koodali

Monday, February 5, 2018

మూఢాచారాల వల్ల కలిగే నష్టం కన్నా...ఆధునిక కాలంలో అభివృధ్ధి పేరుతో.....


ఆధునిక విజ్ఞానం అయినా ..ఆధ్యాత్మికత అయినా స్వార్ధ ప్రయోజనాలకు వాడకూడదు..


ఆధునిక విజ్ఞానాన్ని కొందరు తమ స్వార్ధానికి వాడుకుంటున్నట్లే ....ఆధ్యాత్మికతను కూడా కొందరు తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.


కొందరు స్వార్ధం వల్ల , మరి కొందరు  తెలిసీతెలియనితనం వల్ల ..సమాజంలో కొన్ని మూఢాచారాలను వ్యాపింపచేశారు.


.........................

అయితే, మూఢాచారాల వల్ల సమాజానికి కలిగే నష్టం కన్నా... గ్లోబల్ వార్మింగ్ వంటి   వాటి  వల్ల  ప్రపంచానికి   కలిగే  నష్టం ఎక్కువ. 

.......................
 ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా  వాతావరణపరిస్థితిలో  విపరీతంగా మార్పులు వచ్చాయి.


 విపరీతమైన ఎండ వేడి, విపరీతమైన చలి, వరదలు, తుఫాన్లు..    పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచంలో  క్లిష్టమైన పరిస్థితి  ఏర్పడవచ్చంటున్నారు.


ఆధునిక కాలంలో అభివృధ్ధి పేరుతో  ప్రపంచానికి, పర్యావరణానికి, కోట్లాది మూగజీవులకు ఎంతో హాని కలుగుతోంది.


పరిశ్రమల ద్వారా విడుదల చేస్తున్న ప్రమాదకర రసాయన వ్యర్ధాలు  నదులలో , సముద్రాలలో కలసి, భూమిలో ఇంకి,  ఆ నీటితో   పండించిన ఉత్పత్తులు తినటం వల్ల   మనుషులు, ఇతర జీవులు అనేక రోగాల బారిన పడటం జరుగుతోంది. 


   ప్లాస్టిక్  వంటి  వాటివల్ల కలిగే కొన్ని నష్టాలను అనుభవిస్తూనే ఉన్నాము.  ఇలా చాలా ఉంటాయి. 



ఇక అణు కర్మాగారాలనుంచీ విడుదలయ్యే అణువ్యర్ధాలను ఎక్కడ వదలాలన్న దానికి  సరైన  పరిష్కారం ఏమీ లేదు.

 ఆధునిక ఆవిష్కరణల వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయి.

కొన్ని విపరీత ఆవిష్కరణల వల్ల ప్రమాదాలూ కలుగుతున్నాయి.

ఆధునిక విజ్ఞానం అంటే నాకు ..వ్యతిరేకత ఏమీ లేదండి. 


ఆ విజ్ఞానం హాని చెయ్యకుండా ప్రపంచానికి ఉపయోగపడాలన్నదే నా అభిప్రాయం.

 గ్లోబల్ వార్మింగ్ వంటి  సమస్యల గురించి  అందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతో ఉంది. 




Friday, February 2, 2018

వైద్యం..కొన్ని విషయాలు...



ఇంతకు ముందు మేము ఉన్న ఊరిలో .. ఇరుగుపొరుగు ఇళ్ళల్లో  ఒక లేడీ డాక్టర్ గారు లివర్ వ్యాధి వల్ల మరణించారు. ఆమె గమనించేసరికే వ్యాధి ముదిరి పరిస్థితి చేయిదాటి పోయిందట.

ఇంకొక ఆమె  కాన్సర్ వ్యాధితో మరణించారు.  కాన్సర్ అని తెలిసేవరకూ ఆమె ఆరోగ్యంగానే ఉండేవారు. వ్యాధి ఉన్న లక్షణాలేవీ తెలియలేదు. కాన్సర్ అని తెలిసిన కొన్ని నెలలకే ఆమె మరణించారు.

ఇప్పుడు మేము ఉన్న ఊరిలో .. కొన్ని రోజుల క్రిందట మా వీధిలో ఒకాయన లివర్ వ్యాధి వల్ల సడన్ గా మరణించారు. అంటే, మూడునెలల క్రితం మాత్రమే ఆ వ్యాధి ఉన్నట్లు వాళ్ళకు తెలిసిందట. 

 కిడ్నీ, కాన్సర్ వ్యాధిన బారిన పడుతున్న వారిలో పిల్లలు, మధ్యవయస్కులు, పెద్దవాళ్లు అని తేడా లేకుండా జబ్బులు వస్తున్నాయి.

ఇవన్నీ గమనించిన తరువాత ... ఈ రోజుల్లో వ్యాధులు బాగా పెరుగుతున్నాయనిపించి కొన్ని విషయాలను వ్రాసాను.

అయితే ,  అనారోగ్యాలు తక్కువగా వచ్చేవారు కూడా సమాజంలో ఉన్నారు.

వ్యాధులు రావటానికి గల కారణాలను గుర్తించి వీలైనంతలో జాగ్రత్తలు పాటించితే అనారోగ్యాలు రావటం తగ్గుతాయి.
..........................

ప్రాచీనకాలంలో ఆయుర్వేదంలో  గొప్పప్రావీణ్యత కలిగిన సుశ్రుతుడు, చరకుడు వంటి గొప్పవైద్యులు ఉండేవారు. సుశ్రుతుడు ఆ రోజుల్లోనే శస్త్రచికిత్సలు చేయటంలో గొప్ప నైపుణ్యం కలిగినవారంటారు.

