koodali

Friday, April 26, 2013

మనుషులకు ఆహారం కోసం ఎన్నో మొక్కలు ప్రాణత్యాగం చేస్తాయి.

 
కొంతకాలం  క్రిందట మేము శ్రీ రంగనాథస్వామిగోదాదేవి వార్ల  దర్శనంకొరకు మధురై నుంచి  శ్రీవిల్లిపుత్తూరు బస్సులో వెళ్తుంటే ఎండ  ఎక్కువగా ఉంది.  దాహం  అనిపించింది. 

 బస్సు  వెళ్తుంటే   ప్రక్కనుంచి   పొలాలు,  ఖాళీ స్థలాలు   ఎన్నో  కనిపిస్తుంటాయి. దారి  ప్రక్కన  ఎన్నో  మొక్కలు  ఎండకు  వడిలిపోయి  ఉన్నాయి. 

 అప్పుడు  ఏమనిపించిందంటే ,  మనుషులకు  దాహం   వేస్తే  నీటిని  త్రాగటానికి  ఎన్నో  సదుపాయాలు  ఉంటాయి.  


ఉన్నచోటనుంచి  కదలలేని  మొక్కలకు  దాహం  వేస్తే  పాపం  అవి   ఏం  చేయగలవు  ? అనిపించింది.  దాహంగా  ఉందని  నోటితో  చెప్పుకోలేవు.  నడిచి  వెళ్ళి  నీళ్ళను  త్రాగలేవు  కదా !

 అందుకే  వేసవిలో  కూడా  అప్పుడప్పుడు  వానలు  పడాలి.   వాననీటి  వల్ల  మొక్కలు  మళ్ళీ  వర్షాకాలం  వరకు  బ్రతకటానికి  అవకాశం  ఉంటుంది. 

పెద్ద  వృక్షాల వేర్లు  భూమిలో  లోతు వరకూ  చొచ్చుకుపోయి  నీటిని  పీల్చుకుంటాయి. చిన్న మొక్కలకు   వేర్లు  భూమిలోపలి  వరకూ  వెళ్ళవు. 

  తమ  బాధలను  చెప్పుకోలేని  మొక్కలు,  పశుపక్ష్యాదులతో  పోల్చుకుంటే  మానవ  జన్మ  ఎంతో  గొప్పది.  ఎంతో  పుణ్యం  చేసుకుంటే  మానవజన్మ  లభిస్తుంది  అంటారు. 


 కానీ  ఈ  రోజుల్లో  చాలామంది  మనుషులు  మానవజన్మను  దుర్వినియోగం  చేసుకుంటున్నారు.  అంతులేని  కోరికలతో  పర్యావరణాన్ని  పాడుచేస్తున్నారు. మానవుల  వల్ల  ఎన్నో  మూగజీవులు  బాధలు  పడుతున్నాయి. 

పూర్వకాలంలో  సంవత్సరం  పొడుగూతా  పంటలను  పండించేవారు  కాదు.  సంవత్సరానికి  రెండు  పంటలను  మాత్రమే  వేసేవారట.  


ఇప్పుడు  సంవత్సరం  పొడుగునా   పంటలను  పండిస్తూ  భూమికి  రెస్ట్  ఇవ్వటం  లేదు.  ఇందువల్ల  భూమిలోని సారం  తగ్గిపోతోంది.   అయినా  ఎరువులను  వేసి  బలవంతంగా  పంటలను  పండిస్తున్నారు.  

వేసవికి  ముందు  పుచ్చకాయ, తర్బుజా ..   వంటి  తేలికపాటి  పంటలు  వేస్తారు  కానీ  వరి  వంటి  ఎక్కువ  మొక్కలు  ఉండి, నీరు  ఎక్కువ  అవసరమయ్యే   పంటలను  వేసేవారు  కాదట.ఇప్పుడు  సంవత్సరం  అంతా  వరి   వంటి  పంటలను  వేస్తున్నారు. 
 
 పోనీ  ఇన్ని  పంటలను  పండిస్తున్నా  ఆకలి  తీరుతోందా  ?  అంటే   ఆకలి  తీరనివాళ్ళెందరో  కనిపిస్తున్నారు. పండిన  పంటలను  జాగ్రత్తగా  నిల్వ  చేయకుండా  కుళ్ళబెడుతున్నారు. 

