koodali

Wednesday, October 18, 2017

నరకచతుర్దశి, దీపావళి సందర్భంగా..

 
నరకచతుర్దశి, దీపావళి సందర్భంగా అందరికి శుభాకాంక్షలండి.

  కామ,క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను అదుపులో ఉంచడానికి ప్రయత్నాలు చేసినప్పుడు, జీవితంలో దీపావళి వెలుగులు విరబూస్తాయి.
..............................
 క్రిందవిషయాలను ఈ పోస్ట్ వేసిన చాలాకాలానికి వ్రాసి, ఇక్కడ వేయటం జరిగింది.
 
ఆయువు అనేది శ్వాస లెక్కను బట్టి ఉంటుందంటారు. ఉదా..ఎక్కువశ్వాసలు తీసుకుంటే త్వరగా ఆయువు తగ్గుతుందని, తక్కువశ్వాసలు తీసుకుంటే ఎక్కువ ఆయువు ఉంటుందట. 
 
ఉదా..తక్కువ శ్వాసలు తీసుకునే తాబేలు ఎక్కువకాలం జీవిస్తుందట. ఎక్కువశ్వాసలు తీసుకునే సింహము..వంటివి తక్కువకాలం జీవిస్తాయట.
 
ఆవేశం, కోపం, టెన్షన్ వల్ల శ్వాస వేగం పెరుగుతుంది.  మనుషులు యోగా నియమాలను పాటిస్తూ నెమ్మదిగా శ్వాసతీసుకునే విధానాలను పాటిస్తే ఆయువు పెరుగుతుందట.

 బ్లూజోన్ ప్రాంతాలలో పర్యావరణం బాగుంటుందట.అక్కడ స్త్రీలు, పురుషులు ఆరుబయట మంచిగాలి లో సూర్యరశ్మి తగులుతూ చక్కగా కొండలు కూడా ఎక్కి పనిచేస్తారట. వాళ్లు ఆరోగ్యంగా చాలా కాలం జీవిస్తున్నారట.
................................
నాకు కొన్ని సందేహాలు కలిగాయి. వ్యాయామం అని.. నడవటం, కొండలెక్కటం..వంటివి చేస్తే ఆరోగ్యం అంటారు. అయితే, అలా నడిచేటప్పుడు, ఎత్తులు ఎక్కేటప్పుడు శ్వాసలు గబగబా వస్తాయి. ఆరోగ్యం సంగతి ఎలాగున్నా, అప్పుడు శ్వాసలు ఎక్కువ ఖర్చవుతున్నాయి కదా..అనిపించింది...
 
 అలా నడిచేటప్పుడు ఏదైనా దైవనామాన్ని పెదవులతో అనుకుంటూ నడిస్తే శ్వాసవేగం తగ్గుతుందేమోనని నాకు అనిపించింది.

 దైవనామాన్ని మనసులో అనుకుంటే శ్వాసవేగం ఎలా ఉంది? పైకి అనకుండా పెదవులతో అనుకుంటే శ్వాస వేగం ఎలా ఉంది? ఇలాంటివి ఎవరికి వారు పరీక్షించుకోవచ్చు.
.............................
 తీర్ధయాత్రలు చేసేటప్పుడు కొండ ఎక్కుతుంటే కొందరు దైవనామాన్ని అనుకుంటారు.
.................
  ప్రాచీనకాలంలో కొందరు ఒక దగ్గర కూర్చుని తపస్సు చేసేవారట. వారిది వేరే విషయం. వారు ఆహారం కూడా సరిగ్గా తీసుకోరు.
..................
 శ్వాస గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే యోగాలో నిపుణులైన గురువుల ద్వారా తెలుసుకుంటే మంచిది.
....................................
వ్రాసిన విషయాలలో ఏమైనా తప్పులుంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 

Monday, October 16, 2017

విద్యార్ధుల ఆత్మహత్యలు...


ఈ మధ్య వరుసగా కొందరు విద్యార్ధుల ఆత్మహత్యలు జరగటం అత్యంత బాధాకరం. 

వీటిని ఆత్మహత్యలు అనేకంటే సమాజం చేసిన హత్యలు అన్నా తప్పులేదు. 

