koodali

Wednesday, June 5, 2013

సైన్స్... శాస్త్రీయత మరియు కొన్ని విషయాలు.


 పూర్వం  వాళ్ళు  ప్రతి  చిన్న  అనారోగ్యానికి  వెంటనే   హాస్పిటల్స్ కు  పరిగెత్తేవారు  కాదు. 

  ఇంట్లోని  బామ్మగారు  మొదలైన  పెద్దవాళ్ళు  వంటింట్లోని  పదార్ధాలను  కలిపి  మందుగా  ఇచ్చేవారు.  అవి  వేసుకుంటే  కడుపునొప్పి,  అజీర్ణం  వంటి  ఎన్నో  అనారోగ్యాలు  తగ్గిపోయేవి.

 బామ్మలు  పెద్ద  చదువులు   చదవకపోయినా  తరతరాలుగా  వారసత్వంగా   నేర్చుకున్న  చిట్కా  వైద్యంతో  కుటుంబసభ్యుల  రోగాలను  తగ్గించేవారు.

  ఈ  రోజుల్లో   కూడా    కొందరు  వ్యక్తులు   తాము    వారసత్వం  ద్వారా  నేర్చుకున్న  ప్రాచీన  వైద్యం  ద్వారా   ప్రజలకు    చక్కటి    వైద్య  సహాయాన్ని  అందిస్తున్నారు.

 డబ్బు  ఆశలేకుండా  సేవాదృక్పధంతో  ప్రజలకు   వైద్యాన్ని  అందించే  మంచి వాళ్ళను  అనుమానించటం సబబు కాదనిపిస్తుంది .

.....................................


 ఈ  రోజుల్లో   ప్రతిదానికి   సైన్స్,  శాస్త్రీయత  అంటున్నారు.  అలా  ఆలోచిస్తే   ఆధునిక  సైన్స్ కు  అంతుపట్టని  విషయాలెన్నో  ఉన్నాయి.

ఉదా.... కొందరు  సామాన్యులు  కేవలం  తమ  పళ్ళతో  పెద్ద  లారీని   కొంతదూరం  లాగటం,  విమానాన్ని  జుట్టుకు  కట్టి  లాగటం  చూస్తూనే  ఉన్నాము. 
ఆధునిక సైన్స్,  శాస్త్రీయత  ప్రకారం  ఆలోచిస్తే   ఈ  విధంగా  లాగటం  అసాధ్యం  కదా !  

    ఆధునిక సైన్స్,  శాస్త్రీయత  ప్రకారం  .... జుట్టుతో    లేక  పళ్ళతో  భారీ  వాహనాన్ని  లాగాలని  ప్రయత్నిస్తే  జుట్టు  లేక  పళ్ళు  కుదుళ్ళతో  సహా  ఊడి  వస్తాయి. 

అయితే  కొందరు  వ్యక్తులు  ఈ  విధంగా  లాగి  చూపిస్తున్నారు  కదా  !  వాళ్ళెలా  భారీ  వాహనాలను  లాగగలుగుతున్నారు  ?  ఈ విషయాలను ఆధునిక   సైన్స్, శాస్త్రీయత ప్రకారం  ఎలా  నిరూపించగలం ?
 
 ఇవన్నీ  గమనిస్తే    ఏమనిపిస్తుందంటే , శారీరికశక్తి  కన్నా  మానసిక  శక్తి  చాలా  గొప్పది  అనిపిస్తుంది.  


  ఇలాంటి  సాహసాలు  చేసేవారు  మనలాంటి  మామూలు  వ్యక్తులే.  కానీ,   వాళ్ళు  తమ  యొక్క  గట్టి  సంకల్పశక్తి  మరియు  పట్టుదల  వల్ల  ఇలాంటి  అసాధ్యాలను  సుసాధ్యం  చేస్తున్నారనిపిస్తుంది.  


 ఇంకా   ఏమనిపిస్తుందంటే ,   ఈ  కాలంలోని  సామాన్య  వ్యక్తులే  తమ  సంకల్పశక్తితో  కృషి  చేసి  ఇలాంటి  సాహసాలు  చేయగలుగుతున్నప్పుడు  .....  పూర్వకాలపు  మహర్షులు  గొప్ప  తపస్సులు  చేసి  పొందిన   శక్తితో  ఎన్నో  అసాధ్యాలను  సుసాధ్యాలు  చేసేవారనటంలో  ఎటువంటి  సందేహమూ  లేదు.
 

   ఆధునిక  భౌతికవాద  శాస్త్రవేత్తలు  మానవ  శరీరం  గురించి  కొన్ని  విషయాలను   తెలుసుకోగలిగారు  కానీ  మనిషి  మనస్సు  గురించి,   అది  పనిచేసే  విధానం  గురించి   ఆధునిక  భౌతికవాద  శాస్త్రవేత్తలకు  తెలిసింది  చాలాచాలా  తక్కువ.


  అందువల్ల  మనం  తెలుసుకోవలసింది  ఏమిటంటే ,   దైవం సృష్టించిన  సృష్టిలోని  సైన్స్  గురించి   మనకు  తెలిసింది  సముద్రంలో  నీటిబొట్టంత  అని...  ప్రాచీనులకు  తెలిసిన... ఆధునికులకు  తెలియని ...  సైన్స్  ఇంకా  ఎంతో  ఉంది  అని.  
....................................


ఈ  రోజు  పర్యావరణ  దినోత్సవమట. 


ఆసక్తి  ఉన్నవారు  ఈ  క్రింది  లంకెను  దయచేసి    చదువుతారని  ఆశిస్తున్నాను.
..

..... పసుపు, వేప, వంటివి తరతరాలనుంచి వాడుతున్నా కూడా...


Monday, June 3, 2013

హనుమజ్జయంతి శుభాకాంక్షలు మరియు గోవుల గురించి కొన్ని విషయాలు........

అందరికి  హనుమజ్జయంతి  శుభాకాంక్షలండి . 
.......................................

 ఈ  మధ్య   మేము  ఊరు  వెళ్ళినప్పుడు  దైవదర్శనం  కోసం  ఒక  దేవాలయానికి  వెళ్ళాము. 

 అది   గొప్ప పుణ్యక్షేత్రం.  అక్కడ   గోవులు  ఉండే  ప్రదేశానికి  వెళ్ళాము.   గోశాల  వద్ద  చాలా  గోవులున్నాయి.

 ఇప్పుడు  వాతావరణం  కొంచెం  చల్లబడింది.  కానీ   మేము  వెళ్ళినరోజున   రోజు  ఎండగా   ఉంది.


  కొన్ని  గోవులకు  షెల్టర్  సదుపాయం  ఉంది.  కానీ ,  చాలా  గోవులు  ఎండలోనే  ఉన్నాయి.  వాటికి  షెల్టర్  సదుపాయం  లేదు. 


మధ్యాహ్నానికి  ఎండ  బాగా  వస్తే  ఆ  గోవుల  పరిస్థితి  ఏమిటో  పాపం ? అనిపించింది.  


 మనం   కొద్దిసేపు  కూడా  ఎండలో  ఉండలేక  పోతున్నాము  కదా  !  నోరులేని  మూగజీవులను   ఇలా  బాధించటం  మంచిది  కాదు. 

షెల్టర్  లేకుండా  తొట్టెలో  నీళ్ళు  పెట్టినా  ఎండవేడికి  తొట్టెలో  నీళ్ళు  వేడెక్కిపోతాయి. అందువల్ల  షెల్టర్   ఎంతో అవసరము. . 


భక్తులు  సమర్పించిన   గోవులకు  చక్కటి  సౌకర్యాలు  కల్పించితే  దైవం  యొక్క  అనుగ్రహం  లభిస్తుంది. 


*   భక్తులు  సమర్పించే  గోవులకు   సరైన   సౌకర్యాలను  కల్పించకుండా  బాధపెడుతూ ......    దైవపూజలను  అట్టహాసంగా    నిర్వహించినంత  మాత్రాన  దైవం  యొక్క  అనుగ్రహం  లభిస్తుందా  ?


 ఏమిటో  లోకం  పోకడ  చిత్రవిచిత్రంగా  ఉంది.


    కానుకల  రూపంలో  ఎంతో  ఆదాయం  వస్తున్నా  కూడా   గోవులకు  సరైన  సదుపాయాలను  కల్పించటంలో  నిర్లక్ష్యం  ఎందుకు  జరుగుతోందో ?  అనిపించి  బాధనిపించింది. 


 దేవాలయాలకు    సమర్పించిన  గోవులను  నిర్లక్ష్యం   చేయటం  మహాపరాధం .

 గోవుల  పట్ల  సరైన  శ్రద్ధ  తీసుకోని  పరిస్థితులున్నప్పుడు   దేవాలయాలకు  గోవులను  సమర్పించే  విషయంలో  భక్తులు  పునరాలోచించుకోవటం  మంచిదనిపిస్తుంది.  మన  కోరికల కోసం  వాటినెందుకు  బాధపెట్టటం  ?

..............................

పూర్వం  దేవాలయాలలో  యజ్ఞయాగాదిక్రతువులు  చేయటానికి  మరియు  ప్రసాదాల  తయారీలో  ఆవునేతిని  విరివిగా  వినియోగించేవారు..  ఈ  కార్యక్రమాల  కోసం  దేవాలయాల  గోశాలలలో  పెంచే    ఆవు పాలను,  నేతిని  ఉపయోగించేవారనిపిస్తుంది.

 ఈ  రోజుల్లో  అయితే  ఆవు  నెయ్యి  మార్కెట్లో  అమ్ముతున్నారు. ఆ విధంగా  ఆవునేతిని  బయట  కొనుగోలు  చేసి  దేవాలయాల  కార్యక్రమాలలో  ఉపయోగించే  అవకాశం  కూడా  కలిగింది.


 అయితే  మార్కెట్లో  కొనే  వస్తువులలో  కొన్నిసార్లు  కల్తీ  జరిగే  అవకాశం  కూడా  ఉంది.  పవిత్ర  ప్రదేశాలైన   దేవాలయాల  గోశాల
లో  పెంచే  గోవుల  ద్వారా  లభించే   పాలను,  నేతిని  దైవకార్యక్రమాలకు  వినియోగిస్తే  మరింత  శ్రేష్టంగా  ఉంటుందనిపిస్తుంది.


వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.



Friday, May 24, 2013

ఓం..ఊరు వెళ్ళినప్పుడు కుండీలలోని మొక్కలకు నీటిని అందించటం........


ఓం
శ్రీ  లక్ష్మీసమేతనరసింహస్వామివారికి  వందనములు.
.................................


