koodali

Friday, June 7, 2013

కాంక్రీట్ కట్టడాలను తగ్గించుకుని , వాననీరు ఇంకే విధంగా మట్టినేలను ఉంచాలి.

 
ఈ  బ్లాగ్ ను  ప్రోత్సహిస్తున్న  అందరికి  ధన్యవాదములండి.
........... 

ఈ మధ్య  మేము  కొన్ని  ఊళ్ళు  వెళ్ళి  వచ్చాము.  ప్రయాణంలో  గమనిస్తే  ఏ  ఊరులో  చూసినా    కాంక్రీట్  జంగిల్ లా  కట్టడాలు కనిపించాయి.

  మానవుల  స్వయంకృతాపరాధాల  వల్ల   ప్రపంచవ్యాప్తంగా  ఉష్ణోగ్రతలు  పెరుగుతున్నాయి.  వాతావరణంలో  విపరీతమైన  మార్పులు  వస్తున్నాయి.  ఎండలు,  వరదలు  పెరగటానికి  అనేక  కారణాలున్నాయి.

 భూమిపై  పడిన  వానచినుకులు  నేలలో   ఇంకటానికి   లేకుండా   భూమిపై  ఎక్కువభాగం  కాంక్రీట్  వేయటం  కూడా  ఒక  కారణం.  


పూర్వం  ఇళ్ళ  చుట్టూ  చాలా  మట్టి  ప్రదేశం  ఉండేది.  ఇప్పుడు  ఇంటి  చుట్టూ  కాళ్ళకు  మట్టి  అంటకుండా  సిమెంట్  చేసేస్తున్నారు.   భూమిపై   ఖాళీ  ప్రదేశాలంటూ  మిగలకుండా  కాంక్రీట్  కట్టడాలు  కట్టేస్తున్నారు.

భూమిలోకి  నీరు  ఇంకకుండా   నున్నటి   రోడ్లను  వేస్తున్నారు.  రోడ్ల  ప్రక్కనే  షాప్స్,  ఇళ్ళు  ఉంటాయి.  రోడ్లకు  షాపులకు   మధ్య  సన్నగా  కొద్దిపాటి  మట్టి   దారి  ఉంటుంది.  ఈ  మట్టిలో  ఎంత  నీరు  ఇంకుతుంది? 


 భూమిలో  నీరు  ఇంకకపోవటం   వల్ల  . భూగర్భజలం   తగ్గిపోతోంది. పూర్వకాలంలో  మట్టినేల  ఎక్కువగా  ఉండేది  కాబట్టి  ఎక్కడ  పడే  వాన  అక్కడ  భూమిలో  ఇంకి  భూగర్భజలం  బాగా  ఉండేది.  ఇందువల్ల   భూమి  చల్లగా  ఉండి  ఉష్ణోగ్రతలు  ఎక్కువగా  ఉండవు.

ఎక్కడ  పడిన  నీరు  అక్కడే  భూమిలో  ఇంకటం  వల్ల  వరదలు  ఊళ్ళను  ముంచెయ్యటం   ఉండదు.  పూర్వ  కాలంలో    వరదలు  వచ్చినా  తక్కువ  ఎత్తులో  ఊళ్ళోకి  నీరు  వచ్చి  ఆ  వరదలతో  పాటు  పొలాలలోకి  కొట్టుకువచ్చిన  ఒండ్రు  మట్టి  వల్ల  పొలాలు  సారవంతంగా    అయి  పంటలు  బాగా  పండేవి.

ఈ  రోజుల్లో   వాననీరు   భూమిలో  ఇంకే  పరిస్థితి  తగ్గిపోవటం  వల్ల , ఇంకా   కాలువల  వ్యవస్థ  కూడా  సరిగ్గా  లేకపోవటం  వల్ల    వాన  నీరు  ఉధృతమైన   వరదలుగా  మారి  ప్రాణనష్టం,  పంటనష్టం  కలుగుతోంది.  ఉధృతమైన  వరదల  వల్ల  పొలాలలో  నేల   కోసుకుపోతోంది. 


పూర్వం   ప్రతి  ఊరికి  చెరువు  ఉండేది.  వేసవిలో   ఊరిప్రజలందరూ  కలిసిమెలసి  శ్రమించి   చెరువులలో  పూడిక  తీసుకునేవారు.   వానలు  పడిన  తరువాత   పూడిక  తీసిన  చెరువులో  నీరు  చక్కగా  నిలువ  వుండి    ఊరు  ప్రజల  అవసరాలకు  సరిపోయేవి. ఈ  రోజుల్లో  పూడిక  తీయని  చెరువులు,  కాలువల  వల్ల కూడా  వాననీరు    వృధా అవుతోంది. 

పూర్వం    ప్రజలు   కలసిమెలసి   చెరువులో  పూడిక  తీయటం  వంటి  పనులను  చేసుకునేవారు.
 
 మేము  చిన్నప్పుడు  మా  తాతగారి  ఇంటికి  వెళ్తే  అక్కడి  ఊళ్ళోని  ప్రజలు  చెరువులో  పూడిక  తీయటం  వంటివి  చేస్తుంటే  ఎంతో  సందడిగా  ఉండేది.  చెరువు  పూడికతీసే  పనులు  జరుగుతుంటే  మేము  చిన్నపిల్లలం   సాయంత్రం  పూట    చల్లబడిన  తరువాత  అక్కడ  ఆడుకునే  వాళ్ళం.  అక్కడంతా  ఎంతో సందడిగా  ఉండేది.  వెన్నెల  వెలుగులో  కూడా  పనులు  కొనసాగేవి.


 
కాంక్రీట్  కట్టడాలను  కట్టడాన్ని  తగ్గించుకుని  ,  వాననీరు  ఇంకే  విధంగా  మట్టినేలను  ఉంచాలి. మట్టి   నేలల   విస్తీర్ణం ఎక్కువ  ఉండేలా  జాగ్రత్తలు  తీసుకోవాలి.

  ఈ  రోజుల్లో  కాలువలు  పూడిపోవటానికి   ప్లాస్టిక్  కవర్లు  కూడా  ముఖ్యమైన  కారణం..  ఈ  ప్లాస్టిక్  కవర్లు   కాలువలకు  అడ్డంపడటం  వల్ల  కూడా   నీటిపారుదల  వ్యవస్థ  అస్తవ్యస్థమవుతోంది.



2 comments:

  1. నిజం చెప్పేరు.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete