koodali

Friday, December 7, 2012

కొన్ని యాత్రా విశేషాలు...రెండవ భాగం..

ఓం..
జమ్మూ  నుంచి  కొంతదూరం  వెళ్తే   రెండు  దార్లు  వస్తాయట.  ఒక  దారి  నుండి  వెళ్తే    పహల్గాం  వైపు,  ఇంకొక  దారి  నుంచి  వెళ్తే  బాల్టాల్  వైపు  వెళ్ళి  అమర్నాధ్  యాత్ర  చెయ్యవచ్చట.  కొందరు  శ్రీ  నగర్    వెళ్ళి   అక్కడి  శంకరాచార్య  వారి  దేవాలయాన్ని  కూడా  దర్శించుకుంటారట.  ఆ  ఆలయం  ఎంతో  ప్రముఖమైనదట.   మేము  అక్కడకు  వెళ్ళలేకపోయాం. 


పహల్గావ్  ఇప్పుడు  పెద్ద  టూరిస్ట్  ప్లేస్ . అక్కడకు  వింటర్  సీజన్  లో పర్యాటకులు  వచ్చి  ఐస్  స్కేటింగ్   వంటి  ఆటలు  ఆడతారట. 


పార్వతీపరమేశ్వరులు   అమరనాధ్  గుహకు  వెళ్ళేముందు  పెహల్గావ్  వద్ద  నందీశ్వరుని  , చందన్వారి  వద్ద  చంద్రుని  ,   శేష్ నాగ్  వద్ద  నాగులను   , మహాగుణాస్ పర్వతం  వద్ద  గణేశుని  ,  పంచతరణి  వద్ద  పంచభూతాలను  ఉంచారట. 


  పహల్గావ్  నుంచి  వాన్లు  ఉంటాయి.  యాత్రికులు   వాటిలో   బయలుదేరితే  చందన్వారి    వరకు    వెళ్ళొచ్చు. కొందరు .భక్తులు  పహల్గావ్  నుంచే  నడుచుకుంటూ అమరనాధ్  యాత్ర  మొదలుపెడతారు.  అక్కడ నుంచి   అమర్నాధ్  గుహ  చాలాదూరం  ఉంటుంది.

చందన్వారి చేరితే   ఇక  అదంతా  మరో  ప్రపంచం.   ఇక  ఇక్కడనుంచి  సెల్  ఫోన్స్  పనిచెయ్యవు.  మరీ  అర్జంట్  అయితే , అక్కడ  ఉన్న  మిలట్రీ  వాళ్ళను  అడిగితే  వాళ్ళ  వద్ద  ఉన్న  ఫోన్స్  ద్వారా  మాట్లాడవచ్చనుకుంటా.  అయితే,  ఈ  సంవత్సరం  యాత్రికులకు  ఫోన్  సౌకర్యం  కల్పించారని  వార్తలలో  విన్నాను. 



పెహల్గావ్  నుంచి  గుహను  చేరే  వరకు  ఎన్నో  సదుపాయాలను  కల్పించారు.   ఆహారం   చాలా  బాగుంటుంది. ,  వైద్య  సహాయం  
బాగుంటుంది.  వసతికి  మామూలు  టెంట్స్,  రేకులతో  కట్టిన  రూంస్   కూడా   ఉన్నాయి.   తాత్కాలికంగా  ఏర్పాటు  చేసిన  టాయిలెట్స్  సౌకర్యం  కూడా  ఉంది. 

చందన్ వారీ  నుంచి  నడిచి  గానీ,  గుర్రాలపై  గానీ,  డోలీల  ద్వారా  గానీ  అమరనాధ్  గుహకు వెళ్ళవచ్చు. మేము  గుర్రాలపై  ప్రయాణించాము.   గుర్రాలను  నడిపించేవాళ్ళు  యాత్రికులను  ఒకటి  రెండురోజులలో  దైవదర్శనం  చేయించి  తీసుకొస్తామంటారు.
  ( వాతావరణ  పరిస్థితులు  అనుకూలంగా  ఉంటే. )
 
 కానీ,  ఒకేసారి  ఎక్కువ  దూరం  ప్రయాణించటం  వల్ల  యాత్రికులు  అలసిపోతారు.  అందువల్ల   ఒకరోజు  ఆలస్యమైనా  మధ్యలో  ఆగి  విశ్రాంతి  తీసుకుని   ప్రయాణించటం  మంచిది. 

