koodali

Monday, December 12, 2016

ఓం .


ఈ రోజు తిరువణ్ణామలై దీపోత్సవం....
హనుమద్వ్రతం.... 
మిలాదున్నబి....
రేపు .. దత్త జయంతి .. పూర్ణిమ....

ఈ విశేషాల  సందర్భంగా శుభాకాంక్షలు.


Friday, December 9, 2016

ఏక శ్లోక (ఏక శ్లోకీ ) భగవద్గీత ..


ఏక శ్లోక (ఏక శ్లోకీ ) భగవద్గీత .. 
 
శ్లో|| యత్ర యేగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః
 
తత్ర శ్రీర్విజయో భూతిర్ద్రువా నీతిర్మతిర్మమ||


పైన వ్రాసిన వాటిలో అచ్చు తప్పులు ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.





Wednesday, December 7, 2016

కనీసం అందరికీ నిత్యావసరాలకు లోటు లేకుండా చేస్తే..


ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఉంది. ఇలాంటప్పుడు అందరికీ  ఉపాధి  అనేది చాలా సమయం పడుతుంది. 

  పరిశ్రమలు పెట్టండి..అంటూ అందరినీ బ్రతిమాలుకోవాలి..వారికి భూములు లభించాలి..పరిశ్రమలు నెలకొల్పాలి..ఇదంతా సమయం పడుతుంది. 

ఇంతా చేస్తే ఎంతమందికి ఉద్యోగాలు లభిస్తాయో చెప్పలేం.ఉద్యోగం వచ్చినా ఎంతకాలం ఉద్యోగం ఉంటుందో అసలే చెప్పలేం.

 ప్రతిసంవత్సరం దేశంలోని కాలేజీల నుండి కేవలం ఇంజనీరింగ్ చదివిన వారే లక్షలమంది వస్తున్నారు. 

మరి వీళ్ళందరికీ ఉద్యోగాలు లభించాలంటే అబ్బో చాలా పెద్దపని.

ఇలాంటప్పుడు కనీసం అందరికీ నిత్యావసరాలకు లోటు లేకుండా చేస్తే బాగుంటుంది.

 దేశంలో ఎక్కువ  శాతం  ఉన్న సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చౌక ధరకు ఆహారాన్ని అందివ్వటం, తక్కువ ధరకు సరుకులను అందించటం, తక్కువ ధరకు వైద్యాన్ని అందించటం వంటివి చేస్తే  ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.  


వ్యవసాయాధారిత పరిశ్రమలు మరిన్ని నెలకొల్పితే ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి.

సేవా రంగం ద్వారా కూడా  అవకాశాలు పెంచుకోవచ్చు..

ఉపాధి కోసం  పెద్ద ఎత్తున వస్తు తయారీరంగంపై మాత్రమే ఆధారపడితే సహజవనరులు వేగంగా తరిగిపోతాయి. 

ఉపాధి కోసం .. ఉన్న వనరులన్నీ మనమే ఖాళీ చేస్తే రాబోయే తరాలకు మిగిలేదేమిటి ?

*********************

 Monday, September 8, 2014
అమ్మ, అన్న క్యాంటీన్లు..

ఈ క్యాంటీన్ల  గురించి  వినే  ఉంటారు.  తమిళనాడులో  అమలవుతున్న  అమ్మ  క్యాంటీన్లలో  అతితక్కువ  ధరకే  భోజనాన్ని  అందిస్తున్నారట. 

ఇంకా  నిత్యావసర  వస్తువులనూ  అందిస్తున్నారట. మిగతా  విషయాలు  ఎలా  ఉన్నా  ఇది  మంచి  పద్ధతే  అనిపిస్తుంది.

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం  కూడా  అన్న  క్యాంటీన్లను  ప్రారంభించాలనుకోవటం  ఎంతో మంచి  విషయం.