ఇక వైద్యులైన అశ్వనీకుమారులు ..చ్యవన మహర్షి  యొక్క అంధత్వాన్ని పోగొట్టి, యవ్వనవంతునిగా చేసిన కధ చాలామందికి తెలుసు.


 రామాయణంలో హనుమంతులవారు  సంజీవని మూలిక తేవటం..లక్ష్మణుడు కోలుకోవటం  జరిగింది.


 ఇవన్నీ గమనిస్తే ప్రాచీనకాలంలోనే  వైద్యశాస్త్రం ఎంతో గొప్పగా ఉండేదని తెలుస్తుంది.


 ప్రాచీనకాలపు ఆయుర్వేద వైద్య విజ్ఞానం ఈ రోజుల్లో నిర్లక్ష్యానికి గురయింది. ఎంతో విజ్ఞానాన్ని మనం పోగొట్టుకున్నాం.

........................
 పూర్వం  వాళ్ళు  ప్రతి  చిన్న  అనారోగ్యానికి  వెంటనే   హాస్పిటల్స్ కు  పరిగెత్తేవారు  కాదు.


  ఇంట్లోని  బామ్మగారు  మొదలైన  పెద్దవాళ్ళు  వంటింట్లోని  పదార్ధాలను  కలిపి  మందుగా  ఇచ్చేవారు.  అవి  వేసుకుంటే  కడుపునొప్పి,  అజీర్ణం  వంటి  ఎన్నో  అనారోగ్యాలు  తగ్గిపోయేవి.

 బామ్మలు  పెద్ద  చదువులు   చదవకపోయినా  తరతరాలుగా  వారసత్వంగా   నేర్చుకున్న  చిట్కా  వైద్యంతో  కుటుంబసభ్యుల  రోగాలను  తగ్గించేవారు.

  ఈ  రోజుల్లో   కూడా    కొందరు  వ్యక్తులు   తాము    వారసత్వం  ద్వారా  నేర్చుకున్న  ప్రాచీన  వైద్యం  ద్వారా   ప్రజలకు    చక్కటి    వైద్య  సహాయాన్ని  అందిస్తున్నారు.

 డబ్బు  ఆశలేకుండా  సేవాదృక్పధంతో  ప్రజలకు   వైద్యాన్ని  అందించే  మంచి వాళ్ళను  అనుమానించటం సబబు కాదనిపిస్తుంది .

.....................................

ఇంగ్లీష్  వైద్యం వల్ల కూడా ఉపయోగాలున్నాయి.

 ఎన్నో రోగాలను తగ్గించటంలో, ఎవరికైనా విపరీతంగా నీరసం వచ్చినప్పుడు సెలైన్ ఎక్కించటానికి, ఆపరేషన్స్ అవసరమైనప్పుడు చాలా ఉపయోగపడుతుంది.
 

రేబిస్ వ్యాధికి టీకా కనిపెట్టిన లూయి పాశ్చర్ గారు గొప్ప వారు.
...............

హోమియో వైద్యాన్ని చాలామంది నమ్మరు. అయితే ,  హోమియో కూడా బాగా పనిచేస్తుంది.


నేను చిన్నతనంలో టాన్సిల్స్ వల్ల చాలా బాధపడ్డాను. 


ఇక, వేసవిసెలవులలో నాకు టాన్సిల్స్ సర్జరీ చేయించటానికి మా పెద్దవాళ్లు సిద్ధమవగా , ఒక హోమియో వైద్యులు పరిచయమయి , టాన్సిల్స్ తగ్గటానికి హోమియో మందులు ఇవ్వటం జరిగింది. 

అంతే టాన్సిల్స్ బాధ తగ్గిపోయింది. ఇప్పటివరకూ మళ్లీ ఇబ్బంది రాలేదు.


***************
  నా విషయంలో,  హోమియో వైద్యం ద్వారా  టాన్సిల్స్ సమస్య పూర్తిగా తగ్గింది. 

 ఆశ్చర్యమేమిటంటే .. హోమియో ద్వారా చాలామందికి జబ్బులు తగ్గటం కనిపిస్తున్నా  కూడా ,  హోమియో వైద్య విధానం  శాస్త్రీయం కాదని కొందరు అనటం విడ్దూరంగా ఉంటుంది.

 ఇలాంటి వారి దృష్టిలో శాస్త్రీయత అంటే అర్ధం ఏమిటో ?

అయితే ,  వైద్యం విషయంలో.. రోగాన్ని తగ్గించటంలో డాక్టర్ కు ప్రతిభ  ఉండాలి  మరియు రోగి కూడా డాక్టర్ చెప్పినట్లు మందులు  వేసుకోవాలి. 


డాక్టర్ రోగాన్ని సరిగ్గా  కనిపెట్టలేకపోయినా... రోగి సరిగ్గా మందులు వేసుకోకున్నా జబ్బు తగ్గకపోవచ్చు. ఇందుకు వైద్యశాస్త్రాన్ని తప్పుపట్టకూడదు.

************* 

  మాకు అనారోగ్యాలు తక్కువగానే వచ్చాయి. దైవానికి అనేక కృతజ్ఞతలు.
*****************

(Wednesday, December 16, 2015

వైద్యం..కొన్ని విషయాలు...)

 

సైన్స్... శాస్త్రీయత మరియు కొన్ని విషయాలు.



 ఈ  రోజుల్లో   ప్రతిదానికి   సైన్స్,  శాస్త్రీయత  అంటున్నారు.  అలా  ఆలోచిస్తే   ఆధునిక  సైన్స్ కు  అంతుపట్టని  విషయాలెన్నో  ఉన్నాయి.

