koodali

Friday, March 18, 2011

" ప్రభూ, అటువంటి బాధను నువ్వెందుకు అనుమతిస్తావు " ?

 

*ఈ విషయాలు పరమహంస యోగానంద గారు తెలిపిన విషయాలండి....( ఒక యోగి ఆత్మ కధ గ్రంధము లోనివి. )

అధ్యాయం: 30 లోని కొన్ని విషయాలు............

ఒకనాడు నేను, యూరప్ యుద్ధరంగాలకు సంబంధించిన న్యూస్ రీల్ చూడ్డానికి ఒక సినిమాహాల్లోకి ప్రవేశించాను. పాశ్చాత్యంలో మొదటి ప్రపంచయుద్ధం ఇంకా చెలరేగుతూనే ఉంది : మారణకాండను ఆ న్యూస్ రీల్ ఎంత వాస్తవికంగా చూపించిందంటే, నేను హృదయ వ్యధతో హాల్లోంచి బయటికి వచ్చేశాను.

" ప్రభూ, అటువంటి బాధను నువ్వెందుకు అనుమతిస్తావు " ? అని ప్రార్ధించాను.

నాకు అత్యంత ఆశ్చర్యం కలిగేవిధంగా, నిజమైన యూరప్ యుద్ధరంగాల అంతర్దర్శనాలరూపంలో, తక్షణమే నాకు సమాధానం వచ్చింది. చచ్చిపోయిన వాళ్ళతోటీ, పోతూ ఉన్న వాళ్ళతోటీ నిండిఉన్న దృశ్యాలు, ఏ న్యూస్ రీల్ ప్రదర్శనకయినా ఎంతో మించి ఉండేటంత భయంకరంగా ఉన్నాయి.

" పట్టిపట్టి చూడు !" అంటూ ఒక మృదుస్వరం, నా అంతశ్చేతనతో పలికింది." ఇప్పుడు ఫ్రాన్స్ లో నటిస్తున్న ఈ దృశ్యాలు, వెలుగునీడల సయ్యాటలు తప్ప మరేమీకావని గమనిస్తావు. ఇవి విశ్వచలనచిత్రదృశ్యాలు: ఒక నాటకంలో అంతర్నాటకంలా-ఇంతకుముందు నువ్వు చూసిన సినిమా న్యూస్ రీల్ ఎంత నిజమైనదో ఇవి అంత నిజమైనవి, లేదా అది ఎంత అబద్ధమైనదో అవి అంత అబద్ధమైనవి."

నా గుండె ఇంకా కుదుటబడలేదు. దివ్యవాణి ఇంకా చెప్పింది: " సృష్టి వెలుగూ నీడా-రెండూను: లేకపోతే బొమ్మ రావడం అసంభవం. మాయాపరమైన మంచి చెడ్డలు, ఒకదాని తరవాత మరొకటి ఎప్పటికీ ప్రాబల్యం పొందుతూనే ఉంటాయి.ఈ లోకంలో, ఆనందం అనంతంగానే కనక ఉండి ఉంటే, మానవుడు ఎప్పుడయినా మరొకదాన్ని కోరుకుంటాడా ?బాధ లేనిదే, తాను తన నిత్యనివాసాన్ని విడిచిపెట్టానన్న సంగతి గుర్తుచేసుకోడానికి ఒక్క నాటికి ప్రయత్నించడు. బాధ అనేది జ్ఞాపకానికి ములుగర్ర. దీన్ని తప్పించు కొనే ఉపాయం జ్ఞానం. మరణమనే విషాదం అవాస్తవం: దాన్ని తలుచుకొని గడగడలాడేవాళ్ళు , రంగస్థలం మీద జరుగుతున్న నాటకంలో తన మీదికి పేల్చింది ఖాళీ తూటాయే అయినా జడుసుకొని ప్రాణం విడిచే అవివేకపు నటుడిలాంటి వాళ్ళు. నా పిల్లలు వెలుతురు మొలకలు: వాళ్ళు ఎల్లకాలం మాయలోనే నిద్రపోతూ ఉండరు."

