని చైర్మన్ గా చెయ్యాలంటే ఎంతో నేర్పు అనుభవం ఉండాలి. అవి లేకుండా అప్పనంగా పెత్తనం చలాయిస్తే పెద్ద పెద్ద సంస్థలూ కూలిపోవటం చూస్తూనే ఉన్నాం. అందుచేత ఉన్నత పదవులవారికి మర్యాద ఎక్కువ. అలాగని చిరుద్యోగులని పురుగుల్లా చూడమని అర్థం కాదు. కొన్ని ప్రైవేటు కంపెనీలలో అందరినీ పేరు పెట్టి పిలవటం సంప్రదాయం. అరే ఒరే అనే పిలుపులు స్నేహితుల మధ్య తప్ప ఇంకెవరిమధ్యా వినబడవు.
    3) మీ లాస్ట్ కామెంట్ మరీ వింతగా ఉంది. శూద్ర కులాలను గౌరవించక్కరలేదు, బ్రాహ్మణులైతే చాలు నెత్తినపెట్టుకోవాలనా మీ ఉద్దేశం? అలాంటి భావాలున్నంత కాలం రిజర్వేషన్లు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి.
    ఇక జీత భత్యాల సంగతి. అందరికీ ఒకే జీత భత్యాలిస్తే ఎవరూ నైపుణ్యత ఉన్న పనులు చెయ్యటానికి ఇష్టపడరు. రోజంతా ఒల్లు హూనం అయ్యే సైనికుడిగాకంటే అదే జీతభత్యాలు ఇచ్చే రోడ్లూడ్చే పనినే ఇష్టపడరా మరి?

    ReplyDelete
  4. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    నేను వ్రాసినదానిని మీరు సరిగ్గా అర్ధం చేసుకోలేదు.

    సినిమాలో లైట్ బాయ్ గానో మేకప్ మాన్ చేయటం అంత ఈజీ అని ఎందుకు అనుకుంటున్నారు ? లైట్ బాయ్స్ కు లైట్స్ వేడిని భరించటం వంటి కష్టాలున్నాయి. మేకప్ మాన్ మేకప్ చేయటంలో కొద్దిగా తేడా వచ్చినా ఆకారమే మారిపోతుంది. ఇలా ఎవరి కష్టాలు వాళ్ళకున్నాయి. లైట్ బాయ్ గానో , మేకప్ మాన్ గానో చేయాలంటే చాలా ఆర్ట్ ఉండాలి.

    లైట్ బాయ్ , మేకప్ మాన్ లకు అవకాశాలు వస్తే హీరోలుగా కూడా బాగా నటించగలరు. వారిలో హోరోగా నటించే ప్రతిభ ఉండదని ఎందుకు అనుకుంటున్నారు ? ప్రతి వ్యక్తిలో టాలెంట్ ఉంటుంది. అవకాశాలు వచ్చిన వారు అందలాలు ఎక్కుతారు. రానివాళ్ళు అనామకంగా మిగిలిపోతారు.

    ఒక వ్యాపార సంస్థలో చిన్న ఉద్యోగి గా చేరడానికి కాస్త చదువుంటే చాలు. కాని చైర్మన్ గా చెయ్యాలంటే ఎంతో నేర్పు అనుభవం ఉండాలి. అని ఎందుకు అనుకుంటున్నారు ? బిల్ గేట్స్, ధీరూభాయ్ అంబానీ వంటివారు పెద్ద చదువులు చదవలేదట. తెలివితేటలతో కష్టపడి పనిచేయటం వల్ల గొప్పవారయ్యారు.

    ఎందరో ప్రముఖులు చిన్న ఉద్యోగిగా ఉండి ప్రముఖమైన స్థానాలలోకి వచ్చినవారే. చిన్న ఉద్యోగులలో కూడా ప్రతిభ ఉంటుంది.

    చిన్న ఉద్యోగులలో ప్రతిభ లేకపోతే చైర్మన్ ఎంత ప్రతిభావంతుడైనా ఆ సంస్థ కుప్పకూలిపోతుంది. చిన్న ఉద్యోగస్తుల ప్రతిభ తోడయితేనే సంస్థ బాగుంటుంది.