ఇలా జరగటానికి ఎన్నో కారణాలున్నాయి. 

కొందరు తల్లితండ్రులు  తాము పొందలేని వాటిని పిల్లల నెత్తిమీద రుద్దుతున్నారు. 

ఉదా..నేను డాక్టర్ చదవలేకపోయాను కాబట్టి నువ్వు చదవాలి అంటుంటారు కొందరు తల్లితండ్రులు. 

ఇరుగుపొరుగు పిల్లలు పైచదువులు చదివారు కాబట్టి, తామూ గొప్పలు చెప్పుకోవాలంటే తమ పిల్లలూ పై చదువులు చదివి తీరాల్సిందే..అనే మంకుపట్టు కొందరికి . 

ఇరుగుపొరుగు పిల్లలు విదేశాలకు వెళ్లారు కాబట్టి తమ పిల్లలూ వెళ్ళాలి, 

అక్కడ పరిస్థితి ఎలా ఉన్నా కూడా సర్దుకుపోయి చదివి, ఉద్యోగం సంపాదించాలి, అక్కడ నుండి డబ్బు పంపిస్తే ఇక్కడ ఆస్తులు , ఆభరణాలు కొని గొప్పలు చెప్పుకుంటారు.

 పిల్లలు విదేశాల్లో ఎన్ని కష్టాలు పడుతున్నారో? అనేది అంత ముఖ్యమైన విషయం కాదన్నట్లు ఉంది.. కొందరి పెద్దవాళ్ళ ప్రవర్తన.

 ఇలా రకరకాల మనస్తత్వాలు. 

ఇదంతా పిల్లల మంచి కోసమే అంటారు కొందరు. 

అయితే, వారి శక్తిని బట్టి, పరిస్థితిని బట్టి ప్రవర్తించాలి కానీ , మొండిగా ఒకరి అభిప్రాయాలను ఇంకొకరిపై రుద్దటం  మంచిది కాదు.

*****************
 మా ఇంటి దగ్గరలో ఒక ట్యూషన్ ఉంది. అక్కడకు ట్యూషన్ కొరకు బోలెడు మంది చిన్నపిల్లలు వస్తారు.

ఉదయమూ ట్యూషన్, తరువాత స్కూల్,  మళ్ళీ ట్యూషన్..రాత్రికి ఇంటికి తిరిగివెళ్తారు చిన్నపిల్లలు. 

ఆదివారం కూడా ట్యూషన్ చెప్పమని తల్లితండ్రులు వత్తిడి చేస్తున్నారని టీచర్ చెప్పారు. 

 మార్కులు తక్కువ వస్తే పిల్లలను కొట్టయినా చదివించమని టీచర్లతో చెప్పే పేరెంట్స్ కూడా ఉంటారు.

కన్నతల్లితండ్రికే పిల్లలంటే జాలి లేనప్పుడు బయట వాళ్లయిన కాలేజీ వాళ్ళను అని ఏం లాభం.

*******************
ఈ రోజుల్లో డాక్టర్, ఇంజనీరు కాకుంటే, బతకడానికి ఇక వేరే మార్గమే లేదనట్లు భావిస్తున్నారు కొందరు. 

ఈ చదువులకు  సీట్లేమో వేలల్లో ఉంటాయి. పోటీ లక్షల మంది మధ్య ఉంటుంది. 

ఇలాంటప్పుడు పరిస్థితి..  లైఫ్ అండ్ డెత్..  సమస్యలా ఉంటుంది.  

పోటీచదువులంటూ చిన్నతనం నుంచే పిల్లల్ని హాస్టల్స్లో వేయటం జరుగుతోంది. 

హాస్టల్స్లో కొన్నిసార్లు ర్యాగింగ్ వంటివి కూడా ఉంటాయి. అక్కడ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు ? 

హాస్టల్లో ఉండలేను.. అంటే కూడా కొందరు తల్లితండ్రి అర్ధంచేసుకోకుండా హాస్టల్ కు వెళ్లితీరాలి, సర్దుకుపోవాలి, లేకుంటే జీవితం వృధా అంటారు. 

అక్కడ సర్దుకుపోలేక పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు తల్లితండ్రి ఏడవటం మొదలెడతారు.