నే నంతకు ముందు, మాయను గురించి ధార్మిక గ్రంధాల్లో రాసినవి చదివే ఉన్నప్పటికీ, సొంతగా కలిగిన అంతర్దర్శనానుభవంతోనూ దాంతోబాటూ విన వచ్చిన అనునయ వాక్యాలతోనూ కలిగినంత గాఢమైన అంతర్దృష్టి ఆ గ్రంధాలవల్ల కలగలేదు. సృష్టి అనేది కేవలం, బృహత్తరమైన ఒక చలనచిత్రమే ననీ మన సత్త ( ఉనికి ) దాంట్లో కాకుండా దానికి అతీతమైనదాంట్లో ఉందనీ చివరికి నమ్మకం కుదుర్చుకొన్ననాడు, ఎవరి విలువలయినా సమూలంగా మారిపోతాయి.


నేను ఈ అధ్యాయం రాయడం పూర్తి చేసిన తరవాత, నా పక్కమీద పద్మాసనం వేసుకుని కూర్చున్నాను. నా గదిలో,*, ( ఎన్సినీటస్ లోని సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఆశ్రమంలో) షేడ్లు గల రెండుదీపాలనుంచి వెలుతురు పలచగా పడుతోంది. నా చూపు పైకి లేపుతూ గది కప్పు వేపు చూశాను: అక్కడ చుక్కలు తీర్చినట్టు, సన్నసన్నని ఆవాల వన్నె వెలుగులు కానవచ్చాయి: అవి రేడియం మాదిరి కాంతితో , మిణుకుమిణుకుమంటూ వణుకుతూ ఉండడం గమనించాను. వానజల్లులాంటి అసంఖ్యాకమైన కాంతిశలాకలు, ఒకచోటకూడి పారదర్శక స్థంభాకృతి పొంది మెల్లగా నా మీద పడుతున్నాయి.



వెంటనే నా భౌతికదేహం తన స్థూలత్వాన్ని కోల్పోయి సూక్ష్మ దేహంగా మారిపోయింది. పక్కను అంటీఅంటకుండా, బరువులేని నా దేహం, ఒకోసారి ఎడమవేపుకీ ఒకోసారి కుడివేపుకీ కొద్దికొద్దిగా కదులుతూ తేలుతున్నట్టు అనిపించింది. గది చుట్టూ కలియజూశాను: ఫర్నిచరూ గోడలూ మామూలుగానే ఉన్నాయి: కాని ఆ చిన్న కాంతిపుంజం ఎన్ని రెట్లు పెరిగిపోయిందంటే, గదిలో కప్పు అవుపడకుండా పోయింది. నేను ఆశ్చర్యచకితుణ్ణి అయాను.


" ఇదే బ్రహ్మాండ చలనచిత్ర యంత్రాంగం ." కాంతిలోంచే వెలువడు తున్నట్టుగా , ఒక స్వరం పలికింది. " నీ పక్కబట్టల తెల్లటి తెరమీద తన కిరణాన్ని ప్రసరింపజేస్తూ నీ దేహ చిత్రాన్ని రచిస్తోంది. చూడు, నీ రూపం, కాంతి తప్ప మరేం కాదు !"

నేను నా చేతులవేపు చూసుకుని ముందుకూ వెనక్కూ ఆడించాను. అయినా వాటి బరువు నాకు తెలియలేదు. ఒకానొక ఆనందపారవశ్యం నన్ను ముంచెత్తేసింది. నా శరీరంగా రూపు గడుపుతున్న విశ్వకాంతిస్థంభం, సినిమాహాల్లో ప్రొజెక్షన్ బూత్ లోంచి పారుతూ తెరమీద బొమ్మల్ని రూపు గట్టించే కాంతి కిరణాలకు దివ్యప్రత్యుత్పాదనలా పొడగట్టింది.

నా శరీర చలనచిత్రానుభవం, మసకవెలుతురు గల ప్రదర్శనశాల వంటి నా పడగ్గదిలో, చాలాసేపు పొందాను. అంతకు పూర్వం నాకు అనేక అంతర్దర్శనాలు కలక్కపోలేదు: కాని ఇది వాటన్నిటికన్న విశిష్టమైనది. స్థూల శరీర భ్రాంతి పూర్తిగా తొలగిపోవడంతోనూ, సమస్త వస్తువుల సత్వమూ కాంతేనన్న అనుభూతి గాఢం కావడంతోనూ నేను పైకి, స్పందన శీలమైన ప్రాణాణువుల ( లైఫ్ ట్రాన్ ల ) ప్రవాహం వేపు చూసి :