 ( గుర్రపు  యజమానులకు మొదలే  డబ్బులు   ఇవ్వకుండా,   గమ్యస్థానానికి  చేరిన  తరువాతే  వాళ్ళకు  డబ్బు  ఇవ్వటం  మంచిది. ) 


  గుర్రాల   ప్రయాణం  కంటే,  నడిచి వెళ్తే  బాగుంటుందని  నాకనిపించింది.  అయితే  ఓపిక  లేక  గుర్రాలపై  ప్రయాణించాము.  పాపం  ఆ  గుర్రాలు  అలా  కష్టపడుతుంటే  బాధనిపించింది.

కొన్ని   చోట్ల  ప్రయాణించే  మార్గానికి   ఒకవైపు  కొండ  ఉన్నా,  మరో   ప్రక్క   లోయలు  ఉంటాయి.   గుర్రం  యజమానులు  ప్రక్కనే  ఉండి  గుర్రాన్ని  జాగ్రత్తగానే  నడిపిస్తారు.  కొండ    ప్రక్క    లోయలు   చూస్తే   భయమనిపిస్తుంది. 

 నేరకపోయి  గుర్రాన్ని  ఎక్కాము.  దీనికన్నా  నెమ్మదిగా  నడిచి  వెళ్తే  ఎంతో  బాగుండేది  కదా  !  అనిపించింది.   ఇక  దైవం  మీద  భారాన్ని  వేస్తే  అంతా  వారే  చూసుకుంటారు. 

( కొన్ని  దేవాలయాలకు  వెళ్ళే  ఘాట్  రోడ్స్ లో  కూడా  ప్రక్కన   లోయలు  ఉంటాయి  కదా  !  )

గుర్రపు  స్వారీలు  అలవాటు  లేకపోవటం  వల్ల  కాళ్ళు  కీళ్ళు  పట్టేస్తాయి. 


అయితే,  ఎంతో  వృద్ధులు, పిల్లలు,  అంగవికలురు  కూడా  నడిచి  వెళ్తున్నారు.  వాళ్ళను  చూస్తే  ఆశ్చర్యమనిపించింది. దైవభక్తి  , సంకల్పశక్తి..  ఎంతో  గొప్పవి  కదా  !

( ఇలాంటి  గుర్రపు  ప్రయాణం  భయంగా  అనిపించినా,  భయం  లేనిదెక్కడ  ? ఒక  ఊరి  నుంచి  ఒక  ఊరికి  రాత్రి  సమయంలో  నేషనల్  హైవే  మీద  చేసే  ప్రయాణాలు  కూడా  భయంగానే  అనిపిస్తాయి  కదా  !.  )


గుర్రపు  యజమానులు  ఎన్నో  జాగ్రత్తలు  తీసుకుంటూ  ప్రయాణికులను  ఉత్సాహపరుస్తుంటారు.  ప్రక్కన  లోయల  వైపు  చూడొద్దని , ఎదురుగా  ఉన్న  పర్వతాల  అందాలను  పరికించమని  చెబుతుంటారు.  వాళ్ళు  ముస్లింస్  అయినా  భం  భం  బోలేనాధ్,  జై  మహాదేవ్ శంకర్ .. వంటి  నినాదాలు  చేస్తూ  ప్రయాణీకులను  ఉత్సాహపరుస్తుంటారు. 



  సాయంత్రం  అయ్యేసరికి   ఆగి,  భండారాలలో  భోజన,  ఫలహారాలు  కానిచ్చి   బసకు  చేరితే,  అలసటతో  నిద్ర  వచ్చేస్తుంది.  అక్కడ  భండారాల్లో  చక్కటి  భోజన  వసతి  ఉంది.  అక్కడంతా    మైకులో పాటలు   వినిపిస్తూ  సందడిగా  ఉంటుంది.   రకరకాల  ఆహారపదార్ధాలు  ఉంటాయి.   అజీర్ణం  తగ్గటానికి   ఆయుర్వేద   మందు  పొట్లాలను  కూడా  ఇస్తున్నారు. యాత్రికులు  భోజనం  చేసిన  పళ్ళేలను  వేడి  నీటితో  శుభ్రం  చేస్తున్నారు.  



