koodali

Wednesday, January 23, 2013

అప్పటి, ఇప్పటి, పారిశుధ్య విషయాల గురించి కొన్ని విషయాలు ...


* కొంత  కాలం  క్రిందట  ఒక  టీవీ  చానల్ లో  ఒక  ప్రోగ్రాం  చూసాను. పెద్ద  స్టార్  హోటల్  వాళ్ళు  తమ  హోటల్లో  టాయిలెట్స్ ను  ఎంత  శుభ్రంగా  ఉంచుతామో  చూపించారు. . 

 అక్కడ  కమోడ్స్  కూడా   చేతిలో  ఒక బట్ట ముక్కను  పట్టుకుని  దానితో  శుభ్రంగా  తుడుస్తున్నారు.  ఆ  శుభ్రం  చేసే  వాళ్ళు  మంచి  దుస్తులు  వేసుకుని , చక్కటి  భాష  మాట్లాడుతున్నారు.  వాళ్ళకు   ఎక్కువ   జీతం  ఇస్తారట.

* ఇదంతా    చూసిన  తరువాత  నాకు   ఎన్నో  ఆలోచనలు  వచ్చాయి.
..........................


*  పూర్వకాలంలో   కొందరు    ప్రజలు,  ఇతరుల  మలినాలను  శుభ్రపరిచేవారు .  ఇది  ఎంతో  బాధాకరమైన  విషయం . 


* అయితే,  ఈ  రోజుల్లో  అలాంటివి   జరగటం  లేదా  ?   అనే   విషయాన్ని   గమనిస్తే,   ఇలాంటి    చర్యలు  అప్పటి  కన్నా,  ఇప్పుడే  ఎక్కువగా  జరుగుతున్నాయని  తెలుస్తుంది.

 *   ఈ  రోజుల్లో  కూడా  ఇతరుల  మలినాలను  సాటి  మనుషులే  శుభ్రం  చేయటం  చూస్తూనే  ఉన్నాము.


* ఉదా...చాలామంది  ఇళ్ళలో ,  గదికో   టాయిలెట్,  గదికో  వాష్ బేసిన్  కట్టించుకుంటున్నారు.  అయితే,  వాటిని  ఇంటి  యజమానులు  శుభ్రం  చేయరు.  పనివాళ్ళతో  శుభ్రం  చేయిస్తారు.   



ఈ  రోజుల్లో  చాలామందికి  ఇంటిపని  చేయటానికి  పనివాళ్ళను  ఏర్పాటుచేసుకుంటున్నారు  కదా  !   వాళ్ళు  యజమానులు  తిన్న  ఎంగిలి  పాత్రలను  శుభ్రం  చేస్తారు. టాయిలెట్స్  శుభ్రం  చేస్తారు. 

అంతేకాదు,  వాటిని   గాఢమైన  రసాయనాలతో  శుభ్రం  చేయవలసి  వస్తుంది.  ఆ  ఘాటు  వల్ల  వాళ్ళ  చేతులకు,  కళ్ళకు  అనారోగ్యం  కలిగే  అవకాశం  కూడా  ఉంది.

*   ఇళ్ళల్లోనే  టాయిలెట్స్, వంటగదిలో  సింకులు    వల్ల    డ్రైనేజ్  సమస్యలు   వచ్చినప్పుడు  కూడా  పారిశుద్య  కార్మికులు  వచ్చి   మలినాలను  శుభ్రం  చేసి  వెళ్తారు.

* పూర్వం    ఇలా  గదికో  టాయిలెట్ ను   శుభ్రం  చేసే  అవసరం  ఉండేది  కాదు. రసాయనాల  బాధ  కూడా  ఉండేది  కాదు.

.......................................


* ఇప్పుడు  చాలా  మంది   సరదాగా  కుటుంబసమేతంగా  హోటల్స్ కు  వెళ్ళి   భోజనం  చేస్తున్నారు. . వాళ్ళు  తిన్న  పళ్ళేలను  అక్కడ   వదిలి  వచ్చేస్తారు  గానీ,  కడగరు  కదా  ! వాటిని  అక్కడి పనివాళ్ళే  కడుగుతారు.

* పూర్వ  కాలం    కుటుంబసభ్యులు  హోటల్స్ కు  వెళ్ళి  తినటం  అనేది  తక్కువగా  జరిగేది.  ఒకవేళ  బయట  తిన్నా , ఆ  రోజుల్లో  భోజనం  చేయటానికి  అరటాకులు  వంటి  ఆకులను  ఉపయోగించేవారు. 


భోజనం  తరువాత  అరటాకులను   ఇతరులు   శుభ్రం  చేయనవసరం  లేదు,  వాటిని  బయట  పారేస్తే  పర్యావరణానికి  హాని  లేకుండా  చక్కగా  మట్టిలో  కలిసిపోయేవి. 
...................................

*  అప్పటి  వాళ్ళు  సరుకులు  తెచ్చుకోవటానికి  కిరాణా  కొట్టుకు  వెళ్తే  ఇంటినుంచి  సంచిని  తీసుకు  వెళ్ళేవారు. 


పూర్వకాలంలో  ఇప్పుడు  ఉన్నన్ని  రకాల  వస్తువులు  లేవు  కాబట్టి ,  ఇంత  చెత్త  ఉండేది  కాదు.   ఆ  చెత్త కూడా  పర్యావరణానికి  హాని  కలిగించకుండా  మట్టిలో  కలిసిపోయేది. 

 * పూర్వకాలం  వాళ్ళు  ఇంత  చెత్తను  బయట పారబోసేవారు  కాదు.  అంటే, 


ఉదా... ఇంట్లో  మిగిలిన  వ్యర్ధ పదార్ధాలైన  కూరగాయల తొక్కలను , వేరుశనగ  తొక్కలు,  మొక్కజొన్న  పై  తొక్కలు ,  అరటి  వంటి  పండ్ల  తొక్కలు,.... వంటివాటిని  చెత్తలో  వేయకుండా  పశువులకు  మేతగా  వేసేవారు.  మరికొన్ని  పదార్ధాలను  బయట  పారవేస్తే  కాకులు  వంటి  పక్షులు  తిని  పర్యావరణాన్ని  శుభ్రం  చేసేవి.

 * ఇప్పుడు  పెరిగిన  వాతావరణ  కాలుష్యం  వల్ల  కాకులు,  పిచ్చుకలు  వంటి  పక్షులు  ఎక్కువగా  కనిపించటం  లేదు  కదా  ! 


 ఈ  రోజుల్లో  చెత్త  బుట్టల  వద్ద  టన్నుల  కొద్దీ  చెత్త   పోగవుతోంది.  కుళ్ళిపోయిన  ఆ  చెత్తను  సాటి  మనుషులే  శుభ్రం  చేస్తుంటారు. ఈ  పారిశుద్య  కార్మికులు   డ్రైనేజ్  కాలువలను  కూడా  శుభ్రం  చేస్తుంటారు.
....................


* పూర్వకాలంలో   ఎవరి  ఇంటిముందు  వీధిని  వాళ్ళే   ఊడ్చి,  కళ్ళాపి   జల్లి, ముగ్గులు  పెట్టుకునే  పద్ధతి  ఉండేది.  దీనివల్ల  వీధులను  శుభ్రం  చేసే   పారిశుధ్య కార్మికులకు  చాలా  పని తప్పుతుంది.

* ఈ  రోజుల్లో  ఎవరి  ఇంటి ముందు  చెత్తను   వారు  శుభ్రం  చేసే  పద్ధతి  తగ్గిపోయి ,  బాధ్యతంతా  పారిశుధ్య  కార్మికులపై  పడుతోంది.
..............................


* ఇవన్నీ  గమనిస్తే  పూర్వకాలంలో  కన్నా,  ఈ  కాలంలోనే  ఇతరుల  మలినాలను  సాటి  మనుషులు  శుభ్రం  చేసే  పని  ఎక్కువగా  జరుగుతోంది ... అనిపించింది.
..................................


* పూర్వం  ఈ  దేశంలో  టాయిలెట్స్  ఉండేవి  కాదని, అప్పటి  వాళ్ళు  ఆరుబయటకు  వెళ్ళేవారని  ఇప్పటివారంటారు. ఆరుబయట  కాలకృత్యాలకు  వెళ్ళినా  ఆ  వ్యర్ధాలు  మట్టిలో  కలిసి  ఎరువుగా  మారేవి.

* ఈ  రోజుల్లో అయితే, టాయిలెట్స్  ద్వారా    వచ్చే   వ్యర్ధాలను   పైపుల  ద్వారా, మురుగు కాలువల  ద్వారా......    డైరక్టుగా  నదులలో,  సముద్రాలలో  కలిపేస్తున్నారు. 