కుండీలలో  మొక్కలను  పెంచటమంటే ..... పంజరంలో  పక్షులను  పెంచినట్లు,  వాటిని  స్వేచ్చగా  పెరగనీయకుండా  అడ్డుకోవటం  అని  నాకు   అనిపిస్తుంది.  మా  వద్ద  చాలా  తక్కువ  సంఖ్యలో  మొక్కల  కుండీలున్నాయి.  ఆ  విషయం  అలా  ఉంచితే ,

 కుండీలలో  మొక్కలను  పెంచుకునేవారు  ఏదైనా  ఊరు  వెళ్ళవలసివస్తే  మొక్కలకు  నీరు  పోయటం  ఎలా  అనేది  పెద్ద  సమస్య.

 కొందరు  నీళ్ళు  బాగా  పోసి ,  ఎండవేడికి   తడి  ఆరిపోకుండా  మొక్కల  మొదటిలో  కొబ్బరి  పీచు,  స్పాంజ్ ....  వంటివి  వేస్తారు.


నేను  ఏం  చేస్తానంటే  ఒక  బకెట్లో  నీరు  పోసి  మట్టి  కుండీని  అందులో  పెడతాను.   అప్పుడు   ఆ  నీటిని  కుండీ  గోడల  ద్వారా  లేక  కుండీకున్న    చిన్న  కన్నం  ద్వారా  మొక్కల  వేళ్ళు  పీల్చుకుంటాయి. 

 ఇలా  చేయటానికి   మట్టి  కుండీలు  చాలా  అనుకూలంగా  ఉంటాయి. సిమెంట్  కుండీలు  అంత  అనుకూలంగా  ఉండవు.   ( సిమెంట్  కుండీల గోడలు  తడిని  పీల్చుకోవు  కదా  !

  ఊరు  వెళ్ళినప్పుడు  బాత్రూంస్ లోని  బకెట్స్  ఖాళీగా  ఉంటాయి   కదా  !    ఒక్కొక్క  బకెట్లో  ఒక  కుండీని  ఉంచుతాము. 

కుండీని  బకెట్లో  పెట్టిన  తరువాత  కుండీ  అంచుకు  కొంచెం  కిందవరకు  నీటిని  పోయాలి. 

 (  ఇలా  నీరు  పోసినప్పుడు   కుండీ  అంచు  వరకు  నీరు  పోయాలి.  అంతే. కుండీ  నీటిలో  మునిగిపోయేవరకూ  నీటిని  పోయకూడదు. )


 ఇలా  ఏర్పాటుచేసిన  బకెట్ + కుండీలను  నీడలోనే  ఉంచాలి.  ఎండలో  పెడితే  మనం  ఊరినుండి  వచ్చేసరికి    బకెట్లోని  నీరు  ఆవిరైపోయి  మొక్కలు  ఎండిపోతాయి.   అందువల్ల  నీడలోనే  ఉంచాలి. 
చలికాలంలో  అయితే  నీరు  త్వరగా  ఆవిరైపోదు .
 
 
 ఇలా  చేయటం  వల్ల  ఊరు  వెళ్ళి  వారం  తరువాత  వచ్చినా  మొక్కలు  చక్కగా  ఉన్నాయి.  అప్పుడు  కుండీని   బయటకు  తీసి  బకెట్లోని  నీటిని    తీసివేయాలి.

.................... 


పై  పద్ధతిలో   సిమెంట్  కుండీలలోని  మొక్కలకు  నీరు  అందించవచ్చా  ?  లేదా  ?  అన్నది  నాకు  తెలియదు. 

అయితే  సిమెంట్  కుండీలకు  కూడా  అడుగున  చిన్న  రంధ్రం  ఉంటుంది  కదా  ! ఆ  రంధ్రం  ద్వారా  నీటిని  వేర్లు  పీల్చుకుంటాయేమో  ?    మా  ఇంట్లో  సిమెంట్  కుండీలు  లేవు. 

..................................

మట్టి  కుండీలలో  మొక్కలను  పెంచితే   మొక్కలకు  చల్లగా  ఉంటుంది.   ఈ  రోజులలో    ఎక్కువమంది   సిమెంట్  కుండీలను  వాడుతున్నారు. 

(  పగలకుండా  గట్టిగా   పడుంటాయని .)  
............................

 సిమెంట్  కుండీలు,  సిమెంట్  ఇళ్ళు  వేడిగా  ఉంటాయి.   ఈ  రోజులలో  రోడ్లను  కూడా  సిమెంట్ తో  వేస్తున్నారు. 

వర్షం  పడితే  నీరు    భూమిలో  ఇంకటానికి   మట్టి  నేల    ఎక్కువగా  కనిపించకుండా  సిమెంట్  రోడ్లను  వేసేస్తున్నారు.   టెక్నాలజీ  పెరిగిపోయింది  కదా  ! మరి.

...........................................


అడుగు  భాగం  పోయిన  మట్టి  కుండీ  .......... 

 ఒకసారి  నేను  ఊరు వెళ్ళి  వచ్చిచూస్తే,   అన్ని  కుండీలలోని   మొక్కలు  చక్కగా  ఉన్నాయి.   ఒక కుండీలోని  మొక్క  మాత్రం కుళ్ళిపోయినట్లు  అనిపించింది. 

ఇదేంటి  చెప్మా  నీరు  ఎక్కువైపోయిందా  ?  అనుకుని  కుండీని  పరీక్షిస్తే  ఆ  కుండీ  యొక్క  అడుగు భాగం    కొంతకాలం  క్రిందట  పగిలిపోయిందన్న  విషయం  నాకు  గుర్తు  వచ్చింది.  


అప్పుడు   నాకు  తెలిసింది  ఏమిటంటే .... అడుగు  భాగం  పోయిన  మట్టి  కుండీలను   నీటిలో  పెడితే  నీరు  ఎక్కువై   మొక్క  కుళ్ళిపోయే  అవకాశం  ఉంది  అని. 

 అందువల్ల  అడుగుభాగం  పోయిన  కుండీని  నీళ్ళ  బకెట్లో  పెట్టాలంటే  కుండీకి  క్రింద  ఏదైనా  ప్లేట్  ఉంచాలి.  

.........................................

వడదెబ్బకు   మరణించిన  వారి  గురించి   వార్తలను    చూస్తుంటే  చాలా బాధగా అనిపిస్తోంది. ఏమిటో జీవితం?  ప్రకృతి  ముందు  మనిషి  ఎంత  ?  అనిపిస్తోంది.


Wednesday, May 22, 2013

ఎండలు .. మొక్కలకు చల్లటి నీళ్ళు .

 
ఎండలు  విపరీతంగా  ఉన్నాయి.  ఎంత  వేడిగా  అంటే,  నీళ్ళకోసం  పంపు  తిప్పితే  చేయి  చురుక్కుమనేంతగా....   

 ఇలాంటప్పుడు  ఇళ్ళల్లో  పెంచుకునే  మొక్కలకు  నీరు  పోయాలంటే  కొన్ని   జాగ్రత్తలు  తీసుకోవాలి.   

వేసవికాలంలో  మొక్కలకు  నీరు  పోయాలంటే  ఉదయం  సూర్యుని  వేడి  పెరగకముందే  పోయాలి.  సాయంత్రం   వాతావరణం  కొంచెం  చల్లబడిన  తరువాత  పోయాలని పెద్దలు  తెలియజేసారు. 


   వేసవికాలంలో  .... చెరువుల్లో,  నూతిలో  నీరు  చల్లగా  ఉంటుందో ? వేడిగా  ఉంటుందో?   నాకు  తెలియదు  కానీ, 

 డాబాపైన  కట్టిన  నీళ్ళ టాంకుల  ద్వారా  పంపుల్లో  వచ్చే  నీళ్ళు   మాత్రం  చాల  వేడిగా ఉంటాయి . 

    వేసవికాలంలో మొక్కలకు  నీరు  పెట్టాలంటే   కొన్ని  జాగ్రత్తలు  తీసుకోవాలి. 

 పంపులకు   పైప్  తగిలించి ,  వచ్చే  వేడినీటిని   డైరెక్ట్  గా  మొక్కలకు  పట్టకూడదు.  

  ఇప్పటి  ఎండలకు  సాయంత్రం  6  గంటలకు  కూడా  పంపుల్లో  వేడినీరే  వస్తోంది.  

 అందువల్ల   ఏం  చేయాలంటే ..  ఉదయం  ఎండ  పెరగకముందే   మొక్కలకు  నీరు  పెట్టి , ఇంకొక  బక్కెట్ తో  నీరు  పట్టుకుని  నీడలో  ఉంచుకోవాలి.  ఆ  చల్లటి  నీటిని  సాయంత్రం  మొక్కలకు  పోయాలి. 

 లేకపోతే  మధ్యాహ్నం  ఒక  బకెట్ తో  నీరు  పట్టుకుని  నీడలో  ఉంచితే  సాయంత్రానికి  ఆ   వేడి   నీరు  చల్లగా  అవుతాయి.   అప్పుడు  ఆ  నీటిని  మొక్కలకు  పోయాలి.  వేసవికాలం  అంతా  ఇలా  చేయాలి.

 
...............

ఎండలు  ఇలా  పెరుగుతూ  పోతే .. కొంతకాలానికి  ధృవ  ప్రాంతాల్లో  మంచు  కరిగి  సముద్రనీటిమట్టాలు  పెరిగిపోతాయట.  సముద్రనీటిమట్టం  అతికొద్దిగా  పెరిగినా  ప్రపంచంలోని   ఎన్నో  నగరాలు  మునిగిపోతాయట.


 ( పర్యావరణకాలుష్యం  ఇదే  తీరులో  ఉంటే, మంచు  కరిగి   సముద్రనీటిమట్టం  పెరగటానికి   50  సంవత్సరాల  కన్నా  ఎక్కువకాలం  పట్టదంటున్నారు . ) 

 హిమాలయాలలో  మంచు  కూడా  కొద్దికొద్దిగా  కరుగుతోందంటున్నారు.

 అభివృద్ధి పేరుతో  మానవులు  పర్యావరణాన్ని    పాడుచేయటం  వల్ల  వాతావరణంలో  ఎన్నో  మార్పులు  వస్తున్నాయి.  వాటి  ఫలితమే  విపరీతమైన  ఎండలు,  విపరీతమైన  వరదలు.


కొంతకాలం  క్రిందట  రెంటచింతల  వంటి  కొన్ని  ప్రాంతాల్లో  మాత్రమే  వేడి  40  డిగ్రీలు  దాటేది.  ఈ  సంవత్సరం  మన  రాష్ట్రంలోని  చాలా  ప్రాంతాల్లో  వేడి  40  డిగ్రీలు  దాటిపోయింది. 


 మానవుల  అవసరాలు  పెరుగుతున్న  కొద్దీ   ..   ఎండలు,  వరదలు ,  పొల్యూషన్....పెరిగిపోతున్నాయి .


