koodali

Friday, April 5, 2013

వైద్యం...కొన్ని సంగతులు .....రెండవ భాగం.

 
 ఆయుర్వేదం,  హోమియో,  అల్లోపతి  అన్ని  వైద్యాలు  గొప్పవే.  ఈ  మధ్య  అన్ని  రకాల వైద్య విధానాలు   ఒకే  ఆవరణలో  అందుబాటులో  ఉండేటట్లు  కొత్తరకం  హాస్పిటల్స్   ఏర్పాటుచేస్తున్నారు. ఇది  ఎంతో  మంచిపరిణామం. 

మాకు  అన్ని  రకాల  వైద్య  విధానాల  పట్ల   గౌరవం  ఉంది. మేము  అవసరాన్ని  బట్టి  అన్ని  రకాల  వైద్య  విధానాలను  వాడతాము. 

 .................... 

ప్రత్యక్షంగా   వైద్యాన్ని  చేసే  వైద్యులు  కొందరయితే,  మీడియా  ద్వారా  వైద్య  సలహాలను  అందించి  ప్రజలకు  సహాయం  చేస్తున్న  వైద్యులు  ఎందరో  ఉన్నారు.

  ఆయుర్వేదం,  అల్లోపతి  ,   హోమియో   వైద్యవిధానాల  గురించి  ఎందరో  వైద్యులు  ఎన్నో  చక్కటి  వైద్యసలహాలను  మీడియా  ద్వారా  అందిస్తున్నారు.  చాలా మంది  వాటిని  పాటించి  మంచి  ఫలితాలను  పొందుతున్నారు.

 ....................... 

ప్రతి  అనారోగ్యానికి  ప్రకృతిలో  మందు  ఉంటుందంటారు.

ఆహారవిహారాల్లో  చక్కటి  పద్ధతిని  పాటించటం  వల్ల  ఎన్నో  రోగాలు  రాకుండా  ఉంటాయని  పూర్వీకులు  తెలియజేసారు.  ఆయుర్వేదంలో  ఎన్నో  చక్కటి  మందులు  ఉన్నాయి. 

ఉదా.......నాకు  తెలిసిన  ఒకామె  ఏం  చెప్పారంటే , ఒకప్పుడు  ఆమెకు  చాలా  మందపాటి  కళ్ళద్దాలు  ఉండేవట.  ఆయుర్వేద  వైద్యులు  చెప్పినట్లు    గోపంచకాన్ని  ఒక  పద్ధతి  ప్రకారం  మందులా  తయారుచేసి  వాడటం  వల్ల  ఆమెకు  ఉన్న  దృష్టి దోషం  పోయి   కళ్ళజోడు  అవసరం  లేకుండానే  చక్కగా  పత్రికలు  చదవగలుగుతోందట. 

ఉదా.....పక్షవాతంతో  బాధపడే   ఒక  వ్యక్తికి   అల్లోపతి  వైద్యం  వల్ల   వ్యాధి   తగ్గలేదట,   ఆయుర్వేదమందులు  వాడుతూ  యోగాను  చేయటం  వల్ల  ఆయనకు  వచ్చిన  వ్యాధి  పూర్తిగా  తగ్గిపోయిందట.  అప్పటినుంచి  ఆయన   యోగాను  బాగా  నేర్చుకుని,   యోగా  యొక్క  గొప్పదనాన్ని  తెలియజేస్తూ   ఇతరులకూ  నేర్పుతున్నారట.

ఉదా......పదవతరగతి  పరీక్షలు  పూర్తయిన   తరువాత  నాకు  కామెర్లవ్యాధి  వచ్చింది. మా  ఊళ్ళోని  ఒక  ఆయుర్వేద  వైద్యుని  వద్ద  మందులు  వాడితే  తగ్గింది.

 ఆహారంలో  ఉసిరిని  వాడితే  మంచిది..  ఉసిరి  వల్ల  ఎన్నో  రోగాలు  రావట.  పూర్వీకులు    భోజనం  చేసేటప్పుడు  మొదటి  ముద్దలో   ఉసిరికాయ పచ్చడిని  కలుపుకుని  తినేవారట. 

............


హోమియో  వైద్యం  గురించి  ఇంతకుముందు    టపాలో  వ్రాసాను. స్త్రీలకు  వచ్చే  నెలసరి  సమస్యలను  ఆపరేషన్  అవసరం  లేకుండా  హోమియో  మందులతో  తగ్గించవచ్చు.
.......................................

 అల్లోపతి  వైద్యం  విషయనికొస్తే ,   కొన్నిసార్లు  అనారోగ్యం  బాగా  పెరగటం  వల్ల  రోగులు    నీరసంగా,  నిస్త్రాణగా   అయిపోయినప్పుడు  అప్పటికప్పుడు  సెలైన్  ఎక్కించి  ప్రాణాలను  కాపాడవచ్చు.   ఎవరికైనా  అత్యవసరంగా   ఆపరేషన్  చేయటం  వంటి  సమయాలలో  అల్లోపతి  వైద్యం  ఉపయోగపడుతుంది.

నాకు   చిన్నతనంలో  ఒకసారి   బాగా  అనారోగ్యం  వచ్చిందట..  అప్పుడు  మా  ఊరిలోని  అమెరికన్  మిషనరి  ఆసుపత్రిలో  వైద్యులు  నాకు  వైద్యం  చేసి   సెలైన్  ఇవ్వటం  వల్ల  కోలుకున్నానట.

ఆ  ఆసుపత్రి  గేట్  వద్ద  పెద్ద  ఏసుక్రీస్తు  విగ్రహం  ఉంటుంది.

....................................... 

 
కొందరు  హిందువులు, పిల్లలకు  అనారోగ్యం  వచ్చినప్పుడు  మందులు  వాడటంతో  పాటు    ద్రిష్టి  కూడా  తీస్తారు.  కొందరు  ముస్లిం మతస్తులు , కొందరు  హిందువులు  కూడా  పిల్లలకు  అనారోగ్యం  వచ్చినప్పుడు  మందులు  వాడటంతో  పాటు  మసీదుల  వద్ద  మహిమ కలిగిన తాయెత్తులు  తెచ్చుకుని  ధరిస్తారు.  మా  పెద్దవాళ్ళు  కూడా  మసీదు  వద్ద  తాయెత్తులు   తెచ్చి  పిల్లలకు  కట్టినట్లు  నాకు  గుర్తుంది.

ద్రిష్టితీయటం,  తాయెత్తులు   కట్టుకోవటం వలన , వ్యక్తులకు  ఉన్న  చెడు  దోషాలు  తొలగిపోతాయని   పెద్దలు  తెలియజేసారు.   ........

ఈ రోజుల్లో   ఎన్నో రకాల  వైద్యాలు  ఉన్నాయి.  పూర్వం  అయితే  మన  దేశంలో  ఆయుర్వేదమే  ఎక్కువ  ప్రాచుర్యంలో  ఉండేదట.  ఇన్నిరకాల  వైద్య  విధానాలు  కాకుండా  ఆయుర్వేదవైద్యచికిత్స   ద్వారానే  అన్ని  రోగాలు  తగ్గిపోయేవట.

 అప్పట్లోనే   చరకుడు,  సుశ్రుతుడు  వంటి  గొప్ప  వైద్యులు ఉండేవారని  గ్రంధాల  ద్వారా  తెలుస్తోంది. 


  అప్పట్లో  సర్జరీలు  కూడా  జరిగేవట.   అయితే,  ఇప్పుడు  ఆ  వివరాలన్నీ  మనకు  అందుబాటులో  లేకుండా  పోయాయి.

ఎన్నో  విలువైన  గ్రంధాలను  మనం  నిర్లక్ష్యం  చేశాము.  ఉన్నవాటినైనా  పరిరక్షించుకుని , వాటిలోని  వివరాలను  బట్టి  పరిశోధనలు  చేస్తే  ఎన్నో  విలువైన  విషయాలు  తెలిసే  అవకాశం  ఉంది.

........................................................


చాలామందితో  పోల్చితే    మాకు  అనారోగ్యం  చాలా  తక్కువగా  వచ్చింది.  అందుకు  భగవంతునికి  అనేక  కృతజ్ఞతలు.  అంతా  దైవం  దయ.




2 comments:

  1. దేనిలో మంచి ఉన్నా స్వీకరించాలి.చాలా బాగా వ్రాసారు.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. నేను కొద్దిసేపటి క్రితమే మీ వ్యాఖ్యను చూశాను. రిప్లై ఇవ్వటం ఆలస్యమయినందుకు దయచేసి క్షమించండి.

    నిజమేనండి . దేనిలో మంచి ఉన్నా స్వీకరించాలి.

    ReplyDelete