    పెద్ద చదువు ఉంటే గొప్పవాళ్ళు, తక్కువ చదువు ఉన్నవాళ్ళు తక్కువ వాళ్ళు అనుకోకూడదు.

    చిన్న ఉద్యోగి అయినంత మాత్రాన మర్యాద ఇవ్వనవసరం లేదని మీ అభిప్రాయమా ?

    శూద్ర కులాలను గౌరవించక్కరలేదు, బ్రాహ్మణులైతే చాలు నెత్తినపెట్టుకోవాలని నేను ఎక్కడా వ్రాయలేదు.

    అందరికీ ఒకే జీత భత్యాలివ్వాలన్నది నా అభిప్రాయం కాదండి. . జీతాల్లో విపరీతమైన అంతరాలు ఉండకూడదన్నదే నా అభిప్రాయం.

    ఒక చిరు ఉద్యోగి రోజంతా ఆఫీసులో కష్టపడతాడు. ఒక ఉన్నత స్థాయి ఉద్యోగి రోజంతా ఆఫీసులో కష్టపడతాడు. చిన్న ఉద్యోగికి నెలకు 20 వేలు వస్తే పెద్ద ఉద్యోగికి నెలకు లక్ష వచ్చాయనుకుందాము.

    చిన్న ఉద్యోగి అయినా పెద్ద ఉద్యోగి అయినా ఇంట్లో ఖర్చులు ఒకలానే ఉంటాయి కదా ! అందువల్లే జీతాల్లో విపరీతమైన తేడాలు ఉండకూడదు అన్నాను.

    చిన్న ఉద్యోగులు కుటుంబఖర్చులకు డబ్బు సరిపోక అవస్థలు పడుతుంటే , ఎక్కువ జీతం తీసుకుంటున్న పెద్ద ఉద్యోగులు కోటి రూపాయల కార్లు కొనటం వంటివి చేస్తూ ఆడంబరంగా జీవిస్తున్నారు.

    సైనికులది వేరే పరిస్థితి. వాళ్ళది ప్రాణాలతో చెలగాటం ఉన్న ఉద్యోగం. వారికి ఎక్కువ జీతాలుండటాన్ని ఎవరూ అభ్యంతరం చెప్పరు.

    చాలామంది ఏమనుకుంటారంటే , చిన్న ఉద్యోగస్తులకు పని తక్కువ ఉంటుంది కాబట్టి వారికి తక్కువ జీతం ఇచ్చినా ఫరవాలేదు. తక్కువగా గౌరవించినా ఫరవాలేదు అనుకుంటారు. అయితే చిన్న ఉద్యోగస్తులకు కూడా ఎక్కువ పని ఉంటుంది. అన్నది అందరూ గ్రహించాలి.

    రోడ్లు ఊడ్చే పనివారు జనం పడేసిన చెత్తను, మలమూత్రాలనూ శుభ్రం చేయవలసి ఉంటుంది. రోడ్లూడ్చే పని కూడా తేలిక కాదు. ముఖానికి మాస్క్ వేసుకోకపోతే వారికీ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. రోడ్లు ఊడ్చే పని తేలిక అని మీరు ఎందుకు అనుకుంటున్నారో అర్ధం కావటం లేదు.

    ఏ వృత్తిలో ఉండే కష్టాలు ఆ వృత్తిలో ఉన్నాయి. అందుకే అందరినీ గౌరవించాలి. జీతభత్యాలలో విపరీతమైన తేడాలు ఉండకూడదు.

    ReplyDelete
  5. పెద్దజీతగాడికీ చిరుద్యోగికీ జీతాలలో హస్తిమశకాంతరం తేడా ఉండకూడదు!చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు లేకపోతే ఎంతకష్టమో అమెరికాలో సెటిల్ అయిన మనవాళ్ళను అడిగితే తెలుస్తుంది!ఈ ధరల పెరుగుదలకాలంలో ,ఈ కరువు కాలంలో చిన్న ఉద్యోగులుకూడా బతకాలికదా!ఇపుడు వాళ్ళు చస్తూ బతుకుతున్నారు జీవచ్చవాలలా!అసలు తేడాలు ఉండకూడదని కాదు విపరీతమయిన తేడాలుఉండకూడదంటున్నారు బ్లాగరు!నిజమేకదామరి!

