ఒక పండితుల వారు, రామనామము గురించి కొన్ని వ్యాఖ్యలను చేసారు..వారు గౌరవనీయులు. ఎన్నో విషయముల గురించి తెలియజేస్తుంటారు. శ్రీరాముని గురించి కూడా ఎన్నో విషయములను చక్కగా తెలియజేసారు.
అయితే, రామనామము గురించి వారు అన్న కొన్ని విషయములు విన్నప్పుడు, ఇలా అన్నారు ఏమిటో? అనిపించింది. ఇదంతా ఇలా వ్రాయవలసి రావటం నాకు ఇబ్బందిగా ఉంది. నాకు వచ్చిన కొన్ని ఆలోచనలను వ్రాయాలనిపించి రాస్తున్నాను.
వారి అభిప్రాయాలు ఏమిటన్నది నాకు పూర్తిగా తెలియకపోవచ్చు కానీ, వారిమాటలు విన్నప్పుడు ..రామరామ, కృష్ణకృష్ణ..అనేవి మహా మంత్రాలు కావు.. అవి వచనములు, వాటిని జపించటం వల్ల గొప్ప ఫలితాలు రావని..అన్నట్లు నాకు అనిపించింది.
ఇంకా, ఓంకారాన్ని జపిస్తే గొప్ప ఫలితాలు వస్తాయన్నారు..వేదములలో రామ పదం, రామాయణంలో రామ పదములకు అర్ధములు వేరు అన్నారు..రామాయణంలో రామునిలా ఉంటూ రామ జపము చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు.
నిజమే, నైతికవిలువలను పాటించటమనేది ఎవరికైనా ముఖ్యమే. శ్రీ రామునిలా తాము కూడా ప్రవర్తించటం కొందరి విషయంలో ఇప్పటికిప్పుడు కష్టం కావచ్చు. దైవస్మరణ చేస్తూ..ఉంటే, వారి శ్రద్ధను బట్టి క్రమంగా మంచిగా మారగలరు.
అయినా, రామరామ..కృష్ణకృష్ణా అనుకుంటే గొప్పఫలితాలు ఎందుకు ఉండవు? తప్పకుండా గొప్ప ఫలితాలు ఉంటాయి. దైవనామస్మరణ ద్వారా అన్నింటికి మూలమైన దైవాన్ని ఆరాధిస్తారు. అందువల్ల, గొప్ప ఫలితాలు లభిస్తాయి.
కొందరు మంత్ర సాధన ద్వారా ఇతరుల కీడు కోరుకుంటారు.అలాంటప్పుడు మాత్రం గొప్పఫలితాలు లభించవు.అలాంటివారికి కష్టాలు తప్పవు.ఉదా..రావణాసురుడు.
ఇంకో విషయం ఏమిటంటే,
ఓంకారాన్ని ఎవరికితోచినట్లు అలా అనకూడదని, స్త్రీలు అసలే అనకూడదని, విడిగా ఒక్క ఓంకారాన్ని అనకూడదని చెబుతున్నారు.
దైవకృపను పొందటానికి దైవనామ స్మరణ అనే సులభమైన ఉపాయముందని సంబరపడుతున్నాము. రామనామజపం..వల్ల ఎక్కువఫలితాలు రావన్నట్లు అనటం వల్ల చాలామంది నిరాశకు గురవుతారు. గొప్పఫలితం రానప్పుడు ఎందుకు చేయటమని నామజపాన్ని వదిలేయాలనుకునే పరిస్థితి కూడా ఉండవచ్చు.
ఎలా అనుకుంటే ఏం తప్పులు వస్తాయో? గొప్ప ఫలితాలు వస్తాయో? రావో? అని సందేహాలతో ఓంకారాన్ని, నామాలను కూడా అనుకోవటం మానేసే పరిస్థితి రాకూడదు.
