koodali

Monday, February 4, 2013

పాపాలు చేసే వారి పట్ల అంటరానితనాన్ని పాటించాలి...అని....

పూర్వీకులు  అంటరానితనాన్ని  ప్రోత్సహించారని  కొందరు    తప్పుపడతారు. దయచేసి  పెద్దలను  తప్పు  పట్టవద్దు .   

పశుపక్ష్యాదులనే  పూజించమని  చెప్పిన  పెద్దలు  సాటి  మనుషులను  తక్కువగా  చూడమని  చెప్పరు  కదా  !

దైవం దృష్టిలో   అందరూ సమానమేనని   పెద్దలు  ఎంతగానో   చెప్పటం   జరిగింది. పురాణేతిహాసాలలో దీనికి ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పబడ్డాయి .

ధర్మరక్షణకోసం  విష్ణుమూర్తి  దశావతారాల్లో  జంతుజన్మలను  ధరించటానికి  కూడా  వెనుకాడలేదు.


ఈ   విషయాలను  గమనిస్తే , సృష్టిలో  ఏ  జీవినీ  తక్కువగా  చూడకూడదని  తెలుస్తుంది.

అందుకే   పశుపక్ష్యాదులను,  చెట్లను  కూడా  పూజించి  గౌరవించమని  పూర్వీకులు  మనకు  నేర్పించారు.


వేదములలోని  విషయములను  చక్కగా  అర్ధం  చేసుకోవటానికి   పురాణేతిహాసాలు  తోడ్పడుతాయి.  


వేదపురాణేతిహాసాలలోని  భావాలను  సమాజానికి  మరింత  చక్కగా  తెలియజేయటానికి ఎందరో  అవతారమూర్తులు,  మహానుభావులు  జన్మించారు.

వీరి  బోధనలు  మరియు  ,  ఆచరణ  ద్వారా  ఏది  ధర్మం,  ఏది  అధర్మం  అనే  విషయములు    అందరికీ  తెలుస్తాయి.  


  శ్రీ  రాముడు  శూద్ర  స్త్రీ  అయిన   శబరి  సమర్పించిన  ఫలాలను  స్వీకరించారు.  గుహునితో  స్నేహం  చేశారు. శ్రీరాములవారు  అంటరానితనాన్ని  పాటించలేదు.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు .... అందరూ సమానమేనని చెప్పటం జరిగింది.


శ్రీపాద శ్రీవల్లభుల సంపూర్ణ జీవిత చరిత్రము ..గ్రంధములో  కూడా ఇలాంటి   విషయములు   వివరంగా  చెప్పబడ్డాయి.


 ఆది శంకరాచార్యుల జీవితంలోని ఒక సంఘటన ద్వారా .... అంటరానితనం తప్పు ....అని తెలుస్తోంది.  శివుడే  ఈ  విషయాన్ని  తెలియజేశారంటారు. 


 మహావతార్  బాబాజీ  శిష్యులైన  లాహిరీ  మహాశయులు, స్వామి యుక్తేశ్వర్ , పరమహంస  యోగానంద,  రామకృష్ణపరమహంస,  వివేకానందుడు,......మొదలగువారు  గొప్ప  మహానుభావులు.  వీరు   అంటరానితనాన్ని   పాటించలేదు.

ఒక యోగి ఆత్మకధలో ..... లాహిరీ మహాశయుల వారికి అన్ని కులాల నుంచి శిష్యులు ఉండేవారని చెప్పటం జరిగింది.

రామకృష్ణమఠంలో అన్ని కులాలు, మతాల వారికి   ప్రవేశం ఉంది.

..........................................


అంటరానితనాన్ని  అగ్రవర్ణాల   వాళ్ళు  పాటించారని  కొందరు  అంటారు.  
అగ్రవర్ణాలవాళ్ళలో ఇతరులను  ఎంతో చక్కగా  ఆదరించిన  వారెందరో  ఉన్నారు.  అగ్రవర్ణాల లో  కూడా పేదరికంతో  దయనీయంగా  జీవిస్తున్నవారెందరో  ఉన్నారు. 

 కొన్ని  గ్రామాలలో  ధనవంతులైన  శూద్రులు   పేదవారైన  శూద్రుల  పట్ల   పట్ల  అంటరానితనాన్ని పాటించారు. 
.........................................

 వేదములలోని  కొన్ని  విషయాలు .....ఈ విషయాలు    అంతర్జాలంలో  సేకరించినవి.