ఉదా.... కొందరు  సామాన్యులు  కేవలం  తమ  పళ్ళతో  పెద్ద  లారీని   కొంతదూరం  లాగటం,  విమానాన్ని  జుట్టుకు  కట్టి  లాగటం  చూస్తూనే  ఉన్నాము. 
ఆధునిక సైన్స్,  శాస్త్రీయత  ప్రకారం  ఆలోచిస్తే   ఈ  విధంగా  లాగటం  అసాధ్యం  కదా !  


    ఆధునిక సైన్స్,  శాస్త్రీయత  ప్రకారం  .... జుట్టుతో    లేక  పళ్ళతో  భారీ  వాహనాన్ని  లాగాలని  ప్రయత్నిస్తే  జుట్టు  లేక  పళ్ళు  కుదుళ్ళతో  సహా  ఊడి  వస్తాయి. 

అయితే  కొందరు  వ్యక్తులు  ఈ  విధంగా  లాగి  చూపిస్తున్నారు  కదా  !  వాళ్ళెలా  భారీ  వాహనాలను  లాగగలుగుతున్నారు  ?

  ఈ విషయాలను ఆధునిక   సైన్స్, శాస్త్రీయత ప్రకారం  ఎలా  నిరూపించగలం ?

 
 ఇవన్నీ  గమనిస్తే    ఏమనిపిస్తుందంటే , శారీరికశక్తి  కన్నా  మానసిక  శక్తి  చాలా  గొప్పది  అనిపిస్తుంది.  


  ఇలాంటి  సాహసాలు  చేసేవారు  మనలాంటి  మామూలు  వ్యక్తులే.  కానీ,   వాళ్ళు  తమ  యొక్క  గట్టి  సంకల్పశక్తి  మరియు  పట్టుదల  వల్ల  ఇలాంటి  అసాధ్యాలను  సుసాధ్యం  చేస్తున్నారనిపిస్తుంది.  


 ఇంకా   ఏమనిపిస్తుందంటే ,   ఈ  కాలంలోని  సామాన్య  వ్యక్తులే  తమ  సంకల్పశక్తితో  కృషి  చేసి  ఇలాంటి  సాహసాలు  చేయగలుగుతున్నప్పుడు  ..... 
 


పూర్వకాలపు  మహర్షులు  గొప్ప  తపస్సులు  చేసి  పొందిన   శక్తితో  ఎన్నో  అసాధ్యాలను  సుసాధ్యాలు  చేసేవారనటంలో  ఎటువంటి  సందేహమూ  లేదు.

 
   ఆధునిక  భౌతికవాద  శాస్త్రవేత్తలు  మానవ  శరీరం  గురించి  కొన్ని  విషయాలను   తెలుసుకోగలిగారు  కానీ ,  మనిషి  మనస్సు  గురించి,   అది  పనిచేసే  విధానం  గురించి   ఆధునిక  భౌతికవాద  శాస్త్రవేత్తలకు  తెలిసింది  చాలాచాలా  తక్కువ. 


  అందువల్ల  మనం  తెలుసుకోవలసింది  ఏమిటంటే ,   దైవం సృష్టించిన  సృష్టిలోని  సైన్స్  గురించి   మనకు  తెలిసింది  సముద్రంలో  నీటిబొట్టంత  అని...  ప్రాచీనులకు  తెలిసిన... ఆధునికులకు  తెలియని ...  సైన్స్  ఇంకా  ఎంతో  ఉంది  అని.  

  ....................................

(Wednesday, June 5, 2013

సైన్స్... శాస్త్రీయత మరియు కొన్ని విషయాలు. )

 


Monday, January 29, 2018

అందరూ సురక్షితంగా ఉండే పరిస్థితి ...

 కొన్ని వార్తలు ఎంతో బాధ కలిగిస్తుంటాయి.

మహిళలు  వ్యభిచార గృహాలకు తరలించబడటం వంటివి అత్యంత బాధాకరమైన విషయాలు. 

 
 మానసికంగా, శారీరికంగా ఎంతో క్షోభను అనుభవించే అలాంటి పరిస్థితులు..  ఎంతో  దారుణం.
 
 మహానది అనే సినిమాలో  చూపించిన సంఘటనలు  హృదయవిదారకంగా ఉంటాయి. 



**********

వ్యభిచారకూపాలలో మగ్గుతున్న మహిళలను   రక్షించి,  వారిని ఆదుకోవటానికి కొందరు కృషిచేస్తున్నారు.
వీరందరూ ఎంతో గొప్పవారు.

 హిళా  సంస్థలు కూడా కష్టాలలో ఉన్న  మహిళలను  ఆదుకుంటున్నారు. వీరందరూ ఎంతో గొప్పవారు.
.................

సమాజంలో బాధాకరమైన పరిస్థితి  లేకుండా..  అందరూ   సురక్షితంగా ఉండే పరిస్థితి   ఏర్పడాలని ఆశిద్దాము.  





Friday, January 26, 2018

. కొన్ని విషయాలు..బ్రహ్మచర్యం, గృహస్ఠ జీవనం.....



ఈ రోజుల్లో సమాజంలో చాలా మార్పు వచ్చింది.  వివాహేతర  సంబంధాలు ఉంటే తప్పేమిటి ? వంటి  మాటలు మాట్లాడే వారి సంఖ్య పెరిగింది. 

బయట ఆకర్షణలు ఎక్కువగా ఉంటున్నాయి...ఇలాంటప్పుడు భార్యాభర్తలు ఉద్యోగం  వల్లనో   లేక ఆచారవ్యవహారాలు
వల్లనో   లేక మరేదైనా కారణాలతోనే దూరంగా జీవించటం మంచిది కాదు.


