koodali

Friday, January 6, 2017

కిడ్నీ వ్యాధులు ...కొన్ని ఆయుర్వేద విషయాలు ..




ఈ రోజుల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య బాగా పెరిగింది. కిడ్నీవ్యాధులు రావటానికి ఎన్నో కారణాలుంటాయి.
  అయితే,  ఉద్దానం వంటి ప్రాంతాలలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది.


అక్కడ నీటిలో..సిలికా ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల  కిడ్నీలు దెబ్బతింటున్నాయని కొందరు పరిశోధకులు అన్నట్లు వార్తలు వచ్చాయి.


 సిలికా కొద్ది మోతాదులో  శరీరానికి మంచిదే కానీ, ఎక్కువ మోతాదులో శరీరంలో ప్రవేశిస్తే మాత్రం కిడ్నీలు దెబ్బతినటం వంటి సమస్యలు వస్తాయంటున్నారు.


 ఇలాంటప్పుడు..  ఈ సమస్య ఉన్న ప్రాంతాలలో అయినా కుటుంబానికి కనీసం రోజుకి రెండు బిందెల శుభ్రమయిన నీరు..  త్రాగటానికి, వంటకు  అందించగలిగితే  నీటి కాలుష్యం వల్ల వచ్చే జబ్బులు తగ్గుతాయి.


అందువల్ల  ప్రభుత్వాలు..  కిడ్నీ వ్యాధులు ఎక్కువ వస్తున్న ప్రాంతాలు మరియు  ఫ్లోరైడ్ నీరు ఉన్న ప్రాంతాలలో  విరివిగా నీటిని శుద్ధి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయాలి.


ప్రస్తుతం కిడ్నీ వ్యాధి మొదటి దశలో కనుక్కోవటం కొంచెం కష్టం. అయితే కిడ్నీ వ్యాధి ఎక్కువగా వచ్చే ప్రాంతాలలో ప్రజలకు తరచూ వైద్య పరీక్షలు చేస్తే వ్యాధి మరీ ముదరకముందే కనుగొని మందులు ఇవ్వవచ్చు.


కిడ్నీలు పాడయినవారికి భవిష్యత్తులో కృత్రిమ కిడ్నీలను అమర్చే విధంగా పరిశోధనలు జరుగుతున్నాయంటున్నారు.

ఈ పరిశోధనలు ఫలిస్తే కిడ్నీ దాతల కోసం వేచి చూసే సమస్య ఉండకపోవచ్చు.

 అయితే, ట్రాన్స్ ప్లాంటేషన్ తరువాత కూడా కొన్ని సమస్యలు ఉంటాయట. అందువల్ల కిడ్నీలు పాడవకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం.


 కిడ్నీ వ్యాధికి ఆయుర్వేదంలో మందులు ఉన్నాయంటున్నారు.

డయాలసిస్ స్థాయిలో కూడా డయాలసిస్ తో పాటూ పునర్నవ వంటి మందులు వాడుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయంటున్నారు.

 
వ్యాధిఉన్నవారు  ఒక్కొక్కరికి వివిధ స్థాయిలలో వ్యాధి ఉండవచ్చు.


అయితే, మందులు వాడేటప్పుడు తోచినట్లు వాడటం కాకుండా,  తమ అనారోగ్యం పరిస్థితిని బట్టి మందులను ఎంత మోతాదులో, ఎంతకాలం వాడాలో వంటి విషయాలను ఆయుర్వేద నిపుణుల సలహాతో వాడటం మంచిది.

ఆసక్తి ఉన్నవారు ఈ  క్రింద ఇచ్చిన లింకులను  .. కాపీ..పేస్ట్.. క్లిక్ చేసి  చూడగలరు. 



nattu vaithiyam telugu part 3 genimi tv 


How to Avoid dialysis – Herbal Treatment for Kidney failure





Monday, January 2, 2017

ఓం .. కొన్ని విషయములు..


శ్రీ అనఘాదేవీ సమేత శ్రీ దత్తాత్రేయస్వామి వార్లకు నమస్కారములు.
  శ్రీపాదశ్రీవల్లభ స్వామి వారికి నమస్కారములు.
     దిగంబర ! దిగంబర !! శ్రీ పాదవల్లభ దిగంబర !!!
               శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే .


 ************************

శ్రీ దేవీ భాగవతము నుండి తెలుసుకున్న విషయములు..

వ్యాసులవారు జనమేజయునికి తెలియజేసిన కొన్ని విషయాలు..


ఒకప్పుడు ప్రహ్లాదుడు భూలోకంలో ఉన్న తీర్ధాలను గురించి తెలియజెప్పమని చ్యవనుని అభ్యర్ధించాడు.
చ్యవనుడు అన్నాడు కదా...
 
హిరణ్యకశిపునందనా! మనోవాక్కాయాలను శుద్ధిగా ఉంచుకున్నవారికి అడుగడుగునా తీర్ధాలే. మలిన మనస్కులకు గంగానది సైతం పాపపంకిలమే.