 Before we begin our journey of solving the caste-puzzle through Vedas, let us start with certain worship mantras from Vedas that mention Shudras:


Yajurved 18.48:
O Lord! Provide enlightenment/ compassion to our Brahmins, Kshatriyas, Vaishyas and Shudras. Provide me also with the same enlightenment so that I can see the truth.

Yajurved 20.17:
Whatever crime we have committed against my village, forest or committee; whatever crime we have committed through our organs, whatever crime we have committed against Shudras and Vaishyas, whatever crime we have done in matters of Dharma, kindly forgive us relieve us from the tendency of the same.

Yajurved 26.2:
The way I gave this knowledge of Vedas for benefit of all humans, similarly you all also propagate the same for benefit of Brahmins, Kshatriyas, Shudras, Vaishyas, Women and even most downtrodden. The scholars and the wealthy people should ensure that they not deviate from this message of mine
.***
 There are several shlokas in Manusmriti that state that a person belonging to high Varna falls down to level of a Shudra (uneducated) if he does not conduct noble deeds. For example,

2.104: A person who does not worship the Supreme Lord twice daily should be considered a Shudra.

2.172. He who has not been initiated with teaching of the Vedas is a Sudra.

4.245: A Brahmin acquires brilliance through company of noble persons and avoiding bad company. On contrary, if he indulges in bad company, he becomes a Shudra.


..................................

గ్రంధముల  ద్వారా  తెలుసుకున్న  మరి  కొన్ని  విషయములు.....

బ్రాహ్మణ  క్రత్రియ  వైశ్యులను  ద్విజులు అంటారు...ఉపనయనం  జరగకుండా  వారికి  ద్విజత్వం  రాదు.  అందాకా  వీళ్ళు  శూద్రుల  కిందనే  లెక్క.  రాకుమారులకు  11  వ ఏట,  బ్రాహ్మణ పుత్రులకు  ఎనిమిదవ  ఏట, వైశ్య  తనయులకు  పన్నెండవ  ఏట  ఉపనయనం  చెయ్యాలని  ధర్మశాస్త్రాల  నిర్ణయం......... అన్నట్లు    పెద్దలు  తెలియజేశారు.

..........................


భీష్ముల  వారి  విషయంలో............

భారతంలో , భీష్ముల  వారు అంపశయ్యపై  ఉన్నప్పుడు   వారే  తెలియజేసిన  విషయాన్ని  బట్టి ,  వ్యక్తులు  తినే  ఆహారాన్ని  బట్టి    మనస్తత్వంలో  మార్పులుచేర్పులు  వస్తాయని  తెలుస్తుంది. 


  అధర్మంగా  ప్రవర్తించే  వారి  వద్దనుంచి  స్వీకరించే  ఆహారం  వల్ల  కూడా స్వీకరించిన వారి  మనస్తత్వంలో  మార్పులుచేర్పులు  వస్తాయని  తెలుస్తుంది.

 దుర్యోధనుడు  గొప్ప  వంశంలో   జన్మించినా   కూడా  ,అధర్మపరుడైనందువల్ల  అతని  నుంచి  స్వీకరించిన  ఆహారం  వల్ల  భీష్ముల  వారికి  కష్టాలు  వచ్చాయి.  



శ్రీ కృష్ణుల వారు   కూడా.....దుష్టుడైన  దుర్యోధనుని  ఆహ్వానాన్ని  తిరస్కరించి , సౌమ్యుడైన  విదురుని  ఆతిధ్యాన్ని స్వీకరించారు.


పై  విషయాలన్నీ  గమనిస్తే  ,  అధర్మంగా  ప్రవర్తించేవారిపట్ల..,   పాపాలు  చేసే వారి  పట్ల  అంటరానితనాన్ని  పాటించాలన్నది . పెద్దల  అభిప్రాయం  అనిపిస్తుంది.

....................................................

కొందరు  గొప్ప పదవి  లభించినా  అంతటితో  తృప్తిని  పొందక  ఇంకా  ఏదో  కావాలని  అశాంతితో  జీవిస్తారు. 


 భగవదనుగ్రహాన్ని  పొందాలంటే  నిష్కామకర్మతో జీవించాలని పెద్దలు  తెలియజేశారు.  