 కూర్చున్న  కొమ్మనే  నరుక్కుంటూ .. ..ఇదే    గొప్ప అభివృద్ధి .    అని  సంబర పడిపోతున్న  మానవుల  ప్రవర్తనకు  కాలమే  తగిన తీర్పును  చెబుతుంది .



Monday, May 20, 2013

దైవం..జీవులు..కర్మ సిద్ధాంతము..జన్మపరంపర..మరియు..కొన్ని సంగతులు .

ఓం
 వాసవీ  కన్యకా పరమేశ్వరీ  దేవి  జయంతి  సందర్భముగా శుభాకాంక్షలు.
   వాసవి కన్యకా పరమేశ్వరీదేవినగరేశ్వర  స్వామి వార్లకు  వందనములు.
 అనఘాదేవీదత్తాత్రేయస్వామివార్లకు  వందనములు
శ్రీ  పాద శ్రీ వల్లభస్వామి వారికి  వందనములు.
శ్రీ  పాద శ్రీ వల్లభ సంపూర్ణ  చరితామృతము .... గ్రంధములో  వాసవీ  కన్యకా పరమేశ్వరీ దేవి  గురించి అనేక  వివరములున్నాయి.

.........................................


ఇంతకుముందు  ఒక  టపాలో  దైవానికి ఆది, అంతము లేవు ...అనే  విషయం  గురించి  చెప్పుకున్నాము.


ఆండాళ్  అమ్మవారి  చరిత్ర  ( శ్రీ గోదాదేవి  శ్రీ రంగనాధుల కల్యాణం )
సినిమా  ద్వారా  తెలుసుకున్న  కొన్ని  విషయములు....   


  ఒక  రాజుగారు  నాస్తికులు.

ఆ  రాజు  ,  ఆస్తికులను .........  దైవం  గురించి   కొన్ని    ప్రశ్నలు  అడుగుతారు.  


సృష్టికర్త  అయిన  దైవాని  కంటే  ముందు  ఏమున్నది ?  అనే  అర్ధం  వచ్చేటట్లు  ప్రశ్న  అడుగుతారు.

 
అప్పుడు ,  ఆండాళ్  మాతకు  తండ్రి  అయిన  విష్ణుచిత్తుల  వారు   రాజుతో ...  ఒకటి  అనే  అంకెకు  ముందు  ఉన్న  అంకె  పేరు  చెప్పమంటారు.

 అప్పుడు  రాజు  చెప్పలేకపోతారు. 
(  ఒకటి  అనే  అంకెకు  ముందు  ఏ  అంకె  లేదు  కదా  !  )
............................................


 విష్ణుచిత్తులవారు  చెప్పిన    విషయాన్ని  గమనిస్తే,  మనకేం  తెలుస్తుందంటే,  నిజమే.  ఒకటి  అనే  అంకెకు  ముందు  ఏ   అంకె   లేదు.

అలాగే,  సంఖ్యలలో  ఆఖరి  సంఖ్య  ఏది  ?   అనే  ప్రశ్నకు  కూడా  మనకు   జవాబు  తెలియదు.

ఎందుకంటే,  సంఖ్యలను  అలా  లెక్కవేసుకుంటూ   వెళ్తే    ఒకదానితరువాత  ఒకటి  అంతం  లేకుండా  అలా  వస్తూనే  ఉంటాయి  కదా  !


ఇదంతాగమనిస్తే, 1,2,3,4,...అనే  వాటికి  ఆది, అంతమూ  అనేవి  లేవు . అని  మనకు   తెలుస్తుంది.

 అలాగే ,   దైవానికి  ఆది,  అంతమూ  అనేవి  లేవు . అని కూడా   మనకు  తెలుస్తుంది.


ఆది,  అంతమూ  లేక   అంతటా  వ్యాపించి  ఉన్న  శక్తినే  దైవమని  ఆరాధిస్తారు.  ఆస్తికులు. 

....................................

  " Matter and energy cannot be created or destroyed "  సిద్ధాంతం  ప్రకారం  ............ 


 మంచు  గడ్డ  నీరులా  మారుతుంది.  నీరు  ఎండ   వేడికి  ఆవిరిగా  మారుతుంది.    నీటి ఆవిరి     తిరిగి    నీరుగా  మారి  వర్షంలా    కురుస్తుంది...... అని  ఆధునిక  శాస్త్రవేత్తలు  తెలియజేసారు. 

 అయితే    " Matter and energy cannot be created or destroyed
"   సిద్ధాంతం  ప్రకారం  జీవులు  ఏమవుతారో ..  ఆదునిక  శాస్త్రవేత్తలు  చెప్పలేదు.

 అయితే    ఈ  విషయాల  గురించి  ప్రాచీనులు  చక్కగా  తెలియజేసారు. 

ప్రాచీనులు  తెలియజేసిన  ...."    కర్మలను  బట్టి " జన్మపరంపర  విధానాన్ని "  "Matter and energy cannot be created or destroyed ".....    ప్రకారం   అన్వయించి  చూస్తే    జన్మలు,  పునర్జన్మలు  ఉండే  మాట  వాస్తవమే  అని  తెలుస్తుంది .


ఉదాహరణకు...  ఎవరైనా  వ్యక్తి   యొక్క    జీవితం  ముగిసినప్పుడు ,   పంచభూతాలతో  తయారైన    శరీరం  పంచభూతాల్లో  కలిసిపోతుంది.


  జీవించి  ఉన్నప్పుడు   మనిషి  మనస్సుతో  ఎన్నో  ఆలోచనలు  ( పనులు ) చేస్తాడు.  అంటే,  మనస్సు  కూడా  శక్తే  కదా  !....


