koodali

Friday, November 6, 2015

ఆధునిక కాలంలో ..



ఆధునికులు కొందరు పాతకాలంలో సమాజం  అన్ని రంగాల్లోనూ  ఎంతో వెనుకబడి ఉందనీ .. ఆధునిక కాలంలోనే  ఎంతో అభివృద్ధి జరుగుతోందనీ వాదిస్తుంటారు.

అభివృద్ధి అంటే ఏమిటి ?


 ప్రపంచంలోని జీవజాతులు  వీలైనంతలో సుఖంగా తమ బ్రతుకులు తాము బ్రతికే పరిస్థితి ఉండటం  అభివృద్ధి. 


సమాజంలోని మనుషులు వీలైనంతలో  సుఖంగా తమ బ్రతుకులు తాము బ్రతికే పరిస్థితి ఉండటం అభివృద్ధి.


మరి, ఆధునిక కాలంలో మానవుల అంతులేని కోరికల వల్ల పర్యావరణకు జరుగుతున్న కాలుష్యం వల్ల ఎన్నో పశుపక్ష్యాదులు అంతరిస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. ఇది అభివృద్ధి అని ఎలా అంటారు ? 



మనుషుల పరిస్థితి చూసినా  ఎంతో అసంతృప్తి నెలకొని ఉంది. చిధ్రమవుతున్న కుటుంబవ్యవస్థ, నైతికవిలువల కన్నా డబ్బు సంపాదనకే ప్రాముఖ్యతను ఇస్తున్న వారు ఎక్కువయ్యారు.ఇది అభివృద్ధి అని ఎలా అంటారు ?  


ఒకప్పుడు కుటుంబంలో పురుషుడు సంపాదించి తెస్తే స్త్రీ ఇంటిని చక్కదిద్దుకోవటం జరిగేది. 


ఇప్పుడు స్త్రీపురుషులు ఇద్దరూ సంపాదనకే  ఎక్కువ  ప్రాధాన్యతనిస్తున్నారు. 


చాలామంది విషయంలో... చిన్నతనంలో  ఎక్కువభాగం  క్రెష్,  స్కూలు  మరియు  హాస్టల్లో జీవితం  గడిచిపోతుంది.


యవ్వనం , మధ్యవయస్సులో ఎక్కువ భాగం  డబ్బు సంపాదనలో  గడిచిపోతుంది.


వృద్ధాప్యంలో  ఎక్కువభాగం  వృద్దాశ్రమం  మరియు ఆసుపత్రులలో గడిచిపోతుంది.  జీవితం అంటే ఇదేనా ? 



ఈ రోజుల్లో అనేక రోగాలు ఎక్కువయ్యాయి. మాకు తెలిసినంతలో పాత రోజుల్లో   కిడ్నీ వ్యాధి కేసులు   ఇప్పుడున్నంత ఎక్కువ  సంఖ్యలో ఉండేవి   కాదు.  కాన్సర్ వ్యాధి కూడా అరుదుగా ఉండేది.


యాంటిబయాటిక్స్ విచ్చలవిడి వాడకం వల్ల రోగకారకక్రిములు యాంటిబయాటిక్స్ను  తట్టుకునే శక్తిని సంపాదించుకుంటున్నాయట. 


ఇందువల్ల మందులకు రోగాలు తగ్గని భయంకర  పరిస్థితి వస్తుందని అంటున్నారు.


పాతకాలంలో యంత్ర వినియోగం తక్కువగా ఉండేది. అప్పట్లో ఇంతగా నిరుద్యోగ సమస్య ఉండేది కాదు. 


ఇప్పుడు ఎక్కడ చూసినా నిరుద్యోగ సమస్య,   ఉద్యోగంలో అభద్రత వంటి సమస్యలతో  యువత  నిరాశానిస్పృహకు లోనవుతున్నారు. 


ఆధునిక సమాజంలో ఆర్ధిక అసమానతలు అధికమయ్యాయి. 


ఒక ప్రక్క కోటీశ్వరులు విలాసంగా జీవిస్తుంటే ..తినటానికి తిండిలేక , రోగాలు వస్తే బాగుచేయించుకోవటానికి డబ్బు లేక  లక్షలమంది ప్రజలు బాధపడుతున్నారు.



ఇక మానవుల అంతులేని కోరికల వల్ల  ప్రపంచమంతటా పెరుగుతున్న కాలుష్యం,  గ్లోబల్ వార్మింగ్ , విపరీతంగా మారుతున్న వాతావరణం వంటి సమస్యల గురించి తెలిసిందే.


ఈ సమస్యల పరిష్కారం గురించి  పట్టించుకోవటం మానేసి ఇతరగ్రహాలకు వెళ్ళి అక్కడ ఎలా పాడుచేయాలా .... అని ఆలోచిస్తున్నారు.


ఆధునిక టెక్నాలజీ వల్ల అశ్లీలత ( అశ్లీల ప్రసారాలు ) అరికట్టటానికి అసాధ్యం అన్నంతగా అంతటా వ్యాపిస్తున్నాయి.


ఇలా ఎన్నో సమస్యలుండగా ఆధునిక కాలంలో ప్రపంచం అంతా  అభివృద్ధితో  దూసుకుపోతోందని  చెప్పుకోవటం హాస్యాస్పదం. 



No comments:

Post a Comment