koodali

Friday, August 12, 2011

భగవంతునికి అసాధ్యం అన్నదే ఉండదు.

ఓం.

వరలక్ష్మీ వ్రతము సందర్భంగా
శుభాకాంక్షలండి .

రామాయణ,భారతములు ముందే ఒక ప్రణాళిక ప్రకారం జరిగాయని చెప్పుకున్నాము. మహా భారతము విషయంలో అది ఎలా జరిగిందంటే . .. ( క్లుప్తంగా. )

ఒకప్పుడు భూదేవి , భూమిపై పాపాత్ములు పెరిగిపోతున్నారని తాను ఆ భారాన్ని భరించలేకపోతున్నానని బాధపడినప్పుడు .... దేవతలు మరియు భూదేవి ... ఆదిపరాశక్తిని వేడుకోవటం జరిగింది.


అప్పుడు అమ్మవారు .. దేవతలు భూమిపై జన్మిస్తారని , తరువాత జరిగే యుద్ధం వల్ల పాపాత్ములు ఎందరో మరణించి భూభారం తగ్గుతుందని చెప్పటం జరిగింది.

శ్రీకృష్ణ జననం గురించి ,పాండవుల జననం గురించి ఇంకా , ఫలానా దేవతలు ఫలానా విధంగా జన్మ ఎత్తవలసి ఉంటుందని కూడా అమ్మవారు చెప్పటం జరిగింది.

ఆ విధంగా దేవతలకు భవిష్యత్తులో జరగబోయేది ముందే తెలుసు.

అలా దేవతలను నిమిత్తమాత్రులుగా చేసి అమ్మవారు అంతా నడిపించారు.

ఆదిపరాశక్తి అయిన పరమాత్మ తలచుకుంటే పాపాత్ములను చిటికెలో సంహరించగలరు.

కానీ, దేవతలు నిమిత్తమాత్రులుగా అమ్మవారు నడిపించిన చరిత్ర ఎన్నో కధలు, ఉపకధలతో రసవత్తరంగా నడిచింది.

ఆ విధంగా , పురాణేతిహాసాలలోని జీవిత కధల ద్వారా .. లోకానికి ఎన్నో గొప్ప విషయాలు అందించబడ్డాయి.

సామాన్యులమైన మనము పురాణేతిహాసాలలోని ధర్మాలను అపార్ధం చేసుకోకుండా చక్కగా అర్ధం చేసుకొని జీవితాలను తీర్చిదిద్దుకోవాలి.


ఒక సమస్యను పరిష్కరించేటప్పుడు , ఆ పరిష్కారం ద్వారా ప్రజలు కూడా ఎన్నో విషయాలను నేర్చుకునే విధంగా సమస్యను పరిష్కరించటం దైవానికే సాధ్యమవుతుంది...

ఇంకా,

( పిల్లలకు నీతి కధలు బోధించేటప్పుడు కొన్నిసార్లు , పెద్దవాళ్ళు ఆ కధలలోని పాత్రధారులుగా తాము అభినయించి చూపిస్తారు కూడా .)

ఇంకా,

దేవతల గురించి పెద్దలు చెప్పిన విషయాల్లో అర్ధాలు నిగూఢంగా ఉంటాయట. మనం వాటి గురించి పైపై విషయాన్ని చూసి ఒక నిర్ణయానికి వచ్చెయ్యకూడదు.

గోలోకానికి అధిపతులు .. శ్రీకృష్ణుడు రాధాదేవి. . అక్కడ శ్రీకృష్ణుడురాధాదేవి దంపతులు.

ఒక సందర్భంలో శ్రీకృష్ణుని లీలల గురించి రాధాదేవి శ్రీ కృష్ణుని అడుగుతూన్న సందర్భంలోని కొన్ని విషయాలు ఇలా ఉన్నాయి...


శోభ అనే గోపిక శరీరం విడిచిపెట్టి చంద్రమండలంలోకి వెళ్ళిపోగా ...... శ్రీకృష్ణుడు ఆవిడ తేజస్సును విభజించి కొంత రత్నానికి, బంగారానికి, స్త్రీల ముఖాలకీ, చిగురాకులకీ, పువ్వులకీ, పక్వ ఫలాలకీ, పంటలకీ, రాజదేవమందిరాలకీ, శిశువులకీ, క్షీరానికీ, పంచిపెట్టారట.


ప్రభ అనే గోపిక సూర్యమండలానికి వెళ్ళిపోయింది..... ఆ ప్రభను కృష్ణుడు కొంత తన కన్నులలో దాచుకున్నారట. కొంత అగ్నికీ., యక్షులకీ, పురుష సింహాలకీ, దేవతలకీ, విష్ణుజనులకూ, నాగజాతికీ, బ్రాహ్మణులకూ, మునులకీ, తపస్వులకూ, సౌభాగ్యవతులకూ, యశస్వంతులకూ విభజించి ఇచ్చారట.

శాంతి అనే గోపిక శరీరాన్ని విడిచి కృష్ణునిలో లీనమయ్యిందట. ... శాంతిని విభజించి కొంత బ్రహ్మకూ, కొంత రాధాదేవికీ, లక్ష్మీదేవికీ, కృష్ణుని మంత్రోపాసకులకూ, శాక్తేయులకూ, తపస్వులకూ, ధర్ముడికీ పంచిపెట్టారట.

క్షమ అనే గోపిక ప్రాణాలు విడిచి భూమిలో కలిసిపోయిందట. ... అప్పుడు కొంత భాగాన్ని విష్ణువుకీ, వైష్ణవులకీ, ధార్మికులకీ, ధర్ముడికీ, దుర్బలులకీ, తపస్వులకూ, వేదపండితులకూ, పంచి ఇచ్చినట్లు చెప్పబడింది.

ఇవన్నీ చదివితే మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి.

ఈ విషయములలోని అంతరార్ధములు నాకు అంతగా తెలియవు కానీ , శోభ కూ ప్రభకూ ఉండే తేడా....ఏవి ఎక్కడ ఉంటాయి అనే విషయాలు మనము కొద్దిగా తెలుసుకోవచ్చు .


ఉదా.. చంద్రునికి ఉండే గుణాన్ని శోభ అంటారనీ, సూర్యునికి ఉండే గుణాన్ని ప్రభ అంటారని తెలుస్తోంది.ఇంకా, ,


శాంతి అనే గుణం ఎవరిలో ఎక్కువగా ఉంటుంది ,క్షమ అనే గుణం ఎవరిలో ఎక్కువగా ఉంటుంది. ఇత్యాది విషయాలు తెలుసుకోవచ్చని నాకు అనిపించిందండి.

ఇంకా, కొందరు ఏమంటారంటే, ప్రాణం లేని గ్రహాలు ఆలోచించినట్లు పురాణాల్లో చెబుతారు. అవి ఎలా ఆలోచించగలవు? అవి ఏమన్నా జీవులా? అంటారు.

కానీ గ్రహాధిదేవతలు ఉంటారు. మనకు గ్రహదోషాలు ఉన్నప్పుడు ఆ గ్రహాధిదేవతలను పూజించటం జరుగుతుంది.

" శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము. "ఈ గ్రంధములో విశేషమైన విషయాలు చెప్పబడ్డాయి. వీలయితే తప్పక చదవండి.

ఇంకా...

" శ్రీ దేవీ భాగవతము " గ్రంధములో మణిద్వీపవర్ణనలో షోడశశక్తుల పేర్లు చెప్పబడ్డాయి.

ఆ పేర్లు....కరాళి,వికరాళి, ఉమ, సరస్వతి, శ్రీ , దుర్గ, ఉష, లక్ష్మి,శ్రుతి, స్మృతి,ధృతి,శ్రద్ధ, మేధ,మతి, కాంతి,ఆర్య వీరు జగన్మాతకు సేనానులు. అని చెప్పబడింది.
ఇంకా,

చింతామణి గృహంలో భువనేశ్వరుడి వామాంకంలో కూర్చుని ఉంటుంది శ్రీ భువనేశ్వరి. అని చెప్పబడింది.
ఇంకా,

లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ, స్మృతి, లక్ష్మి, వీరు అక్కడుండే దేవాంగనలు అని ..... అని చెప్పబడింది.

ఇంకా,
సృష్టిలో సకల సప్తకోటి మహామంత్రాలూసకల మహావిద్యలూ రూపుదాల్చి వచ్చి ఆ సామ్యావస్థాత్మికను ఆ శివను ఆ కారణబ్రహ్మరూపను ఆ మాయా శబల విగ్రహను నిరంతరం ఉపాసిస్తూ ఉంటాయి.

ఇలా ఎన్నో విషయాలు కూడా చెప్పబడ్డాయి.

నాలాంటి సామాన్యులకు ఇలాంటి విషయాల అంతరార్ధాల గురించి అంతగా తెలియకపోయినా పురాణేతిహాసముల గొప్పదనం తెలుస్తోంది.

విశ్వంలో.... భావాలూ, గుణాలు , నదులూ కూడా రూపాన్ని పొంది పరమాత్మను ప్రార్ధిస్తాయట. మనకు ఇలాంటివి వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది..

ఇలాంటి అద్భుతాలెన్నో విశ్వంలో ఉన్నాయని పురాణేతిహాసాల ద్వారా తెలుస్తుంది. ...

విశ్వంలో అంతటా పరమాత్మ ఉంటారు.

ఒక రూపాన్ని చేసి , ప్రాణం పోసి ఆలోచనా శక్తిని ,గుణాలనూ ఇచ్చిన పరమాత్మకు ...........


ఆలోచనా శక్తికి ,గుణానికి ,నదులకూ ..... తిరిగి రూపాన్ని , ప్రాణాన్ని ఇవ్వటం కూడా చేతనవుతుంది. ..


భగవంతునికి అసాధ్యం అన్నదే ఉండదు...........ఏది చెయ్యటానికైనా సర్వసమర్ధులు వారు.


అందుకని, అంతులేని ,మనకు అంతుపట్టని విషయాల గురించి అతిగా ఆలోచించి ఆయాసపడేకన్నా... అన్నిటికి ఆది అయిన పరమాత్మనే శరణు వేడితే చాలు కదా ! అనిపిస్తుంది.

.కలియుగంలో నామస్మరణం సులభమయిన ఉపాయమని పెద్దలు చెప్పటం జరిగింది.

అందుకే , వీలయినంతవరకూ నామస్మరణం చెయ్యటానికి ప్రయత్నిస్తే మంచి జరుగుతుంది.

ఇందులో ఏమైనా పొరపాట్లు ఉన్నయెడల దైవం క్షమించాలని ప్రార్ధిస్తున్నానండి.

ఈ మాత్రం వ్రాయించినందుకు భగవంతునికి కృతజ్ఞతలు చెబుతున్నాను.


అంతా దైవం దయ.. .. .


ఇందులో ఒప్పులను దైవం దయగా, తప్పులను నావిగా గ్రహించాలని మనవి.


No comments:

Post a Comment