koodali

Friday, September 15, 2017

మాకు తెలిసిన ఒక కుటుంబం ఇంకో మతం ..మరియు ..


 
మేము చెన్నైలో ఒక అపార్ట్మెంట్లో ఉండే రోజుల్లో  అపార్ట్మెంటుకు సెక్రటెరీగా ఒకామె ఉండేవారు. ఆమె బాగా చదువుకున్నామె . నాకు ఆమె గురించి ఎక్కువ విషయాలు తెలియవు.

 అయితే, అపార్ట్ మెంట్  లో  తెలుగు తెలిసిన ఒక పెద్దామె నాకు బాగా పరిచయం అయ్యారు. 

ఆ పెద్దామె ఎన్నో  కబుర్లు చెప్పేవారు. మాటల్లో సెక్రటరీ కుటుంబం గురించి కూడా కొన్ని విషయాలు తెలియజేసారు. 

ఉదా.. సెక్రటరీ,  శ్రీ కృష్ణజయంతి పండుగ రోజు  బాగా పూజలు చేస్తారట , సుమారు 21 రకాల పిండివంటలతో నైవేద్యం దేవునికి నివేదిస్తారట. 

ఒకసారి నేను ఒక పని గురించి సెక్రటరీ గారింటికి వెళ్ళాను. వారి ఇంట్లో  గమనిస్తే , వేరే మతం యొక్క చిత్రాలు గోడకు కనిపించాయి. ఈ విషయాన్ని నేను నాకు పరిచయం ఉన్న పెద్దామెతో చెపితే ఆమె ఆశ్చర్యపోయి నమ్మలేదు. 

కొంతకాలానికి సెక్రటరీ వాళ్ళు వేరే మతం ప్రకారం పూజలు చేస్తున్నట్లు బహిరంగంగా తెలిసింది ..ఈ విషయాన్ని పెద్దామె నాతో చెప్పి విపరీతంగా ఆశ్చర్యపోయింది.

నేను ఇంతకుముందే చెప్తే మీరు నమ్మలేదు కదా ! అన్నాను. 

సెక్రటరీ గారు  విషయాన్ని రహస్యంగా ఉంచటం వల్ల త్వరగా ఎవరికీ తెలియలేదు. 

విషయం బయటకు తెలిసిన తరువాత సెక్రటరీ గారి ఆచారవ్యవహారాలలో చాలా మార్పులు వచ్చాయి. 

అప్పటివరకూ విపరీతంగా  హిందూ ఆచారవ్యవహారాలను పాటించిన ఆమెలో అంత మార్పు ఎలా వచ్చిందో ? అని మాకు  ఆశ్చర్యం అనిపించింది.

కొద్దికాలం తర్వాత మేము మా సొంత కారణాలతో  ఆ అపార్ట్ మెంట్  మారి వేరే ఇంటికి వెళ్లటం వల్ల అపార్ట్ మెంట్   విషయాలు సరిగ్గా తెలియలేదు.

 అయితే, కొంతకాలం తర్వాత , మాకు తెలిసిన పెద్దామె ద్వారా కొన్ని విషయాలు తెలిసాయి. సెక్రటరీ మళ్లీ ఏమంటున్నదంటే , తమ పిల్లలకు హిందువులతోనే వివాహాలు జరిపిస్తామని చెప్పటం జరిగిందట.  తరువాత ఏం జరిగిందో తెలియదు.

 (ఈ సెక్రటరి గారు తమిళ బ్రాహ్మణులు.ఇది నిజంగా జరిగిన సంఘటన.)

వారు ఆలా ఎందుకు చేసారో నాకు తెలియదు. 

*******************

ఎవరి శక్తిని బట్టి వారు దైవప్రార్ధన చేసుకోవచ్చు. ..
ఎవరైనా మతం మారటానికి ఎన్నో కారణాలు ఉంటాయేమో? హిందువులలో కొందరు అంటరానితనం వంటి కారణాలతో బాధపడి మతం మారితే,కొందరు మారటానికి మరి కొన్ని కారణాలు కూడా ఉండవచ్చు.
 
ఇంకా మరికొన్ని విషయాలను గమనిస్తే, ఆధునిక కాలంలో ఆచారవ్యవహారాల్లో వచ్చిన విపరీతపోకడలు కూడా ఇందుకు కారణం కావచ్చు.


ఆచారవ్యవహారాల్లో  క్లిష్టత ఉన్నాకూడా ప్రజలు సరళంగా ఉండే విధానాలపట్ల మొగ్గుచూపే అవకాశం ఉంది. 

ప్రజల మంచికోసం ఎన్నో చక్కటి ఆచారవ్యవహారాలను ప్రాచీనులు తెలియజేసారు. 

అయితే ,ఆధునిక కాలంలో కొందరు ఆచారవ్యవహారాలను కొత్తగా మార్చుకుంటూ , తమకుతామే మోయలేనంతగా నెత్తిన వేసుకుని విసుగు తెచ్చుకుని..ఆచారవ్యవహారాలను ఆడిపోసుకోవటం న్యాయం కాదు కదా! 


ఆధునిక కాలపు పరిస్థితులను ఊహించిన పూర్వీకులు ఎన్నో విషయాలను తెలియజేసారు. 

ఉదా..కలికాలంలో కేవలం దైవనామాన్ని స్మరిస్తే చాలు ..గొప్ప ఫలితం లభిస్తుందని సడలింపులను తెలియజేయటం జరిగింది. 