మరణించిన  వ్యక్తి  యొక్క   మనస్సు ( ఆత్మ ) మరో  శరీరాన్ని  ధరిస్తుంది.   మరో  జన్మనెత్తుతుంది.

 పరమాత్మను   చేరేవరకూ  (మోక్షాన్ని  పొందేవరకూ) ఈ   జన్మపరంపర .... కొనసాగుతుంది. 

ఇవన్నీ  గమనిస్తే ,  ప్రాచీనులు  చెప్పినట్లు  జన్మలు,  పునర్జన్మలు   ఉన్నాయన్నది   పరమసత్యం .  అని  తెలుస్తుంది. 

 జన్మలు,  పునర్జన్మలు    ఉన్నప్పుడు ,  జీవికి  తాను  చేసిన  పూర్వకర్మల   ఆధారంగా    భవిష్యజన్మ    ఉంటుంది.   ఈ  విధంగా   జీవులు  జననమరణచక్రంలో  పరిభ్రమిస్తుంటారు.

  సృష్టిలో  ప్రతి  చర్యకూ   ప్రతి  చర్య  ఉంటుందని   అంటారు.  అంటే  మనం  మంచి  పనులు  చేస్తే  మంచి  ఫలితాలు  చెడ్డపనులు  చేస్తే  చెడ్డఫలితాలు  లభిస్తాయి. 


  మనం  చేసే  ప్రతిపని  మన  భవిష్యత్తును  నిర్ణయిస్తుంది.

  వివేకానందుల  వారు  చెప్పినట్లు  మన  భవితకు  మనమే  బాధ్యులం.  


అందువల్ల    చెడ్డపనులను  చేయకుండా   జాగ్రత్తగా  జీవించటానికి  ప్రయత్నించాలి.
.....................................

 
పాత  టపాలను  చూడాలనుకుంటే  ఈ  లంకెల  ప్రకారం 
చూడగలరు......

 దైవానికి ఆది, అంతము లేవు ....ఒక ఉదాహరణ.

".Matter and energy cannot be created or destroyed...


వ్రాసిన  విషయాలలో  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.



Friday, May 17, 2013

ప్రహ్లాదునితో చ్యవనుల వారు..

ఓం

వ్యాసులవారు  జనమేజయునికి  తెలియజేసిన  కొన్ని  విషయాలు..


ఒకప్పుడు  ప్రహ్లాదుడు  భూలోకంలో  ఉన్న  తీర్ధాలను  గురించి తెలియజెప్పమని  చ్యవనుని  అభ్యర్ధించాడు.


చ్యవనుడు  అన్నాడు  కదా...


హిరణ్యకశిపునందనా! మనోవాక్కాయాలను  శుద్ధిగా  ఉంచుకున్నవారికి  అడుగడుగునా  తీర్ధాలే.  మలిన మనస్కులకు  గంగానది  సైతం  పాపపంకిలమే. మనస్సు  పాపరహితంగా  పరిశుద్ధంగా  ఉంటేనే  ఏ  తీర్ధాలైనా  పావనాలయ్యేది.  గంగానదికి  ఇరువైపులా  పొడుగునా  ఎన్నెన్నో  గ్రామాలున్నాయి. నగరాలున్నాయి.  అడవుల్లో  గిరిజనావాసాలున్నాయి. 



ఇన్ని  జాతులవారూ  రోజూ  ఆ  గంగలోనే  ముప్పొద్దులా   మునుగుతున్నారు.  బ్రహ్మసమానమైన  ఆ పవిత్రజలాన్నే  గ్రోలుతున్నారు.  అయితేనేమి  ఒక్కడంటే ఒక్కడు  ముక్తి  పొందాడా ? విషయలంపటులు  వెళ్ళి  ఎంతటి  పవిత్రతీర్ధంలో  మునిగినా  ఫలితం  శూన్యం. అన్నింటికీ  మనస్సే  ముఖ్యం.  దాన్ని  శుద్ధి  చేసుకుంటే  అన్నీ  శుద్ధి  పొందుతాయి. 



అలా  కాకుండా తీర్ధయాత్రలకు  వెళ్ళి  అక్కడ ఆత్మవంచన  పరవంచనలు చేస్తే ఆ చుట్టుకునే పాపానికి అంతు ఉండదు.



ఇంద్రవారుణం(పెదపాపరకాయ) పక్వమైనా  ఇష్టం  కానట్టే  దుష్టస్వభావుడు దివ్యతీర్ధంలో  కోటిసార్లు  మునిగినా  పవిత్రుడు  కాలేడు. 


అందుచేత  అన్నింటికంటే  ముందు  మనశ్శుద్ధి  ఉండాలి. అది  ఉంటేనే  ద్రవ్యశుద్ధి  సిద్ధిస్తుంది.  అటుపైని  ఆచారశుద్ధి.  ఇవన్నీ  ఉన్నవాడికే  తీర్ధం  తీర్ధమవుతుంది.  లేకపోతే  అదొక  రేవు  మాత్రమే.  అక్కడ  ఏవేవి  ఎంతెంత  చేసినా  "శుద్ధ దండుగ " . నిజానికి  వీటన్నింటికంటే  భూతదయ  చాలా  గొప్పది. 



 అయినా నువ్వు  తీర్ధాలను  గురించి  అడిగావు  కనక  వాటినే  చెబుతాను...విను. భూలోకంలో  లెక్కలేనన్ని   తీర్ధాలున్నాయి. వాటికేంగానీ  ఉత్తమోత్తమమైన  తీర్ధరాజం  ఒక్కటేఒక్కటి.  నైమిశంలో  చక్రతీర్ధం. దాన్నే  పుష్కరతీర్ధమని  కూడా  అంటారు......అంటూ తెలియజేశారు.


Wednesday, May 15, 2013

శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలు మరియు పాపాలు చేసిన వాళ్ళు పాపపరిహారం చేసుకున్నంత మాత్రాన పాపఫలితాలు అనుభవించనక్కరలేదా ?

....................
 ఓం
 శ్రీ  శంకర  జయంతి   సందర్భంగా  అందరికి  శుభాకాంక్షలు.

......................................................

పాపాలు  చేసిన  వాళ్ళు   పాపపరిహారం  చేసుకున్నంత   మాత్రాన  పాపఫలితాలు  అనుభవించనక్కరలేదా ?

ఈ  విషయాల  గురించి  తోచినంతలో  ఏమనిపిస్తుందంటే......

నిజమే  పాపపరిహారం  చేసుకోవటం  ద్వారా  పూర్వ  పాపఫలితాలను  తగ్గించుకోవటం,  నిర్మూలించుకోవటం   సాధ్యమే.

 అయితే   చేసిన  పాపాలకు  పశ్చాత్తాపం  చెంది,   వర్తమానంలో  పాపకర్మలను  చేయటం  మాని  , సత్కర్మలను  ఆచరిస్తూ .. పరిహారం  చేసుకోవటం  ద్వారా  పాపకర్మఫలితాన్ని   తగ్గించుకోవటం,   నిర్మూలించుకునే  అవకాశం  ఉందంటారు. 

తెలిసోతెలియకో  పాపాలు  చేసిన  తరువాత  పశ్చాత్తాపపడితే ,   పడే  శిక్ష  తగ్గే  అవకాశం  ఉంది. అంతేకానీ   ఏ మాత్రం పశ్చాత్తాపం  లేకుండా  పాపాలు  చేస్తూనే  ప్రాయశ్చిత్తంగా   పరిహారక్రియలను    చేసేవారి  అతితెలివిని  దైవం  చూస్తూ  ఊరుకోరు.

 పూర్వం  హిరణ్యకశిపుడు  వంటి  ఎందరో  రాక్షసులు  తపస్సులు  చేసి   వరాలను  పొందారు. (వరాలను కోరుకోవటంలో తమదే  గొప్ప  తెలివి అని భ్రమించారు.  ) 

సృష్టినే  సృష్టించిన  దైవం  తెలివి  ముందు  వారి  ఆటలు  సాగవు  కదా  !

  వర గర్వంతో  రాక్షసులు   లోకాలను  పీడించినప్పుడు,    దైవం  ఎటువంటి  మొహమాటం  లేకుండా  ఆ  రాక్షసులను  సంహరించారు.  ( రాక్షసులు  పొందిన  వరాలకు  భంగం  కలుగకుండానే. )



అందువల్ల  దైవకృపను  పొందాలన్నా,  పూర్వం  చేసిన  పాపఫలితాన్ని  వదిలించుకోవాలన్నా  వర్తమానం,  భవిష్యత్తులో  పుణ్యకార్యాలను  చేస్తూ  సత్ప్రవర్తనతో  జీవించటానికి  ప్రయత్నించాలి. 

 అంతేకానీ  అతితెలివితో    చెడ్డపనులు  చేస్తూనే   ఆ  పాపఫలితాలను  పరిహారక్రియలను   చేయటం  ద్వారా  పోగొట్టుకోవాలనుకోవటం  వృధాప్రయాస  మాత్రమేనని  గ్రహించాలి.


......................................

పాపకర్మపరిహారక్రియల  ద్వారా   తమ  పాపాన్ని  పోగొట్టుకోవటం  అందరికీ  సాధ్యమయితే  ,  రాక్షసులు  కూడా   పాపపరిహారక్రియల  ద్వారా    తాము  చేసిన   పాపాలను  పోగొట్టుకుని  హాయిగా  ఉండేవారు  కదా  !

 రావణాసురుని  వంటివారికి  తాము   చేసిన  పాపాలకు  విరుగుడుగా  చేసే   పాపపరిహారక్రియల  గురించి  కూడా  తెలుస్తాయి  కదా  !  

ఇలాంటి వారు  అధర్మమైన  లోకపీడాకరమైన  పూజలు,  తపస్సులు  మొదలైనవి ..  చేయాలనుకున్నా  దైవం  వారి  ఆటలను  సాగనివ్వరు.  వారి  పూజలలో  ఎక్కడో  ఒక  దగ్గర  దోషాలు   లేక  విఘ్నాలు   వచ్చేలా  చేస్తారు.

 రామ  రావణ  యుద్ధ  సమయంలో   ఇంద్రజిత్తు  చేస్తున్న  పూజకు    ఆటంకాలను     కల్పించి  దైవం  ఇంద్రజిత్తును  సంహరించారు.

రావణాసురుడు  ఎన్నో  పూజలు  కూడా   చేసేవాడట.  అయినా  సీతాదేవిని    అపహరించటం  అనే  పెద్ద  పాపం  చేయటం  వల్ల  రావణాసురునితో  పాటూ  అతని  బంధుమిత్రులు  కూడా  కష్టాలపాలయ్యారు.  రావణుడు  చేసిన  పాపం  వల్ల  యుద్ధంలో   అతని  సంతానం  కూడా  ప్రాణాలను  కోల్పోవలసి  వచ్చింది. 