రేషన్  కార్డుల  ద్వారా  నిత్యావసర  వస్తువులను  అందించటమూ  మంచిదే. అయితే, వంట  చేయాలంటే గ్యాస్  వంటివి ఎన్నో కావాలి.  

వంటచేసుకోవాలంటే  కుదరని వారికి  ఇలాంటి  క్యాంటీన్లు  ఎంతో  ప్రయోజనకరం.  

మనిషికి  ఆహారం  ముఖ్యం.  ఆకలితో  అల్లాడే  ప్రజలున్న  సమాజంలో  ఎంత  టెక్నాలజీ  ఉన్నా ఏం  లాభం ?  

అందరికీ  ఆహారాన్ని  అందించగలిగిన  రోజున  దేశంలో  ఎన్నో  సమస్యలు  పరిష్కారమవుతాయి.
...................
ఇక్కడ  ఒక విషయాన్ని  చెప్పుకోవాలి. 

 
సమాజంలో  డబ్బున్న  వాళ్ళలో  కొందరు  మరీ  పిసినారివాళ్ళుంటారు.    ఇలాంటి  వాళ్ళు,  తక్కువ ధరకు  ఆహారం  లభిస్తుందంటే - ఇక  ఇంట్లో  వండుకోవటం  మానేసి  అన్నా  క్యాంటీన్లలోనే  భోంచేస్తారేమో ? 

  డబ్బున్న  వాళ్ళు  కూడా  ఇలా  చేస్తే , పేదవారికి  ఆహారం  సరిపోదు.  ఇలాంటి  క్యాంటీన్లను  ప్రారంభించిన   అసలు  ఉద్దేశ్యం  సరిగ్గా  నెరవేరదు. 


 ఎప్పుడో తప్పనిసరి  పరిస్థితిలో  తప్ప  డబ్బున్నవాళ్ళు  ఇలాంటి  క్యాంటీన్లను  ఉపయోగించకుండా  ఉంటేనే మంచిది. 

 పీనాసితనాన్ని,అత్యాశను   తగ్గించుకుంటే  పేదవారి  కడుపు నింపిన వారవుతారు.


Monday, December 5, 2016

ఓం ..


శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం..


హే స్వామినాధ కరుణాకర దీనబంధో
శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో
శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ
వల్లీసమేత  మమదేహి కరావలంబం..


దేవాదిదేవనుత దేవగణాధినాధ
దేవేంద్ర వంద్య మృదుపంకజ మంజుపాద
దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే
వల్లీసనాధ మమదేహి కరావలంబం..


నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్
తస్మా త్ప్రసాద పరిపూరిత భక్తకామ
శ్రుత్యాగమ ప్రణవ వాచ్య నిజస్వరూప
వల్లీసనాధ మమదేహి కరావలంబం..


క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల
పాశాది శస్త్ర పరిమండిత దివ్యపాణే
శ్రీ కుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ
వల్లీసనాధ మమదేహి కరావలంబం..


దేవాదిదేవ రధమండల మధ్య వేద్య
దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తం
శూరం నిహత్య సురకోటిభి రీడ్యమానం
వల్లీసనాధ మమ దేహి కరావలంబం..


హారాదిరత్న మణియుక్త కిరీటహార
కేయూర కుండల లసత్కవచాభిరామ
హే వీర తారక జయామర బృంద వంద్య
వల్లీసనాధ మమ దేహి కరావలంబం..


పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయైః
పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైమునీంద్రైః
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాధ
వల్లీ సనాధ మమ దేహి కరావలంబం..


శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా
కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం
సిక్త్వాతు మా మవ కళాధర కాంతికాంత్యా
వల్లీసనాధ మమ దేహి కరావలంబం..


సుబ్రహ్మణ్యాష్టకం యే పఠంతి ద్విజోత్తమా తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదితః.
సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటిజన్మ కృతం పాపం తత్ క్షణాదేవ నశ్యతి..


