koodali

Friday, September 29, 2017

పూర్ణాలు..గారెలు..విప్పింగ్ బ్లేడ్..పులిహోర..


పూర్ణాల తయారీకి.. ఉడికించిన శనగపప్పును..బెల్లం పాకంపట్టి ఉండలా తయారుచేసేటప్పుడు కొన్నిసార్లు త్వరగా దగ్గరపడదు. 


అలాంటప్పుడు పాకం గట్టిపడటానికి .. చివరిలో.. కొంచెం వేయించిన శనగపప్పును ( పుట్నాల పప్పును) మిక్సీలో పిండి కొట్టి, ఆ పొడిని పాకంలో కలిపితే వెంటనే గట్టిపడి ఉండ చేయటానికి వీలవుతుంది. 


అయితే తీపి తక్కువకాకుండా, వేయించిన శనగపొడిని కొద్దిగా వేసుకోవాలి.  తీపి తగ్గితే కొంచెం బెల్లం పొడి కలుపుకోవచ్చు.


సూచన.. వేయించిన శనగపప్పు పొడిని ముందే కలపకూడదు, పాకం త్వరగా రాని పరిస్థితిలో  మాత్రం చివరిలో కలుపుకోవచ్చు.
 
కొబ్బరిపొడి కూడా కలపొచ్చు.
...........
 
పూర్ణాలు పైపూత పిండికి ఒకకప్పు మినప్పప్పు నానబెట్టి రుబ్బి, ఒకకప్పు బియ్యంపిండిని నీటితో ఉండలు లేకుండా కలిపి  నానబెట్టి, రుబ్బిన మినప్పిండిలో కలపాలి. ఒకకప్పు మినప్పప్పుకు ఒకటిన్నరకప్పుల బియ్యంపిండి కూడా వేయవచ్చు.
 
 కొందరు ఒక కప్పు మినపప్పుకు అరకప్పు బియ్యం నానబెట్టి రుబ్బుతారు. మరికొందరు ఒకకప్పు మినపప్పుకు రెండు కప్పుల బియ్యం నానబెట్టి రుబ్బుతారు. పూర్ణాలు కొందరికి మెత్తగా ఉంటే ఇష్టం, కొందరికి క్రిస్ఫీగా ఉండాలి. దానినిబట్టి బియ్యం వేసుకోవాలి.

 పూర్ణాల పైపూత పిండి మరీగట్టిగా ఉండకూడదు, పలుచగా కూడా ఉండకూడదు.

**************
గారెల కు మినపప్పును నానబెట్టిన  గిన్నెను  ఫ్రిజ్ లో పెట్టి ..  నానిన తరువాత మిక్సీలో రుబ్బితే బాగుంటాయి. చల్లటి నీరు or అయిస్ క్యూబ్స్ కూడా వేస్తారు.

గారెలు మృదువుగా రావటానికి..పొట్టుతో ఉన్న మినపపప్పు అయితే జిగురు ఉంటుందని కొందరు పొట్టు ఉన్న పప్పు వాడతారు. రోటిలో రుబ్బుతారు. ఈ మధ్య గ్రైండర్ వాడుతున్నారు.

 అయితే కొంచెం  మాత్రమే  పప్పు రుబ్బవలసి వచ్చినప్పుడు కొందరు గ్రైండర్ వాడరు. 

గారెలు మిక్సీలో మృదువుగా రావాలంటే పొట్టుతో ఉన్నపప్పు వాడవచ్చు. 

పొట్టులేని పప్పును సుమారు .. రెండు లేక మూడు గంటలు  నానబెట్టి మిక్సీలో ఎక్కువ నీరు పోయకుండా కొద్దిగా గట్టిగా రుబ్బుకోవాలి. 

అప్పుడు విప్పింగ్  బ్లేడ్ ( గుండ్రంగా ఉన్న బ్లేడ్ ...) ఉన్న జార్ లో రుబ్బిన పిండిని వేసుకోవాలి. ఇప్పుడు అవసరమైతే కొద్దిగా నీరు పోసి  తిప్పితే,  పిండి పొంగినట్లు అవుతుంది. 

విప్పింగ్  బ్లేడ్ వల్ల పిండి  మృదువుగా అవుతుంది. అలాగని మరీ ఎక్కువ నీరు పోయకూడదు.  
ఈ పిండితో అప్పుడే గారెలు వేసుకోవచ్చు. లేక ఫ్రిజ్ లో పెట్టి  కొంతసేపు తరువాత వేసుకోవచ్చు.

***************
గారెలకు విప్పింగ్  బ్లేడ్ ( గుండ్రంగా ఉన్న బ్లేడ్ ...) ఎందుకంటే,  గారెలు మృదువుగా రావటానికి,  రుబ్బిన పిండిని చేతితో సుమారు రెండు లేక మూడు నిమిషాలు తడతారు.