***********
కొందరు  పిల్లలు మత్తుమందులకు అలవాటు పడుతున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి.  ఈ విషయాల గురించి  కొంతకాలం చర్చలు జరిగాయి. 

 ఇప్పుడు వరుసగా కొందరు ఆత్మహత్యలు జరిగాయి కాబట్టి చర్చలు జరుగుతున్నాయి. మళ్లీ సద్దుమణుగుతుందేమో .... 

ఇప్పుడు ఎవరికీ దేన్నీ పట్టించుకునే సమయం లేదు.

 చాలామంది తల్లితండ్రులకు తమ పిల్లల గురించి పట్టించుకునే సమయమే లేదు.
*******************
కాలేజీల వాళ్ళు తమకు ర్యాంకులే ముఖ్యం అన్నట్లు కాకుండా పిల్లల జీవితాలు కూడా ముఖ్యంగా పిల్లలను చూసుకోవాలి. 

తల్లితండ్రికి దూరంగా , తమను నమ్మి వచ్చిన పిల్లలను చక్కగా చూసుకోవాలి.

 ర్యాగింగ్ వంటివి జరగకుండా కఠినచర్యలు తీసుకోవటం, పిల్లలకు చదువు మధ్యలో ఆటవిడుపు ఇవ్వటం వంటి చర్యలు తీసుకోవాలి.  
**************

ఇక ప్రభుత్వాలు,   ర్యాగింగ్ వంటివి జరగకుండా కఠినచర్యలు తీసుకోవటం, చదువుకోవటానికి ప్రవేశసీట్ల కొరకు పెద్ద ఎత్తున పోటీ లేకుండా కాలేజీలలో సీట్ల సంఖ్య పెంచటం ..వంటి చర్యలు తీసుకోవాలి. 

ఎవరు  ఎన్ని చర్యలు తీసుకున్నా విషాద సంఘటనలు  జరగకుండా ఉండాలంటే   సమాజంలో నైతికవిలువలు పెరగాలి.

*******************
చక్కగా జీవించటానికి ఎన్నో వస్తువులు అవసరం లేదు. 

మన పాతకాలంలో ప్రజలు ఇన్ని వస్తువులు లేకపోయినా చక్కగానే జీవించారు. 

అయితే, ఇప్పుడు ప్రపంచం అనేక  భ్రమల్లో పయనిస్తోంది. 

పరిస్థితి చక్కబడాలంటే, భ్రమలనుండి బయటపడి సరైన దారిలోకి రావటం తప్ప వేరే దారిలేదు.  



Friday, October 13, 2017

పిల్లల హక్కుల గురించి మనం ఏం చేస్తున్నాము ? రెండవ భాగం.

 
ఈ రోజుల్లో  దారుణమైన  వార్తలను  పత్రికలలో  చదువుతున్నాము.  పాఠశాలలో  5  సంవత్సరాల  పాప ను  అత్యాచారం  చేయటానికి  ప్రయత్నించిన  ఉపాధ్యాయుడు,  ప్రక్కింటికి  ఆడుకోవటానికి  వెళ్ళిన  పాప   పట్ల  అత్యాచార  యత్నం  చేసిన  ప్రక్కింటి  వ్యక్తీ ,  బంధువుల  వల్ల  అత్యాచార  యత్నానికి  గురైన  అమ్మాయి.....ఇలా  ఎన్నో  వార్తలు  చదువుతున్నాము.  అభంశుభం  తెలియని      పసిపిల్లల  పట్ల  కూడా  అమానుషంగా  ప్రవర్తిస్తున్నారు.  


ఇవన్నీ  గమనించితే  ఈ  కాలపు  పిల్లల  రక్షణ  పట్ల     సమాజం  ఎంత  నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తుందో  తెలుస్తోంది. 


 ఆ  మధ్య  మీడియాలో  ఒక  విషయం  వచ్చింది.  దేశంలో  ఉత్తర  భాగానికి  చెందిన    ఒక  సెలిబ్రిటి  కూతురు  తాను  చిన్నతనంలో  లైంగిక  వేధింపులకు  గురయినట్లు  తెలియజేసింది.  తనను  వేధింపులకు  గురి చేసిన  వ్యక్తి  తన  తల్లితండ్రులకు  బాగా  తెలిసిన  వ్యక్తేనని,  తరచూ  తమింటికి  వచ్చే  వ్యక్తేనని  పేర్కొంది.