ఫలం: సర్వ వాంచా ఫల సిద్ధి - సర్వ పాప నాశనం...

పైన వ్రాసిన వాటిలో అచ్చు తప్పులు ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

ఇంకొక విషయం ఏమిటంటే కంప్యూటర్లో వ్రాసేటప్పుడు కొన్ని తప్పులు వస్తున్నాయి.
 న కారము " న్ " అని వ్రాసే దగ్గర సకారం" స్" అని వసోంది.
 ఉదా.. రోగహారిన్ అని వ్రాసిన దగ్గర ఈ విషయాన్ని గమనించవచ్చు.


Friday, December 2, 2016

ఏదో చేయాలనుకుంటే..ఏదో అవుతున్నట్లుంది..



సామాన్య మధ్య తరగతి వారికి అనేక హద్దులు ఏర్పరుస్తూ, సంపద లెక్కలు చూపమనటం బాగానే ఉంది.. నియమాలు ఎవరికైనా ఉండవలసిందే..

అయితే సమాజంలో వందలు, వేలకోట్ల సంపద ఉన్న వారెందరో ఉన్నారు.

కొందరికి ఇంత వరకే సంపద ఉండాలని హద్దులు పెడుతున్నప్పుడు ..కొందరి వద్ద వందలు, వేలకోట్ల సంపద ఉండకూడదు కదా!

నోట్లు, బంగారం సంగతి  అలా ఉంచితే భూమి సంగతి ?  పారిశ్రామిక వేత్తలకు, అనేక సంస్థలకు ప్రభుత్వాలే వందల ఎకరాలను ఇస్తున్నాయి.

భూమి లేని ప్రజలెందరో ఉండగా కొన్ని దేశవిదేశీ  సంస్థలకు వందల ఎకరాలు కట్టబెడుతున్నారు.

భవిష్యత్తులో ప్రభుత్వానికి భూమి కావాలంటే మళ్ళీ సామాన్యప్రజల వద్ద సేకరిస్తారు కాబోలు.

ఇక, బ్యాంకుల నుండి లక్షల కోట్లు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించని ధనవంతులను ఏం చేస్తున్నారు?


ఇక, వ్యవసాయంపై వచ్చే ఆదాయానికి పన్ను లేకపోవటం అనే కారణంవల్ల చాలామంది ధనవంతులు ..భూమి కొని  పన్ను కట్టకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.


  సామాన్య, మధ్యతరగతి రైతులకు పన్ను వేయకుండా పెద్దమొత్తంలో వ్యవసాయభూములు ఉన్న వారిపై పన్ను వేస్తే  ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వస్తుంది.

ప్రజలందరికి సంబంధించిన ఖనిజాలు ...మొదలైన సహజసంపదలను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇస్తున్నారు. ఆ సంస్థలు వందలు, వేల కోట్లు ఆర్జిస్తున్నారు.


 టాక్స్ చెల్లించినా కూడా వారివద్ద వందలు, వేల కోట్ల ఉంటున్నప్పుడు.. ప్రజలకు చెందవలసిన సొమ్ము కొందరు ప్రైవేటు వ్యక్తులు పొందటం అన్యాయం కాదా?

నష్టాలు వస్తున్నాయని చెప్పి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయటం కాకుండా ..ప్రభుత్వరంగ సంస్థలను   ప్రభుత్వాలే సమర్ధవంతంగా నిర్వహించితే  చాలా ఆదాయం వస్తుంది.


 ప్రజలసొమ్ముతో నేతలు ఎన్నో సౌకర్యాలు ఏర్పర్చుకుంటున్నారు. దేశంలో జరిగే పెద్ద, చిన్నా ఫంక్షన్లకు నేతలు, అధికార్లు  విమానాలలో, కార్లలో వచ్చిపోవటానికి ఎంతో ప్రజల సొమ్ము ఖర్చవుతుంది. ఇక పార్టీల ఎన్నికల ఖర్చు సంగతి సరేసరి. 