రుబ్బిన గారెలపిండిని చేతితో తట్టడం వలన పిండిలో గాలి బుడగలు ఏర్పడి, గారెలు బోలుగా వస్తాయి. 

అయితే, ఇలా చేతితో తట్టడం కన్నా, రుబ్బిన పిండిని విప్పింగ్ బ్లేడ్ ఉన్న జార్ లోకి మార్చి రెండు, మూడు రౌండ్లు రుబ్బితే  పిండి పైకి పొంగుతుంది. 


. అలాగని  ఎక్కువసేపు విప్పింగ్ బ్లేడ్ ఉన్న జార్ లో రుబ్బ
కూడదు.

************
కొందరు మినప్పప్పులో వేడినీళ్లు పోసి అర్ధగంట నానబెట్టి రుబ్బి, పిండిని 3 నిమిషాలు చేతో తట్టి (పిండి తేలికగా అయ్యేలా ఏరినేషన్ చేయటం)అప్పటికప్పుడు గారెలు వేస్తారు. లేదంటే, ఆ పిండిని ఫ్రిజ్లో పెట్టి మరుసటి ఉదయం గారెలు వేసుకోవచ్చు. 
 ................................
 
  గారెల పిండిని రుబ్బేటప్పుడు, మరీ నీరు తక్కువ పోసి రుబ్బితే  పిండి మరీగట్టిగా ఉండి ..గారెలు గట్టిగా  ఉంటాయి. నీరు ఎక్కువపోస్తే నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి.  
  
పాతపప్పు..కొత్తపప్పు రకాన్ని బట్టి,  ఒక కప్పుపప్పుకు బొటాబొటిగా కాకుండా, బాగా ఎత్తుగా నిండుగా పోసినప్పుడు,  పావుకప్పు నుంచి అరకప్పుకు కొంత తక్కువగా నీరు పడుతుంది.

నానిన మినప్పప్పులో నీటిని మొత్తం వడపోసి,  ఏ కప్పుతో మినప్పప్పు తీసుకుంటామో అదే కప్పుతో నీటి కొలత తీసుకుంటే, మినప్పప్పు రకాన్ని బట్టి, నీరు కొద్దిగా అటు ఇటుగా పడుతుంది. 
 
మామూలుగా అయితే, ఒక కప్పు మినప్పప్పుకు పావుకప్పు నీరు  లేక అరకప్పు కన్నా కొద్దిగా తక్కువ అంటే ( పావుకప్పుకన్నా కొద్దిగా ఎక్కువ నీరు) పోయవచ్చు. కొన్నిసార్లు అరకప్పు కూడా పోయవచ్చు.
 
 గారెలు పిండి రుబ్బేటప్పుడు కొద్దిగా నీళ్లు ఇంకా, కొద్దిగా నూనె కూడా వేసి రుబ్బవచ్చు. పప్పు కొంత రుబ్బాక, నూనె వేసి మరికొంతసేపు రుబ్బొచ్చు.
  
 పప్పును  చిన్నమిక్సీ జార్ లో , పెద్దజార్ లేక మీడియం సైజ్ జార్ లో రుబ్బినా మంచిదే. 

రుబ్బిన గారెల పిండి కొద్దిగా నీటిలో వేస్తే పిండి పైకి తేలాలి. అపుడు సరిగ్గా రుబ్బినట్లు అంటారు.  పిండిని రుబ్బాక ఫ్రిజ్లో పెట్టి తరువాత గారెలు వేస్తే కూడా బాగా వస్తాయి.  గారెలు వేగేటప్పుడు పెద్ద మంట, చిన్న మంట కాకుండా, మధ్యస్థాయి మంటపై  వేగాలి.
 
అరకేజి మినప్పప్పుకు, సుమారు 30 గారెలు (మీడియం సైజు) వేయవచ్చు.

**************
 మా ఇంట్లో అదివరకు సుమీత్ మిక్సీ ఉండేది. దానికి పెద్ద సైజు స్టీల్ విప్పర్ బ్లేడ్ కూడా ఇచ్చారు..ఈ మిక్సీలో బ్లేడ్లు  మార్చుకోవచ్చు. గారెలు పిండి రుబ్బిన తరువాత విప్పర్ బ్లేడ్ మార్చి, మళ్ళీ కొద్దిసేపు మాత్రమే మిక్సీలో పిండి తిప్పితే,  పిండి బాగా పొంగేది. గారెలు చక్కగా వచ్చేవి.