( డిల్లీలో  నిర్భయ  సంఘటన  జరిగిన  తరువాత  ఈ  వార్త  పత్రికలలో  వచ్చింది.  వివరాలు  తెలుసుకోవాలంటే  అప్పటి  పత్రికలను  చూడవచ్చు. )

అయితే  ఇంత  జరుగుతున్నా  అమ్మాయి  తల్లితండ్రి  గమనించలేకపోవటం ...అమ్మాయి  తల్లితండ్రులకు  చెప్పలేకపోవటం  చూస్తుంటే  తల్లితండ్రులకు  పిల్లలకు  మధ్య  పెరుగుతున్న  కమ్యూనికేషన్  గేప్  ఎంతలా  ఉందో  తెలుస్తోంది.  

ఎటువంటి  విషయం  ఉన్నా  భయం,  మొహమాటం  లేకుండా   పిల్లలు  తల్లితండ్రులకు  చెప్పగలిగే  పరిస్థితి  ఉండాలి.


కొందరు  తల్లితండ్రులు   బయటకు  లేక   వేరే   ఊర్లు  వెళ్ళవలసి  వచ్చినప్పుడు  పిల్లలను  ఇతరుల   వద్ద  వదిలి  వెళుతుంటారు. 


  కంటికి  రెప్పలా  కాపాడుకోవలసిన  కన్నబిడ్డలను   పరాయి  వారి  వద్ద  వదిలే  ముందు  ఎన్నో  ఆలోచించాలి.    పసిపిల్లల  పట్ల  జరుగుతున్న  అత్యాచారాల  విషయంలో  తెలిసిన  వాళ్ళ  పాత్రే  ఎక్కువగా  ఉంటోందని  సర్వేల  ద్వారా  వెల్లడి  అయింది.   


అలాగని  అందరినీ  అనుమానించమని  అనటం  లేదు. అలా  అనుమానించటం  ఘోరమైన  తప్పు  కూడా. 


ఇవన్నీ  ఎవరి  పరిస్థితిని  బట్టి  వారు  ఆలోచించుకోవలసిన  విషయాలు.


చెడ్డ  పనులు  చేయటానికి  చెడ్డవాళ్ళే  కానక్కరలేదు.  కొన్నిసార్లు  మంచివాళ్ళ  బుద్ధి  కూడా  విచక్షణను  కోల్పోయే  అవకాశం  ఉంది. 


 ఉదా...  మత్తుపదార్ధాలను  తీసుకున్న  వ్యక్తికి  ఆ  సమయంలో  బుద్ధి    విచక్షణను  కోల్పోతుందని   అంటారు.   ఇప్పుడు  సెల్ ఫోన్స్  లో  కూడా  అసభ్యకరమైన దృశ్యాలు   చూసే  వీలు  వచ్చేసింది. అనభ్యకరమైన  దృశ్యాలు  చూస్తున్న  వ్యక్తిపై  ఆ  దృశ్యాల   ప్రభావం  ఎంతో  ఉంటుంది. 


 మత్తు  పదార్ధాన్ని  తీసుకుని ,  అసభ్యకరమైన    దృశ్యాలను  చూస్తున్న  వ్యక్తికి    ఒంటరిగా  ఉన్న   అమ్మాయి   కనిపిస్తే   విచక్షణను   కోల్పేయే  అవకాశం  ఉంది.  అప్పుడు  ఆ  పిల్ల  పరిస్థితి   ఏమవుతుందో  చెప్పలేం.   ఇలాంటప్పుడు   అఘాయిత్యం  జరగటానికి   చిన్నపిల్ల    లేక  పండుముదుసలి   అనే  అభ్యంతరం  కూడా   ఉండకపోవచ్చు.


 
పెద్దవాళ్ళయిన    ఆడవాళ్ళ  రక్షణ  గురించి  ఎన్నో  జాగ్రత్తలు  చెబుతున్నారు. అభంశుభం  తెలియని  చిన్నారుల    రక్షణ   గురించి  కూడా  ఆలోచించండి.
.........................