 దేశంలో   సొమ్ము ప్రజలందరికీ న్యాయంగా అందాలి. ప్రభుత్వాలు ప్రజలను లెక్కలు అడుగుతున్నట్లు..ప్రభుత్వాలు కూడా ప్రజలకు లెక్కలు చెప్పవలసి ఉంటుంది.


 స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా దేశంలో ఇంత పేదరికం ఎందుకు ఉందో? ప్రభుత్వాలు ఎందుకు సమర్ధవంతంగా పనిచేయలేదో ? వంటి ప్రశ్నలు ప్రజలు కూడా వేస్తారు.


 అయితే చాలామంది ప్రజలలో కూడా అవినీతి బాగా పెరిగింది. అందువల్ల ఇప్పుడు ఎవరూ ఎవరినీ .. ఇదేమిటని...అడిగే  పరిస్థితి ఎక్కువగా  లేదు.


సమాజంలో ఉన్న  ఆర్ధిక అసమానతలు పోవాలంటే కొందరి వద్ద ఎక్కువ సంపద ..కొందరి వద్ద తక్కువ సంపద ఉండకూడదు.కనీసం విపరీతమైన  అసమానతలు ఉండకూడదు.

నల్లడబ్బు ఉన్న బడావ్యక్తులను పట్టుకోకుండా సామాన్య, మధ్యతరగతి వాళ్ళకు ఎక్కువ ఆంక్షలు విధిస్తున్నారనే అభిప్రాయాన్ని  ఎక్కువమంది ప్రజలు వ్యక్తపరచటాన్ని ప్రభుత్వం గమనించాలి.

************** 
కొన్ని విషయాలు ఏమిటంటే, 

పాతకాలంలో కొందరు స్వార్ధపరులు, ప్రాచీన గ్రంధాలలోని విషయాలను సరిగ్గా అర్ధం చేసుకోని వారు .. శూద్రులను చిన్నచూపు చూసేవారు. ఆ విధంగా శూద్రులు కష్టాలను అనుభవించారు. 

 కాలక్రమేణా శూద్రులలో కూడా కొన్ని కులాలు ఏర్పడ్దాయి. కొందరు ఆర్ధికంగా అభివృద్ధిచెందారు. కొందరు ఆర్ధికంగా ఎదగలేకపోయారు.

ఆర్ధికంగా ఎదిగిన శూద్రులలో కొందరు , తమకన్నా ఆర్ధికంగా క్రిందస్థాయిలో ఉన్న  శూద్రులను చిన్న చూపు చూడటం కూడా  జరిగింది. 

ఆధునిక కాలంలో రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. 

  కొందరు ఏమంటున్నారంటే, ఆర్ధికంగా అడుగున ఉన్నవారు అన్ని కులాల్లోనూ ఉన్నారు కాబట్టి ,మాకూ రిజర్వేషన్లు కావాలంటున్నారు.

మరి కొందరు ఏమంటున్నారంటే, పాతకాలంలో శూద్రులు వివక్షకు గురయ్యారు కాబట్టి, ఆర్ధికస్థితితో  సంబంధం లేకుండా, కులాల ప్రకారమే రిజర్వేషన్లు ఉండాలని అంటున్నారు.

అలా అయితే , ఇప్పుడు శూద్రులలో ఉన్నతకులాలుగా గుర్తించబడిన కులాల వారి పూర్వీకులు పూర్వకాలంలో వివక్షకు  గురయిన వారే .. అందువల్ల ఇప్పుడు  శూద్రులలో అన్ని కులాలకూ రిజర్వేషన్లు ఇస్తారా?

 అన్నికులాల వారిలోనూ పేదరికంతో బాధలు పడుతున్న వాళ్ళెందరో ఉన్నారు. 

ఒక ఉదాహరణ గమనిస్తే,  రిజర్వేషన్లు ఉన్న ఒక కుటుంబంలో తల్లితండ్రి ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు.వారు ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉన్నారు. 