  అయితే, కొన్నిసార్లు అనారోగ్యం వల్లనో, పూజాదీక్షల వల్లనో, ఉద్యోగరీత్యానో భార్యాభర్తలు దూరంగా ఉండక తప్పని పరిస్థితి   ఉండవచ్చు. ఇలాంటప్పుడు భార్యాభర్త  పద్ధతిగా వ్యవహరించాలి.


 భార్యాభర్త ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలుపంచుకోవాలి. 


***************
బ్రహ్మచర్యం, గృహస్ఠ జీవనం..
*****************
ఈ లింక్ వద్ద కూడా దయచేసి చదవండి.
బ్రహ్మచర్యం దాంపత్య ధర్మం..వంటి విషయాల  గురించి ఎన్నో సందేహాలు ఉంటాయి... 

గృహస్థాశ్రమంలో భార్యాభర్తల ఏకాంతకార్యం విషయంలో నియమాల గురించి  ఎన్నో సందేహాలు వస్తుంటాయి. 

 అయితే, శ్రీ దేవీ భాగవతము ద్వారా ..తెలుసుకున్న కొన్ని విషయములు..

 నారాయణ మహర్షి నారద మహర్షికి తెలియజేసిన కొన్ని విషయములు .
 
జపహోమాది సమయాల్లో మౌనంగా ఉండాలి. ఏ సంభాషణమూ చెయ్యకూడదు. మైధునాలాపాలు అస్సలు చెయ్యకూడదు. మనోవాక్కాయకర్మలలో సర్వకాలసర్వావస్థలలో మైధున ప్రసక్తిని పరిత్యజించడమే బ్రహ్మచర్యమంటేను. అని  తెలియజేస్తూ


 ఇంకా...

  బ్రాహ్మణక్షత్రియులు గృహస్థాశ్రమంలో కూడా బ్రహ్మచర్యం పాటించవచ్చు.సంస్కారవంతురాలైన సవర్ణస్త్రీని వివాహం చేసుకుని నిషిద్ధసమయాలలో కలయికను పూర్తిగా పరిత్యజించి , అనుమతించిన దినాలలో రాత్రిపూట మాత్రమే సంగమిస్తూ సంసారం సాగిస్తే అది బ్రహ్మచర్యమే. అని  తెలుస్తోంది.

పై విషయాన్ని గమనిస్తే,

 
 ఎక్కువ నియమనిష్ఠలు ఉండే బ్రాహ్మణక్షత్రియుల విషయంలో కూడా..  
 నియమాల విషయంలో కఠినత లేకుండా, సరళంగా ఉన్నట్లు  తెలుస్తుంది. అందువల్ల ఈ విషయంలో ఎవరూ భయపడనవసరం లేదు.
..........................

సనాతనధర్మం ఎంతో చక్కటిది. అయితే,  కొందరి వల్ల ఆచారవ్యవహారాలలో విపరీత ధోరణులు ప్రవేశపెట్టబడ్డాయి. మూఢాచారాలను విడిచిపెట్టాలి. సదాచారాలను ప్రోత్సహించాలి.


 ఇహలోకంలో కూడా ఏదైనా ఉన్నతపదవిని చేపట్టాలన్నా కొంత శ్రమపడకతప్పదు. మరి అత్యంత ఉన్నతమైన మోక్షాన్ని పొందాలంటే  సత్ప్రవర్తనతో జీవించి దైవకృపను పొందాలి.
******

కొన్ని ప్రత్యేక పూజలు,  కొన్ని పండుగ రోజులలో దంపతులు బ్రహ్మచర్యం పాటిస్తారు.  అయితే, దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక ప్రత్యేకపూజ అన్నట్లు ఉంటే దంపతులు ఎలాంటి నియమాలు పాటించాలి ? 


ఈ మధ్య కాలంలో   మీడియా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాక   ఈ నెలలో ఈ  పూజలు చేయాలి, వచ్చే నెల ఈ పూజలు  చేయాలి..దాదాపు నెలలో అన్ని రోజులూ ఏదో ఒక పండుగ ..అన్నట్లు  చెబుతున్నారు. ఇలాంటప్పుడు  ఏమనిపిస్తుందంటే, రోజూ ఏదో ఒక పండుగ అయితే, దంపతులు శృంగారజీవితానికి దూరంగా ఉండాలా ? అనే  అయోమయం కలిగే  అవకాశం ఉంది.
  

 ఈ జీవితం భగవంతుని ప్రసాదం. దైవానికి ఎప్పటికీ కృతజ్ఞులుగా ఉండాలి. జీవితంలో ప్రతి క్షణమూ దైవారాధనగా భావించి స్వధర్మంతో నిజాయితీగా జీవించటానికి ప్రయత్నించాలి. 

రోజూ పూజలు చేయవచ్చు. అలాగని, పూజల పేరుతో ఎప్పుడూ  దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలని పెద్దలు చెప్పలేదు. 


 దంపతులు ఇద్దరూ ఇష్టపడి పూజలు చేస్తే  అది  వాళ్ళ ఇష్టం.. అలాకాకుండా ఎప్పుడూ పూజలు అంటూ నన్ను పట్టించుకోవటం లేదు అని దంపతులలో ఒకరు భావిస్తే , దంపతుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది.  ఇలాంటప్పుడు పూజచేసే వారికి కూడా మనశ్శాంతి ఉండదు.


 దాంపత్య జీవితంలో శృంగారం కూడా ఒక భాగమే. అయితే,  ముఖ్యమైన పండుగలు, పూజల సందర్భంలో నియమాలను పాటించి, మిగతా రోజులలో దాంపత్యజీవితాన్ని గడపవచ్చు.. అని నా అభిప్రాయం. 