**************

ఆచార వ్యవహారాలు అవసరమే, అయితే మూఢత్వం పెంచే విధంగా కాకుండా ఎవరి విచక్షణతో వారు పాటించటం అవసరం. 

ఆచారవ్యవహారాలను నిక్కచ్చిగా పాటించాలనుకుంటూ  విసుగు వచ్చేలా చేసుకోవటం కాకుండా..తమశక్తికి తగినంతలోనే పూజలు చేస్తూ దైవభక్తి ఎక్కువగా ఉండేలా నిలుపుకోవటం సరైన పద్ధతి అనిపిస్తుంది.


దీనికి సంబందించిన ఒక కధను పెద్దలు తెలియజేసారు. 

ఒక భక్తుడు భక్తి పారవశ్యంలో పూజ చేస్తూ దైవానికి అరటిపండ్లను నివేదించబోయి, భక్తి పారవశ్యంలో అరటిపండ్లను ప్రక్కన పడవేసి వాటి తొక్కలు తీసి దైవానికి నివేదిస్తారు. ఆ భక్తుని భక్తికి మెచ్చిన దైవం అతనికి దర్శనాన్ని అనుగ్రహించారని అంటారు.


 తరువాత కొంతసేపటికి భక్తుడు తాను చేసిన పొరపాటు తెలుసుకుని.. ఈ సారి  పొరపాటు రాకుండా పూజ చేయాలనే తాపత్రయంలో భక్తి కన్నా, పూజను చేసే విధానంపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించగా ఈసారి దైవం ప్రత్యక్షం కాలేదట.


 ఈ కధ ద్వారా ఏం తెలుస్తుందంటే,  పూజా విధానాలను, ఆచారవ్యవహారాలను చక్కగా పాటించటం మంచిదే కానీ, దైవంపై భక్తి అన్నింటికన్నా ముఖ్యం..  అని గ్రహించాలి.


శక్తి ఉన్నవారు ఆచారవ్యవహారాలను నిక్కచ్చిగా పాటించుకోవచ్చు. అంత ఓపిక లేనివారు తమకు వీలున్నంతలో పాటించుకోవచ్చు. ఎవరి శక్తిని బట్టి వారు దైవప్రార్ధన చేసుకోవచ్చు. 


అంతేకాని, తమకు శక్తి లేనప్పుడు  మోయలేనంతగా నెత్తిన వేసుకుని విసుగు తెచ్చుకుని..ఆచారవ్యవహారాలను ఆడిపోసుకోవటం న్యాయం కాదు కదా! 

*************

క్రింద వ్రాసిన విషయాలు..ఈ పోస్ట్ వేసిన కొంతకాలం తరువాత మరికొన్ని విషయాలను వ్రాసి, వాటిని ఇక్కడ పోస్ట్ చేయటం జరిగింది.


దైవశక్తి ఒకటే అన్నది నిజమే.  దైవం ఒక్కరే కాబట్టి అన్ని మతాలు కూడా ఒక్కటే అని, అన్ని మతాల దేవతలను సమానంగా పూజించే విశాలహృదయం అందరికి ఉండదు. కొందరు విశాలహృదయంతో ఉన్నా కూడా, విశాలహృదయం లేనివాళ్ల  వల్ల అందరికీ కష్టాలు వచ్చే ప్రమాదముంది.
 

 ఎవరి విశ్వాసాల ప్రకారం వారు దైవాన్ని ఆరాధించుకోవచ్చు. అయితే, మన నమ్మకాల వల్ల ఎవరికీ నష్టం కలగకూడదు. కొందరు ఇతరులను మతాలు మార్చడానికి నయానాభయానా ప్రయత్నిస్తారు. అలా చేయటం సరైనది కాదు. దైవం ఒకరే కానీ, ఎవరి మతం వారికి ముఖ్యమే కదా..


కొన్ని హిందు గ్రంధాలలో ఇతరమతదేవతల గురించి కూడా ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలో అర్ధం కాదు. అవి చదివి మనం కూడా ఇతరమతాల దేవతలను ఆరాధించాలా ఏమిటి? అని సందేహాలు కలుగుతాయి.  ఇలాంటి వాటిని చదివినప్పుడు అర్ధంకాక అయోమయంగా ఉంటుంది.అసలు అలా ఎందుకు వ్రాసారో దైవానికే తెలియాలి.


గ్రంధాలలో కొన్ని ప్రక్షిప్తాలు కూడా ఉన్నాయంటారు. ఏది ప్రక్షిప్తమో? ఏది కాదో?

***************

 కొందరు, సంపద, అధికారం కొరకు మతాన్ని వాడుకుంటారు. కొందరు మతపెద్దలు కూడా మతం విషయంలో అతిగా ఆలోచిస్తూ ప్రజలలో మూఢాచారాలు వ్యాప్తి చేస్తారు. ఇలాంటి వారి వల్ల ప్రభావితం కాకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రభావితమైతే ప్రజలకు కష్టాలు వచ్చే అవకాశాలున్నాయి.


 అయితే, మనం ఎంత మంచిగా ఉన్నా కూడా, అలాంటి వారి వల్ల ప్రభావితమయిన వారు కొందరు మనల్ని ఇబ్బంది పెట్టడం, దాడులు చేయటం..వంటివి చేసే అవకాశముంది. అందువల్ల, అందరూ ఒకటే.. అందరూ మంచివారే ..అనుకుంటూ నింపాదిగా బ్రతకటం కాకుండా, మన రక్షణ కొరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి.

No comments:

Post a Comment