నిష్కామ  కర్మతో  జీవించేవారు  మహారాజ  పదవిలో  ఉన్నా,   పొంగిపోకుండా  ప్రశాంతంగా  జీవించి  దైవకృపకు  పాత్రులవుతారు.   
జనకమహారాజులా.  


 నిష్కామ  కర్మతో  జీవించేవారు  ఆడంబరాలు లేకున్నా   క్రుంగిపోకుండా,  ప్రశాంతంగా  జీవించి  దైవకృపకు  పాత్రులవుతారు .
శబరిలా.

భగవంతుని  కరుణను  పొందిన  జీవులలో   పశువులు,  పక్షులు,   పేద వారు,  ధనవంతులు, అన్నిరకాల  జీవులు  ఉన్నారు. అంతా  దైవం  దయ. 


వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉన్నచో దయచేసి  క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను .




Friday, February 1, 2013

ఎక్కువ, తక్కువ.....తారతమ్యం...

 ఈ  బ్లాగ్ ను  ప్రోత్సహిస్తున్న  అందరికి  అనేక  కృతజ్ఞతలండి.
....................... 


 సమాజంలో   కొందరు  ,  ధనవంతులను  ఎక్కువగా   గౌరవిస్తున్నారు.  పేదవారిని  తక్కువగా  గౌరవిస్తున్నారు.   ఇంకా  ఎన్నో  విషయాలలో  మనుషుల  మధ్య   తేడాలను  చూపిస్తున్నారు. 

ఇలాంటి  విషయాల  గురించి  పురాణేతిహాసాలలోని   గొప్పవారు  ఎలా  ప్రవర్తించారో  పరిశీలిస్తే,   ఎన్నో  సంగతులు   తెలుస్తాయి.


శ్రీ  రాముడు  గుహునితో  స్నేహం  చేశారు. శబరి  అందించిన  ఫలాలను  స్వీకరించారు.
తాను  ఎక్కువ  ఇతరులు  తక్కువ  అనే  భేద  భావం  ఉండకూడదని  నిరూపించారు.



శ్రీ  కృష్ణుడు  తన  బాల్యస్నేహితుడైన  కుచేలుని  పట్ల  ఎంతో  ఆదరంగా  ప్రవర్తించారు.
 స్నేహానికి   పేద,  ధనిక  తారతమ్యం  ఉండకూడదని   నిరూపించారు. 



 పురాణేతిహాసాలలో  గొప్ప వ్యక్తులు  కొందరు  ఎన్నో  రకాల   వృత్తులను  నిర్వహించారు.

 హరిశ్చంద్రుడు  కొంతకాలం   కాటికాపరిగా  పనిచేశారు.

వాల్మీకి
మహర్షి, మహర్షిగా  మారకముందు  బోయవాడుగా  వేటాడుతూ  జీవించేవారు.

 వ్యాసమహర్షి  యొక్క   తల్లి  అయిన  సత్యవతిదేవి యొక్క  తండ్రి  ( పెంపుడు  తండ్రి )  పడవను  నడపటం,  చేపలను పట్టే  వృత్తులను   నిర్వహించేవారు.

పాండవులు   కొంతకాలం   విరాటుని  కొలువులో రకరకాల  వృత్తులను  నిర్వహించారు.

ఇవన్నీ  గమనిస్తే , మనకు  ఎన్నో  విషయాలు  తెలుస్తాయి.

 పేద  వారిని  చిన్నచూపు  చూడకూడదని  ,  ఏ  వృత్తిని  చిన్నచూపు  చూడకూడదని  తెలుస్తుంది.

*************

పాతకాలంలో కొందరు స్వార్ధపరులు, ప్రాచీన గ్రంధాలలోని విషయాలను సరిగ్గా అర్ధం చేసుకోని వారు..శూద్రులను చిన్నచూపు చూసేవారు.అంటరానితనం అనే చెడ్డ విషయాన్ని సమాజంలో ప్రవేశపెట్టారు. ఆ విధంగా శూద్రులు కష్టాలను అనుభవించారు.

 కాలక్రమేణా శూద్రులలో కూడా కొన్ని కులాలు ఏర్పడ్దాయి. కొందరు ఆర్ధికంగా అభివృద్ధి చెందారు. కొందరు ఆర్ధికంగా ఎదగలేకపోయారు. ఆర్ధికంగా ఎదిగిన శూద్రులలో కొందరు తమకన్నా ఆర్ధికంగా క్రిందస్థాయిలో ఉన్న శూద్రులను చిన్న చూపు చూడటం కూడా  జరిగింది.