మనస్సు పాపరహితంగా పరిశుద్ధంగా ఉంటేనే ఏ తీర్ధాలైనా పావనాలయ్యేది. గంగానదికి ఇరువైపులా పొడుగునా ఎన్నెన్నో గ్రామాలున్నాయి. నగరాలు ఉన్నాయి. అడవుల్లో గిరిజనావాసాలు ఉన్నాయి.

ఇన్ని జాతులవారూ రోజూ ఆ గంగలోనే ముప్పొద్దులా మునుగుతున్నారు. బ్రహ్మసమానమైన ఆ పవిత్రజలాన్నే గ్రోలుతున్నారు. అయితేనేమి ఒక్కడంటే ఒక్కడు ముక్తి పొందాడా ?

విషయ లంపటులు వెళ్ళి ఎంతటి పవిత్రతీర్ధంలో మునిగినా ఫలితం శూన్యం. అన్నింటికీ మనస్సే ముఖ్యం. దాన్ని శుద్ధి చేసుకుంటే అన్నీ శుద్ధి పొందుతాయి.

అలా కాకుండా తీర్ధయాత్రలకు వెళ్ళి అక్కడ ఆత్మవంచన - పరవంచనలు చేస్తే ఆ చుట్టుకునే పాపానికి అంతు ఉండదు.

ఇంద్రవారుణం(పెదపాపరకాయ) పక్వమైనా ఇష్టం కానట్టే దుష్టస్వభావుడు దివ్యతీర్ధంలో కోటిసార్లు మునిగినా పవిత్రుడు కాలేడు.

అందుచేత అన్నింటికంటే ముందు మనశ్శుద్ధి ఉండాలి. అది ఉంటేనే ద్రవ్యశుద్ధి సిద్ధిస్తుంది. అటుపైని ఆచారశుద్ధి. ఇవన్నీ ఉన్నవాడికే తీర్ధం తీర్ధమవుతుంది. లేకపోతే అదొక రేవు మాత్రమే. అక్కడ ఏవేవి ఎంతెంత చేసినా "శుద్ధ దండుగ " .

నిజానికి వీటన్నింటి కంటే భూతదయ చాలా గొప్పది.

అయినా నువ్వు తీర్ధాలను గురించి అడిగావు కనక వాటినే చెబుతాను - విను. భూలోకంలో లెక్కలేనన్ని తీర్ధాలున్నాయి.


వాటికేంగానీ ఉత్తమోత్తమమైన తీర్ధరాజం ఒక్కటేఒక్కటి - నైమిశంలో చక్రతీర్ధం. దాన్నే పుష్కరతీర్ధమని కూడా అంటారు......అంటూ తెలియజేశారు.



Sunday, January 1, 2017

పాలు, తేనె ఆహారంగా..మరియు..అందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలండి.....




అందరికి.. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలండి.


******

  ఈ క్రింద విషయాలను ఈ పోస్ట్ వేసిన చాలాకాలం తరువాత వ్రాసి, ఇక్కడ పోస్ట్ చేయటమైనది.
**
 
తేనెను వాడటం గురించి కొన్ని సందేహాలు వస్తాయి. తేనె కొరకు తేనెపట్టును పిండేటప్పుడు అందులో ఉండే గుడ్లు, చిన్న తేనెటీగలు చనిపోయి తేనెలో 
 కలుస్తాయంటారు.( నాకు తెలిసినంతలో)..

మరి అలాంటి తేనెను ఆహారంగా తినాలంటే.. మాంసాహారం తినకూడదనుకునే వారికి సందేహంగా ఉంటుంది.

 
తేనెటీగల వల్ల ప్రపంచానికి అనేక లాభాలుండటం నిజమే. పుష్పాల మధ్య పరపరాగసంపర్కం జరిగి పశుపక్ష్యాదులకు, మనుషులకు శాకాహారం లభిస్తుంది. 
 
ప్రకృతిలో సమతుల్యత కొరకు అయితే మాత్రం, మనుషులు తేనెటీగల్ని చంపితీరవలసిన అవసరం ఏమీ లేదు.

 
ప్రకృతిలో సమతుల్యత కొరకు అంటూ.. మనుషులు అన్ని జీవులను చంపి తినవలసిన అవసరం లేదు. ప్రకృతి సమతుల్యత కొరకు ప్రకృతిలోనే ఏర్పాట్లు ఉన్నాయి. మనుషులు ప్రకృతిని పాడుచెయ్యకుండా ఉంటే చాలు. 
 
ఈ రోజుల్లో మనుషుల అవసరాల కొరకు తేనెపట్టులను పెంచి మరీ తేనెను పిండి వాడుకుంటున్నారు.
 
 తేనెటీగల సంఖ్య విపరీతంగా పెరగకుండా ప్రకృతిలోనే ఏర్పాటు ఉంది. 
 
ఉదా.. ఎలుగుబంట్లు తేనెపట్లను తీసుకుని ఎంతో ఇష్టంగా  తింటాయి. తద్వారా పట్టులోని గుడ్లు, చిన్నతెనెటీగలు చనిపోతాయి. అలా తేనెటీగల సంఖ్య విపరీతంగా పెరగదు.
 
 
Honey Buzzards అనే పెద్ద పక్షులు, Honey Badger అనే జంతువులు కూడా తేనెతుట్టెల వద్ద తేనెను ఇష్టంగా తింటాయట.. కొన్ని రకాల చీమలు, కొన్ని రకాల కీటకాలు , పాములు..వంటివి కూడా తేనెతుట్టెల వద్దకు వెళ్ళి తేనెను, అక్కడ ఉండే తేనెటీగల గుడ్లను తింటాయట.

******** 
ప్రాచీనకాలంలోని వారు, పొడుగైనకర్రతో తేనెపట్టుకు చిన్న గాటు పెట్టి, బొట్టుబొట్టుగా క్రింద పడే తేనెను కొంత సేకరించేవారేమో?  మరల ఆ భాగాన్ని మూసేసేవారేమో?ఈ పద్ధతిలో తేనెను సేకరించవచ్చో? లేదో? నాకు తెలియదు. అలా అనిపించింది.
 
 
  తేనెపట్టులో ఉన్న జీవులకు హాని కలగకుండా తేనెను తీయటం గురించి కొన్ని పద్ధతులు ప్రాచీనకాలంలోని  వారికి తెలిసి ఉండవచ్చు. ప్రాచీనులు ఎంతో గొప్పవారు. వారిలో కొందరికి ఎన్నో మహిమలు కూడా ఉంటాయంటారు.
 
 మధువుకు సంస్కృతంలో అనేక అర్ధాలుండవచ్చు. ప్రాచీనకాలంలో పువ్వులనుండి మనుషులే తేనెను సేకరించే విధంగా, తేనె బాగా ఉండే పెద్ద పువ్వులు ఉండే  మొక్కలు ఉండిఉండవచ్చు.  
 
ఇవి చదివి కొందరికి నవ్వు వస్తుందేమో..సృష్టిలోనూ, ప్రాచీనగ్రంధాలలోనూ అంతుబట్టని రహస్యాలెన్నో ఉంటాయి.
 
***** 
మేము చిన్నప్పుడు Ixora పువ్వులను తెంపి, వాటి సన్నకాడలను నోట్లో పెట్టుకుని పీల్చితే,  తియ్యటి తేనె కొద్దిగా వచ్చేది.   
 
ఆ పువ్వులను తినవచ్చో లేదో..నాకు తెలియదు. మేము  కొన్నిసార్లు తిన్నాం అంతే. తెలిసితెలియక ఏదో పువ్వులను ఎవ్వరూ తినకండి. కొన్ని విషపు పువ్వులు కూడా ఉంటాయి. మొక్కల గురించి బాగా తెలిసిన వారిని అడిగి తినాలి.
 
*******
తేనె లేని జైన్ చ్యవన్ ప్రాస్ కూడా లభిస్తుంది. 
 
 జీవహింస చేయకుండా నూటికినూరుపాళ్ళు ఉండటం చాలా కష్టం. 
 
ఉదా..ఇంట్లో బొద్దింకలు, దోమలు, చీమల్ని చంపుతాము. మనం తినే పప్పులు, కూరగాయల్లో కూడా అప్పుడఫ్పుడు కొన్ని చిన్నపురుగులు, వాటి గుడ్లు ఉండే అవకాశం ఉంది.
 
*************
కొన్ని పశుపక్ష్యాదులు ఒకదానిని మరొకటి చంపి తినటం బాధాకరమే. మరి సృష్టిలో ఇలా ఎందుకు ఉందో దైవానికే తెలుస్తుంది. పాపాలు చేసిన మనుషులు వచ్చే జన్మలో పశుపక్ష్యాదులుగా జన్మించి, ఇంకో జంతువు చేతిలో చంపబడతారేమో?
 
 
సృష్టిలో భూమితో పాటు ఎన్నో లోకాలు ఉంటాయంటారు. ఆ లోకాల్లో పాపాలు చేసే జీవులు కూడా ఆ పాప ఫలితాలను,  పుణ్యం చేస్తే పుణ్య ఫలితాలను   అనుభవించటానికి భూమిపై కూడా జీవులుగా జన్మించటం జరుగుతుందేమో?
 
భూమి ఒక పరీక్షాలోకం  అనిపిస్తుంది. ఎలాంటిపరిస్థితిలోనైనా దైవాన్ని నమ్మి ఇక్కడ సత్ప్రవర్తనతో జీవించిన వారికి ఉత్తమగతి 
లభిస్తుంది.

