ఇంతకు ముందు పోస్ట్ వ్రాసిన తరువాత నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయండి.
ఏమంటే, పాపములు చేసే వాళ్ళు దైవపూజకు అర్హులు కారు అనుకుంటే ఈ కలికాలములో పాపములు చెయ్యనివాళ్ళు ఎంతమంది ఉంటారు ?
అదీకాక వారిని దైవకార్యక్రమముల వంటి మంచి కార్యక్రమములకు దూరం చేస్తే వారు మంచికి మరింతగా దూరమయ్యే అవకాశం ఉంది.
సత్సంగం వల్ల చెడ్డ ఆలోచనలు దూరమయి చెడ్డవాళ్ళు మంచిగా మారే అవకాశం ఎంతో ఉందని పెద్దలు చెబుతున్నారు కదండి. అందుకే మంచివాళ్ళయినా, చెడ్డవాళ్ళయినా దైవపూజకు అర్హులే.
అయితే, కొన్ని ప్రాచీన గ్రంధములలో ఏమని ఉంటుందంటే ..అందులోని విషయములను భక్తిలేని వారికి చెప్పవద్దని హెచ్చరిస్తారు పెద్దలు.
ఎందుకంటే, కొందరు దురాశాపరులు ప్రాచీనవిజ్ఞానాన్ని, గొప్పమంత్రములను దుర్వినియోగపరచటం వల్ల లోకమునకు హాని కలుగుతుందని పెద్దల అభిప్రాయం కావచ్చు.
ఇలాగే కొంతమంది తీవ్రస్థాయి చెడ్డ మనస్తత్వం గలవాళ్ళు ( పురాణములలో చెప్పబడ్డ రాక్షసులు ) తపస్సులు అవిచేసి, మరింత బలం సంపాదించి లోకములను అల్లకల్లోలం చేయటానికి ప్రయత్నిస్తారు. అయితే, ఆఖరికి వారు దైవం చేతిలో సంహరించబడటం అందరికీ తెలిసిన విషయమే.
ఈ రాక్షసులు తీవ్రమయిన తపస్సు చేసినప్పుడు ఆ తపశ్శక్తి వల్ల పుట్టిన వేడికి లోకాలు తల్లడిల్లగా, దేవతలు లోకములను రక్షించుట కొరకు రాక్షసులకు వరప్రదానం చేసినట్లు మనం చదువుకున్నాము.
ఇవన్నీ ఆలోచిస్తే ఇలా అనిపిస్తోందండి. ఈ విశ్వాన్నే సృష్టించిన పరమాత్మకు ........... రాక్షసులకు వరములను ఇవ్వకుండానే , ఆ రాక్షసుల తపశ్శక్తి వల్ల పుట్టిన వేడినుంచి లోకములను కాపాడటం పెద్ద పనేమీ కాదు.
అయితే, పరమాత్మ దయామయుడు. మంచివారు, చెడ్డవాళ్ళు అందరూ వారి బిడ్డలే .
అందుకే రాక్షసులయినా వారు కష్టపడి తపస్సు చేయటం వల్ల దైవం వారికి వరములను ప్రసాదించి, ఆ రాక్షసులు కూడా మంచిగా మారటానికి ఒక అవకాశమును కల్పించిందని మనం భావించవచ్చు.
కానీ వరములను పొందిన తరువాత వారు మంచిగా మారకుండా లోకులను పీడిస్తూ ఉండటం వల్ల దైవం వారిని సంహరించవలసి వస్తోంది.
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ రాక్షసులు ఒక ప్రక్క దైవంవల్లనే వరములను పొందుతూ , ఆ వరముల సాయంతోనే లోకులను పీడించటానికి, దైవాన్ని ఎదిరించుటకు ప్రయత్నిస్తారు.
కానీ సదా లోకక్షేమం కోరే దైవం చూస్తూ ఊరుకోవటం జరగదు కదా !
అసలు ఈ రాక్షసులకు తపస్సు చేసేటప్పుడు త్వరగా వరములను ప్రసాదించటం ఒకరకముగా మంచిదే. లేకపోతే వారు అలాగే తపస్సు చేస్తూ మరింత శక్తిని పొందే అవకాశం ఉంది.
వారిని సంహరించటం వారికి కూడా మంచి చేయటమేనని పెద్దలు చెబుతున్నారు. ఎలాగంటే ఆ రాక్షసులు మరిన్ని చెడ్డపనులు చేసి మరిన్ని పాపములు మూటకట్టుకోకుండా అన్నమాట.
......ఇవన్నీ ఎలాగంటేనండీ, ... ఉదా.. శరీరంపై వచ్చిన వ్రణములు కొన్ని మందులతో తగ్గుతాయి. కొన్ని తీవ్రమయిన వ్రణములు శస్త్రచికిత్స ద్వారా కోసిపారేస్తే గానీ పోవు.
అలాగే కొద్ది స్థాయి చెడ్డవాళ్ళు దైవపూజల వల్ల మంచిగా మారే అవకాశం ఉంది. తీవ్రస్థాయి చెడ్డతనం కలిగిన వాళ్ళు మారరు .. వారికి వెయ్యవలసిన శిక్షను వారికి దైవం వేసేవరకూ....... అని తెలుస్తోంది.
ఇలా ప్రతి విషయానికి మనకు తెలియని ఇంకా ఎన్నో కోణములు ఉంటాయని అనిపిస్తోందండి..
No comments:
Post a Comment