ఇప్పుడు వేరే మిక్సీలలో అంత చక్కటి విప్పర్ బ్లేడు కనిపించలేదు. చిన్నవి ద్రవపదార్ధాలు విప్పింగ్ చేయటానికి ఇస్తున్నారు. ఫుడ్ ప్రాసెసర్ లో ప్లాస్టిక్  విప్పింగ్ అటాచ్మెంట్ ఉంటుంది.  విడిగా హాండ్ బ్లెండర్స్ కూడా లభిస్తున్నాయి.

బజ్జీల పిండి కూడా విప్పింగ్ చేస్తే పిండి పొంగుతుంది. బజ్జీల పిండిలో కొద్దిగా వేడి నూనె కూడా వేయవచ్చు.

***************
పులిహోర తయారీకి ..కొందరు, చింతపండును చాలాసేపు నానబెడతారు. అయితే అలా నానబెట్టకుండా ..కుక్కర్లో  చింతపండు కొద్దిగా నీరుపోసి ఉడికించి తీసుకుంటే సరిపోతుంది. 

ఉడికించిన చింతపండును పిండి, ఆ రసాన్ని చిల్లుల ప్లేటులో వడపోస్తే పిప్పి పైన ఉండి, రసం క్రిందకు వచ్చేస్తుంది.
 
పులిహోరకు.. ఒకటిన్నర కప్పుల బియ్యానికి, చింతపండు 50 గ్రాములు , సుమారు ఒకటిన్నర లేక రెండు  టీస్పూన్ల ఉప్పు పడుతుంది.

ఇవన్నీ చాలామందికి తెలిసిన విషయాలే కానీ, రాయాలనిపించి వ్రాసాను. 

**********************
 అల్యూమినియం గిన్నెల్లో వంటచేసి తింటే ఆరోగ్యానికి మంచిదికాదంటున్నారు కాబట్టి, అవి వాడటంలేదు. పైన కింద స్టీల్ మధ్యలో అల్యూమియంతో ట్రైప్లై గిన్నెలు తయారుచేస్తున్నారు.
 
 ఈ ట్రై ప్లై మూకుడు లో డీప్ ఫ్రై..అంటే కారప్పుస, బజ్జీలు వంటివి వేపితే గిన్నెకు నూనె జిడ్డు ఉండి తోమటానికి చాలా కష్టంగా ఉంది. పాతకాలపు స్టీల్ కడాయి జిడ్దు పట్టుకున్నా, కొంచెం గట్టిగా తోమితే పోయేది.
 
 ఫ్రై కూరలు కూడా ట్రైప్లై కడాయిలో ఎంతసేపు వేయించినా, ఎర్రగా వేగినట్లు కనిపించదు. 
 
బేకింగ్ సోడా, వెనిగర్ కలిపి జిడ్డును తోమితే,  పోతుందంటారు. ఇవన్నీ చేసి రుద్దటం, or  బాగాజిడ్డుగా ఉన్న గిన్నెను శుభ్రం చేయటానికి, ఎవరైనా పదునైన గరిట వంటిదానితో గీకటం, గట్టిగా  తోమగాతోమగా.. అల్యూమినియం బైటపడితే?
.......................

ఫ్రై చేసే వంటలకు మాత్రం కాపర్ బాటం ఉన్న కడాయి కానీ,
  ట్రిప్లై లేని కడాయి కానీ, కాప్సులేటెడ్ తయారి కడాయి కానీ వాడితే బాగుంటుంది.
 
  మేము కొన్ని సంవత్సరాల క్రిందట కొన్న కాపర్ బోటం స్టీల్ కడాయి ఇప్పటికి చాలా బాగుంది.
................... 
ట్రైప్లై కడాయ్ లో కూడా నూనె తక్కువ వేసి వేపుడు చేస్తే, కూరలు త్వరగా మాడుతున్నాయి.

డీప్ ఫ్రై కు ..Param Upayog  స్టీల్ కంపెని, Coconut స్టీల్ కంపెనీ వాళ్లు.. ట్రై ప్లై లేకుండా, అడుగుభాగం 3mm మందం కడాయిలు అమ్ముతున్నారు.
  స్టీల్ లో  14G , 16G.... స్టీల్ గిన్నెలు బాగుంటాట. 
 
PARAM UPYOG Heavy Stainless Steel Deep 3mm Kadhai/Kadai ... 
 
* 3mm కడాయి బరువుగా ఉంటుంది.
 ................
Praylady  కంపెని వాళ్లది 14G స్టీల్ కడాయ్ లభిస్తుంది, అయితే అడుగుమందం 2 mm ఉంటుంది.
...........................
 