ఇంకొక రిజర్వేషన్లు లేని కుటుంబం వారు  మధ్యతరగతికి చెందిన వాళ్ళు.

రెండు కుటుంబాల వారి అమ్మాయిలు వైద్యవృత్తిలో సీటు సంపాదించడం కొరకు బాగా కష్టపడి చదివారు. అయితే, ఇద్దరికీ మార్కులు బాగానే వచ్చాయి.

అయితే,రిజర్వేషన్లు లేని అమ్మాయికి సీటు రాలేదు. రిజర్వేషన్లు ఉన్న అమ్మాయికి  సీట్ లభించింది.

 తాను రిజర్వేషన్ లేని కులానికి చెందటం వల్లే తనకు సీట్ రాలేదని సీట్ లభించని అమ్మాయి వాపోవటం జరుగుతుంది.

 ఇలాంటప్పుడు మనుషుల మధ్య అసహనం, కులాల మధ్య విభేదాలు పెరిగే అవకాశముంది. 

అయితే, వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావటం ఎంతో అవసరం. వారికి ఆర్ధికంగా చేయూత నివ్వాలి. 

అదే సమయంలో రిజర్వేషన్లు లేని కులాలలో పేదవారికి కూడా ప్రోత్సాహాలు ఇస్తే బాగుంటుంది.
...............
పాతకాలమైనా, ఆధునికకాలమైనా, ఏ కులం వాళ్ళ పట్లా ఏ కారణం చేతనైనా వివక్ష ఉండకూడదు. 

 అందరికీ  అవకాశాలుండాలి.  అందరూ బాగుండాలి.ఎవరూ పేదరికంలో బాధపడకూడదు.

ఆశ్చర్యమేమిటంటే, రిజర్వేషన్లు ప్రవేశపెట్టబడి ఇన్నేళ్ళయినా.. దేశంలో పేదరికంతో బాధలు పడుతున్న వారెందరో ఉన్నారు.

పేదరికం పోకపోవడానికి సంపద కొందరి వద్దే ప్రోగుపడటం ముఖ్యకారణం.  


Wednesday, November 30, 2016

దేశంలో పరిస్థితి గురించి కొన్ని విషయాలు ..2..

 
 
కొన్నినెలల క్రిందట ఒకసారి నేను  మనియార్డర్ చేయటానికి పోస్టాఫీసుకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన కొన్ని విషయాలు చెబుతాను. 

పోస్టాఫీసులో కొందరు వృద్ధులు ఉన్నారు.వాళ్ళు పెన్షన్ల కోసం వచ్చారట.


పోస్టాఫీసులో పెన్షన్లు ఇస్తున్నారని పేపర్లో  రాసారు.మైకులో చెబుతున్నారు. అందుకని వచ్చామని అడుగుతున్నారు. 


అయితే పోస్టాఫీస్ వాళ్ళు ఏమంటున్నారంటే ..


వార్తలు వచ్చాయి గానీ,  మాకు ఇంకా డబ్బు అందలేదు. మేం ఏం చెయ్యం? రేపు డబ్బు వస్తుందేమో? మళ్ళీ రండి అంటున్నారు. 


 ఆ వృద్ధులలో దూరం నుంచి ఎండలో నడిచి వచ్చిన వారూ ఉన్నారట.


 ఇక చేసేదేమీ లేక వృద్ధులలో కొందరు తిరిగి వెళ్ళారు.


 ఇది చూసిన తరువాత నాకు ఏమనిపించిందంటే... 


 ఈ రోజు పోస్టాఫీసుల నుండి వృద్ధులకు డబ్బు వస్తుందని వార్తలలో చెబుతున్నారు..పోస్టాఫీసుకు వెళ్తే డబ్బు రాలేదంటున్నారు.


అయితే, ఇప్పుడు ఈ వృద్ధులు ఇంటికి వెళ్తే.. 


ఇంట్లో వాళ్ళు , ఈ వృద్ధుల మాటలు నమ్మకుండా ఆ డబ్బు ఏం చేసావని ?  వృద్ధులని అనుమానించే పరిస్థితి కూడా ఉండొచ్చు...అనిపించింది.


ఇలా రకరకాల సంఘటనలు ఉంటాయి. 


దేశంలో..  ఇప్పటికిప్పుడు   డిజిటల్ లావాదేవీలంటే ఎన్నో కోణాల నుంచి ఆలోచించాలి.  ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.


**********

మేము కొన్నేళ్ళు చెన్నైలో ఉన్నాము.మాకు తమిళ్ సరిగ్గా రాదు.


అయితే షాపింగ్ కొరకు మాల్స్ కు వెళ్తే కార్డ్ వాడటం వల్ల మాటతో పనిలేకుండా సరుకులు కొనుక్కునే అవకాశం ఉండేది. 


అయితే, షాపులలో కార్డ్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటున్నారు.


 బిల్ చెల్లించటం కొరకు షాప్ వాళ్ళకు కార్డ్ ఇచ్చి మరిన్ని సరుకులు కొనటానికి వెళ్ళకూడదు. 


కార్డ్ పక్కకు తీసుకెళ్ళి నెంబర్ కనుక్కుని ఎక్కువ డబ్బు తీసుకునే అవకాశముందని తెలిసినవాళ్ళు చెబుతున్నారు. 


అందువల్ల,  కార్డ్ ఇచ్చి బిల్ చెల్లించి వెంటనే కార్డ్ తీసుకోవాలి.


( మామూలుగా అయితే షాప్ వాళ్ళు  
కార్డ్ వెంటనే ఇచ్చేస్తారు.)


అయితే, మోసం చేయాలనుకుంటే ఎన్నో పద్దతులుంటాయి. 


వినియోగదారులు గట్టిగా అడగాలన్నా విషయం సరిగ్గా తెలియని పరిస్థితి ఉండొచ్చు..


**********
కొన్ని విదేశాలలో.. షాపుకు వెళ్ళి వస్తువులపై ఉన్న ధరల సూచిని మిషన్ వద్ద చూపించి మనమే సొంతంగా బిల్ చెల్లించే ఏర్పాట్లు కూడా ఉన్నాయట.


 (అంటే, మన వద్ద ఉన్న కార్డ్ షాప్ వాళ్ళకు ఇవ్వకుండా  మనమే కార్డ్ తో బిల్ చెల్లించవచ్చన్నమాట.)


కార్డ్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి .. మన నెంబర్ ఇతరులు చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 


తరచు సిం మార్చటం మంచిదంటున్నారు.


 ఏమైనా ఇకమీదట దేశంలో సైబర్ నేరాలు ఎక్కువ కాకుండా  జాగ్రత్తలు తీసుకోవాలి.


ప్రస్తుతానికి 100, కొత్త 500 నోట్లు అందుబాటులోకి తెచ్చి ప్రజల సమస్యలు తీర్చాలి. 


క్రమంగా నగదురహిత లావాదేవీల గురించి నేర్చుకోవచ్చు.



దేశంలో పరిస్థితి గురించి కొన్ని విషయాలు ..1..

 
సైబర్  నేరాల  వల్ల బాగా చదువుకున్న వాళ్ళుకూడా మోసానికి గురవుతున్న ఈ రోజుల్లో.. 
టెక్నాలజీ అంతగా తెలియని వాళ్ళు ఎక్కువగా మోసపోయి డబ్బుపోగొట్టుకునే అవకాశాలున్నాయి. 
............

మనదేశంలో ఎక్కువమంది ప్రజల ఆర్ధికపరిస్థితి అంతంత మాత్రమే. వాళ్ళలో కొందరు  పెద్ద మాల్స్ కు  వెళ్ళటానికి  జంకుతారు. 

ఉదా ..మా బంధువుల ఇంట్లో పనిచేసె అమ్మాయి కుక్కర్ కొనుక్కోవాలనుకుందట. 

కుక్కర్ అమ్మే షాపుకు వెళ్ళటానికి తనకు జంకు అని చెప్పి, ఇంటామెతో   తనకు మంచి కుక్కర్ కొని తెమ్మని ..డబ్బు తానే ఇస్తానని  అడిగిందట. 

ఇది ఎందుకు రాసానంటే.. ఇలాంటి పరిస్థితి ఉన్న దేశంలో   ప్రజలు ఉన్నపళాన అందరూ నగదురహిత లావాదేవీలు చేయాలంటే ప్రజలకు కష్టమవుతుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు గ్రామీణులు సరుకులు కొనుక్కోవటానికి వీలుగా గ్రామాలలో మాల్స్ ఏర్పాటు చేస్తామంటున్నారు. 

అక్కడే కుక్కర్లు  వంటి వస్తువులు కూడా అందుబాటులో ఉంటే బాగుంటుంది.

***********
ఇంకో సంఘటన చెబుతాను. మాకు ఇంట్లో అంతర్జాలం సౌకర్యం ఉంది. నేను ఒకసారి దేవాలయానికి ఆన్ లైన్ ద్వారా కొంత సొమ్ము పంపాలనుకున్నాను. 

నాకు చేతకాకుంటే ఇంట్లో వాళ్ళు సహాయం చేసారు. ఇంకోసారి ఆన్ లైన్లో ప్రయత్నిస్తే కుదరలేదు.

దగ్గరలోని పోస్టాఫీస్ కు వెళ్ళి మనియార్డర్ చేసాము. 

ఇంకొకసారి, మనియార్డర్ చేద్దామని వెళ్తే అక్కడి సిబ్బంది మిషన్ పనిచేయటం లేదన్నారు. 

బాగవటానికి ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేమని అన్నారు. 
************

పోస్టాఫీసుకు వచ్చే వాళ్ళలో చదువు అంతగా రాని వాళ్ళు , చదువు వచ్చినా అప్లికేషన్స్ రాయటం చేతకాని వాళ్ళు కూడా ఉంటారు. 

నేను పోస్టాఫీస్ వద్ద ఉన్నప్పుడు ఒకామె వచ్చి ఏదో అప్లికేషన్  చూపించి,  రాసిపెట్టమని నన్ను అడిగింది. అవన్నీ నాకు తెలియదు.

 తెలిసీతెలియక నేను ఏదో రాస్తే తప్పులు వస్తే కష్టమని భావించి అప్లికేషన్ రాయటం నాకు తెలియదని చెప్పాను. ఆమె  వెళ్ళిపోయింది.

 ఇలాంటి దేశంలో అంతా నగదురహిత పద్ధతులు అంటే ..

.చదువు రానివాళ్ళు ప్రతిదానికి ఇతరుల సహాయం అడగవలసి వస్తుంది.అప్పుడు వాళ్ళను  మోసం చేసే వాళ్ళూ ఉంటారు. 

ప్రజలు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

వైద్యవృత్తిలో ఉన్నవాళ్ళలో కూడా బ్యాంకింగ్ గురించి సరిగ్గా తెలియనివారున్నారు. 

వారిలో కొందరు వివరాల కోసం బ్యాంక్ వాళ్ళను, సిఏ వాళ్ళను అడుగుతారు. ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఎవరి పని బిజీ వాళ్ళది. 

ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలనూ అందరూ తెలుసుకోవాలంటే ఎలా కుదురుతుంది ?
..............
ఇందువల్ల అందరూ డిజిటల్ లావాదేవీలకు మారటం కంటే ..పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపేటప్పుడు డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత ఇవ్వటం ..చిన్నమొత్తంలో లావాదేవీలు జరిపేటప్పుడు నగదు వాడటం జరిగితే బాగుంటుంది.