 కొందరు శూద్రులు తమకన్నా తక్కువ స్థాయిలో ఉన్న శూద్రుల పట్ల అంటరానితనాన్ని పాటించేవారు.

ఆధునిక కాలంలో రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. 

 కొందరు ఏమంటున్నారంటే, ఆర్ధికంగా అడుగున ఉన్నవారు అన్ని కులాల్లోనూ ఉన్నారు కాబట్టి మాకూ రిజర్వేషన్లు కావాలంటున్నారు. 

 కొందరు ఏమంటున్నారంటే, పాతకాలంలో శూద్రులు వివక్షకు గురయ్యారు కాబట్టి, ఆర్ధికస్థితితో సంబంధం లేకుండా, కులాల ప్రకారమే రిజర్వేషన్లు ఉండాలని అంటున్నారు.

అలా అయితే, ఇప్పుడు శూద్రులలో ఉన్నతకులాలుగా గుర్తించబడిన కులాల వారి పూర్వీకులు వివక్షకు గురయిన వారే .. అందువల్ల ఇప్పుడు  శూద్రులలో అన్ని కులాలకూ రిజర్వేషన్లు ఇస్తారా? 

అన్నికులాల వారిలోనూ పేదరికంతో బాధలు పడుతున్న వాళ్ళెందరో ఉన్నారు.  పాతకాలమైనా, ఆధునికకాలమైనా, ఏ కులం వాళ్ళ పట్లా ఏ కారణం చేతనైనా వివక్ష ఉండకూడదు.

కొందరిని పైకి తేవటానికి మరికొందరి అవకాశాలను తగ్గించకూడదు. 

 ఒక ఉదాహరణ గమనిస్తే..  రిజర్వేషన్లు ఉన్న ఒక కుటుంబంలో తల్లితండ్రి ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు.వారు ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉన్నారు.

ఇంకొక కుటుంబం రిజర్వేషన్లు లేనివారు.. వాళ్ళు మధ్యతరగతికి చెందిన వాళ్ళు.

 రెండు కుటుంబాల వారి అమ్మాయిలు  ఉన్నత చదువులలో  సీటు సంపాదించడం కొరకు బాగా కష్టపడి చదివారు.  రిజర్వేషన్లు లేని అమ్మాయికి సీటు రాలేదు. రిజర్వేషన్లు ఉన్న అమ్మాయికి  సీట్ లభించింది. 

 తాను రిజర్వేషన్ లేని కులానికి చెందటం వల్లే తనకు సీట్ రాలేదని సీట్ లభించని అమ్మాయి వాపోవటం జరుగుతుంది. ఇలాంటప్పుడు మనుషుల మధ్య అసహనం, కులాల మధ్య విభేదాలు పెరిగే అవకాశముంది. 

వెనుకబడిన వారిని పైకి తేవాలంటే ప్రభుత్వాలు వారికి ఆర్ధికంగా ప్రోత్సాహకాలు కల్పించాలి. ఉన్నత చదువులలో మెరిట్ ప్రకారమే సీట్లు ఇస్తే బాగుంటుంది.

 వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావటం ఎంతో అవసరం. వారికి ఆర్ధికంగా చేయూత నివ్వాలి. అదే సమయంలో రిజర్వేషన్లు లేని కులాలలో పేదవారికి కూడా ప్రోత్సాహాలు ఇవ్వాలి. 

అందరికీ సమాన అవకాశాలుండాలి.  అందరూ బాగుండాలి.ఎవరూ పేదరికంలో బాధపడకూడదు. సమాజంలో కులాల పేరుతో  వివక్షలు ఉండకూడదు.

 రిజర్వేషన్లు ప్రవేశపెట్టబడి ఇన్నేళ్ళయినా.. దేశంలో పేదరికంతో బాధలు పడుతున్న వారెందరో ఉన్నారు.

పేదరికం పోకపోవడానికి సంపద కొందరి వద్దే ప్రోగుపడటం ముఖ్యకారణం. 

సమాజంలో అసమానతలు తగ్గాలంటే ఆర్ధిక అసమానతలు తగ్గాలి. మనుషులు సాటి మనుషుల పట్ల మానవత్వంతో ప్రవర్తించాలి. 
*******


Wednesday, January 30, 2013

* దైవమే అందరికీ అండ.

* మణిద్వీపవాసులైన ఆదిశక్తి అయిన పరమాత్మకు అనేక వందనములు.


* దైవాన్ని ఏ పేరుతో, ఏ రూపంతో ఆరాధించినా ఆ పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది.


లోకంలో గొప్పవారితో పరిచయం పెంచుకోవాలని ఎందరో ప్రయత్నిస్తుంటారు.

కొద్దిమంది ప్రముఖులు మనకు పరిచయమైనా కూడా, మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటుంటాము.


* అలాంటిది,  విశ్వానికంతటికీ అధిపతి అయిన దైవంతోనే మనము పరిచయాన్ని పెంచుకుంటే అది ఎంతో గొప్ప విషయం కదా ! అప్పుడు మనకే మంచి జరుగుతుంది.


దైవానికి మనం అందరూ పరిచయమే కదా !మనమే లోకమాయలోపడి అప్పుడప్పుడూ భగవంతుని మరిచిపోతుంటాము.


అలా కాకుండా మన స్వధర్మాన్ని మనం నిర్వహిస్తూనే , సర్వత్రా దైవాన్ని తోడునీడగా భావించాలి.

* మనకు భగవంతుని అండ ఎంతో అవసరం. మనకు ఆసరాగా ఉండి మనల్ని సరైన దారిలో నడిపించమని దైవాన్ని ప్రార్ధించాలి.

కొందరు ఏమని అంటారంటే, విధిరాతను ఎవరూ తప్పించలేరు, మనం చేయగలిగింది ఏముంది ? అంటారు .

* కానీ, సతీ సావిత్రి, మార్కండేయుల వంటి వారు దైవాన్ని మెప్పించి తమ జీవితాల్లోని ఆపదలను తొలగించుకున్నారు కదా !


యమధర్మరాజు రావద్దు అన్నా కూడా ఆయన వెంటపడి , యముని అనుగ్రహాన్ని పొంది సతీసావిత్రి తన పతి ప్రాణాలను దక్కించుకుంది.


జీవులకు పూర్వపాపకర్మల వల్ల ఇప్పుడు కష్టాలు వస్తాయి.


కానీ, ఇప్పుడు పుణ్యకర్మలను ఆచరించటం వల్ల ఆ పాపకర్మ యొక్క ఫలితాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చునని పెద్దలు చెబుతున్నారు.


* ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నా కూడా , సత్ప్రవర్తన కలిగిఉండి దైవాన్ని మెప్పించితే పాపకర్మఫలితాన్ని పూర్తిగా తొలగించుకోవచ్చు అనీ పెద్దలు చెప్పటం జరిగింది.


కొందరు ఎన్నో మంచిపనులు చేస్తున్నా కూడా , వారి జీవితంలో కొన్ని కష్టాలు వస్తున్నాయి.

అది వారు పూర్వం చేసిన పాపకర్మ ఫలితం వల్ల కావచ్చు. .
* అంటే , ఇప్పుడు వారు చేస్తున్న పుణ్య కర్మ కన్నా , పూర్వపు పాపకర్మ అంత ఎక్కువగా ఉందన్న మాట.

* ( ఇంకా కొన్ని ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. అవి భగవంతునికే తెలుస్తాయి. )

ఇప్పుడు వారు చేస్తున్న పుణ్యకర్మ వృధా పోదు. ఎప్పటికయినా ఆ పుణ్యఫలం అనుభవంలోకొస్తుంది.


* భగవంతుని ఆరాధించాలంటే ధనం, విద్య ఉండితీరాన్న నియమమేమీలేదు. నిర్మలమైన ప్రేమ భక్తితో భగవంతుని ఆరాధించినా చాలు.

కొందరు ఆడంబరంగా పూజలు చేస్తారు. కొందరు భక్తి ఉన్నా కూడా అంత ఆడంబరంగా పూజలు చెయ్యకపోవచ్చు. ఏమైనా భక్తిని కలిగిఉండటం ముఖ్యం.


* నిర్మలమైన భక్తిని కలిగిన వారు ఎవరైనా దైవం యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. అలాంటి నిర్మలమైన భక్తిని ఇవ్వమని మనము భగవంతుని ప్రార్ధించాలి.


* నాకు విషయపరిజ్ఞానం అంతగాలేదండి. అయినా , బ్లాగులో ఈ మాత్రం విషయాలు వ్రాస్తున్నానంటే ,
* ఇది అంతా దైవం వేసిన భిక్షయే. అంతా దైవం దయయే.