విచిత్రం ఏమిటంటే  ఈ మధ్య  కొందరు  ఆడవారు  కూడా  మత్తు  పదార్ధాలను   తీసుకుంటున్నారు . ఈ  మధ్య  ఒక  అమ్మాయి  మత్తులో  రోడ్డుపై  పడి  గొడవ  చేసిన  విషయాన్నీ  మీడియాలో  చూసాము కదా ! 

ఇది  మరింత  ప్రమాదకరం . (Friday, January 31, 2014)






పిల్లల హక్కుల గురించి మనం ఏం చేస్తున్నాము ?

 
ఈ  రోజుల్లో  సమాజ  వ్యవస్థ  గందరగోళంగా  తయారయింది.  పిల్లల  పరిస్థితి  మరీ  అయోమయంగా  ఉంది .  పెద్దవాళ్ళు  తమ  స్వేచ్చ  గురించి,  తమ  హక్కుల  గురించి  మాట్లాడుతున్నారే  గానీ  పిల్లల  హక్కుల  గురించి   మనం  ఏం  చేస్తున్నాము ?

పూర్వం  మగవాళ్ళు  కుటుంబం  కోసం  డబ్బు  సంపాదించటం,  ఇంటికి  కావలసిన  సరుకులను   తేవటం  వంటి  పనులను  చేస్తే ,  స్త్రీలు  ఇంటిని  చక్కదిద్దుకునేవారు.  అయితే  ఇప్పుడు  పరిస్థితి  మారింది. 

ఇప్పటి    స్త్రీలు  ఇంటిపనులతో  పాటు  సంపాదన..  వంటి  బాధ్యతలను  కూడా  నెత్తినేసుకుని  ఎంతో  కష్టపడుతున్నారు.  

ఇదే   సమయమని   కొందరు  పురుషులు  ఇంటి  బాధ్యత  అంతా     స్త్రీల  నెత్తిన  వేసి  తాము  పనుల  నుంచి  తప్పించుకు  తిరుగుతున్నారు . 

ఉద్యోగాలు,  వ్యాపారాలు  చేయటం,   బయటకెళ్ళి  సరుకులను  తెచ్చుకోవటం..వంటి   ఎన్నో   పనుల  వల్ల    స్త్రీలకు  ఇంటిపట్టున  ఉండే  సమయం  తగ్గిపోయింది.

బయట  పనులను  చక్కబెట్టుకుని   తల్లి   ఇంటికి  వచ్చేసరికి    కొన్నిసార్లు  రాత్రి    అయినా  అవవచ్చు. 

ఇలాంటప్పుడు   పిల్లలను    చూసుకోవటంలో  ఎన్నో  ఇబ్బందులు  వస్తున్నాయి.   
..................  

పూర్వపు  ఆడపిల్లలకు   ఎక్కువగా   బయట  తిరగవలసిన  అవసరం  ఉండేది    కాదు.

 ఇప్పుడు   మారిన   వ్యవస్థలో   పిల్లల   జీవనవిధానం  ఎలా  ఉందన్నదానికి...ఒక  ఉదా..

కొంతకాలం  క్రిందట  పసిపిల్లలు  అమ్మ  జోకొడితే  హాయిగా  నిద్రపోయేవారు.  అమ్మ  కబుర్లు  చెబుతూ  
చందమామ  రావే  అంటూ..అన్నం  తినిపిస్తుంటే  చక్కగా   తినేవారు. 

 ఇప్పుడు   అవన్నీ  గతకాలపు  ముచ్చట్లు  అయిపోయాయి.  ( చాలామంది  పిల్లల  విషయంలో .)

ఇప్పుడు  తల్లులు  బిజీ  అయిపోయారు.   పిల్లలను   ఉదయాన్నే   ఆదరాబాదరాగా  తయారుచేసి       ఏడుస్తున్న  పిల్లలను   హడావిడిగా  ఏ  కేర్ సెంటర్  లోనో  వదిలి  పరిగెడుతుంటారు.

