koodali

Wednesday, November 11, 2015

ఓం..

ఓం 

అందరికీ దీపావళి శుభాకాంక్షలండి .
***********
ఈ క్రింద విషయాలు ఈ పోస్ట్ వేసిన కొంతకాలం తరువాత వ్రాసి ఇక్కడ పోస్ట్ చేయటం జరిగిందండి.
 
కొన్నివిషయాలు...
 
ఈ మధ్య కొందరు పెద్ద కంపెనీల వాళ్ళు ఏమంటున్నారంటే, ఉద్యోగస్తులు మరిన్ని ఎక్కువ గంటలు పనిచేయాలని చెబుతున్నారు. త్వరగా ఇంటికెళ్ళటం వేస్ట్ అన్నట్లు, భార్యాభర్తలు ఎక్కువగా మాట్లాడుకోకూడదన్నట్లు కూడా కొందరు చెబుతున్నారు.

ఉద్యోగస్తులతో విపరీతంగా పనిచేయిస్తూ వేలకోట్లు సంపాదించే కంపెనీల వాళ్ళు తమ ఇష్టానికి మాట్లాడటం అన్యాయం.. వాళ్ళకు మాత్రం బోలెడు డబ్బు కావాలి. ఉద్యోగస్తులు మాత్రం ఎప్పుడూ పనిచేస్తూ ఉండాలి కాబోలు.

 కొన్ని సంవత్సరాల క్రిందట పనిగంటలు పెరిగినదానికి వ్యతిరేకంగా విదేశాలలో కార్మికులు పోరాటం చేసారు. ఆ పోరాటాలకు గుర్తుగా మేడే జరుపుతారు.

ఈ రోజుల్లో కొన్ని కంపెనీలు కొందరు ఉద్యోగస్తులను తీసివేస్తున్నారు..అది చూసి భయపడి, మిగతావాళ్ళు విపరీతంగా పనిచేస్తుంటారు.

మనుషులు పనిచేయటం కొరకే పుట్టలేదు.పనిచేసి డబ్బు సంపాదించటం జీవితంలో ఒక భాగం. మనుషులు దైవధ్యానం చేసుకోవాలి. గృహస్థాశ్రమంలో కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి. సంతానాన్ని చక్కటి పౌరులుగా తయారుచేయటంలో తమ వంతు పాత్రను సరిగ్గా నిర్వహించాలి.

ఎవరైనా తాము ఆరోగ్యంగా ఉండటానికి కొంత సమయం కేటాయించుకోవాలి.  చక్కటి చెట్లు, మొక్కలు పెంచుతూ ఆహ్లాదంగా ఉండవచ్చు. ప్రపంచంలో ఉన్న ప్రకృతిసుందరదృశ్యాలను చూసి ఆనందించవచ్చు. 
 
పర్యావరణాన్ని కాపాడటంలో కొంత సమయం కేటాయిస్తే మంచిది.సమాజంలో కష్టాలలో ఉండేవారికి కొంత సేవ లేక సాయం చేయవచ్చు.

 ఇలా ఎన్నో ఉండగా, సమయం చాలక ఎందరో ఉరుకులు పరుగులతో జీవిస్తున్నారు. కొన్ని ఉద్యోగాల వారికి ఇంటికొచ్చినా, ఆఫీసువాళ్ళు ఫోన్లు చేసి పనులు చేయించుకుంటున్నారు.

ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగులు సమయం చాలక ఒత్తిడితో అనారోగ్యం పాలవుతున్నారు. ఈ మధ్యన యువత కొందరు  పని ఒత్తిడితో ఉన్నపళాన చనిపోయారు. కొందరు ఉద్యోగస్తులు ఆహారం వండుకోవటానికి సమయం చాలక,బయట  దొరికింది తిని అనారోగ్యం పాలవుతున్నారు.