సృష్టిలో ఏది ఎలా ఉండాలో అలా ఉంది. ఉదా..నీటిలో ఈదే చేపలు ఈదగలిగేలా, గాలిలో ఎగిరే పక్షులకు ఎగిరేలా రెక్కలు..ఇలా ఏర్పాటు చేయబడి ఉంది. 
 
ఇంత అద్భుతమైన సృష్టి చేసిన దైవానికి ఏది ఎలా చేయాలో అంతా తెలుస్తుంది. 
 
 ప్రపంచంలో జీవులు విపరీతంగా పెరిగిపోకుండా సృష్టిలో ఏర్పాటు ఉంది. 
 
జీవులు విపరీతంగా పెరిగితే వాటికి ఆహారం సరిపోదు.

  మొక్కలను తినే జీవులు.. ఆ జీవులను తినే చిన్నజంతువులు.. వాటిని తినే పెద్ద జంతువులు.. ఇలా ఉంది. 
 
 అలాని, మనుషులు ఏ జీవిని చంపి తిననవసరం లేదు. మనకు తగినంత శాకాహారాన్ని చక్కగా తినవచ్చు.
 
  ఎప్పుడైనా అత్యవసర పరిస్థితిలో కానీ, తప్పనిసరి పరిస్థితిలో కానీ, ఏదైనా జంతువు దాడి చేసినప్పుడు కానీ, వాటిని మనుషులు చంపవచ్చు. 
 
అంతేకానీ, సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని మనుషులు తమ అవసరాల కొరకు వాడకూడదు. 
**************
మంచివాళ్లు, పశుపక్ష్యాదులు, ఇతర మూగజీవులు ...  కష్టాలలో ఉంటే, ఎప్పుడో పాపం చేయటం వల్ల కష్టాలు వస్తాయి, అనుభవించనీ.. అనుకోవటం తప్పు. చేతనైనంత సాయం చేయటం మంచిది.

మనుషులు తాము చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి రక్షించమని దైవాన్ని వేడుకోవాలి...నీతిగా జీవించటానికి శాయశక్తులా ప్రయత్నించాలి.
 
 
**************
మరికొన్ని విషయములు...
 
 కొందరు ఏమంటారంటే... ఆవులు, గేదెలు విషయంలో వాటి దూడలు పాలను త్రాగగా ఇంకా బోలెడు పాలు ఉంటాయి. ఆ పాలను పిండకపోతే పెద్దవాటికి జబ్బు చేస్తుంది కాబట్టి, మనం మిగిలిన పాలను పిండితీరాలని చెబుతున్నారు.

 
 ఇక్కడ, నాకు కొన్ని సందేహాలు వచ్చాయి. ఆవుల సంగతి అలా ఉంచితే,  గేదెలను కూడా పెంచి పాలు పిండుతారు. 
 
 
అడవులలో అడవి గేదెలు.. ఉంటాయి. వాటి దూడలుంటాయి. మరి వాటి దూడలు త్రాగగా మిగిలిన పాలను అడవుల్లోకి వెళ్ళి ఎవరూ పిండరు కదా. అయినా అవి బాగానే జీవిస్తున్నాయి కదా..
 
అడవిగేదె జీవనవిధానం గురించి నాకు అంతగా తెలియదు.

 
బహుశా, ప్రకృతిసహజంగా అడవుల్లో తిరుగుతూ ఆహారాన్ని తింటూ బ్రతికే వాటికి కొంచెం ఎక్కువతక్కువగా వాటి దూడకు సరిపడా మాత్రమే పాలు వస్తాయేమో?
 
 
 మనుషుల వద్ద పెరిగే వాటికి, వాటిని బయట తిరగనివ్వకుండా..వాటి సహజ పద్ధతులకు విరుద్ధంగా ఒకచోట కట్టివేసి, రకరకాల ఆహారం ఇవ్వటం, పాలు ఎక్కువగా రావటానికి మందులు వాడటం వల్ల ఎక్కువపాలు వచ్చి, ఆ పాలను పిండుకుంటున్నారేమో? అనిపించింది.

 
అంటే, మనుషులు తమ అవసరాలకొరకు వాటి సహజత్వాన్ని మార్చివేసి, ఇప్పుడు వాటినుండి పాలు పిండకపోతే వాటికే నష్టం.. అంటున్నట్లుంది.

 
మనుషుల్లో గమనిస్తే, కొందరు స్త్రీలలో తక్కువ పాలు వస్తాయి. కొందరిలో బాగా వస్తాయి. ఇలా జరగటానికి..వారి ఆహారపు అలవాట్లు, మానసికవిషయాలు, పరిసరాల ప్రభావం, తీసుకునే మందులు..ఇలా అనేక కారణాలుంటాయి...
 