  అడుగుభాగం పల్చగాఉన్న కడాయిలో తక్కువ నూనె వేసినప్పుడు కూరలు త్వరగా మాడే అవకాశముంది. గాస్ పొయ్యి మంట సమంగా వ్యాపించటానికి జల్లెడ(మెష్) వంటివి అమ్ముతున్నారు. దానిని పొయ్యిమీద పెట్టి, దానిపైన కడాయ్ పెట్టి వండితే పదార్ధాలు త్వరగా మాడవు. మెష్ పొయ్యిపైన పెట్టినవెంటనే అరనిమిషం ఎక్కువవేడి వస్తుందికానీ, తరువాత మంట సమంగా  వస్తుంది.

गैस स्टोव ऊर्जा सेवर नेट कवर, 14 सेमी गोल स्टील मेष, 2 का सेट, मिनी रोस्टर, स्टेनलेस स्टील मिनी तंदूरी


5 comments:

  1. గారెలపిండి రుబ్బేటప్పుడు మిక్సీ వేడి అయితే పిండి వేడెక్కి గారెలు చేదుగా అయే అవకాశముందట.

    .ఇలాంటప్పుడు కొద్దిగ చల్లటి నీరు పోస్తూ పిండి రుబ్బవచ్చని అంతర్జాలం ద్వారా తెలుస్తోంది.

    ReplyDelete

  2. పప్పు రుబ్బేటప్పుడు చల్లటినీరుపోసి రుబ్బితే గారెలు, ఇడ్లీలు బాగుంటాయని అంటారు.

    మిక్సీలో మినప్పప్పు రుబ్బేటప్పుడు వేడెక్కి పిండి చేదు రాకుండా కొందరు చల్లటి నీరు పోస్తారు.

    అలా కాకుండా, మినపప్పు నానటానికి పప్పులో నీరు పోసి, ఆ గిన్నెను ఫ్రిజ్లో పెట్టి, మూడుగంటల తరువాత తీసి వెంటనే రుబ్బుకోవచ్చు.

    ReplyDelete

  3. నాకు మరి కొన్ని ఆలోచనలు కూడా వచ్చాయి.

    పప్పు ఎక్కువసేపు నానబెట్టినప్పుడు పప్పులలో జీవం వికసించి కొంత మొలకలు కూడా వస్తాయి...

    ఆ పప్పులను రుబ్బేటప్పుడు పప్పులలోని జీవానికి నొప్పి కలుగవచ్చు.పప్పులను నానబెట్టడానికి ఫ్రిజ్లో పెడితే చల్లదనం వల్ల మొలక త్వరగా రాకపోవచ్చు.

    మొలకలు వచ్చినా కూడా, నీటిలోని చల్లనిదనం వల్ల రుబ్బేటప్పుడు వాటికి బాధ కొంత తగ్గుతుందేమో?
    మనుషులకు ఇంజక్షన్ ఇచ్చిన దగ్గర ఐస్ ముక్క పెడితే బాధ కొంత ఉపశమిస్తుంది కదా..అలాగ.

    ReplyDelete

  4. గారెలు కోసం మినపప్పును కొద్దిగా వేయించి, పొడి చేసి ఉంచుకుని, ఆ పిండితో కూడా గారెలు చేయవచ్చంటున్నారు.

    దోసెలకు కూడా కొందరు పప్పులను, బియ్యాన్ని ...కలిపి పిండి పట్టించుకుని ఉంచుకుంటారు.

    ReplyDelete
  5. దోసెలు వేయటానికి మందపాటి అడుగు భాగం ఉండే
    విధంగా పెనం తయారుచేస్తే బాగుంటుంది.
    ఉదా..స్టీల్ కుక్కర్లకు అడుగుభాగం మందంగా ఉంటుంది.అలాంటి పెనాలు తయారుచేస్తే దోసెలు బాగా రావచ్చు.

    ఇప్పుడు స్టీల్ పెనాలు, ట్రిప్లెయ్ పెనాలు అనేక రకాలు మార్కెట్లో వచ్చాయి.

    ఎందుకో ఆ స్టీల్ పెనాలు అనేవి కొన్ని ..స్టీల్ మెరుపు లేకుండా కొంత తెల్లగా ఉంటున్నాయి.

    కొన్ని స్టీల్ పెనాలు అడుగుభాగం పల్చగా ఉండటం వల్ల దోసెలు రావటం లేదని కొందరంటున్నారు.

    మట్టి పెనాలపై దోసెలు నిదానంగా కాల్తాయి.

    ఇనుప పెనాలపై దోసెలు బాగానే కాలుతాయి కానీ, పెనం తుప్పు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇనుపవి చపాతీకి బాగుంటాయి.

    దోసెలు వేయటానికి రాతి పెనాలు కూడా ఉన్నాయి.వాటిని జాగ్రత్తగా వాడుకుంటే బాగానే ఉంటాయి.

    ReplyDelete