  ఇక   ఏ  సాయంత్రానికో  పిల్లలు   ఇంటికి  తేబడతారు.  అప్పటికే  పగలంతా  ఆఫీసు  పనితో  అలసిపోయి  వచ్చిన  తల్లికి ..  ఇంట్లో  పని  చేసుకుని  ఇంకా  పిల్లలతో  తీరికగా  ముచ్చట్లాడటానికి  ఓపిక  ఉంటుందా  ?
...................... 

  పిల్లలు  కొంచెం   పెద్దయి   ప్లే   స్కూల్ కు  పంపబడతారు.  ఆ  స్కూల్స్  మధ్యాహ్నం  వరకే  ఉంటాయి  కాబట్టి  మధ్యాహ్నం  పిల్లలను  స్కూల్  నుంచి   పికప్  చేసుకుని  మళ్ళీ  ఏ  
కేర్ సెంటర్  లోనే  వదలాలి.  

..................

ఇక  పిల్లలు  సాయంకాలం  వరకూ  స్కూలులో  ఉండే  వయస్సు  వస్తుంది. 

  పిల్లలు  స్కూల్  నుంచి  అలసి  ఇంటికి  వచ్చినా  ఇంట్లో  పెద్దవాళ్ళు   ఎవరూ  ఉండరు  కాబట్టి ...  పిల్లలు    కోచింగ్  క్లాసులలో  చేరతారు. 


 వారికి  అవన్నీ  నేర్చుకోవటం  ఇష్టం  ఉన్నా  లేకపోయినా  వారి  ఇష్టానికి  ప్రాధాన్యత   ఇచ్చే  పెద్ద  వాళ్ళు  తక్కువ  కాబట్టి  కోచింగులు  తీసుకోవాలి. 


  ఈ  పోటీ  ప్రపంచంలో  దూసుకుపోవాలంటే  సినిమా  పాటలు,  డాన్సులు  వంటివి  కూడా  నేర్చుకోవాలి   అంటారు .


కోచింగ్  క్లాసుల  తరువాత   ఇంటికి  వచ్చి  తాళం  తీసుకుని , స్నాక్స్  ఏమైనా  ఉంటే  తిని  కాసేపు  రెస్ట్  తీసుకుని    బోర్ గా  అనిపిస్తే   ప్రక్క  ఇంటి  పిల్లలు  తో  ఆడుకుంటారు. 

 ఆటలు  అయిపోయి   పక్క  పిల్లలు   వెళ్ళిపోతే  ..  ఇంటికి  వచ్చి   టీవీ    లేక  కంప్యూటర్  చూడటం  చేస్తారు. 


 నెట్  ఉంటే  ఇక  బోలెడు  సమయం  గడిచిపోతుంది.  నెట్లో  చాలా  చూడవచ్చు.  అవన్నీ  చూస్తుంటే   సమయమే  తెలియదు ?  

.................

ఇక   రాత్రి  సమయంలో  ఉద్యోగాలు  చేయవలసిన   తల్లులకు,   వారి    పిల్లలను  వదిలి  పనికి  వెళ్ళటం  అనేది  పెద్ద  సమస్య.  
 ........................ 

ఈ  కాలంలో  తల్లితండ్రులు  పిల్లలు   కలిసి   ఇంట్లో  గడిపే   సమయం  తగ్గిపోయింది.  ఎవరి  బిజీ  వారిది . ఇలాంటి  వాతావరణంలో  పిల్లలు  అభద్రత  భావంతో   జీవిస్తున్నారు . 

ఇవన్నీ  ఆలోచిస్తే   నేటి  సమాజంలో  పిల్లల  పరిస్థితి  అయోమయంగా  తయారయింది  అనిపిస్తోంది .

(Wednesday, January 29, 2014)





Wednesday, October 11, 2017

ఓం. .అమ్మవారు అయిన ఆదిపరాశక్తి ప్రహ్లాదునికి తెలియజేసిన కొన్ని విషయములు ....


శ్రీ దేవీ భాగవతము ద్వారా తెలుసుకున్న విషయములు .....

ఒక సందర్భంలో, ప్రహ్లాదునితో అమ్మవారు అయిన ఆదిపరాశక్తి.... 