మరుసటి  రోజు  ఉదయాన్నే  లేచి  ప్రయాణం  మొదలుపెడితే  మన  ఓపికను  బట్టి  అదే  రోజు   గుహ  వద్దకు  వెళ్ళగలుగుతాము.  లేక  ఇంకోరోజు  పడుతుంది.  పోనుపోను  ఎక్కువ  మంచు    ఉంటుంది. ఆ  చలిని  తట్టుకోవటం  చాలా  కష్టమైంది. 



అలా  వెళ్ళగా   అల్లంతదూరంలో  అమరనాధ్  గుహ  కనిపించేసరికి   ఉత్సాహం  వచ్చింది.  ఆ   అనుభూతి  మాటలకందనిది. మమ్మల్ని  తీసుకు  వచ్చిన   గుర్రపు  యజమానులు  మాకు  టెంట్  మాట్లాడారు. . గుహ   పరిసరాల్లో   కూడా  టెంట్స్  ఉన్నాయి  . టెంట్లో   సామాను   ఉంచి ,  దైవ దర్శనానికి  బయలుదేరాము. మేము  తీసుకున్న  టెంట్  గుహకు  కొంచెం  దూరం.



  అప్పటికే  సాయంకాలం  అయ్యింది.   నేలపై  మందంగా  మంచు  పరుచుకుంది.  అక్కడ   మంచులో  నడవటానికి  చేతికర్రలు  అద్దెకు  ఇస్తారు.  ఆ  కర్రల  సాయంతో   ఆ  మంచులో   నిదానంగా  నడుస్తూ  గుహ  దగ్గరకు  చేరుకున్నాము.  చుట్టూ  పూజాద్రవ్యాలను  అమ్మే  షాప్స్  ఉన్నాయి. ముస్లింస్  చక్కగా   ఆ  షాప్స్ ను  నిర్వహిస్తున్నారు.  మాకు అక్కడి   మతసహనం  చూసి  చాలా  ఆనందమనిపించింది.  ఆ  షాప్స్ లో   బిల్వపత్రాలు  కూడా  ఉన్నాయి. మొత్తానికి  గుహకు  చేరుకుని  దైవదర్శనం  చేసుకున్నాం. 
  గుహ  వద్ద  అమర్ గంగ  ప్రవహిస్తుంది.

దైవం  దయవల్ల  యాత్రాకాలంలో  వాతావరణం  ఇబ్బంది  పెట్టలేదు.  వాతావరణం  ఆహ్లాదంగా  ఉంది.  వర్షం పడటం  , మంచు  పడటం  వంటి  ఇబ్బందులు  ఎదురవ్వలేదు.  అంతా  దైవం  దయ.


*  ఇదంతా  పహల్గావ్  నుంచీ  వెళ్తే  ...అదే  బాల్టాల్  నుంచీ  వెళ్తే   చాలా  దగ్గరట.  ఒక్క  రోజులో  దైవదర్శనం  చేసి  తిరిగిరావచ్చట.    ట్రావెల్స్  వాళ్ళు   ఎక్కువగా   బాల్టాల్  నుంచే  తీసుకువెళ్తారు.  పహల్గావ్  యాత్ర  చాలా  దూరం,  మరియు  కొంచెం  రిస్క్  అని  వాళ్ళ  అభిప్రాయమనుకుంటా. కొందరు  యాత్రికులు  అమరనాధ్  వెళ్ళేటప్పుడు  బాల్టాల్  నుంచి  వెళ్ళి,  తిరిగి  వచ్చేటప్పుడు  పెహల్గావ్  నుంచి  వస్తారట.  పెహల్గావ్  నుంచి  అమర్నాధ్  గుహ  40  కిలోమీటర్లు  పైనే  ఉంటుంది.  బాల్టాల్నుంచి  14  కిలోమీటర్లు  మాత్రమే  ఉంటుందట.

  మంచుపర్వతాల  ఫొటోస్  మరియు  కొన్ని  యాత్రా  విశేషాలు  పాతటపాలో   ఉన్నాయండి. . 

*  ఈ  లింకులో... June .


2 comments:

  1. మంచి సంగతులు చెప్పేరు

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete