ఒకోసారి మనకు కొన్ని ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. ఉదా...మనకు తెలిసినవారు మనల్ని వారు చేయబోయే పూజలకు, వ్రతములకు పిలుస్తుంటారు కదా !
ఉదా....సత్యన్నారాయణ స్వామి వారి వ్రతమునకు పిలిచారనుకోండి ! పూజకు వెళ్ళినా ఒక్కోసారి పూజ పూర్తి అయ్యేవరకూ ఉండటానికి మనకు కుదరకపోవచ్చు. మనకు పూజ మధ్యలో నుండి తప్పనిసరిగా వెళ్ళవలసిన పనులు ఉండవచ్చు.
అలాంటప్పుడు ఇలా ధర్మ సందేహాలు వస్తూంటాయి. ....ప్రసాదం తీసుకోకుండా మధ్యలో వెళ్తే ఏమవుతుందో అని. అలా అని వెళ్ళకపోతే మరి మన పనులు ఎలా ? అని......
పూజను స్వయముగా చేస్తున్న వాళ్ళు ఎలాగూ వీలయినంత నియమముగానే చేయటానికి ప్రయత్నిస్తారు. నియమముగా చేస్తే వాళ్ళకే ఎంతో మంచిది.
కానీ పూజను చూడటానికి వెళ్ళేవాళ్ళకు పూజ పూర్తి అయ్యే వరకూ ఉండాలంటే ఒకోసారి కుదరదు కదండి.
కుదిరితే , పూజ పూర్తి అయ్యేవరకూ ఉండి , తీర్ధ,ప్రసాదములు తీసుకుని రాగలిగితే ఎంతో అదృష్టము. కానీ కుదరనప్పుడు ఏమి చెయ్యాలి అన్నదే ఇక్కడ చెప్పుకుంటున్న సమస్య.
ఇలాంటప్పుడు ఏమి చెయ్యాలో తెలియక నేను రకరకములుగా అలోచిస్తూంటాను. ఈ విధముగా............
1. ప్రసాదం తీసుకోకుండా పూజ మధ్యలో వచ్చేయటం వల్ల ఏదైనా దోషం వస్తుందేమో ? అందుకే అసలు పూజకే వెళ్ళకుండా ఉంటే ఎలా ఉంటుంది ? ...అని.... ( పూజకు పిలిస్తే వెళ్ళకపోతే ఎలా .... ? అని ) మళ్ళీ..
2. దేవుని పూజకు పూర్తిగా వెళ్ళకుండా మానటం కంటే ..... మనకు వీలుకుదిరినంతవరకూ చూసి ఆ తరువాత భగవంతుని పైన భారం వేసి మన పనికి మనం వెళ్ళటం. ( దేవుని పూజ చూసే భాగ్యం కొద్దిసేపు దొరికినా అదృష్టమే కదా ! )
( దోషం గురించి అలోచించి దైవానికి దూరమవటం వివేకము అనిపించుకోదు. అలా చేసే కన్నా, దైవాన్నే నమ్ముకుని మనకు వీలయినంత వరకు పూజలో పాల్గొంటే, తరువాత అంతా దైవమే చూసుకోవటం జరుగుతుంది కదా ! )
ఇలా... రకరకాల ఆలోచనలతో ఏమి చెయ్యాలో అర్ధం కాదండి.
ఇలాంటప్పుడు పైన రెండు ఆలోచనలలో, నాకు రెండవదే మంచిదని అనిపించిందండి.
అయితే ఇలాంటప్పుడు ప్రసాదం తీసుకోకుండా వచ్చేశామే .... అని మనసు పీకుతుంది.
ఒకోసారి ఒక్కోసారి మనము అప్పుడే వేరే ఊరు వెళ్ళవలసి వస్తుందనుకోండి. మళ్ళీ వచ్చి అదే రోజు ప్రసాదం తీసుకోవటం కుదరదు,.
దీనికి నాకు ఇలా చేస్తే బాగుంటుంది అనిపించిందండి.
అక్కడ పూజ పూర్తి అయ్యే సమయాన్ని సుమారుగా లెక్కవేసుకుని మనము ఎక్కడ ఉన్నా, ఒకవేళ ప్రయాణములో ఉన్నా, అక్కడ దొరికే మామూలు నీటిని, ఆహారపదార్ధాన్ని తీర్ధము, ప్రసాదముగా భావించి దైవాన్ని స్మరించి , వాటిని ప్రసాదముగా తీసుకోవచ్చు.
ఆఖరికి ఏదీ దొరకకపోతే ఒక ఆకునైనా ప్రసాదముగా భావించి తీసుకోవచ్చు. దేనికైనా భావన ముఖ్యమని పెద్దలు చెబుతున్నారు కదండి. ( అలా అని పేరు తెలియని ఆకులు తినకూడదు లెండి. )
అలా పూజ పూర్తి అయ్యేవరకూ ఉండి , ప్రసాదము తీసుకుని వచ్చే సమయము లేనప్పుడు ఇలా చేయవచ్చని నాకు అనిపించిందండి.
ఇలాంటి సందర్భములలో ఏమి చెయ్యాలని శాస్త్రములో చెప్పారో నాకు తెలియదండి. నాకు పెద్ద పాండిత్యం లేదు. ఏదో నాకు తోచినంతవరకు ఆలోచనలు మీకు చెప్పుకోవటానికి ఇలా వ్రాస్తున్నానండి...
అయితే ఎవరయినా పూజలను చూడటానికి వెళ్ళినప్పుడు సాధ్యమయినంతవరకూ ఆ పూజ పూర్తి అయ్యేవరకూ ఉండి ప్రసాదం స్వీకరించటం వల్ల వారికి మంచి జరుగుతుందని అందరికి తెలిసిన విషయమే.
No comments:
Post a Comment