దంపతుల మధ్య శృంగారం  విషయంలో గొడవలు వస్తే అక్రమసంబంధాలు పెరగటం,  తద్వారా కుటుంబజీవితం  అస్తవ్యస్థం కావటం.. వంటివి జరుగుతాయి. పెద్దలు ఇలా కోరుకోలేదు. 

  వ్యక్తులు చతురాశ్రమధర్మాలతో చక్కగా జీవించి మోక్షాన్ని పొందాలని తెలియజేశారు.

వానప్రస్తం, సన్యాసాశ్రమం లో అడవులకు వెళ్ళకపోయినా  తమ ఇంటిలో తాము  ఉంటూ కూడా ఇహజీవితపు బాధ్యతలను నెరవేర్చి, ఇహజీవితపు లంపటాలను తగ్గించుకుంటూ ,  మనస్సును అదుపులో ఉంచుకుంటూ , క్రమంగా మోక్షం కోసం ప్రయత్నాలు చేయటం మంచిది. 


మనిషి ఎప్పుడూ ఇహలోకపు తాపత్రయాలతోనే కొట్టుకుపోతుంటే మరి మోక్షం కోసం ప్రయత్నం చేసేదెప్పుడు? మోక్షం ఎందుకంటే,  కష్టాలు లేని పరమసుఖాన్ని పొందాలంటే పరమపదాన్ని( మోక్షాన్ని) పొందవలసిందే.

*************
నియమాల పేరుతో కఠినంగా వ్యవహరిస్తే, ఇతర మతాలలో ఇన్ని నియమాలు లేకపోయినా చక్కగా దైవాన్ని ప్రార్ధించుకుంటున్నారు కదా! అని కూడా కొన్నిసార్లు  అనిపించే అవకాశం ఉంది.

మనుషులకు  దైవం అవసరం ఎంతో ఉంది. అయితే, మరీ  క్లిష్టమయిన నియమాలు ఉన్నప్పుడు , వాటిని పాటించలేక సులభంగా దైవాన్ని ప్రార్ధించే విధానాలకు మరలే పరిస్థితి  కూడా ఉండవచ్చు.

 కలియుగంలో  చాలామందికి  ..మానసిక, శారీరిక దృడత్వం తక్కువగా ఉంటుంది. ఇవన్నీ తెలిసిన పెద్దలు , కలియుగంలో  దైవనామస్మరణ  తరుణోపాయం ... అని తెలియజేసారు.

 కలియుగంలో దైవనామస్మరణ చేసినా చాలు  ..యజ్ఞయాగాదులు చేయటం.. అనేది వ్యక్తుల  ఓపికను బట్టి చేసుకోవచ్చు.

సనాతనధర్మంలో దైవపూజ కు ఎన్నో విధానాలు ఉన్నాయి. ఎవరి ఇష్టప్రకారం వారు దైవాన్ని ఆరాధించుకోవచ్చు. విగ్రహారాధన చేసుకోవచ్చు. నిరాకార ఆరాధన కూడా చేసుకోవచ్చు. 

సనాతనధర్మం  ఎంతో సులభమయినది. అయితే,  కొందరి వల్ల ఆచారవ్యవహారాలలో విపరీత ధోరణులు ప్రవేశపెట్టబడ్డాయి. మూఢాచారాలను విడిచిపెట్టాలి. సదాచారాలను ప్రోత్సహించాలి.

 ఇహలోకంలో కూడా ఏదైనా ఉన్నతపదవిని చేపట్టాలన్నా కొంత శ్రమపడకతప్పదు. మరి అత్యంత ఉన్నతమైన మోక్షాన్ని పొందాలంటే  సత్ప్రవర్తనతో జీవించి దైవకృపను పొందాలి.



. లైంగికకోరికలు .. కొన్ని విషయాలు.. రెండవ భాగం.

 
ఏదిపడితే అది ఎక్కువగా తింటే శరీరం అరిగించుకోలేదు.  

ఇష్టం వచ్చినట్లు ఆహారం తీసుకునే వ్యక్తులు అనారోగ్యం పాలవుతారు.

అలాగే శృంగారం విషయంలోనూ లిమిట్ అవసరం.

లైంగిక కోరికలను పెంచే దృశ్యాలు ..వంటి వాటికి దూరంగా ఉండటం  శ్రేయస్కరం.

శారీరిక వాంచలు  పెంచుకున్న కొద్దీ ..అగ్నిలో ఆజ్యం పోసినట్లు  కోరికలు పెరగటమే తప్ప తగ్గవని పెద్దలు తెలియజేసారు.

ఆనక  అనేక సమస్యలు  వచ్చి బాధలు పడటం కన్నా , ముందే  మనస్సును అదుపులో ఉంచుకోవటం అనేది ఎంతో మంచిది.

ఆరోగ్యకరమైన శ్రేయస్కరమైన లైంగిక కార్యం  చక్కటి వివాహవ్యవస్థ ద్వారా సాధ్యం.


అయితే, భార్యాభర్త సంబంధం ఉన్నా కూడా , కొందరు వివాహేతరసంబంధాల కొరకు తిరగటం గురించి వింటున్నాము. 

.............................

అక్రమసంబంధాల వల్ల  ఎన్నో నష్టాలున్నాయి. 


 1. వ్యాధులు సంక్రమించే ప్రమాదం.2. శరీరం బలహీనపడటం.3. సామాజిక సమస్యలు.4.  సంతానానికి తండ్రి ఎవరో తెలియని పరిస్థితి.

*అక్రమ సంబంధాల వల్ల వ్యాధులు వచ్చే అవకాశముంది.

* ఎయిడ్స్ జబ్బు ఎందుకు వస్తుందో తెలియదు కానీ, అది వచ్చిన వారికి రోగనిరోధకశక్తి బాగా తగ్గుతుందట.