* అన్ని శుభాశుభాలకూ కారణం కాలమే కదా ! వైరాగ్య భావన ఉన్న వారికి ఎక్కడ ఉన్నా ఎప్పుడూ సుఖమే. లోభచిత్తులకు ముల్లోకాలూ చేతికి వచ్చినా సుఖం ఉండదు. ఏ ఫలాలూ సంతృప్తినివ్వవు. అని చెప్పటం జరిగింది.


Monday, October 9, 2017

ఓం.. శ్రీ దేవీ భాగవతము నుండి తెలుసుకున్న విషయములు..


శ్రీ దేవీ భాగవతము  నుండి  తెలుసుకున్న  విషయములు..

వ్యాసులవారు  జనమేజయునికి  తెలియజేసిన  కొన్ని  విషయాలు..


ఒకప్పుడు  ప్రహ్లాదుడు  భూలోకంలో  ఉన్న  తీర్ధాలను  గురించి తెలియజెప్పమని  చ్యవనుని  అభ్యర్ధించాడు.


చ్యవనుడు  అన్నాడు  కదా...
 


హిరణ్యకశిపునందనా! మనోవాక్కాయాలను  శుద్ధిగా  ఉంచుకున్నవారికి  అడుగడుగునా  తీర్ధాలే.  మలిన మనస్కులకు  గంగానది  సైతం  పాపపంకిలమే. 



మనస్సు  పాపరహితంగా  పరిశుద్ధంగా  ఉంటేనే  ఏ  తీర్ధాలైనా  పావనాలయ్యేది.  గంగానదికి  ఇరువైపులా  పొడుగునా  ఎన్నెన్నో  గ్రామాలున్నాయి. నగరాలు ఉన్నాయి.  అడవుల్లో  గిరిజనావాసాలు ఉన్నాయి.


ఇన్ని జాతులవారూ  రోజూ  ఆ గంగలోనే  ముప్పొద్దులా   మునుగుతున్నారు.  బ్రహ్మసమానమైన  ఆ పవిత్రజలాన్నే  గ్రోలుతున్నారు.  అయితేనేమి  ఒక్కడంటే ఒక్కడు  ముక్తి  పొందాడా? 



విషయలంపటులు  వెళ్ళి  ఎంతటి  పవిత్రతీర్ధంలో  మునిగినా  ఫలితం  శూన్యం. అన్నింటికీ  మనస్సే  ముఖ్యం.  దాన్ని  శుద్ధి  చేసుకుంటే  అన్నీ  శుద్ధి  పొందుతాయి. 


అలా  కాకుండా తీర్ధయాత్రలకు  వెళ్ళి  అక్కడ ఆత్మవంచన - పరవంచనలు చేస్తే ఆ చుట్టుకునే పాపానికి అంతు ఉండదు.



ఇంద్రవారుణం(పెదపాపరకాయ) పక్వమైనా  ఇష్టం  కానట్టే  దుష్టస్వభావుడు దివ్యతీర్ధంలో  కోటిసార్లు  మునిగినా  పవిత్రుడు  కాలేడు. 


అందుచేత  అన్నింటికంటే  ముందు  మనశ్శుద్ధి  ఉండాలి. అది  ఉంటేనే  ద్రవ్యశుద్ధి  సిద్ధిస్తుంది.  అటుపైని  ఆచారశుద్ధి.  ఇవన్నీ  ఉన్నవాడికే  తీర్ధం  తీర్ధమవుతుంది.  లేకపోతే  అదొక  రేవు  మాత్రమే.  అక్కడ  ఏవేవి  ఎంతెంత  చేసినా  "శుద్ధ దండుగ " . 


నిజానికి  వీటన్నింటికంటే  భూతదయ  చాలా  గొప్పది.

 అయినా నువ్వు  తీర్ధాలను  గురించి  అడిగావు  కనక  వాటినే  చెబుతాను  - విను. భూలోకంలో  లెక్కలేనన్ని   తీర్ధాలున్నాయి. 


వాటికేంగానీ  ఉత్తమోత్తమమైన  తీర్ధరాజం  ఒక్కటేఒక్కటి -   నైమిశంలో  చక్రతీర్ధం. దాన్నే  పుష్కరతీర్ధమని  కూడా  అంటారు......అంటూ తెలియజేశారు.