 
తల్లివద్ద పాలు సరిపడా రానప్పుడు, ఆ చంటిపిల్లలకు ఆవు లేక గేదె పాలను పడతారు.తల్లులకు పాలు బాగా రావటానికి స్థన్యవర్ధిని వంటి ఆయుర్వేద మందులు కూడా ఉన్నాయి.
***********
ఆవుపాలు, పెరుగు, నెయ్యి..వీటిని ...వైద్యంలో కూడా వాడతారు.  కొందరి విషయంలో అనారోగ్యం చక్కగా తగ్గిపోతుంది. కొందరి విషయంలో ఎన్నిమందులు వాడినా తగ్గకపోవచ్చు. ఇలా జరగటం వెనుక వారి కర్మఫలాల ప్రభావం కూడా ఉండవచ్చు. ఏది ఎందుకు జరుగుతుందో దైవానికి తెలుస్తుంది.

************
 ప్రాచీనకాలంలో మనుషులు కొన్ని వందల సంవత్సరాలు జీవించేవారట. అప్పట్లో కొన్ని పశుపక్ష్యాదులు కూడా భారీ శరీరాన్ని కలిగి ఉండేవంటారు. 
 
 
శ్రీకృష్ణుని కాలంలో, ఆ యుగంలో ఆవులనుండి ఎక్కువ పాలు వచ్చేవంటారు. అప్పట్లో ఆవులను ఎంతో ఆప్యాయంగా పెంచుకునేవారు. ఆ యుగంలోని ఆవులు ఎక్కువ పాలను ఇచ్చేవి కావచ్చు.

జనాభా తక్కువగా ఉండి, పశువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు వాటిదూడలు త్రాగగా మిగిలిన కొద్దిపాలను కలిపితే (అన్నింటి నుండి మిగిలిన పాలను)  చాలా పాలు అవుతాయి. వాటిని పిండి వాడుకునేవారు కావచ్చు.
 
***********
ఆవుపాలు, పెరుగు, నెయ్యి..వీటిని యజ్ఞయాగాదులలో వాడతారు....వైద్యంలో కూడా వాడతారు.  యజ్ఞయాగాదుల్లోను, వైద్యంలోనూ వాడే మూలికలు, పాలు, నెయ్యి.. కల్తీలేని స్వచ్చమైనవి వాడాలి. లేకపోతే సరైన ఫలితాలు లభించకపోవచ్చు.
 
 
ఈ రోజుల్లో అయితే, కొన్ని వనమూలికలు లభించటం కూడా తగ్గిపోయిందట. వాతావరణకాలుష్యం వల్ల వనమూలికల యొక్క సహజస్వభావం, సహజగుణం మారే  పరిస్థితి కూడా ఉండవచ్చు.
 
 
ప్రాచీనకాలంలో స్వచ్చమైన వాతావరణం, స్వచ్చమైన పదార్ధాలు, స్వచ్చమైన మనుషులు ఎక్కువగా ఉండటం వల్ల, అప్పుడు యజ్ఞయాగాదుల వల్ల చక్కటి ఫలితాలు వచ్చేవి.

 
 ఈ రోజుల్లో కల్తీలేనివి పెద్దమొత్తంలో లభించటం కష్టంగా ఉంది. మరి, స్వచ్చమైనవి పెద్దమొత్తంలో లభించనప్పుడు ఏం చేయగలరు? ఉన్నవాటినే జాగ్రత్తగా వాడాలి.

ఇవన్నీతెలిసే కాబోలు, ప్రాచీనులు కలియుగంలో దైవనామస్మరణ సులభోపాయమని తెలియజేసారు.

 దైవస్మరణ, దైవనామస్మరణ. ఎవరైనా చక్కగా చేయవచ్చు. ఈ విషయంలో కల్తీ ఉండదు.
 
 మంత్రాలు పఠించటంలో తప్పులు రావచ్చు కానీ, నామాన్ని తప్పులు లేకుండా అనుకోవచ్చు. 
 
దైవాన్ని..దైవనామాన్ని.. భక్తితో స్మరించుకోవటం వల్ల మంచి ఫలితాలుంటాయి.
 
  ధ్యానం, దైవనామ స్మరణ..ద్వారా ప్రపంచంలో అనేక సమస్యలను పోగొట్టవచ్చని గ్రంధాల ద్వారా తెలుస్తుంది. ఇంకా, అనారోగ్యాలను కూడా పోగొట్టుకోవచ్చని తెలుస్తుంది. అయితే, చక్కగా సాధన చేయాలి.
 
 ఎవరికివారు దైవాన్ని చక్కగా స్మరించుకోవచ్చు. ఎవరైనా తమకుతాము దైవనామాన్ని ఎక్కువగా అనుకోలేకపోతే, ఎవరైనా అంటున్న నామాలను వినవచ్చు, భక్తి గీతాలను, భజనలను, పాటలను కూడా వినవచ్చు.తప్పులు లేకుండా ఉన్న మంత్రాలను కూడా కేసెట్ ద్వారా వినవచ్చు. 
 
ఎవరికైనా అనారోగ్యం కలిగి మంచాన ఉన్నప్పుడు, వారి బంధువులు ..మంత్రాలను, దైవనామాలను, భక్తిగీతాలను.. రోగికి వినిపించవచ్చు. కాసెట్ ద్వారా కూడా వినిపించవచ్చు.
పెద్ద సౌండ్ కాకుండా చిన్న శబ్దంతో వినిపిస్తే మంచిది.
*******
 అందరు దైవభక్తి కలిగి..నైతికవిలువలతో జీవించటానికి ప్రయత్నిస్తూ..దైవస్మరణ.. దైవనామస్మరణ..శ్రద్ధగా చేయటం మంచిది.

ఈ రోజుల్లో కూడా కొంతవరకు అయినా యజ్ఞయాగాదులను చేయాలి...యజ్ఞయాగాదుల కొరకు,  వైద్యం కొరకు, కొందరు చంటిపిల్లల  కొరకు..చక్కగా పాలు లభించాలంటే  ఇతరత్రా పాలు, పాల ఉత్పత్తుల  వాడకాన్ని తగ్గించుకోవాలి. 
 
 
రుచికొరకు  తీసుకునే కాఫీలు, టీలు, పన్నీరు, పాల ఉత్పత్తుల తో స్వీట్లు..తినటాన్ని తగ్గించుకుంటే మనుషుల కొరకు కష్టపడుతున్న  పశువులకు కష్టాలు  కొంతయినా తగ్గుతాయి. 
 
 
సాటిజీవులైన వాటి కష్టాలను తగ్గిస్తే చాలా పుణ్యం వస్తుంది. ఎక్కువ పుణ్యాన్ని సంపాదించుకుంటే, జీవితంలో కష్టనష్టాలు తగ్గుతాయంటారు కదా.
 
 వాతావరణాన్ని కలుషితం చేయకుండా ప్రకృతిసిద్ధంగా జీవించటం, నైతికవిలువలతో జీవించటం..చేస్తే అనేక సమస్యలు ఉండవు.
 
  అయితే, కొందరు చేసే పనుల వల్ల అందరూ ఇబ్బంది పడవలసి వస్తుంది. 
 
********
ఏ సమస్యకైనా కూడా భక్తిగా దృఢంగా దైవస్మరణ చేస్తే చక్కటి ఫలితాలుంటాయి. కొన్నిసార్లు ఫలితం ఆలస్యం కావచ్చు కానీ, మంచిఫలితం మాత్రం ఎప్పటికైనా తప్పక లభిస్తుంది.
 
******
 వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 
*******
konni  links..ఆసక్తి ఉన్నవారు లింక్స్ నుండి చదవవచ్చు.
 
 

 

Monday, December 26, 2016

మనశ్శాంతి కరువైతే బోలెడు డబ్బున్నా సంతోషం ఉంటుందా ?

 

ఈ  రోజుల్లో  చాలామంది   జనం   ఎలాగైనా  సరే  డబ్బును  సంపాదించి  విలాసంగా  జీవించటమే  జీవిత ధ్యేయంగా  బ్రతుకుతున్నారు.


డబ్బున్నవాళ్ళు  తమ గొప్పలను    అతిగా  ప్రదర్శించటం  వల్ల  సమాజానికి  హాని  జరుగుతోంది.


  కొందరు  జరుపుకునే  అట్టహాసమైన  ఫన్క్షన్స్  చూసి   చాలా  మంది  తామూ  అలా  ఆడంబరంగా  జీవించాలని   ప్రయత్నిస్తున్నారు.  ఎలాగైనా  డబ్బు  సంపాదించాలనే  తాపత్రయంలో  కొందరు  అడ్డదారులలో  డబ్బును  సంపాదించటానికి  ప్రయత్నిస్తున్నారు. 

ఇంతా  చేసి  డబ్బున్నవారు  అందరూ  నిజంగా  సుఖంగా  ఉన్నారంటారా  ?
 

 డబ్బున్నవారిలో  చాలామందికి  మనశ్శాంతి  లేకపోయినా ..... తమకు  ఉన్న  సొమ్మును  ఇతరులకు  ప్రదర్శిస్తూ  తృప్తి  పడటానికి  ప్రయత్నిస్తుంటారు.
.............................

డబ్బున్నవారు కూడా  కొన్ని  విషయాలను  గ్రహించాలి.  సమాజంలో  పేదవారు  లేనప్పుడు  డబ్బున్నవారు  తమ  గొప్పలను  ప్రదర్శించుకోవచ్చు.  


అంతేకానీ,  సమాజంలో  మన  ప్రక్కనే  ఎందరో  పేదవారు   అష్టకష్టాలు  పడుతుంటే  మనం  మాత్రం  మన  గొప్పలను  అదేపనిగా  ప్రదర్శించుకోవటం  మానవత్వం  అనిపించుకోదు. 


 ప్రపంచంలోని  సంపద  అందరిదీ..  అయితే  కొందరు  తమ  తెలివి,  బలం,  అధికారంతో    అతిగా  డబ్బును  పోగేసి  విలాసవంతంగా  జీవిస్తున్నారు.


 ఒక  స్థాయికి  మించి  డబ్బును   కూడబెట్టుకోవటం  అంటే  ఇతరుల  సొమ్మును  దొంగిలించినట్లే. 

 సమాజంలోని  ఆర్ధిక  అసమానతల  వల్లే  సమాజంలో  ఎన్నో  ఘోరాలు,  నేరాలు  జరుగుతున్నాయి. 

 తెలివి,  బలం,  అధికారం  ఉన్నవాళ్ళు  తమ  తెలివిని,  బలాన్ని,  అధికారాన్ని  కేవలం  తమవరకు  డబ్బు  సంపాదించటానికి  మాత్రమే  కాకుండా ,   సమాజంలోని  తోటి  నిస్సహాయుల  కోసం  కూడా  ఉపయోగించాలని  దైవం  ఆశిస్తారు.


 ప్రక్కవాళ్ళు  ఆకలితో  అల్లాడుతుంటే  విచ్చలవిడిగా  విందు  భోజనాలు  చేయటం,  తోటివాళ్ళు  కొంపాగోడులేక  అల్లాడుతుంటే  కోట్లాది  డబ్బుతో  విలాసవంతమైన  బంగళాలను  నిర్మించుకోవటం....ఇవన్నీ  ఏం  బాగుంటాయి. 


 సమాజంలోని  ఎందరో  బడుగుజీవులు  అనారోగ్యంతో  అల్లాడుతున్నారు.


 మనం  కోటి  రూపాయల  కారులో  తిరిగితే   పొందే  ఆనందం  కన్నా  10  లక్షల  రూపాయల  కారు  కొనుక్కుని  మిగిలిన  90  లక్షలను  అనారోగ్యంతో  అల్లాడుతున్న  పేదవారికి  సహాయం  చేస్తే   వచ్చే  ఆనందం  ఎన్నో  రెట్లు  ఎక్కువ.    


తెలివి  ఉన్నా  చదువుకోవటానికి  డబ్బు  లేక  బాధపడుతున్న  పేద  విద్యార్ధులు  ఎందరో  ఉన్నారు.  అలాంటి  పేద  విద్యార్ధులకు  సాయం  చేస్తే  పొందే  ఆనందం  ఎంతో  తృప్తిని  ఇస్తుంది.


  డబ్బున్న  వారు  కొందరు  కలిసి  పేదరికాన్ని  పోగొట్టే  కార్యక్రమాలకు  సహాయం  చేయవచ్చు.  మనవల్ల  ఏ  ఒక్కరి  జీవితం  బాగుపడినా  ఆ  ఆనందం  వర్ణనాతీతం. 

అయితే,  మనం  ఎంత  మంచి  చేసినా  కొన్నిసార్లు  ఇతరులు  మెచ్చుకోరు.  అయినా    ఫరవాలేదు.  మనలను  మెచ్చుకోవలసింది  దైవం. 
.................................. 

 ఈ  రోజుల్లో  టీవీలు  వంటి  ప్రసారమాధ్యమాల్లో  వచ్చే  సీరియల్స్  ,  సినిమాలలో  కనిపించే  ఇళ్ళలోని  వస్తు  సామాగ్రిని   చూసి  తామూ  అలా  విలాసవంతమైన  వస్తువులను  కొనుక్కోవాలని  చాలామంది    తాపత్రయపడుతున్నారు.

ఇలాంటి  విలాసవంతమైన  ఇళ్ళలో  జీవించేవారందరూ   నిజంగా  ఆనందంగా  జీవిస్తున్నారా  ?  అని  ప్రశ్నించుకుంటే   లేదనే  చెప్పుకోవచ్చు.


 ఎంత  డబ్బున్నా,  ఎన్ని  విలువైన  వస్తువులు  చుట్టూ  ఉన్నా  మనస్సులో  సంతోషం  లేనప్పుడు   సుఖమెలా  ఉంటుంది  ?

  డబ్బు  వల్ల  కొన్ని  సౌకర్యాలు  ఉండే  మాట  నిజమే.  అయితే  మనశ్శాంతి  అనేది  మాత్రం   డబ్బుతో  మాత్రమే  లభించేది   కాదు.

 ఉదా...కుటుంబసభ్యుల  వల్ల  మనశ్శాంతి  కరువైతే  బోలెడు   డబ్బున్నా  సంతోషం   ఉంటుందా  ?

ఎంత  డబ్బున్నా    మనశ్శాంతి  లేక  అల్లాడే  వారు  ఎందరో  ఉన్నారు.  ఉన్న  దానితోనే   తృప్తి  పడి  సంతోషంగా  జీవిస్తున్నవారు  కూడా  ఎందరో  ఉన్నారు.
........................... 