 
బహుశా అతిగా శృంగార కార్యకలాపాల్లో పాల్గొనే వారికి శరీరంలో జీవశక్తి క్షీణించి , రోగనిరోధకశక్తి బలహీనపడి,  ఎయిడ్స్ వంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు.

*ఏ స్త్రీ అయినా  తన భర్త ఇతరులతో చనువుగా ఉంటే భరించలేదు. 


*ఏ పురుషుడు కూడా తన భార్య ఇతరులతో చనువుగా ఉంటే భరించలేరు.

అక్రమసంబంధాల వాళ్ళ కుటుంబంలో  గొడవలు, హత్యలు, ఆత్మహత్యలు పరిస్థితి వచ్చి...  తల్లితండ్రి జైలుకి వెళ్తే పిల్లలు అనాధలవుతారు.



*స్త్రీపురుషుల అక్రమ సంబంధాల వల్ల  కలిగే  సంతానానికి తండ్రి ఎవరో తెలియని పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితి వస్తే  మగవారికి కూడా  నష్టం.

 అందువల్ల మగవారు కూడా  అక్రమసంబంధాలను ప్రోత్సహించకుండా ఉండటం మంచిది.
......................................


 ఎయిడ్స్ వంటి వ్యాధులు వచ్చిన వారిని చూస్తే జీవితం విలువ తెలుస్తుంది. 


అన్నీ తెలిసి కూడా శృంగారమే జీవితంలో ముఖ్యం.. అనుకునే వారు వారి కర్మకు వారే కర్తలు.

ఈ రోజుల్లో చాలామంది ప్రజలు ఏమంటున్నారంటే...

మేము నీతిమంతులమే.  పోర్న్ వంటివి చూస్తే తప్పేమిటి ?  వివాహేతర సంబంధాలు ఉంటే తప్పేమిటి ? మద్యం , మత్తుమందులు వాడితే తప్పేమిటి ? అని ప్రశ్నిస్తున్నారు.

మానభంగాలు, మర్డర్లు చేస్తే తప్పేమిటి ? అని కూడా కొందరు  ప్రశ్నిస్తున్నారు. 

 ఇలాంటి పరిస్థితి రావటం దౌర్భాగ్యం.

    అనేక సమస్యలున్న ఈ రోజుల్లో   సమాజానికి హాని కలగకుండా  ప్రభుత్వం మరియు ప్రజలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. 

అశ్లీల దృశ్యాలు ప్రసారం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. 


తల్లితండ్రులు  తాము నైతికవిలువలను పాటిస్తూ.. పిల్లలకు నైతిక విలువలను నేర్పించాలి.
*************
భార్యాభర్తల గురించి కొన్ని విషయాలు...

ఆధునిక వ్యవస్థలో సమాజంలో పరిస్థితి.. స్త్రీపురుషులు నిగ్రహాన్ని కోల్పోయేలా ఉన్నది.

మనస్సును నిగ్రహించుకునే పరిస్థితి అందరికీ ఉండకపోవచ్చు.

భార్యాభర్తలు కొన్ని పండుగల రోజులలో కోరికలను నిగ్రహించుకుని నియమంగా ఉండవచ్చు.

భార్యాభర్తల సంబంధం ధర్మబద్ధమైనదే.

అందువల్ల,  ఏదో  కారణంతో  భార్యాభర్త శారీరికసుఖాలకు దూరంగా ఉంటూ ఇంట్లో గొడవలు వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు.

భార్యాభర్త ఇద్దరూ ఒకే మాటతో ఇష్టంగా శారీరికసుఖాలకు దూరంగా ఉండాలనుకుంటే సమస్య ఏమీ ఉండదు.

 కానీ, ఒకరికి ఇష్టం లేకుండా ఇంకొకరు బలవంతంగా నియమాలను పాటించే పరిస్థితి ఉంటే మాత్రం ఆలోచించుకోవాలి.

అలాగని భార్యాభర్త ఎప్పుడుపడితే అప్పుడు విచ్చలవిడిగా  ప్రవర్తించాలని  నా అభిప్రాయం కాదు. 
 
*************
 ఒక దగ్గర విన్నాను. ఏం చెబుతున్నారంటే, ఈ మధ్య కొందరు స్త్రీలు తమ భర్తలకు శృంగారం విషయంలో సహకరించటం లేదని, అందువల్ల అనేక సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఇది నిజమే కావచ్చు.
 
 
ఈ రోజుల్లో స్త్రీలు ఉద్యోగాలు కూడా చేస్తూ కెరీర్లో పైకి వెళ్ళాలని ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కెరీర్ కొరకు..ప్రెగ్నెన్సి వంటి వాటికి దూరంగా ఉండాలనుకుంటున్నారేమో? కొందరు స్త్రీలు భర్త అత్తింటి వారి వల్ల కష్టాలు పడతారు. కొందరు స్త్రీలు భర్తను అత్తింటివారిని కష్టాలు పెడతారు.


జీవితంలో సంతానాన్ని పొంది, ఆ పిల్లలను చక్కగా పెంచి, చక్కని పౌరులుగా తయారుచెయ్యటం కూడా ముఖ్యమైన విషయం.

ఇంకో విషయం ఏమిటంటే, సోషల్ మీడియా వచ్చాక రోజూ ఏదో ఒక పూజలు, పండుగలు అంటూ చెప్పే వారు పెరిగారు. పూజలు, పండుగలు అంటే బ్రహ్మచర్యం పాటించాలని చాలా మంది అనుకుంటారు.
 