    ReplyDelete
  6. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    నిజమే , ఒక చిరు ఉద్యోగి రోజంతా ఆఫీసులో కష్టపడతాడు. ఒక ఉన్నత స్థాయి ఉద్యోగి రోజంతా ఆఫీసులో కష్టపడతాడు.

    చిన్న ఉద్యోగి అయినా పెద్ద ఉద్యోగి అయినా ఇంట్లో ఖర్చులు ఒకలానే ఉంటాయి కదా ! అందువల్లే జీతాల్లో విపరీతమైన తేడాలు ఉండకూడదు అన్నాను.

    చిన్న ఉద్యోగులు కుటుంబఖర్చులకు డబ్బు సరిపోక అవస్థలు పడుతుంటే , ఎక్కువ జీతం తీసుకుంటున్న పెద్ద ఉద్యోగులు కోటి రూపాయల కార్లు కొనటం వంటివి చేస్తూ ఆడంబరంగా జీవిస్తున్నారు.

    ReplyDelete
  7. anrd గారూ, పాఠకులుగా మేము మీరు రాసిన వాక్యాలని చదవగలమే గాని, వెనుక ఉన్న మీ భావాలు చదవలేము. మీరు రాసిన వాక్యాలు మీ భావాలని స్పష్టంగా ప్రతిబింబించటం లేదేమో అని నా అనుమానం. ఆ విషయం పక్కన పెడితే మీతో ఏకీభవిస్తున్న విషయాలు. (1) ప్రతి మనిషికీ కనీస గౌరవం దక్కాలి, అనగా ఎవరినీ అమర్యాదపరచకూడదు. (2) సమాజానికి అన్ని వృత్తులవారూ అవసరం. అందరికీ కనీస జీవన ప్రమాణాలు అందాలి.
    ఇక మీ పోస్టులో నాకు విస్మయాన్ని కలిగించిన అంశమేమిటంటే "అందరి కష్టాలూ ఒక్కటే, ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది, కాబట్టి నిజానికి అన్నీ అందరికీ సమానంగా దక్కాలి" అనే భావం ప్రతిబింబిస్తోంది. మీ మనసులో ఉన్న భావం అదేనో లేక కాదో తెలియదుగాని, మీరు రాసిన విధానం మాత్రం ఆ భావాన్నే ప్రతిబింబిస్తోంది. అందుకే నేను విభేదించాల్సి వచ్చింది. ఉదాహరణకు మీరు రాసిన వాక్యాలు.
    ----------------------------
    అందరి కష్టమూ ఒకటే . తెర వెనుక పనిచేసేవారు కూడా ఎంతో కష్టపడతారు. అయినా వారికి హీరోహీరోయిన్స్ తో సమానంగా పేరు గానీ డబ్బు గానీ రాదు.
    ఆఫీస్ సరిగ్గా నడవాలంటే చైర్మన్, క్లర్క్ ఇద్దరూ అవసరమే , ఇద్దరూ రోజంతా కష్టపడతారు. అయితే ఇద్దరికీ జనం ఇచ్చే మర్యాదల్లో ఎంతో తేడా.
    డబ్బు, అధికారం ఉన్న వాళ్ళు శూద్ర కులానికి చెందినా అందరూ గౌరవిస్తారు.
    డబ్బు, అధికారం లేనివాళ్ళు బ్రాహ్మణకులానికి చెందినా గౌరవించటం లేదు
    అందరికీ సమానంగా హోదా, జీతభత్యాలు ఉన్నప్పుడే ఈ అసమానతలు తొలగిపోతాయి
    -------------------------------
    ఇపుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక రిక్షా తొక్కే వ్యక్తి ఎండలో గంటసేపు తొక్కి మనల్ని ఒక డెంటిస్టు దగ్గరికి తీసుకెల్తాడు. ఆ డెంటిస్టు A/C రూములో గంటసేపు చికిత్సచేస్తాడు. క్లుప్తంగా చూస్తే మనకు కనిపించేది "ఇద్దరూ గంటసేపే కష్టపడ్డారు. రిక్షా అతను ఎండలో చెమటోడ్చితే డాక్టరు చల్లని A/C రూం లో పని చేసాడు. ఎవరి కష్టాలు వారికి ఉన్నాయి". ఇలా మనం గమనించినపుడు ఇద్దరికీ సమానంగా ఫీజు చెల్లిస్తే బాగుండదా అనిపిస్తుంది. అయితే మనం మర్చిపోయిన విషయం ఏమిటంటే "అతను డాక్టర్ కావడానికి సంవత్సరాల చదువు కృషి అవసరం అయ్యాయి. రిక్షా తొక్కే పని నేర్చుకోడానికి అంత సాధన అవసరం లేదు. ఒక డాక్టరు కొద్దిపాటి అలవాటుతో రిక్షాతొక్కేవానిగా మారగలడు. కాని రిక్షా అతను డాక్టరుగా మారటం అంత సులువు కాదు. " అందుచేత డాక్టరు గారి పనిలో కనబడని శ్రమదాగి ఉంది, అందుకే ఆ నైపుణ్యానికి విలువ ఎక్కువ. విలువైనదేదైనా కాస్త ఎక్కువ గౌరవాన్ని కూడా పొందుతుంది. పైపెచ్చు డిమాండు-సరఫరా అనే అంశం కూడా పని విలువను ప్రభావితం చేస్తుంది. ఒక ఊరిలో అందరూ డాక్టర్లే అయి రిక్షావాళ్ళు లేకపోతే (not a practical scenario) అపుడు రిక్షా అతనికే ఎక్కువ డిమాండ్ ఉండి అతనికే ఎక్కువ జీతం లభించవచ్చు. ఇపుడు కొంతమంది అనొచ్చు "అబ్బే ఇతనికి అవకాశాలు రాక రిక్షా తొక్కుతున్నాడు, లేకపోతే ఇతనూ ఓ గొప్ప డాక్టరు అయి ఉండేవాడు, ఇతనిలోనూ గొప్ప టాలెంట్ ఉంది" అని. కాని అవి ఉత్తి మాటలే అవుతాయి. ఆ మాటలని బట్టి ఇద్దరికీ సమానంగా ఫీజు ఇవ్వగలమా చెప్పండి? అవకాశం దొరికినంతమాత్రాన మనిషి గొప్పవాడైపోడు. అది ఉపయోగించుకున్నవాడు మాత్రమే పైకి రాగలడు. ఒక క్లాసులో మాస్టరు చెప్పిన పాఠం అందరూ సమానంగా అర్థం చేసుకోరు కదా. ఇదీ అలాగే. కాబట్టి సింపుల్ గా చెప్పాలంటే ఆర్థిక అసమానతలు, అంతరాలు ఉంటాయి. అది ఈ సృష్టి నైజం. వీటిని అంతమొందించేస్తామని ఎవరైనా చెప్తే అది బలుపో అమాయకత్వమో తప్ప ఇంకోటి కాదు. మరి అలాంటపుడు మన బాధ్యత ఏమిటి అనే ప్రశ్న రావచ్చు. సమాజపు మనుషులుగా మనం ఈ అంతరాలని ఆరోగ్యకర పరిమితుల్లో ఉంచాలి. దానికి అటు ఉన్నవారూ ఇటు లేనివారూ ఇద్దరూ సహకరించాలి. ఒక మనిషి కోటి రూపాయల కారు కొనుక్కుంటే మనం ఉడుక్కోనక్కరలేదు. అయితే ఆ బడాబాబు కూడా ట్రాఫిక్ రూల్స్ ని పాటిస్తూ వెళ్ళాలి, రోడ్డంతా తన బాబు సొత్తని అనుకోకూడదు. చిరుద్యోగులకి కూడా కనీస కోరికలు తీరేలా ఏర్పాట్లు ఉండాలి. ఇటు వీరు కూడా తమ కుటుంబ సభ్యుల సంఖ్యని పరిమితంగా ఉంచుకోవాలి.
    ఇకపోతే నేను చైర్మన్ కి నేర్పు అనుభవం ఉండాలని చెప్పానుగానీ పెద్ద చదువుండాలని చెప్పలేదు. ఒక చిరుద్యోగి తన పని మాత్రమే చేస్తాడు. కాని ఒక మేనేజర్/చైర్మన్ కిందివారితో పని చేయించగలగాలి. నిజానికి అది చాలా కష్టం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోము. నాకు బోలెడు టాలంట్ ఉంది అని చెప్పీంతమాత్రాన జీతం పెంచరు కదండీ. టాలంట్ ఉంది అని చూపించాలి. మన టాలంట్ ని ఒకరు గుర్తించకపోతే, మనమే గుర్తించే చోటుకు వెళ్ళాలి. అంతేగాని కడుపులో చల్ల కదలకుండా కూర్చుంటూ పైవాడు బోలెడు జీతం తీసుకుంటున్నడని తిట్టుకుంటే ఏమీ లాభం ఉండదు కదా.