నూతిలోని కప్ప అదే పెద్ద ప్రపంచమనీ, తనకు విశ్వం గురించి అంతా తెలుసనీ,అలా అనుకుంటుందట.


మానవులు కూడా తమకు తెలిసిన గోరంత విజ్ఞానం చూసి మిడిసిపడటం తగదు. మనకు తెలిసిన విజ్ఞానం అతి తక్కువ.

*
దైవమే అందరికీ అండ.

* ఇవి   ఇంతకు  ముందు వేసిన  టపాలోని  విషయాలే.
 
 

Monday, January 28, 2013

హోదాను బట్టి మాత్రమే గౌరవమా....


*  ఈ  బ్లాగ్ ను  ప్రోత్సహిస్తున్న  అందరికి  అనేక  కృతజ్ఞతలండి.
....................... 


కొన్ని  సంవత్సరాల  క్రిందట  జరిగిన  విషయమిది. 

 ఒక  భాషను  నేర్చుకోవాలని  భావించి , ఒక  గొప్ప   సంస్థలో   జాయిన్  అయ్యాను. 

(  అయితే, కొద్దికాలం  మాత్రమే  వెళ్ళాను. పూర్తిగా  నేర్చుకోలేదండి.)

  కొత్తగా చేరిన  విద్యార్ధినీ  విద్యార్ధులకు  అక్కడి  హాల్ లో  పరిచయ  సభను  నిర్వహించారు. ఉపాధ్యాయులను , ఇతర   స్టాఫ్ ను   స్టూడెంట్స్ కు  పరిచయం  చేస్తున్నారు. 


 ఒక్కొక్కరు   స్టేజ్  మీదకు  వచ్చి  తమ  గురించిన  వివరాలను  చెబుతున్నారు.  ఒక్కొక్కరి  పరిచయాలు  జరుగుతుంటే  నూతనంగా  చేరిన   స్టూడెంట్స్  చప్పట్లు  కొడుతున్నారు.  


ఇలా  అక్కడి  స్టాఫ్ ను  స్టూడెంట్స్ కు  పరిచయం  చేస్తూ,  అక్కడి  వాచ్ మన్ ను  కూడా   స్టేజ్  పైకి  పిలిచి   అతని  పేరు  చెప్పి  పరిచయం  చేసారు. 

(  ఈ  సంస్థ  చాలా  గొప్పది.  ఇక్కడ  పేద,  ధనిక  అనే తారతమ్యం లేదు. ) 


అప్పటి  వరకు  ప్రతి  ఒక్కరి  పరిచయానికి  క్లాప్స్  కొట్టిన  స్టూడెంట్స్ , వాచ్ మన్  యొక్క   పరిచయం   తరువాత   క్లాప్స్  కొట్టలేదు.  నిశ్శబ్దంగా  ఊరుకున్నారు. 



 నేను  క్లాప్స్  కొట్టబోయి  ఆగిపోయాను.  అంతా  నిశ్శబ్దంగా  ఉన్నప్పుడు ,  నేను   చప్పట్లు  కొడితే  బాగుండదేమోననే  సంశయంతో  ఆగిపోయాను.  


అయితే,  తరువాత  చాలాకాలం  ఈ  విషయం  నన్ను  ఆలోచింపజేసింది.


  ఎవరు  క్లాప్స్  కొట్టకపోయినా  , నేను  క్లాప్స్  కొట్టి  ఉండవలసింది. అనిపించింది. 


అందరికి  క్లాప్స్  చేసి,  వాచ్ మన్  పరిచయం  అప్పుడు    క్లాప్స్  కొట్టకపోవటం  వల్ల ,  ఆ  వాచ్ మన్  ఎంత  చిన్నతనంగా  ఫీలయ్యారో  కదా  !  అనిపించింది. 

(  బహుశా  నా  లాగే   మిగతా  స్టూడెంట్స్  కూడా   క్లాప్స్  కొట్టబోయి  సంశయంతో   ఊరుకున్నారేమో ? తెలియదు...)


  సమాజంలో  పెద్ద  స్థాయిలో  ఉన్నవారిని,  చిన్న  స్థాయిలో  ఉన్నవారిని  చూసే  విధానంలో  ఎంతో  భేదం  ఉంటోంది.  ఇది  ఎందుకో  అర్ధం  కాదు. 