 
ఇక రోజూ ఏదో ఒక పూజలు అని చెబుతుంటే ఏం చేయాలో తెలియక, ఇలాంటి విషయాల్లో ఎవరిని అడగాలో అర్ధకాక భయంతో కూడా కొందరు స్త్రీలు శృంగారానికి దూరంగా ఉంటారేమో?


  నా అభిప్రాయం ఏమిటంటే, రోజూ పూజలు, పండుగలు అని చెప్పినా కూడా.. రోజూ ఉపవాసాలు, తలస్నానాలు, బ్రహ్మచర్యం పాటించనక్కరలేదు. ముఖ్యమైన కొన్ని పూజలు, పండుగలకు పాటిస్తే సరిపోతుంది. ఇలా అందరూ రోజూ బ్రహ్మచర్యం పాటిస్తే హిందువుల సంఖ్య తగ్గిపోయే ప్రమాదముంది.
 
 
 ప్రతిరోజు పూజ చేయకూడదని నా అభిప్రాయం కానేకాదు. నిత్యపూజ చేయాలి. అయితే, ప్రతిరోజు పూజ, పండుగ అని అతిగా తలస్నానం చేస్తే, జలుబు చేసే అవకాశం ఉంది. ఎక్కువగా ఉపవాసాలు ఉంటే, నీరసంగా ఉండి పనులు చేసుకోలేరు. వివాహం చేసుకుని ప్రతిరోజు  జీవితభాగస్వామికి దూరంగా ఉంటే, గొడవలు వచ్చే అవకాశముంది. 
 
కాబట్టి, నిత్యపూజ చేసుకుని,  పండుగలప్పుడు , ప్రత్యేకమైనపూజలప్పుడు..  ..ఉపవాసం, బ్రహ్మచర్యం..పాటించవచ్చు... ని  నా అభిప్రాయం.
 
ఎవరి స్వధర్మాన్ని వారు సరిగ్గా పాటించటం కూడా పూజయే. తమపని తాము చేసుకుంటూ కూడా దైవాన్ని స్మరించుకోవచ్చు.

భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోతే..కుటుంబవ్యవస్థ, కుటుంబసంబంధాలు కూడా దెబ్బతినటం, అక్రమసంబంధాలు కూడా పెరిగే ప్రమాదముంది. అందువల్ల, అందరూ ఆలోచించుకోవాలి. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు సన్యాసాశ్రమంలోలా కాకుండా, గృహస్థధర్మాలను కూడా పాటించాలి.

 
అయితే, జీవితంలో కోరికల విషయంలో అతి లేకుండా, కోరికలను అదుపులో ఉంచుకుంటూ , అవసరమైనంతవరకు మాత్రమే ఉంటూ.. జీవిస్తే ఎన్నో లాభాలున్నాయి.

***************
జీవితభాగస్వామి ఏదైనాకారణాల వల్ల సహకరించకపోతే, ఏం చెయ్యాలో? అనే విషయాల గురించి అటుంచితే, జీవితభాగస్వామి సహకరించే వ్యక్తి అయినా కూడా, వారి భర్త లేక భార్య  అక్రమసంబంధాలతో తిరగటం బాధాకరం.

కొందరు అనారోగ్యం వల్ల, కొందరు భార్యాభర్త గొడవలవల్ల, కొందరు లౌకికసుఖాలు కాకుండా, వైరాగ్యం వైపు వెళ్ళాలని..ఇలా అనేక కారణాలుంటాయి. అయితే, ఈ సమస్యలకు అనేక కోణాలుంటాయి. అందరి సమస్యలకు ఒకేవిధమైన పరిష్కారం ఉండదు. ఎవరి సమస్యలు వారివి. ప్రతిసమస్యకు అందుకు ప్రత్యేకమైన పరిష్కారం ఆలోచించాలి.
 
కొందరు స్త్రీలు, పురుషులు పరాయి వాళ్లతో వివాహేతర సంబంధాలతో తిరుగుతున్నారని తెలుస్తోంది. కొన్ని చోట్ల కాస్టింగ్ కౌచ్ అని, లైంగిక వేధింపుల గురించి వింటున్నాం. ఇలా కొందరు స్త్రీలు, పురుషులు విచ్చలవిడిగా తిరిగితే, వాళ్ళను వివాహం చేసుకున్న వారి పరిస్థితి ఏమిటి?
 
 అలా తిరిగే జీవితభాగస్వామి వల్ల ఎయిడ్స్ వంటి భయంకర వ్యాధులు సంక్రమించే అవకాశం కూడా  ఉంది కదా. ఇలాంటి భయాలతో కాపురం ఎలా చేయాలి? ఇది అందరూ ఆలోచించవలసిన విషయం.
........................ 
మరికొన్ని తరువాత పోస్టులో...
 

. లైంగికకోరికలు కొన్ని విషయాలు..మొదటి భాగం.


  కొన్ని సంవత్సరాల క్రితం , వివాహం జరిగిన  కొత్తలో కొంతకాలం   మేము   కొన్ని వారపత్రికలు తెప్పించుకొనేవాళ్ళం.

వాటిలో సీరియల్స్, కధలతో పాటూ సెక్స్ కు  సంబంధించి వైద్యులు ఇచ్చే సలహాలు కూడా ఉండేవి. 


కధలు, సీరియల్స్ తో పాటూ అవి కూడా చదవటం జరిగింది.  

తరువాత ఆ పత్రికలలో  శృంగార పరమైన బొమ్మలు ఎక్కువగా వేస్తుండటంతో
,  పిల్లలు అలాంటి చిత్రాలను చూడటం మంచిది కాదని , పత్రికలను తెప్పించుకోవటం నిలిపివేసాం.