Monday, October 2, 2017

మొక్కులు తీర్చగలమో ? లేదో? ..మరికొన్ని విషయాలు..

 
 
కొందరు కష్టాలలో ఉన్నప్పుడు దేవునికి ఎన్నో మొక్కులు మొక్కుకుంటారు.

 ఉదా..కష్టాలు తీరితే,  ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను ..అని మొక్కుకుంటారు. 

అయితే, ఆ మొక్కులు తీర్చటం కొన్నిసార్లు సులభంగా సాధ్యం కాకపోవచ్చు. 


గభాలున ఎన్నో  అనుకోవటం .. ఆ తరువాత ఆలోచించటం కన్నా.. ముందే ఆలోచించుకోవటం మంచిది. 


ఎన్ని కష్టాలు వచ్చినా, క్లిష్టమైన మొక్కులు మొక్కుకోవటం కన్నా.. దైవప్రార్ధన చేసుకోవటం మంచిది. 


ఇంకా, సమాజానికి తనకు చేతనైనంత మంచిపనులు చేయవచ్చు. 


*********************
అనుకోని సంఘటనలు అప్పుడప్పుడు కొన్ని జరుగుతుంటాయి. 

ఉదా..దేవాలయానికి వెళ్తూ దారిలో పువ్వులు, పండ్లు కొందామనుకుని,  దేవాలయం వద్ద కొనవచ్చులే.. అని దేవాలయం వద్దకు వెళ్లిన తరువాత చూస్తే అక్కడ మనం కొనాలనుకున్న పువ్వులు, పండ్లు ఉండకపోవచ్చు. 

అప్పుడు తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళి కొనలేకపోవచ్చు. ఇలాంటప్పుడు సంశయంగా ఉంటే కొంత సొమ్మును హుండీలో సమర్పించవచ్చు లేక క్షమించమని దైవాన్ని ప్రార్ధించవచ్చు. 

ఉదా.. ఎప్పట్నించో చేయాలనుకున్న పూజ చేయాలనుకుని , అన్నీ సిద్ధం చేసుకుని పూజ తరువాత..హమ్మయ్య.. ఇప్పటికి పూజ పూర్తిచేయగలిగాం.. అనుకున్నప్పుడు, 

తరువాత తెలుస్తుంది. దూరపు బంధువు మరణించిన విషయం, అదే సమయంలో పూజ చేసామని. 

అలాంటప్పుడు పూజ చేయటం జరిగిందని తెలిసినప్పుడు సంశయం అనిపిస్తుంది. 

ఇంతకీ పూజ చేసిన ఫలితం లభిస్తుందా ? లేదా ? తిరిగి పూజ చేయాలా ? వంటి అనేక సందేహాలు కలగవచ్చు. తిరిగి అలా పూజ చేయాలంటే కష్టం కావచ్చు. 

కొందరేమంటారంటే , మళ్లీ పూజ చేయాలంటారు. 

కొందరేమో అవసరం లేదు , బంధువుల మరణం గురించి మీకు తెలియక పూజ చేశారు కాబట్టి, తిరిగి పూజ చేయనవసరం లేదంటారు.  ఎన్నో సందేహాలుంటాయి. 

కొన్ని సంవత్సరాల క్రిందట నాకు ఇలాంటి సంఘటన అనుభవంలోకి వచ్చింది. ఇలాంటివి గమనిస్తే ఏమనిపిస్తుందంటే,  

కొన్నిసార్లు మనం చేయగలిగింది ఏమీ ఉండదు. ఇంతే శక్తి ఉంది,  క్షమించమని దైవాన్ని ప్రార్ధించుకోవాలి అంతే.


మనం చేయాలనుకున్న పని చేయగలమో ? లేదో? తెలియదు. అందువల్ల, కుదిరితే..చేస్తాను..అనుకోవటం మంచిది.

 ప్రతిపనికీ ముందు అలా అనుకోవటం కష్టం కాబట్టి..ఒకేసారి అనేసుకోవచ్చు. జీవితంలో ఏ పనైనా.. కుదిరితే చేస్తాను.. అనుకోవచ్చేమో .. అనిపిస్తోంది.