ఒక సినిమా తీయాలంటే దాని వెనుక ఎందరో వ్యక్తుల అవసరం ఉంటుంది.
కెమెరామెన్, ఎడిటర్, సంగీతాన్ని , కధను, మాటలను అందించేవారు , లైట్ బోయ్స్, మేకప్ వాళ్ళు, ఆహారాన్ని , దుస్తులను సప్లయ్ చేసేవాళ్ళు, వాహనాలను నడిపేవారు...ఇలా ఎందరో సమిష్టిగా కృషి చేస్తేనే సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.
( సమాజం సజావుగా నడవాలన్నా ఎన్నో వృత్తుల వారి అవసరం ఉంది. )
ఇక సినిమాకు నిర్మాత, దర్శకుడు , ఇతర నటీనటుల కృషి ఎంతో ఉంటుంది. అయితే, ప్రేక్షకులు ఏం చేస్తారంటే,
హీరోహీరోయిన్స్ ను మాత్రమే ఆకాశానికి ఎత్తేసి గౌరవిస్తారు. వారికే ఎక్కువ పారితోషికమూ లభిస్తుంది.
అందరి కష్టమూ ఒకటే . తెర వెనుక పనిచేసేవారు కూడా ఎంతో కష్టపడతారు. అయినా వారికి హీరోహీరోయిన్స్ తో సమానంగా పేరు గానీ డబ్బు గానీ రాదు.
......................................
ఒక పెద్ద వ్యాపారసంస్థ ఉంటుంది అందులో చైర్మన్ ఆఫీసుకు రాగానే అందరూ నిలబడి విష్ చేస్తారు. ఆ సంస్థలో చిన్న ఉద్యోగి వస్తే ఎవరూ విష్ చేయరు.
ఆఫీస్ సరిగ్గా నడవాలంటే చైర్మన్, క్లర్క్ ఇద్దరూ అవసరమే , ఇద్దరూ రోజంతా కష్టపడతారు. అయితే ఇద్దరికీ జనం ఇచ్చే మర్యాదల్లో ఎంతో తేడా, ఇద్దరూ అందుకునే జీతభత్యాల్లో విపరీతమైన అంతరం.
.............................
ఒక రోడ్ ప్రక్కన బిచ్చగాడు అద్భుతంగా చిత్రాలు వేస్తాడు. జనం చిల్లర నాణేలు ఆ చిత్రం పై వేసి వెళ్తారు.
ఒక ప్రముఖ వ్యక్తి వేసే చిత్రాలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. ఎన్నో అవార్డులు లభిస్తాయి.
రోడ్డు ప్రక్కన చిత్రాలు వేసే అతనికి ఏ గుర్తింపూ లభించదు. ఏ అవార్డులూ అతనిని వరించవు.
...........................
ఇలా ప్రపంచంలో ఎన్నో అసమానతలు జరుగుతున్నాయి.
ఈ అసమానతలకు కులంతో సంబంధం లేదు. ఇప్పుడు డబ్బు, అధికారం ఉన్న వారిదే రాజ్యంలా ఉంది.
డబ్బు, అధికారం ఉన్న వాళ్ళు శూద్ర కులానికి చెందినా అందరూ గౌరవిస్తారు.
డబ్బు, అధికారం లేనివాళ్ళు బ్రాహ్మణకులానికి చెందినా గౌరవించటం లేదు.
అందరికీ సమానంగా హోదా, జీతభత్యాలు ఉన్నప్పుడే ఈ అసమానతలు తొలగిపోతాయి. మరి ఇలా చేయటానికి ఎందరు ఒప్పుకుంటారు?
అందరూ సమానమే అనే వారు ..... రోజంతా కష్టపడే ఒక కూలీకి, రోజంతా కష్టపడే ఒక ఉన్నత స్థాయి ఉద్యోగికి ఒకే రకంగా హోదా, జీతభత్యాలు ఇస్తే ఒప్పుకుంటారా ?
.................................................