" దివ్యజ్యోతీ, నా ఈ వినమ్ర దేహ చిత్రాన్ని దయచేసి నీలో కలిపేసుకో : ఎలిజాని జ్వాలారధంలో స్వర్గానికి తీసుకుపోయినట్టు,.
" * Ι Ι కింగ్స్ 2:11 ( బైబిలు ). అని
వినయపూర్వకంగా అన్నాను. ఈ ప్రార్ధన ఎవరినయినా చకితుల్ని చేస్తుందన్నది స్పష్టం : కిరణం అదృశ్యమయింది. నా శరీరానికి మళ్ళీ మామూలు బరువు వచ్చి పక్కలో కూలబడింది. మిరుమిట్లు గొలిపే గది కప్పునున్న దీప సమూహాలు అల్లల్లాడి ఆరిపోయాయి. బహుశా నేను ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం ఇంకా ఆసన్నం కానట్టుంది.

" పైగా నా అహంకారానికి ఎలిజాకి రవ్వంత కోపం కూడా రావచ్చు !" అనుకున్నాను తాత్విక దృష్టితో .

అధ్యాయం:43లోని కొన్ని విషయాలు.........

." కృష్ణభగవానుడు !" నేను బొంబాయిలో, రీజెంట్ హోటల్లో నా గదిలో కూర్చుని ఉండగా , ఆ అవతారమూర్తి దివ్యమంగళరూపం ఒక ఉజ్వల దీప్తితో నాకు దర్శనమిచ్చింది. నేను ఎత్తైన మూడో అంతస్తులో ఉన్నాను: కిటికీ తెరిచి ఉంది : దాంట్లోంచి బయటికి చూస్తూ ఉండగా , వర్ణించశక్యం కాని ఆ అద్భుత దృశ్యం, వీధికి అవతలివేపు ఎత్తయిన ఒక భవనం పై కప్పుమీద హఠాత్తుగా నా కంట పడింది.


చిరునవ్వు చిందిస్తూ, పలకరింపుగా తల ఆడిస్తూ , ఆ దివ్యమంగళవిగ్రహుడు నా వేపు చెయ్యి ఊపాడు. కృష్ణభగవానుడిచ్చిన సందేశాన్ని నేను సరిగా అర్ధం చేసుకోలేకపోవడం వల్ల ఆయన ఆశీః సంకేతంతో అంతర్ధానమయాడు. అధ్బుతమయిన దివ్యానుభూతితో ఉత్తేజం పొందిన నాకు, ఏదో ఆధ్యాత్మిక సంఘటన జరగబోతున్నదన్న అభిప్రాయం కలిగింది.

నా పాశ్చాత్య దేశ యాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది. మళ్ళీ మరోసారి బెంగాల్ వెళ్ళేలోగా బొంబాయిలో కొన్ని బహిరంగ సభల్లో నేను ఉపన్యాసాలివ్వడానికి కార్యక్రమాలు నిర్ణయమయ్యాయి.


1936 జూన్ 19 తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు- అంటే ,
శ్రీ కృష్ణుడు దర్శనమిచ్చిన వారం రోజులకు- బొంబాయి హోటల్లో నేను మంచం మీద కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండగా, ఒకానొక దివ్యకాంతి నాకు బాహ్యస్మృతి కలిగించింది. నేను కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా , నా గదంతా ఒక విచిత్ర ప్రపంచంగా మారిపోయింది :సూర్యకాంతి ఒక దివ్యతేజస్సుగా పరిణామం చెందింది.


ఎదురుగా, రక్తమాంసాలతో నిండిన శ్రీ యుక్తేశ్వర్ గారి విగ్రహాన్ని చూసేసరికి ఆనందతరంగాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేశాయి.

" నాయనా ! "అంటూ వాత్సల్యం ఉట్టిపడేటట్టు పిలిచారు, గురుదేవులు. ఆయన ముఖంలో దివ్యదరహాసం వెలుగుతోంది!

(ఆ తరువాత
శ్రీ యుక్తేశ్వర్ గారు , పరమహంస యోగానంద గారికి ఎన్నో సృష్టి రహస్యాలను తెలియజేస్తారు. ఇలా ఈ గ్రంధంలో ఎందరో గొప్పవారిని గురించి ఎన్నో గొప్ప విశేషాలను గురించి చెప్పటం జరిగింది. .)


ఇందులో , నేను ఏవైనా పొరపాట్లు చేసిన యెడల .... దైవం దయచేసి క్షమించాలని కోరుకుంటూ...

 


No comments:

Post a Comment