ఈ రోజుల్లో స్త్రీల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు (?) తయారయ్యింది.
పాతకాలంలో లాగా ఇంట్లో ఉంటే తమకు గుర్తింపు ఉండటం లేదని భావించిన ఈనాటి స్త్రీలు బయటకు వస్తున్నారు.
స్త్రీలు బయటకు రాకూడదని అనలేము. వైద్యులు, నర్సులు, అధ్యాపకులు .... వంటి రంగాలలో మహిళలు పనిచేయటం అవసరం కదా !
కారణాలు ఏవైనా నా ఈనాటి స్త్రీలకు ఇంటా బయటా చాకిరీ పెరిగిపోయిందేమో.. అనిపిస్తుంది.
ఈ మధ్య స్త్రీల పట్ల జరుగుతున్న నేరాల గురించిన వార్తలు వింటుంటే సమాజం ఇలా ఎందుకు తయారయిందో అర్ధం కావటం లేదు.
అందువల్ల స్త్రీలు ప్రయాణించటానికి , స్త్రీల రక్షణ కోసం ప్రత్యేక వాహన సర్వీసులను ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట.
ఇవన్నీ అలా ఉంచితే, ఈ మధ్య కాలంలో మరికొన్ని వార్తలను గమనించితే , వివాహవ్యవస్థ విచ్చిన్నమవటం , వివాహేతర సంబంధాలు, విడాకులు, యువతరంలో సహజీవనం ...వంటివి పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇంకా స్కూల్స్, కాలేజీలలో చదువుతున్న అమ్మాయిల పట్ల , ఆఫీసుల్లో పనిచేసే మహిళల పట్ల కొందరు మగవారి వేధింపులు, గురించి వింటున్నాము.
ఇవన్నీ వింటున్న భార్యలకేమో తమ భర్తల గురించిన బెంగ, భర్తలకేమో తమ భార్యల గురించిన బెంగ, తల్లిదండ్రులకేమో తమ పిల్లల గురించిన బెంగ ఉంటుంది.
ఇలా పరస్పర అనుమానాలు, భయాలతో ఎన్నో కుటుంబాల్లో గొడవలు జరగటం , అవి విడాకులకు దారితీయటం జరుగుతోంది.
ఈ రోజుల్లో స్త్రీలకు అనేక సమస్యలు. .....బయట రక్షణ సమస్య, ఇంటాబయటా చాకిరీతో అలసిపోవటం సమస్య , కుటుంబానికి తగినంత సమయాన్ని కేటాయించలేకపోవటమనే సమస్య,
పై విషయాలను గమనించితే ఏమనిపిస్తుందంటే, కొంతకాలం క్రిందట ఆడవారి కోసం విడిగా పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు ఉండేవి. మళ్ళీ ఆ పద్దతి వస్తే ఈ బాధలు సగమయినా తగ్గే అవకాశముంది . అనిపిస్తోంది.
మొహమాటం లేకుండా చెప్పాలంటే, స్త్రీలకు పురుషులకు వేరువేరుగా పాఠశాలలు, కళాశాలలు, ఉంటే చాలా సమస్యలు తగ్గుతాయి. ( పురుషుల వేధింపులు స్త్రీలకు ఉండవు కదా ! )
ఇంకో సమస్య ఏమిటంటే, పని వేళలు పెరిగిపోవటం వల్ల స్త్రీలు ఆఫీసులకు ఉదయం వెళ్తే రాత్రి ఇంటికి చేరటం జరుగుతోంది. దాని వల్ల పిల్లలకు తగినంత సమయాన్ని కేటాయించలేకపోతున్నారు.
అలా కాకుండా మహిళలే స్థాపించిన పరిశ్రమల్లో అయితే వారు తమకు తగ్గట్లు పనివేళలను ఏర్పాటు చేసుకునే అవకాశముంటుంది. ఉదా....ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు మాత్రమే పనిచేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు.
ఆ విధంగా కుటుంబానికీ న్యాయం జరుగుతుంది. ఇంకా ఆఫీసు దగ్గర్లో బేబీ కేర్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే చంటి పిల్లల తల్లులు మధ్యలో వెళ్ళి చూసుకోవచ్చు.
ఆ మధ్య నేను పత్రికలో చదివాను. ఒక పేరున్న బాంక్ వారు పూర్తిగా మహిళా ఉద్యోగులతో ఒక శాఖను బెంగళూరులో ఏర్పాటు చేశారట. అలాగే ఒక పరిశ్రమ వారు స్పేర్ పార్టులు తయారు చేసే ఒక యూనిట్ ను మహిళా ఉద్యోగులతో ఏర్పాటు చేశారట.
ఇలాంటి మార్పులు చేర్పులు జరిగితే సమాజంలో ఎన్నో సమస్యలు తగ్గుతాయి.
ఇక ఇంట్లో ఉండే స్త్రీలు తాము ఖాళీగా ఉన్నామని బాధపడవలసిన అవసరం లేదు.
ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలోపు ఇరుగుపొరుగు మహిళలు కలిసి పిండివంటలు, కుట్లు అల్లికలు వంటివి నేర్చుకోవటం, సంగీతం నేర్చుకోవటం, ఆయుర్వేద మందుల తయారీ వంటివి నేర్చుకోవచ్చు.
లేక ధనవంతులై చదువుకున్న కొందరు స్త్రీలు కలిసి మహిళా మండలిలా ఏర్పడి , పేద స్త్రీల చేత చిన్న తరహా కుటీరపరిశ్రమలను ఏర్పాటుచేయించి , వారి ఆదాయం పెరిగేలా ప్రోత్సహించవచ్చు. వారికి విద్యను , ఆరోగ్య సలహాలను నేర్పించవచ్చు.
ఇవన్నీ చేయటం కుదరకపోయినా ........ సమాజానికి ఏదైనా సహాయం చెయ్యాలని భావించే ఆడవాళ్ళు చుట్టుపక్కల పేద పిల్లలకు ట్యూషన్ చెప్పవచ్చు. తమకు తెలిసిన కుట్లు, అల్లికలు, ఫాబ్రిక్ పెయింటింగ్ వంటివాటిని వారికీ నేర్పించవచ్చు.
ఈ రోజుల్లో ఎందరో స్త్రీలు తమకు వీలున్నంతలో సమాజానికి సహాయం చేస్తున్నారు. ఇది అభినందనీయ విషయం.
Baga chepparandi. So at home the male and female can live together. But once we are out of the house, be separate. Good suggestion.
ReplyDeleteఅజ్ఞాత గారు మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు.
ReplyDeleteమీ అభిప్రాయాన్ని తెలుగులో వ్రాయమని మనవి చేసుకుంటున్నాను.
నాకు ఇంగ్లీష్ అంత బాగా అర్ధం కాదు మరి.