koodali

Friday, August 17, 2012

లక్ష్మీకటాక్షం.....

ఓం.
శ్రీ లక్ష్మీదేవి    అనుగ్రహాన్ని   పొందటానికి   పెద్దలు    అనేక  ఉపాయాలను   తెలియజేయటం  జరిగింది.   భక్తితో   పూజలు  చేయటం,   సత్ప్రవర్తనను  కలిగి ఉండటం .....  సత్కార్యాలు  చేయటం....... ఇలా...  లక్ష్మీ  అనుగ్రహాన్ని  పొందవచ్చు. 

ఇంకా ,   గడపకు   పసుపు   రాయటం,     గుమ్మం   బయట  ఆవుపేడతో  కళ్ళాపి  జల్లి  చక్కటి  ముగ్గులు    వేయటం......... ఇలా  చేయటం  వల్ల    కూడా    లక్ష్మీ  అనుగ్రహం  కలుగుతుందని  పెద్దలు  చెప్పేవారు.  

 

 పసుపు  రాయటం,  ఆవుపేడతో  కళ్ళాపి  జల్లటం ,  ముగ్గు  వెయ్యటం   వల్ల  ఇంటి  చుట్టు  ప్రక్కల  చెడు  బాక్టీరియా  చనిపోతుంది.    పరిసరాలు  శుభ్రంగా  ఉంటాయి. 

 
  పసుపు,  ఆవు  పంచకం,  ఆవు పేడ,  మొదలైన  వాటికి  బాక్టీరియాను  చంపే  గుణం  ఉన్నదని  ఆధునికులు  కనుగొన్నారు.  

 

  ఇవన్నీ  గమనిస్తే ,   పూర్వీకులకు  ఎంతో  విజ్ఞానం  తెలుసని  మనకు   స్పష్టంగా  తెలుస్తుంది. 

 

   శుచీశుభ్రత  ఉన్న  దగ్గర    లక్ష్మీదేవి  ఉంటుందని,    అశుభ్రంగా  ఉంటే  లక్ష్మీదేవి  ఇష్టపడదనీ  పెద్దలు  చెప్పేవారు.  అందువల్ల  ,  భయభక్తులతో    పూర్వం   ప్రజలు  చక్కగా  శుచీశుభ్రతలను  పాటించేవారు. 

 

  ఇలా  శుచీశుభ్రతలను  పాటించటం  వల్ల   ఇంటిలో    అందరూ  ఆరోగ్యంగా  ఉంటారు .   అలా  అందరూ   శుభ్రతను  పాటిస్తే  సమాజంలోని  అందరూ  ఆరోగ్యంగా  ఉంటారు.  ఆరోగ్యమే  మహా  భాగ్యం  కదా  !

  ............................

ఇంకా, భార్యాభర్తలు  గొడవలు  పడే  ఇంట్లో  లక్ష్మీదేవి  ఉండదని  కూడా  పెద్దలు   తెలియజేయటం  జరిగింది. ఈ  విషయం  కూడా  నిజమే. 

 

 ఇంట్లో  పెద్దవాళ్ళు  గొడవలు   పడుతుంటే  ఇక  పిల్లల  పరిస్థితి , ఆ   ఇంటి  పరిస్థితి ,తద్వారా  సమాజం    ఏం  బాగుంటుంది  .

 

 అందరూ  లక్ష్మీదేవి  అనుగ్రహాన్ని    పొంది  ఆరోగ్యంగా,  ఆనందంగా,  సిరిసంపదలతో  జీవించాలని  పెద్దలు  ఎన్నో  చక్కటి  ఆచారాలను ,  అలవాట్లను   దైనందిక  జీవితంలో    ఏర్పరిచారు.

  ..................................................
 
డబ్బు  ఉన్న  వాళ్ళు  మాత్రమే  లక్ష్మీ  కటాక్షాన్ని  పొందినవారని,   ధనం  మాత్రమే  లక్ష్మీ  స్వరూపం  అనీ   అనుకుంటారు  కొందరు.   కానీ,     ధనం తో  పాటూ   లక్ష్మీదేవి   ఇంకా    అనేక    రూపాల్లో  ఉంటుంది....... స్వర్గలక్ష్మి,  రాజ్యలక్ష్మి  ,  మోక్షలక్ష్మి....ఇలా....
 
ఇంకా...  ..... అష్టలక్ష్ములుగా ........ ఆదిలక్ష్మి,  ధాన్యం,   ధైర్యం,  గజములు (  రధ  గజ  తురగ పదాది..)  సంతానం,   విజయం,   విద్యా,   ధనం, .......ఇవన్నీ  లక్ష్మీ  స్వరూపాలే.

 
ఒకరికి  ఇంటినిండా  ధాన్యపు  రాశులుంటాయి.   అయినా    అతనికి  సుగర్  ,  బిపి , అజీర్ణం.. వంటి  వ్యాధులు  ఉంటే,   కడుపు  నిండా  తినటానికి  కూడా  అతడికి  అవకాశం  ఉండదు.

 
  ఒక  పేద  వ్యక్తికి   ఇంటి  నిండా  ధాన్యపు  రాశులు  లేకపోయినా , సుగర్ .. వంటి  జబ్బులు  లేకుండా  ఉంటే , అతడు  తనకు  ఉన్నంతలో   ,   ఇష్టమైన  ఆహారాన్ని    తినగలడు. 

 

  డబ్బున్నా  తినలేని  వ్యక్తి....... తక్కువ  డబ్బున్నా   చక్కగా  తినగలిగే  వ్యక్తి ...........  వీళ్ళిద్దరికి    కూడా   ఏదో  విధంగా   లక్ష్మీకటాక్షం  ఉందని  చెప్పుకోవచ్చు.

 

ఒక  వ్యక్తికి   ధనం    అంతగా  లేకున్నా ,   అతడికి  ధైర్యం  ఉంటే  , ఆ వ్యక్తికి   క్రమంగా  ధనలక్ష్మి  అనుగ్రహం    కూడా   లభించే  అవకాశం  ఉంది.

 

ధైర్యం  లేని  వ్యక్తి   తన  ధనాన్ని  కూడా  క్రమంగా  కోల్పోయే    అవకాశం   ఉంది.

 

ఇక  మోక్షలక్ష్మి   విషయంలో  పేదవారు,   డబ్బున్న వారు  అనే  తేడాలు  లేవు.  మోక్షలక్ష్మి  అనుగ్రహాన్ని  పొందిన  వారు  ఎంతో  అదృష్టవంతులు.

 

ఇవన్నీ  గమనిస్తే,  లక్ష్మీదేవి  అనుగ్రహం  అనేక  విధాలుగా    ఉంటుందని  మనం  తెలుసుకోవచ్చు.  అందుకే  ఎవరూ  నిరాశ చెందకూడదు. 


 లక్ష్మీకటాక్షం   అందరికీ  ఏదో  రూపంలో  ఉంటూనే  ఉంటుంది..



No comments:

Post a Comment