ఒక వారపత్రికలో ఒక మానసిక వైద్యురాలు ,  సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను  వ్రాసారు. 


అవి చదివితే సమాజంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో , కొందరు  మనుషుల్లో ఉండే ఘోరమైన ప్రవృత్తుల గురించి కూడా  వ్రాసారు.

......................

 ఈ రోజుల్లో కూడా ఎన్నో సంఘటనలు వింటున్నాము.

 నిర్భయ వంటి కేసులు, చిన్నపిల్లల పట్ల కూడా అఘాయిత్యాలు జరగటం..వంటివీ విన్నాము.

నిర్భయ ఘటన తరువాత అలాంటి కేసులు మరింత ఎక్కువయ్యాయనిపిస్తుంది.

..............................

ఈ మధ్య  వచ్చిన ఒక వార్త  ద్వారా తెలిసిన విషయమేమిటంటే..

 6 సంవత్సరాల పాప రేప్ కు గురవ్వటం, అమ్మాయి  మర్మాంగం వద్ద చెక్క ముక్క  వంటి వస్తువు లభించటం జరిగిందట.  

ఇలాంటి సంఘటనల నిందితులను కఠినంగా శిక్షించాలి.

 ఆ శిక్ష ఎంత కఠినంగా ఉండాలంటే ...మరెవరైనా నేరం చేయడానికి భయపడే విధంగా ఆ శిక్ష ఉండాలి.

.........................

శృంగారం దైవం సృష్టించిందే..


అలాగని   స్త్రీపురుషులు ఎటువంటి పరిధులు లేకుండా ఎవరిష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించటం  సరైనది కాదు.

ఆహారం తీసుకోవటం, లైంగికకోరికలు.. అందరికీ ఉండేవే.  


 ఆరోగ్యకరమైన శ్రేయస్కరమైన లైంగిక కార్యం  చక్కటి వివాహవ్యవస్థ ద్వారా సాధ్యం.


అయితే ఇక్కడ  ఒక  విషయమేమిటంటే, ఎవరికైనా శారీరిక కోరిక కలిగినప్పుడల్లా  స్త్రీ లేక పురుషుని తోడు లభించకపోవచ్చు.

 అలాంటప్పుడు  ఆ కోరిక తీరడం కొరకు దొరికిన వారి పట్ల అఘాయిత్యం చేస్తే నేరాలు..ఘోరాలు జరిగే అవకాశం ఉంది.

ఇలాంటి పరిస్థితులు జరగకుండా శారీరిక నిర్మాణంలోనే  అవకాశం ఏర్పరచబడింది.  


 స్వయం తృప్తి విధానం ద్వారా ఎవరి కోరికను వారు నెరవేర్చుకోవచ్చు.
..................


* ఇందులో వ్రాసిన శృంగార సంబంధ విషయాలు వారపత్రికలలో  వైద్యుల అభిప్రాయాలు చదివి వ్రాసినవి.


. స్వయంతృప్తి  పద్ధతి గురించి కొన్ని అపోహలున్నాయంటారు.  


ఈ విషయంలో   భాగస్వామి అవసరం లేదు కాబట్టి,  ఈ పద్ధతికి అలవాటుపడి,  అనేకసార్లు ప్రయోగిస్తే వ్యక్తి నీరసించిపోయే ప్రమాదముంది.

ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే స్వయంతృప్తి వల్ల నీరసం వస్తుందని కొందరు  చెప్పి ఉంటారు.

అయితే, మనిషిలో లైంగికకోరికలు పెరిగితే ..స్వయంతృప్తి  చేయకున్నా ,  నిద్రలో కూడా వీర్య స్కలనం  జరిగి, వీర్యం పోవటం జరుగుతుందని వైద్యులు చెబుతారు. 


ఈ విషయాలను గమనిస్తే,   లైంగికకోరికలను అదుపుచేయలేనప్పుడు  , అక్రమ సంబంధాలలో పాల్గొని వ్యాధులు తెచ్చుకోవటం, గొడవలు జరగటం, మానభంగాలు చేయటం,  హత్యలు, ఆత్మహత్యలు వరకు పరిస్థితి వెళ్ళటం..వంటి సమస్యల కన్నా ..ఒక లిమిట్  పాటించి స్వయంతృప్తిని పొందటం మంచిదని తెలుస్తుంది.


(  లైంగిక కోరికల విషయంలో జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో  పై  వివరాలను  వ్రాయటం జరిగింది.) 
 
(ఇలాంటి విషయాలను రాయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే, సమాజంలో కొన్ని దారుణమైన వార్తలను విన్నప్పుడు ఎంతో బాధ కలిగి ఇలా రాయాలనిపించి వ్రాసాను.)

*******************

నిర్భయ సంఘటనల వంటివాటిని  గమనిస్తే , మనుషుల్లో పైశాచిక ప్రవృత్తి పెరుగుతుందనిపిస్తోంది.

ఆధునిక టెక్నాలజీ వల్ల అశ్లీలదృశ్యాలు విచ్చలవిడిగా అందుబాటులోకి రావటం కూడా ఇలాంటివి జరగటానికి ఒక కారణం.


అసభ్యకరమైన చిత్రాల ప్రసారం , మత్తుపదార్ధాల ప్రసారం ద్వారా కూడా  మనుషుల్లో నేరప్రవృత్తి ఎక్కువయ్యే అవకాశాలున్నాయి.


ఇలాంటివాటిని ప్రసారం చేసేవారిని కూడా శిక్షించాలి. 


ఇలాంటి వారు ఒకవేళ ఇక్కడ శిక్షను తప్పించుకున్నా.. దైవం వేసే శిక్షనుండి మాత్రం తప్పించుకోలేరు.