ఇలా  కాకుండా   గోబర్  గేస్  ప్లాంట్స్  ఏర్పరిచి ,  ఈ  వ్యర్ధాలను విద్యుత్ గా మార్చి , వీధి  దీపాలు  వెలగటానికి , ఇంకా  ఇతరత్రా  విద్యుత్  అవసరాలకు  వాడుకుంటే  బాగుంటుంది. ( ఇలా  వచ్చిన  గేస్ ను   వంటకు  ఉపయోగించటానికి  ఎక్కువమంది  ఇష్టపడరు  లెండి..  )

*   చాలా  కాలానికి  పూర్వమే ,  భారతదేశంలో   విలసిల్లిన   సింధు  నాగరికత  యొక్క పురావస్తు  త్రవ్వకాలలో  చక్కటి  మురుగునీటిపారుదల  ఏర్పాట్లు  ఉన్న  వ్యవస్థ  బయటపడింది.  దీన్నిబట్టి  చూస్తే  అప్పటి  వాళ్ళకు  ఎంతో  టెక్నాలజి  తెలుసు . అని  తెలుస్తుంది. 


* ఒకప్పుడు  భారత దేశం  ఎంతో  సిరిసంపదలతో  విలసిల్లేది.  ఇక్కడి  వైభవాన్ని గురించి  ఎందరో  విదేశీ  యాత్రికులు  తమ  గ్రంధాలలో  వర్ణించారు.  అయితే,  తరువాత  క్రమంగా  భారతదేశం  పేద  దేశంగా,  మురికితో  నిండిన  దేశంగా  తయారయింది.  

* తిరిగి  ఈ  దేశం   సిరిసంపదలతో, పరిశుద్ధంగా విలసిల్లాలని  ఆకాంక్షిస్తూ .....



6 comments:

  1. మనలాటి పిచ్చాళ్ళు ఇంకా ఉన్నారనుకుంటా. మా ఇంట పని మనిషిలేదు, ఎప్పుడూ, ఇప్పుడూ కూడా. బట్ట్లు మేమే ఉతుక్కుంటాం. టాయ్ లెట్లు మేమే బ్రష్ తో శుభ్రం చేసుకుంటాం. మమ్మల్ని మా బంధువులంతా పిసినారులని బిరుదిచ్చారు.

    ReplyDelete
    Replies
    1. * మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      * ఇంట్లో పనికి ఎవరినీ మాట్లాడుకోలేదంటే, మీరు నిజంగా చాలా గ్రేటండి.
      * మా ఇంట్లో గిన్నెలు శుభ్రం చేయటానికి ఇంతకుముందు ఉండేవారండి.
      * అయితే, గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఎవరినీ పనికి పెట్టుకోలేదు.
      * గత కొన్ని సంవత్సరాల నుంచి నేనే ఇంటిపని చేసుకుంటున్నాను.
      * మా బంధువులు కూడా పనికి ఎవరినైనా మాట్లాడుకోవచ్చు కదా ! అంటుంటారు.
      * నాకైతే ఇలాగే బాగుంది..

      Delete
  2. ఆలోచింపజేసేవిధంగా ఉంది మీ వ్యాసం. కాని ఎంత మంది భారతదేశంలో వీటి గురించి ఆలోచిస్తున్నారన్నదే ప్రశ్న ??

    ReplyDelete
    Replies
    1. * మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      * నిజమేనండి ఇప్పడు సమాజంలో ఎన్నో సమస్యలున్నాయి.
      * సమస్యలను పరిష్కరించాలి ... అనే శ్రద్ధ కూడా ఈ రోజుల్లో చాలా మందిలో కనిపించటం లేదు.

      Delete
  3. అయ్యో మనవాళ్ళకి టివిలో సీరియల్ చూడటానికి ట్యెం సరిపోవట్లెదు, ఇంకా ఇంటిపని ఏప్పుడు చెయ్యాలి.

    ReplyDelete
    Replies
    1. * మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      * పూర్వం మిక్సీలు , గ్రైండర్లు ..... లేకపోయినా ఆడవాళ్ళకు పని త్వరగా పూర్తయేది. ఇంటిపనులు పూర్తయిన తరువాత ఇరుగుపొరుగు ఆడవాళ్ళు కొంచెంసేపు కబుర్లు కూడా చెప్పుకునేవారట.
      * ఈ రోజుల్లో మిక్సీలు, గ్రైండర్లు .... ఉన్నా కూడా ఆడవాళ్ళకు పని త్వరగా జరగటం లేదు. అందుకు ఒక ముఖ్యమైన కారణం టీవీల ముందు ఎక్కువసేపు కూర్చోవటం.

      * నేను కూడా కొన్ని టీవీ ప్రోగ్రాంస్ చూస్తానండి. , ఎక్కువసేపు టీవీ ముందు కూర్చుంటే ఇంట్లో పని ఆలస్యమైపోతుంది.

      Delete