 ఇవన్నీ  గమనిస్తే  మనకు  ఏం  తెలుస్తుందంటే,   చెడ్డపనులు  చేసేవారి  పూజలకు  సత్ఫలితాలు  లభించవు.  అని. 

....................................................

పాపపరిహారక్రియల  వల్ల  పాపాలు  పోగొట్టుకోవచ్చు ...... అని  పెద్దలు  చెప్పటానికి  కొన్ని  కారణాలు  ఉండి  ఉండవచ్చని  అనిపిస్తోంది.  కొన్ని  కారణాలు......

1.  తెలిసోతెలియకో  క్రితం  జన్మలో  చేసిన  పాపాల  వల్ల  ఈ  జన్మలో  కష్టాలు  వస్తున్నప్పుడు  ఇప్పుడు  ప్రాయశ్చితం  చేసుకోవటం  ద్వారా  గత కాలపు   పాపభారాన్ని  వదిలించుకోవచ్చు. (  ఈ  జన్మలో  సత్ప్రవర్తనతో     ప్రయత్నించినప్పుడు .....)

2.  జీవితంలో  కొన్నిసార్లు  మనకు  ఇష్టం  లేకపోయినా  పరిస్థితుల  ప్రభావం  వల్ల  పొరపాట్లు  చేయవలసి  వస్తుంది.  ఇలాంటివారికి  కూడా   ప్రాయశ్చితం  ద్వారా  పాపభారాన్ని  వదిలించుకునే  అవకాశం   ఉండవచ్చు.

3   ప్రాయశ్చిత్తం  ద్వారా  చేసిన  పాపఫలితాన్ని  వదిలించుకోవచ్చు .... అనే  ఆశను  కల్పిస్తే,      పాపాత్ములలో   కొందరయినా   మంచిగా  మారే  అవకాశం  ఉంది. 

4.  పాపాలు  చేస్తున్న  వారికి  ప్రాయశిత్తం  లేనే లేదు..... అంటే  ఆ నిస్పృహతో  కొందరు  చెడ్డవాళ్ళు   మరింతగా  చెడ్డపనులు  చేసే  అవకాశం  ఉంది.  


ఇలాంటివారికి  మంచిగా మారటానికి  మరల   అవకాశం   ఇచ్చి  చూడాలనే  అభిప్రాయంతో  పెద్దలు  అలా  చెప్పి  ఉండవచ్చు. 


5. కొందరు  వ్యక్తులకు  చెడ్డపనులు  చేయటం  ఇష్టం  ఉండదు.  అయినా  తమ  మనస్సును  నిగ్రహించుకోలేక  చెడ్డపనులను  చేస్తుంటారు. తాము   చెడ్డపనులను  చేసినందుకు   విపరీతమైన  మానసికబాధను  అనుభవిస్తారు.  తమ  మనస్సును  నిగ్రహించుకోలేనందుకు  తమను  తాము  నిందించుకుంటారు. ఇలాంటివారు  ధ్యానం,  దానధర్మాలు  చేయటం,  పూజ,  తీర్ధయాత్రలు  చేయటం....వంటి  పద్ధతుల  వల్ల  మానసికచాంచల్యం  నుంచి  క్రమంగా   బయటపడే   అవకాశం  ఉంది. 


6. ఇంకా  చాలా   కారణాలు ఉంటాయి......

ఇవన్నీ  గమనిస్తే   ఏమనిపిస్తోందంటే  , ప్రాయశ్చిత్తం   ద్వారా   పూర్వ పాపఫలితాన్ని  పోగొట్టుకోవాలంటే ,  ఇప్పుడు  సత్ప్రవర్తనతో  ఉండటానికి  ప్రయత్నిస్తూ  పాపపరిహార క్రియలను    ఆచరించవచ్చు. 


   అంతేకానీ , పాపాలు  చేస్తూనే  ప్రాయశ్చిత్తం  ద్వారా  పాపఫలితాలను   పోగొట్టుకోవచ్చు.......అన్నది   పెద్దల  అభిప్రాయం  కాదు  అని.
............................


తప్పులు  చేసి  జైలు శిక్ష  పడిన  ఖైదీలు  జైలులో  సత్ప్రవర్తనతో   ఉంటే ,  పై  అధికారులు  ఖైదీ  యొక్క  శిక్షా  కాలాన్ని  తగ్గించి  , అతనిని   కారాగారం  నుంచి  త్వరగా  విడుదల  చేసే  అవకాశం  ఉంది.

అలాగే   పూర్వజన్మలో  చెడ్డ పనులు   చేసి  ఈ  జన్మలో  కష్టాలను  అనుభవిస్తున్నవారు  ఇప్పుడు  మరింత  ఎక్కువగా  సత్ప్రవర్తనతో  జీవించటానికి  ప్రయత్నిస్తే ,   దైవం   కరుణించి  వారిని  కష్టాలనుంచి   కాపాడే   అవకాశం  ఉంది.

............................................

  దైవకృపను  పొందాలన్నా, పూర్వ  పాపఫలితాన్ని  పోగొట్టుకోవాలన్నా..... సత్ప్రవర్తనతో  జీవించటానికి  ప్రయత్నించాలి.  సద్బుద్ధిని   కలిగి  సరైన  దారిలో  నడిపించమని  దైవాన్ని  శరణు  వేడాలి.  


అంతేకానీ  దైవం    దగ్గర   ట్రిక్కులు   పనికి  రావు.

వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.