  కొందరు  ధనవంతులు  పెళ్ళిళ్ళు  వంటి  సందర్భాల్లో  ఆహారాన్ని  వృధాగా  పారవేస్తుంటే ,   కొందరు  పేదవాళ్ళకు  ఆహారాన్ని  కొనుక్కోవటానికి   డబ్బు   సరిపోవటం లేదు. 



 
ఈ రోజుల్లో  అందరికి  ఆహారాన్ని  అందించే  రైతు  పరిస్థితి  దయనీయంగా  ఉంది.   రైతు  వద్ద  పంటలను  చవకగా  కొని  వాటితో  ఆహారపదార్ధాలను  తయారుచేసి  విపరీతమైన  లాభాలను  సంపాదిస్తున్నారు  కొందరు  వ్యాపారస్తులు. ప్రభుత్వం,  అధికారులు   గట్టిగా  తలచుకుంటే  రైతుల  యొక్క  సమస్యలను  పరిష్కరించటం  పెద్ద  కష్టమేమీ  కాదు.


 ఈ  రోజుల్లో  మనుషులకే  ఆహారం  సరిపోక  బాధలు  పడుతుంటే  వాహనాలకు   ఇంధనంగా  నూనె  గింజలనుంచి  తీసిన  నూనెలను  వాడుతున్నారు. 


ఇవన్నీ  చూస్తుంటే  భవిష్యత్తులో  ఆహారకొరత  తీవ్రంగా  ఉండే  అవకాశం  ఉందేమో  ?   అనిపిస్తోంది. అభివృద్ది  పేరుతో  మనుషులు  తమ  జీవితాలను  క్లిష్టతరం  చేసుకుంటున్నారనిపిస్తోంది. 

 అన్నం  పరబ్రహ్మ  స్వరూపం .  అని  చెప్పారు  పెద్దలు.  మనుషుల   ఆహారం  కోసం   ఎన్నో  మొక్కలు  ప్రాణత్యాగం  చేస్తాయి.  అందుకని  పంటలను   అవసరమైనంతవరకే  పండించుకుని  ఆహారాన్ని  పొదుపుగా  వాడుకోవాలి.



2 comments:

  1. ముక్కిపోయిన ఆహారధాన్యాలని సముద్రం లో పారబోస్తోంది ప్రభుత్వం. అలాగే కలిగినవారు ఆహారాన్ని దుబారా చేస్తున్నారు, లేనివారు డొక్కలెండుతున్నాయి.హింస అంటే ఏమిటి? అన్న దానికి భారతంలో భీష్ముడు నిర్వచనం చెప్పేరు చదవండి.

    ReplyDelete

  2. కృతజ్ఞతలండి.

    ముక్కిపోయిన ఆహారధాన్యాలని సముద్రం లో పారబోస్తోంది ప్రభుత్వం. అలాగే కలిగినవారు ఆహారాన్ని దుబారా చేస్తున్నారు, లేనివారు డొక్కలెండుతున్నాయి. అని మీరు చెప్పినది అక్షరాలా నిజం.

    సరైన ప్రణాళిక, చిత్తశుద్ధితో కూడిన ఆచరణ ఉంటే ప్రపంచంలో ఆహారసమస్య ఉండనే ఉండదు. వ్యాపారస్తులలో విపరీతమైన లాభాపేక్ష పెరిగిపోవటం కూడా సమాజంలో పేదరికం, ఆహారకొరతలకు మరో ముఖ్యమైన కారణం.

    జీవుల ఆహారానికి అవసరమైన సూర్యరశ్మిని, వానలను, పంటలను పండించుకోవటానికి అవసరమైన వాతావరణాన్ని , విత్తనాలను దైవమే సృష్టించారు.

    చిన్న విత్తనం నాటితే మొక్క మొలిచి ఆ మొక్క నుంచి మరెన్నో మొక్కలు వస్తాయి. అయినా ప్రపంచంలో ఆకలితో అల్లాడుతున్నవారు ఉండటం ఆశ్చర్యంగా అనిపిస్తోంది.

    ఆహారపంపిణి గురించి సరైన ప్రణాళికను పాటించితే ఎక్కువ దిగుబడులనిచ్చే ఆహారపంటలను గురించి శాస్త్రవేత్తలు పరిశోధించనవసరం లేదు అనిపిస్తుంది.

    మనిషి జీవితానికి అవసరమైన అన్ని ఏర్పాటులను దైవం చక్కగా చేశారు. అయినా మనుషులకు శ్రద్ధ , చిత్తశుద్ధి , సరైన ప్రణాళిక లేకపోవటం వల్ల ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉంటున్నాయి.

    ReplyDelete