చెడ్డవాళ్ళు  సుఖపడటం,  మంచివారు   కష్టాలు  పడటం   కూడా  ప్రపంచంలో  అప్పుడప్పుడు  కనిపిస్తుంది.  ఇది  చూసి  కొందరు  ఏమంటారంటే,  ఇతరులకు  సాయం  చేసేవాళ్ళకు  కూడా  కష్టాలు  వస్తున్నాయి  కదా  !  అంటారు.  ఇలా  ఆలోచించటం  సరైనది  కాదు. 

 మనం  క్రితం  జన్మలలో  చేసిన  పాపపుణ్యాల  ఫలాలను   ఇప్పుడు  అనుభవిస్తున్నాము.  ఇప్పుడు  చేసిన  పుణ్యఫలాలు  ఎక్కడికీ  పోవు.
 

.........................
 
మరికొన్ని విషయాలు ఏమిటంటే, 

ఎవరైనా.. ఒక రూపాయి పెట్టుబడికి పది రూపాయలు ఇస్తామని చెపితే నమ్మి, కొందరు ప్రజలు అత్యాశతో డబ్బు పెట్టుబడి పెడతారు.

  తరువాత మోసం జరిగితే, తాము నష్టపోయిన దానికి న్యాయం చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తారు.

మోసం చేయటం తప్పే.. అదే సమయంలో అత్యాశకు పోవటంలో ప్రజల తప్పు కూడా ఉంటుంది కదా!

Saturday, December 24, 2016

కొన్ని సవరణలు ..


గత పోస్ట్ లో నేను ..వైకుంఠ ఏకాదశి ఈ డిసెంబర్ లో అన్నట్లు వ్రాసాను. 

అయితే వైకుంఠ ఏకాదశి 2017 జనవరి లో  వచ్చిందంటున్నారు.

 పొరపాటుకు దయచేసి క్షమించండి.

**************
ఇంకొక విషయం ఏమిటంటే, శని దేవుని జయంతి గురించి నాకు సరిగ్గా తెలియదు.
శనిదేవుని జయంతి గురించి గత పోస్టులో ...


.గ్రహశ్రేష్టులు శ్రీ శనేశ్వర దేవత వికారి నామ సంవత్సరము మార్గశిర బహుళ నవమి రోహిణి నక్షత్రమున జన్మించినట్లు శాస్త్రగ్రంధాలు పేర్కొన్నాయి. కాశ్యపగోత్రోద్భవుడు అయిన 'శనిదేవుని జయంతి' శింగణాపూర్ లో ప్రతిసంవత్సరము వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు అతి వైభవముగా జరుపబడుతుంది... విషయాలను నేను ఒక దగ్గర చదివాను.
(
నెల 22 అంటే రేపు మార్గశిర బహుళ నవమి .)..అని వ్రాయటం జరిగింది.

ఈ  విషయాలను  మా దగ్గర ఉన్న ఒక పుస్తకంలో చదివాను. 
*************
అయితే కొన్ని ప్రాంతాల వారు,  శనిదేవుని జయంతి ....వైశాఖ అమావాస్య నాడు చేస్తారట.....  మరికొందరు జ్యేష్ఠమాస అమావాస్య నాడు కూడా  చేస్తారన్నట్లు అంతర్జాలంలో చదివాను.


బహుశా సౌరమాన పద్ధతి మరియు చాంద్రమాన పద్ధతుల వల్ల ఈ విధంగా జరుగుతున్నదేమో ?

(నాకు ఇంగ్లీష్ అంత బాగా రాదు.)
*************
వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉన్నచో దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.



Wednesday, December 21, 2016

ఓం..




మార్గశిర బహుళ అష్టమి రోజున కూడా అనఘాష్టమీ వ్రతం చేస్తారు.(అంటే ఈ రోజు వచ్చింది.)


 గ్రహశ్రేష్టులు శ్రీ శనేశ్వర దేవత వికారి నామ సంవత్సరము మార్గశిర బహుళ నవమి రోహిణి నక్షత్రమున జన్మించినట్లు శాస్త్రగ్రంధాలు పేర్కొన్నాయి. 
 
కాశ్యపగోత్రోద్భవుడు అయిన 'శనిదేవుని జయంతీ శింగణాపూర్ లో ప్రతిసంవత్సరము  వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు అతి వైభవముగా జరుపబడుతుంది...ఈ విషయాలను నేను ఒక దగ్గర చదివాను.
( ఈ నెల 22 న అంటే రేపు మార్గశిర బహుళ నవమి .)

వైకుంఠ ఏకాదశి కూడా దగ్గరలోనే
ఉంది.


ఈ విశేషముల సందర్భంగా శుభాకాంక్షలు.







Friday, December 16, 2016

ఓం...

ధనుర్మాసం ఆరంభమయింది...


చాలాచోట్ల తిరుప్పావై పారాయణ చేస్తారు . ప్రవచనాలు కూడా జరుగుతాయి. 


ఈ విశేషముల సందర్భంగా శుభాకాంక్షలు.