పనివత్తిడి వల్లకూడా వివాహబంధాలు విచ్చిన్నమవుతున్నాయి...
కుటుంబాలలో గొడవలు జరుగుతున్నాయి. కుటుంబం అంటే బాధ్యతలుంటాయి. అనేకకారణాల వల్ల, కుటుంబసభ్యుల మధ్య కొన్ని గొడవలు వస్తుంటాయి.  ఈ రోజుల్లో చాలామంది  బాధ్యతలు లేకుండా జీవించడానికి ఇష్టపడుతున్నారు.

కొన్ని ఆఫీసుల్లో ఉద్యోగులకు పనివత్తిడి తగ్గటం కొరకు అంటూ..ఆఫీసులోనే రకరకాల ఆహారం, వినోదం..వంటివి అమర్చుతారు. ఇక ఉద్యోగులు అక్కడే బోలెడు సేపు పనిచేస్తారు.

చాలామంది సంతానాన్ని పెంచే సమయం, ఓపిక లేదంటూ డేకేర్లలో వేస్తున్నారు. ఇంటివద్ద అల్లారుముద్దుగా పెరగవలసిన చంటిపిల్లలు బయట ఎక్కడో పెరుగుతున్నారు.

కొందరు తల్లితండ్రి ఏమంటారంటే, పిల్లల కోసమే డబ్బు సంపాదిస్తున్నామని చెబుతుంటారు. మాటలు కూడా సరిగ్గారాని, వాళ్ళ బాధలు చెప్పలేని చిన్నవయస్సులో పిల్లల్ని బయట డేకేర్లలో వేసి, వాళ్ళకొరకు డబ్బు సంపాదిస్తున్నామని చెప్పటమేమిటో?

 కోరికలను తగ్గించుకుంటే కొద్ది డబ్బుతో కూడా చక్కగా జీవించవచ్చు. మనుషులు కోరికలను తగ్గించుకుంటే టెన్షన్ పడుతూ విపరీతంగా పనిచేయనవసరం లేదు.

 ఈ రోజుల్లో పెంచుకున్న పనివత్తిడితో ఎవరికీ సరైన విశ్రాంతి ఉండటం లేదు.

ఉపాధి..కొరకు అదేపనిగా పనిచేసి, అదేపనిగా వస్తువులను ఉత్పత్తి చేస్తూ పోతే, పర్యావరణం పాడయ్యి ప్రపంచానికి పెనుప్రమాదం వచ్చే పరిస్థితులు రావచ్చు.

యంత్రాలు లేని పాతకాలంలో ఒక వస్తువు తయారుచెయ్యాలంటే
కొన్నిరోజులు పట్టేది, చేయడానికి కొన్ని రోజులు పని ఉండేది. ఇప్పుడు యంత్రాల సాయంతో అదేపనిని గంటలో చేస్తున్నారు.ఇందువల్ల నిరుద్యోగం పెరుగుతుంది. అదేపనిగా వస్తువుల తయారీ వల్ల ప్రపంచంలో ఉన్న సహజవనరులూ త్వరగా ఖర్చవుతాయి.

  అందువల్ల అతిని తగ్గించుకుంటే మంచిది.

********* 
ఈ రోజుల్లో ఒకరిని చూసి ఒకరు పోటీలు పడి ఆస్తులు కొనటం, వస్తువులు కొనటం..వంటివి చేస్తున్నారు. ఇందుకు బోలెడు డబ్బు కావాలి. కొందరు అవినీతిగా డబ్బు సంపాదిస్తారు, కొందరు విపరీతంగా కష్టపడతారు. అవినీతిగా సంపాదించటం తప్పు. భవిష్యత్తులో ఆ పాపఫలితాలను అనుభవించవలసి వస్తుంది.

తమకొరకు, తమ సంతానం కొరకు డబ్బు సంపాదించటం తప్పుకాదు. అయితే, కొంతవరకు సంపాదించి తృప్తిగా జీవించాలి. అంతేకానీ, విపరీతంగా ఒళ్లుహూనం చేసుకుని డబ్బు సంపాదనలో మునిగిపోతే అనేక సమస్యలు వస్తాయి.. అనారోగ్యం రావచ్చు.అనారోగ్యం వస్తే ఎంత డబ్బున్నా కష్టాలు తప్పవు.
 
 కొందరు పెద్దవాళ్లు కూడా గొప్పలు చెప్పుకోవటానికి మా పిల్లలు అంత సంపాదిస్తున్నారు, విదేశాల్లో అన్ని ఇళ్లు కొన్నారు..అంటూ గొప్పలకు పోతున్నారు. అంతంత సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి. పనిభారం ఎక్కువయ్యి యువతలో అనారోగ్యాలు వస్తున్నాయి. 
 
పనివత్తిడి తట్టుకోలేక కొందరు మద్యం, మత్తుమందులకు అలవాటుపడుతున్నారు.  అక్రమసంబంధాలు పెరిగాయి.వీటన్నింటివల్ల  కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి. విడాకులు ఎక్కువయ్యాయి.


 ఈ రోజుల్లో స్త్రీలు, పురుషులు అదేపనిగా పనిచేస్తూ తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవటం లేదు. అప్పుచేసి అనేకమైన ఇళ్ళు, వస్తువులు కొని ఆ అప్పులు తీర్చడానికి విపరీతంగా శ్రమపడుతున్నారు. ఉద్యోగాలు పోతే ఆ అప్పులు ఎలా కట్టాలో తెలియక ఆత్మహత్యలు, హత్యలు కూడా జరుగుతున్నాయి.

పాతకాలంలో ఇన్ని వస్తువులు లేకపోయినా చక్కగా జీవించేవారు. ప్రతిదానికి టైం అయిపోతోందంటూ హడావిడిగా పరుగులు పెట్టడం, టార్గెట్ రీచ్ అవ్వలేదంటూ ఆఫీసుల్లో టెన్షన్లు.. ఇలాంటివి అంతగా ఉండేవి కాదు. సైన్యం లోని వారు, ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉన్నవారికి టెన్షన్లు ఎక్కువగా ఉంటాయి కానీ, సామాన్య ప్రజలు ప్రశాంతంగా, నిదానంగా పనులు చేసుకుంటూ జీవితం గడిపేవారు. ఇప్పుడు పిల్లలు, పెద్దలు..ఉరుకులు, పరుగులు, టెన్షన్ తో కూడిన జీవితాలు గడుపుతున్నారు..

కుటుంబాల్లో సహజంగా కొన్ని గొడవలు ఉంటాయి. డబ్బుసంపాదన.. ఖర్చుల గురించి, పిల్లలను పెంచే విధానాల గురించి, అత్తాకోడళ్ళ మధ్య, ఇలా..కొన్ని అభిప్రాయాల వల్ల గొడవలు రావటం జరుగుతుంది.జాగ్రత్తగా సర్దుబాటు చేసుకుంటూ జీవించాలి.

  ఎవరింట్లో వారు తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తిస్తూ పిల్లలను మంచి పౌరులుగా తయారుచెయ్యటం..వంటివి సరిగ్గా చేస్తే కూడా సమాజసేవ చేసినట్లే.

ఇతరులతో అనవసరమైన పోటీలు, గొప్పలకు పోకపోతే..ఉన్నదాంతో కూడా చక్కటి జీవితాలను గడపవచ్చు.
 
పుష్టికరమైన, రుచికలిగిన ఆహారాన్ని అతిగా కాకుండా తగుమాత్రం తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో అతిగా కాకుండా, కొద్దిపాటి అవసరమైన సామాను ఉంటే ఇల్లు గజిబిజి లేకుండా శుభ్రంగా ఉంటుంది, సామాను అదేపనిగా శుభ్రం చేసే పని తప్పుతుంది.అతి లేకుండా, అవసరమైన కొద్దిపాటి కోరికలను కలిగిఉంటే జీవితం సాఫీగా ఉంటుంది.



No comments:

Post a Comment