koodali

Friday, November 17, 2017

పోలి కధ ( క్లుప్తంగా ..) నాకు కలిగిన కొన్ని ఆలోచనలు..


ఒక ఊరిలో చాకలి కుటుంబానికి చెందిన  పోలి అనే పేరుగల ఆమె ఉండేది. ఆమెకు అత్తగారు, తోటికోడళ్ళు ఉండేవారు. 

కార్తికమాసంలో పోలి అత్తగారు మరియు తోటికోడళ్ళు మాత్రం  రోజూ  నదీ స్నానానికి వెళ్ళి దీపాలు వెలిగించేవారు. 

పోలికి  మాత్రం ఆ అవకాశం ఇచ్చేవారు కాదు.  పోలి ఇంట్లో బోలెడు పని చేస్తుండేది. 

  అయితే,  పోలి  ఇంట్లో కొద్దిపాటి వెన్నతో , పత్తితో వత్తి చేసి  దీపం వెలిగించుకుని   దైవప్రార్ధన చేసుకుని,  అత్తగారు చూస్తే తిడుతుందనే భయంతో దీపాన్ని  బాన క్రింద దాచేసింది.  

ఎంతో భక్తితో దైవాన్ని  ప్రార్ధించుకుంది.  దేవతలు పోలి భక్తికి మెచ్చి , ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్ళడానికి  పుష్పక విమానంలో  వచ్చారు. 


  దూరం నుంచి పుష్పకవిమానాన్ని చూసిన  పోలి అత్త,  తోటికోడళ్ళు  ఆ విమానం తమకోసమే గావన్ను ..అనుకుని పరుగెత్తుకుంటూ వచ్చారు.  

అయితే,  పుష్పక విమానం రావటం  వారి కోసం కాదని   తెలుసుకున్నారు.   

 పోలి అత్త , తోటికోడళ్లు ..పుష్పక విమానం అంచులను పట్టుకునైనా స్వర్గానికి వెళ్ళాలని ప్రయత్నించారు కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. 
 
 పోలి..   తన  అత్తగారినీ,  తోటికోడళ్లను కూడా స్వర్గానికి తీసుకువెళ్ళమని దేవతలను కోరగా .. దేవతలు  ఒప్పుకోలేదు .   

పోలి మాత్రం స్వర్గానికి వెళ్ళటం జరిగింది.  

 ***********
ఈ కధ  వింటే  నాకు   కలిగిన కొన్ని ఆలోచనలు  ఏమిటంటే .. 

ఎన్నో  నియమాలను పాటిస్తూ పూజ చేయటం పోలికి కుదరకపోయినా , ఆమెకు ఉన్న భక్తి  మరియు సత్ప్రవర్తన వల్ల ఆమె స్వర్గానికి అర్హురాలయ్యింది.

 మరియు ఈ కధ ద్వారా ఏం తెలుస్తుందంటే,  స్వర్గానికి వెళ్లటానికి కులంతో సంబంధం లేదు,  భక్తి మరియు సత్ప్రవర్తన ఉంటే చాలని తెలుస్తుంది. 

ఇంకా, కొందరు స్త్రీలు ..సాటి స్త్రీలను ఎలా కష్టపెడతారో  కూడా  పోలి అత్తగారు, తోటికోడళ్ళ  పాత్రల ద్వారా తెలుస్తుంది. 

 ఎంత పద్ధతిగా  పూజ చేసినా,  పూజతో పాటు  భక్తి మరియు  సత్ప్రవర్తన కూడా  ఉంటే  చక్కటి ఫలితం లభిస్తుందని  అనిపించింది.

*************

వ్రాసిన వాటిలో  తప్పులు  ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 


No comments:

Post a Comment