మరి, ఓంకారాన్ని సరిగ్గా ఎలా పలకాలో.. ఒక్క ఓం కారాన్ని జపించవచ్చా? లేదా? స్త్రీలు ఓంకారాన్ని అనుకోవచ్చా? లేదా? అని సందేహాలు కలుగుతాయి.ఇలాంటి విషయాలను తెలిసినవారు దయచేసి తెలియజేస్తే అందరికి తెలుస్తుంది.
ఓంకారాన్ని ఒక్కదాన్నే అనేటప్పుడు దీర్ఘంగా నిదానంగా అనుకుని, ఓంకారముతో కూడిన దైవనామాలను అనుకునేటప్పుడు ఉదా..ఓంకారముతో కూడిన శతనామావళిని మాత్రం మామూలుగా అనుకోవచ్చని నాకు అనిపిస్తుంది.(అంటే మరీ నిదానంగా కాకుండా).
ఎందుకంటే, ఓంకారముతో శతనామావళిని ..మరీ నిదానంగా..అనుకోవాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి.
..............
మంత్రాల గురించి యంత్రాల ద్వారా కొందరిని టెస్ట్ చేస్తే తెలిసిన విషయాల గురించి కూడా వారు తెలియజేసారు. ఆధునిక యంత్రపరికరాల ద్వారా కొంతవరకే తెలుసుకోగలం.యంత్రాలకు అందని విషయాలెన్నో ఉంటాయి.
...................
సాత్వికతతో నైతికవిలువలను పాటించటానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ, ప్రేమ భక్తితో దైవనామస్మరణ చేసేవారికి దైవకృప లభిస్తుంది.. ఉదా..మహాభారతంలోని ఒక కధలో .. గొప్పభక్తుడని, విష్ణుమూర్తి నారదమహర్షికి తెలియజేసిన ఒక రైతు.
(నారదులవారు గొప్ప భక్తులు. వారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ విషయం అందరికి తెలుసు. అయితే, భూలోకంలో గృహస్థాశ్రమంలో ఉన్న ఒక రైతు తన స్వధర్మాన్ని నిర్వర్తిస్తూ.. స్వచ్చమైన భక్తితో కొంతసేపు దైవనామస్మరణ చేస్తే.. ఆ రైతు యొక్క భక్తిని కూడా దైవము గుర్తించి అతనిని గొప్పభక్తునిగా తెలియజేసారు. దైవము ఎంతో గొప్పవారు.)
సాత్వికత లేకుండా పాపాలు చేస్తూ ఉండేవారు మహామంత్రాల అర్ధాలను తెలుసుకుని ఎంత గొప్ప సాధనలు చేసినా దైవకృపను పొందలేరు.ఉదా..రావణాసురుడు.
దైవనామము మహామంత్రము.దైవబలమే మహా బలము.
***************************
కొందరు ఏమంటారంటే, మంత్రాల అర్ధాలను.. తెలుసుకుని పఠించాలి, లేకపోతే ఫలితం ఉండదంటారు..అర్ధాలను తెలుసుకుని పఠించటం మంచిదే. మంత్రాలలో ఎన్నో అంతరార్ధాలు కూడా ఉంటాయి. అవి అందరికి అర్ధం కాకపోవచ్చు.
ఎవరైనా మంత్రాలను పూర్తిగా అర్ధం చేసుకోలేకపోయినా ఫరవాలేదు. దైవము సర్వశక్తివంతులు. శ్రద్ధగా దైవాన్ని స్మరించుకుంటూ మంత్రాలను పఠిస్తే చక్కటి ఫలితముంటుంది.
ఏదైనా విషయాలను అదేపనిగా అనుకుంటే కొన్ని సంవత్సరములకు అయినా అవి నోటికి వచ్చేస్తాయి. అలాగే దైవాన్ని స్మరించగాస్మరించగా.. కొంతకాలానికి దైవాన్ని(మోక్షాన్ని) పొందగలము.
ఓంకారము ఎంతో గొప్పది..బీజాక్షరములు..అక్షరములు..ఎంతో గొప్పవి..కొందరు ఏమంటారంటే, ఒక్క బీజాక్షరములనే అనుకుంటే..ఆ శక్తిని అందరూ తట్టుకోలేరని, బీజాక్షరములను దైవనామముతో కలిపి అనుకోవాలని అంటారు. దైవనామములలో బీజాక్షరములు ఉంటాయి. అయితే, దైవనామములను ఎవరైనా సులభంగా అనుకోవచ్చు.
దైవకృపను పొందటం కొరకు..దైవస్మరణ, దైవనామస్మరణ..కలియుగంలో సులభమైన ఉపాయమని ప్రాచీనులు తెలియజేసారు...
ఏం చేయాలో? ఏం చేయకూడదో? అనుకుంటూ ప్రతిదానికి అతిగా సందేహించటం మాని,చక్కగా దైవాన్ని స్మరించుకోవాలి.
*************
రామనామము తారకమంత్రము అని పెద్దలు తెలియజేసారు.. అలాంటి నామాన్ని జపిస్తే మంచి ఫలితం తప్పక ఉంటుంది. దైవనామము ఏదైనా గొప్పదే.
వారు ఇంకా ఏమన్నారంటే, ఓంకారాన్ని జపిస్తే ఎక్కువ ఫలితం ఉంటుందన్నారు.
అయితే కొందరేమో, ఓంకారాన్ని ఒక్కటిగా జపించటం అందరూ చేయకూడదంటున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారు. ఇలా అయితే, ఏం చేయాలో ఏం చేయకూడదో? అని ప్రజలకు అయోమయం కలిగే పరిస్థితి ఉంటుంది.ఇప్పటికే సోషల్మీడియాలో అలా చేయకూడదు, ఇలానే చేయాలి..అంటూ చెప్పేవన్నీ పాటించలేకపోతున్నాము.
పెద్దపూజలు, మంత్ర పఠనాలు..అందరికి సాధ్యంకాకపోవచ్చు. దైవనామస్మరణ అందరికి సులభమని, ఎవరైనా దైవనామాన్ని స్మరించి తరించవచ్చని ప్రాచీనులు తెలియజేసారు.
సృష్టిలో..వేదములకు, అనంతకోటిబ్రహ్మాండములకు, అనేక జీవజాలములకు కారణమైన సృష్టికర్త అయిన దైవము ఆది అంతము లేని అత్యంత గొప్పవారు. దైవము గురించి, దైవనామముల గురించి పూర్తిగా అర్ధంకాకపోయినా కూడా, దైవాన్ని.. దైవనామాన్ని ప్రేమభక్తితో స్మరించుకుని తరించవచ్చు.
*************
దైవము, దైవనామములు గొప్పవి మరియు వేదములు..మంత్రములు గొప్పవి.
దైవనామములు మంత్రములే. సరిగ్గా పలికితే ప్రతి అక్షరమూ మంత్రమే. మంత్రాలలో కూడా పాజిటివ్, నెగటివ్ ఫలితాలను ఇచ్చేవి ఉంటాయంటారు. కొన్ని మంత్రాలను తప్పుగా పఠించితే వ్యతిరేక ఫలితాలు వస్తాయంటారు. కొన్నిసార్లు మంత్రపఠనంలో శ్వాసను పీల్చటంలో తేడా వచ్చినా కూడా, కొన్నితప్పులు జరిగే అవకాశముందంటారు. కొన్ని మంత్రాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి.సామాన్యులు ఇవన్నీ చేయలేరు.
శ్రీరామ వంటి..దైవనామములను పలికేటప్పుడు తప్పులు వస్తాయని భయపడనక్కరలేదు. ఎవరైనా తేలికగా అనుకోవచ్చు. దైవనామములకు కొన్ని పద్ధతులతో బీజాక్షరములను జోడిస్తే జాగ్రత్తగా ఉండాలంటారు.
చక్కని భక్తి గీతాలు పాడినా, విన్నా కూడా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
ఆదిశక్తి అయిన పరమాత్మ అన్నింటికి అతీతులు. మంత్రములతో సహా సృష్టిలోని అన్నీ ఆదిదైవము యొక్క ఆధీనంలో ఉంటాయి. దైవాన్ని స్మరించుకోవటం మంచిది.
****************
కొన్ని విషయములను గమనిస్తే, మంత్రాలతో ఎవరైనా ఏదైనా సాధించవచ్చని అనుకోకూడదనిపిస్తుంది. ఎంతో గొప్ప పాండిత్యం, ఎన్నో గొప్ప మంత్రాలు తెలిసిన రావణాసురుడు కూడా అతని దుర్గుణాల వల్ల పతనమయ్యాడు.ఏ మంత్రాలు రావణాసురుణ్ణి కాపాడలేదు.
దీనిని గమనిస్తే ఏం తెలుస్తుందంటే, సరైన నైతికవిలువలను పాటించనివాళ్ళు, మంత్రముల అర్ధాలను తెలుసుకుని ఎంత బాగా పఠించినా, సరైన ఫలితాలను పొందలేకపోవచ్చు.
సీతాదేవిని తిరిగి రాములవారికి అప్పగించమని శివాంశకలిగిన ఆంజనేయ స్వామివారు హెచ్చరించినా కూడా, రావణుడు వినలేదు.
భక్తులమని చెప్పుకునేవారిలో రకరకాల వాళ్లుంటారు. సాత్వికులు, రాజసికులు, తామసగుణం కలవారు..ఉంటారు. లోకకంటకులుగా చెడ్డపనులు చేస్తూ ఉండేవారు భగవంతునికి నచ్చరు. సాత్వికులు లోకానికి మంచిపనులు చేసేవారు దైవకృపకు పాత్రులవుతారు... రావణాసురునికి తాను చాలా గొప్ప భక్తుడిననే అహం ఉండిఉంటుంది.
దైవనామాలకు ఎంతో శక్తి ఉంటుంది. దైవాన్ని, దైవనామాన్ని స్మరించుతూ ఉంటే, ఆ నామములు మందుగుళికలుగా పనిచేస్తూ క్రమంగా మనిషిని మంచి వాడిగా చేస్తాయి. అయితే ఎవరికైనా వారి గత కర్మలను బట్టి, వారి కర్మ కరిగి మంచిజరగటానికి కొందరిలో తక్కువ సమయం పట్టవచ్చు, కొందరికి ఎక్కువ సమయం పట్టవచ్చు.
పాపాలు చేసినవారు తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడి, దైవాన్ని ప్రార్ధిస్తూ.. కష్టాలలో ఉన్నవాళ్ళకు సాయం చేస్తూ..మంచిపనులు చేస్తూ ఉంటే.. వారికి పడే శిక్ష గణనీయంగా తగ్గే అవకాశముంది. పూర్తిగా శిక్షనుండి మాత్రం అతిత్వరగా తప్పించుకోలేరు. ఎందుకంటే, వారు చేసిన పాపాల వల్ల బాధలు పడిన జీవుల క్షోభ ఉంటుంది కదా.
చేసిన పాపాల పట్ల ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా, పూజలు, పరిహారాలు చేస్తున్నామనే ధీమాతో ఇంకా పాపాలు చేస్తూ ఉన్నవారికి, మంచి జరగటానికి కొందరిలో కొన్ని జన్మలు పట్టవచ్చు.
****
దైవము గురించి సృష్టిగురించి ఎన్నో విషయాలుంటాయి. ఎన్నో రహస్యాలుంటాయి.
నాకు తెలిసిన విషయాలు తక్కువ.వ్రాసినవాటిలో ఏమైనా తప్పులుంటే దయచేసి
క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
*************
ఈ పోస్ట్ కొన్ని సంవత్సరాల తరువాత వ్రాసి, కొన్ని కారణాల వల్ల ఇక్కడ పోస్ట్ చేశానండి. అంటే, 2025 లో వ్రాసాను.