    ReplyDelete
  8. అయ్యా ! మీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. డాక్టర్ అయినా రిక్షా అతను అయినా వారి కుటుంబసభ్యుల ను పోషించటానికి ఇంటి ఖర్చులు , పెరిగిన రేట్లు సమానంగానే ఉంటాయి కదా !

    రిక్షా వాళ్ళు, రోజు కూలీలు రోజంతా కష్టపడినా తక్కువ ఆదాయమే వస్తే కుటుంబాన్ని ఎలా పోషిస్తారు ? రిక్షావాళ్ళు పూరిపాకలోనే ఉండాలని మీ అభిప్రాయమా ?

    సమాజంలో ఎక్కువ చదువుకున్న వాళ్ళకే ఎక్కువ ఆదాయాన్ని పొందే అర్హత ఉంటుందా ? కొన్ని కారణాల వల్ల ఎక్కువ చదువుకోని వారి కుటుంబసభ్యులు చాలీచాలని జీతంతో కష్టాలు పడాలా ? ఇది అన్యాయం.

    చిన్న ఉద్యోగులు ఎవరూ లేకపోతే సినిమా తయారుకాదు కదా ! చిన్న వృత్తుల వారి అవసరం సమాజానికి ఎంతో ఉంది. వాళ్ళకూ మంచి ఆదాయం ఉంటేనే వారి వృత్తులను వదలకుండా ఉంటారు.

    ఆదాయం సరిపోక చిన్న వృత్తుల వారు తప్పుకుంటే సమాజం అస్తవ్యస్తం అయిపోతుంది. డాక్టర్ కావడానికి సంవత్సరాల చదువు కృషి అవసరమే అయినా, నర్సులు లేకుంటే డాక్టర్స్ కు ఎంతో కష్టం,

    చిన్న ఉద్యోగస్తులు లేకపోతే పరిశ్రమల వారికి, వ్యాపారసంస్థలకు ఎంతో కష్టం.

    చైర్మన్లు మాత్రమే సంస్థలను నడిపించగలరా ?

    ఇప్పటికే యంత్రాల వినియోగం పెరిగి ఎందరికో ఉపాధి దొరకక యువత నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు.

    సమాజానికి డాక్టర్స్ ఎంత అవసరమో నర్సులూ, హాస్పిటల్స్ శుభ్రం చేసేవారు అంతే అవసరమని గుర్తించాలి.

    మరి , వారికి సరైన ఆదాయం లేకపోతే వారి కుటుంబాలను ఎలా నడిపిస్తారు ? కుటుంబం అర్ధాకలితో ఉంటే వారు తమ ఉద్యోగాన్ని సరిగ్గా ఎలా నిర్వర్తించగలరు ?

    ReplyDelete
  9. anrd గారూ, ధనవంతులని కేవలం ఇటువైపునుంచి చూస్తూ కుళ్ళుకోవటం తప్పని మాత్రమే నేను చెప్పాను. అంతేకాదు, అందరికీ కనీస జీవన ప్రమాణాలు అందాలని కూడా చెప్పాను. కావాలంటే పైన నేను రాసిన రెండుపాయింట్లు మరియు ఆర్థిక అంతరాలని పరిమితుల్లో ఉంచేందుకు రెండువైపులవారూ గుర్తించవలసిన పాయింట్లు మరొక్కసారి చదువుకోండి. ఇక పోతే మీరు సమాధానాల్లో "అందరూ అవసరమే అందరూ అవసరమే." అని అన్నారు. ఎవరైనా అవసరం లేదని నేను చెప్పానా? లేదే? పరిస్థితిని బట్టి, లభ్యతని బట్టి ఒక వస్తువు/సేవ కంటే మరొకటి ఎక్కువ అవసరం అని చెప్తున్నాను. ఈ కారణంగానే కొన్ని పనులకు ఎక్కువ వెల ఉంటుందని చెప్పాను. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే "అందరూ అవసరమే, కాని అందరూ సమానంగా అవసరం కాదు". ఈ పాయింట్ మీరు అర్థం చేసుకున్నారా?

    ReplyDelete

  10. అయ్యా ! చిన్న స్థాయి ఉద్యోగస్తులు లేనిదే సమాజానికి చాలా కష్టం.... అలాంటప్పుడు వారికి చాలీచాలని జీతాలు ఇస్తే ఎలా ?

    నాకు అందరు ధనవంతులంటే వ్యతిరేకత ఏమీ లేదు. ధనవంతుల్లోనూ దయ గలవారు ఉంటారు.

    అయితే, కొందరు ధనవంతులు ఏం చేస్తారంటే, ........

    క్రింది స్థాయి సిబ్బంది సహకారంతో సంస్థలను వృద్ధిలోకి తెచ్చుకుని , కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టుకుంటూ కూడా తమ వద్ద పనిచేసే సిబ్బందికి చాలా తక్కువ జీతాలను ఇస్తారు. తాము మాత్రం ఆడంబరంగా జీవిస్తారు. ఇది న్యాయమా ? మీరే ఆలోచించండి.

    తక్కువ ఆదాయం వచ్చే ప్రజల ఇళ్ళను మీరు ఎప్పుడైనా చూశారా ?

    చిన్న ఇరుకు ఇళ్ళు, చుట్టూ అపరిశుభ్రత, మురుగుకాలువలు... ఇలా ఎన్నో కష్టాల మధ్య వారు జీవిస్తున్నారు.

    మీరు అందరికీ కనీస జీవన ప్రమాణాలు అందాలి అంటున్నారు. సరైన ఆదాయం లేకుండా జీవనప్రమాణాలు పెరగటం ఎలా సాధ్యం ?

    సమసమాజం ఏర్పడాలి అని మాటలు చెప్పినంత మాత్రాన పేదవారి ఆకలి తీరుతుందా ?

    సరైన ఆదాయం అందినప్పుడే జీవనప్రమాణాలు మెరుగుపడతాయి.

    చిన్న స్థాయి ఉద్యోగస్థులకు సరైన జీతభత్యాలు ఏర్పరచాలి అన్నదే నేను చెబుతున్నది.

    ReplyDelete
  11. పూర్వం అయితే చేతివృత్తులు ఉన్నప్పుడు ఎవరి పనిని వారు చేసుకునేవారు. ఈ రోజుల్లో ఉపాధి కోసం సంస్థల మీద ఆధారపడే అవసరం పెరిగింది.

    తెలివయిన మంచి యజమాని ఏం చేస్తారంటే, తన వద్ద పనిచేసే సిబ్బంది యొక్క బాగోగులు చక్కగా చూసుకుంటారు. ఇంకా, సంస్థకు లాభాలు వచ్చినప్పుడు సిబ్బందికి కూడా ఆ లాభాలలో వాటాలను ఇస్తారు.

    తమ బాగోగులు చూసుకునే యాజమాన్యం ఉన్నప్పుడు సిబ్బంది కూడా సంస్థ కోసం చక్కగా పనిచేస్తారు.


    మనమూ బ్రతకాలి. ఇతరులనూ బ్రతికించాలి .... అని భావించే మంచి యాజమాన్యం ఉన్నప్పుడు సమసమాజం ఏర్పడుతుంది.

    అయితే , ఈ రోజుల్లో సిబ్బందికి కుటుంబఖర్చులకు కూడా సరిపోని తక్కువ జీతాలు ఇస్తూ సంస్థకు వచ్చిన లాభాలను మొత్తం యాజమాన్యమే ప్రొగుచేసుకునే అత్యాశాపరులైన యజమానులు పెరిగిపోయారు.

    ఇలాంటి వారి వల్లే సంపద కొందరి వద్దే ప్రోగుపడి , సమాజంలో పేదరికం పెరిగింది.

    మనమూ బ్రతకాలి. ఇతరులనూ బ్రతికించాలి .... అని భావించే మంచివారు పెరగాలని ఆశిద్దామండి.


    ......................

    ReplyDelete
  12. ఇపుడు ఇద్దరం ఒకే పాయింట్ దగ్గరికొస్తున్నట్లు ఉంది. వెరీ గుడ్. మొదటిగా మీరు చెప్పిన అత్యాశపరులగురించి. ప్రతివారికీ వీలైనంత తక్కువ ధరకు పని చేయించుకోవాలని ఉంటుంది. అది సహజ లక్షణం. అయితే కొంతమంది అత్యాశ వల్ల ఒక్కోసారి శ్రమ కి చాలా తక్కువ విలువ చెల్లించబడుతుంది. అయితే ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి అనే విషయం లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది అతివాదులు ధనవంతులందరినీ ఏరిపారెయ్యాలి అంటారు. బలవంతంగా అవతలి వాడి తల వంచటమే మార్గమంటారు. కాని పెట్టుబడిదారీ విధానాన్ని సరిగా అర్థం చేసుకున్నవారైతే ముల్లు ని ముల్లు తోనే తీయమంటారు. అనగా కనీస విలువకంటే తక్కువ చెల్లించేవారిదగ్గర పని చెయ్యకపోతే ఎలాంటి జేజమ్మ లాంటి సంస్థ అయినా కిందికి దిగివస్తుంది. మరి ఏ పనీ చెయ్యకుండా ఎలా బ్రతకటం అనే ప్రశ్న ఇపుడు వస్తుంది. ఇక్కడే ఉంది అసలు టెక్నిక్. ఒక కంపెనీ కి పోటీగా మరి కొన్ని కంపెనీలు వెలియాలి. యువత గుంపులు గుంపులుగా తమవైన చిన్న కంపెనీలు నెలకొల్పుకోవాలి. ఆశావహ దృక్పథం తో విలువకు సరి అయిన సేవ అందిస్తూ ఉంటే ఇవాల్టి చిన్న కంపెనీయే రేపు మహావృక్షం లా ఎదగవచ్చు. అలా కాక ఇపుడున్న కంపెనీ లోనే ఉండి సరిగా జీతాలివ్వట్లేదని తిట్టుకుంటే ఏమీ ఒరిగేది ఉండదు. మీరు అనవచ్చు, "కొందరు వదిలేస్తే కంపెనీ ఇంకెవరినో తెచ్చుకోదా" అని. కాని సరైన విలువ చెల్లించని చోట కొంతకాలమైతే సర్దుకుపోయి పనిచేస్తారుగాని, ఎల్లకాలం ఎవరు పని చేస్తారు చెప్పండి? (అలా ఎల్లకాలం పనిచేస్తున్నారు అంటే వారిలో చైతన్యం లేదని అర్థం). ఈ విధంగా పెట్టుబడిని పెట్టుబడితో ఎదిరించటం వల్ల అటు శ్రమకి విలువా లభిస్తుంది, ప్రజలకు సేవలూ తక్కువధరలో అందుతాయి (వివిధ గ్రూపుల మధ్య పోటీవల్ల). కాని అతివాద భావాలు గలవారు ఈ సిధ్ధాంతాన్ని ఒప్పుకోరు. ఘర్షణనే ఎంచుకోడానికి ఇష్టపడతారు. దానివల్ల ఉన్న కంపెనీ మూతపడిపోతుంది, ఇటు యువతా ఇంకో పని ఏదీ చేయక తన శక్తిని వృధా చేస్తుంది.
    ఒకసారెక్కడో ఓ మంచి వాక్యం చదివాను. Lead, Follow or get out of the way అని. దాన్ని మనం ప్రస్తుత టాపిక్ కు అన్వయించుకుంటే "నచ్చితే పని చెయ్యి (ఫాలో ద కంపెనీ), నచ్చలేదూ నువ్వే ఏదైనా వ్యాపారం ప్రయత్నించి కొందరికి ఉపాధి కల్పించు (లీడ్), లేదా మరెక్కడికైనా మంచి అవకాశం దొరికేచోటికి వెళ్ళిపో (గెటింగ్ అవుట్ ఆఫ్ ద వే). అంతేకాని ఇక్కడే ఉండి సణుక్కుంటూ నీ బ్రతుకును వృధా చేసుకోకు అని"

    ReplyDelete
  13. చాలామందికి వీలైనంత తక్కువ ధరకు పని చేయించుకోవాలని ఉంటుంది. అలాగే చాలామందికి తాము చేసిన పనికి వీలైనంత ఎక్కువ ఆదాయాన్ని పొందాలనీ ఉంటుంది. ఇలా కాకుండా ఇరువైపులా వారు ధర్మబద్ధమైన విధంగా ఆలోచిస్తే సమస్యే ఉండదు.
    ( ఎవరికయినా కుటుంబఖర్చులకు సరిపడా ఆదాయం రావటం అవసరం. )

    ఆ మధ్య ఒక పారిశ్రామికవేత్త ఏమన్నారంటే , మేమే యువతకు ఉపాధిని కల్పించాలి. మేము కల్పించకపోతే ప్రభుత్వం కల్పిస్తుందా ? అన్నారు. వారు మామూలుగానే ఆ మాటలను అన్నా , ఈ రోజుల్లో ప్రజల జీవితం ప్రైవేట్ రంగ సంస్థల దయాదాక్షిణ్యంపై ఆధారపడి ఉన్న నిజాన్ని తెలియజేసింది.

    ప్రజాస్వామ్యంలో ప్రభుత్వరంగ సంస్థలు ప్రభుత్వం ఆధీనంలో ఉండి, చక్కటి పర్యవేక్షణతో నడపబడుతూ , ప్రజలకు ఉపాధిని కల్పించాలి. ప్రభుత్వం వాటిని సమర్ధవంతంగా నిర్వహించాలి.

    అయితే ఈ రోజుల్లో ప్రభుత్వరంగ సంస్థలకు నష్టాలు వస్తున్నాయని చెప్పి, ప్రతిదానిని ప్రైవేటీకరణ చేసేసి చేతులు దులిపేసుకుంటున్నారు.

    మితిమీరిన ప్రైవేటీకరణవల్ల ప్రభుత్వం వ్యవస్థ మీద సరైన పట్టును కోల్పోతుంది. ప్రైవేట్ పెట్టుబడిదారుల ఆధిపత్యం ఎక్కువ అవుతుంది. ప్రజలు ఉపాధి కోసం ప్రభుత్వం మీద కాకుండా ప్రైవేట్ రంగ సంస్థల మీద ఆధారపడవలసివస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇది సరైన విధానం కాదు.

    పెద్ద సంస్థల వారికి రుణాలు తేలికగా లభిస్తాయి. నిరుద్యోగులైన యువకులు కొందరు కలిసి ఏదైనా చిన్న సంస్థను నెలకొల్పాలని రుణం కోసం వెళ్తే మాత్రం రుణాన్ని ఇచ్చే అధికారులు ఆ నిరుద్యోగులను సవాలక్ష ప్రశ్నలతో వేధిస్తారు.

    చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణాలను ఇచ్చి ప్రోత్సహించటం ఎంతో అవసరం.

    మనుషుల్లో అత్యాశ, స్వార్ధం తగ్గినప్పుడే ఎన్నో సమస్యలు తగ్గుతాయి.

    ReplyDelete