 డబ్బు,  చదువు,  హోదా, ...... ఎక్కువగా   ఉన్నవారిని  ఎక్కువగా  గౌరవిస్తున్నాం.  ఇవి  తక్కువగా  ఉన్నవారంటే  చిన్నచూపు  చూస్తున్నాం. 


ఇలా  కాకుండా ,  తక్కువ  డబ్బు,  తక్కువ  చదువు,  తక్కువ  హోదా .... ఉన్నవారిని  కూడా    గౌరవించటమనేది  సరైన  పద్ధతి. 

అందరినీ  సమానంగా  గౌరవించాలి.  చిన్న  వృత్తి,  గొప్ప  వృత్తి  అనే  భేదాలు  ఉండవు. న్యాయంగా  చేసే  ఏ వృత్తి  అయినా  గొప్పదే. 

డబ్బు,  చదువు,  హోదాలను  బట్టి  కాకుండా ,  వ్యక్తుల  యొక్క    వ్యక్తిత్వాలను  బట్టి  వారిని  గౌరవించటమనేది  మంచి  పద్ధతి.



Friday, January 25, 2013

కొన్ని విషయాలు.




 కొన్ని  విషయాలు.........

ఈ  రోజుల్లో  ఎక్కువమంది  బియ్యం,  లేక  గోధుమతో  చేసిన  ఆహారాన్ని  వాడుతున్నారు,. ఇప్పుడు  పొట్టు  తీసి  బాగా  పాలిష్  చేసిన  తెల్లబియ్యన్నే  ఆహారంగా  వాడుతున్నారు,  ఈ  తెల్ల  బియ్యం వాడకం  వల్ల  మధుమేహం  వంటి  వ్యాధులు  పెరుగుతున్నాయట.  ఇలా  బాగా  పాలిష్  చేయటం  వల్ల  పోషకాలు  కూడా  ఉండవు.  


పాలిష్  చేయని  బియ్యం  ఆరోగ్యానికి  మంచిది.  అయితే,   ఈ  బియ్యంతో  వండిన   అన్నాన్ని   ఎక్కువమంది  ఇష్టపడరు.   పాలిష్  చేయని  బియ్యాన్ని  ఇడ్లీలకు,  దోసెలకు  వాడుకోవచ్చు. పాలిష్  చేయని  బియ్యాన్ని  పిండి  పట్టించి  జంతికలు  వంటివి  చేసుకోవచ్చు.

    కొంతకాలం  క్రిందట  చిరుధాన్యాలైన  రాగులు,  సజ్జలు,  జొన్నలు,  వంటివి  కూడా  ఎక్కువగానే  వాడేవారట.   వరిని  పండించటానికి  చాలా  నీరు  అవసరం. ఈ  తృణధాన్యాలను  పండించటానికి  ఎక్కువ  నీరు  అవసరం  లేదు.  



తృణధాన్యాలతో  కూడా   ఎన్నో  రకాల  వంటలను  చేస్తున్నారు.  జొన్న  రవ్వతో  ఉప్మా  చేసుకోవచ్చు.  
 మినప్పప్పు +  బియ్యం + గుప్పెడు  జొన్నలు  నానబెట్టి  రుబ్బి  దోసెలు  వేసుకోవచ్చు. 
రాగి  పిండితో  సూప్  తయారుచేసుకోవచ్చు. 
 గోధుమ  పిండితో  పాటు రెండు,  మూడు   రకాల  తృణధాన్యాలను  కలిపి  పిండి  పట్టించి , చపాతీలను  తయారుచేసుకోవచ్చు.
పకోడీ, సజ్జబూరెలు .... వంటివి కూడా  చేసుకోవచ్చు.


 వరి,  గోధుమతో  పాటు  చిరుధాన్యాలను  వాడటాన్ని  అలవాటు  చేసుకుంటే    ఎన్నో  ఉపయోగాలున్నాయి. 


 ఆరోగ్యం  బాగుంటుంది  +  వరిని  పండించటానికి  అవసరమయ్యే  నీటి  వాడకం  తగ్గుతుంది  +  వర్షాధార  ప్రాంతాలలో  చిరుధాన్యాలను  పండించే  రైతులకు  ప్రోత్సాహం  లభిస్తుంది. 

రాగులు,  సజ్జలు,  జొన్నలు,  వంటి  చిరుధాన్యాల   మొక్కలకు  ఎక్కువగా  చీడపీడలు  ఆశించవట.  

ఇలా  ఎన్నో  ఉపయోగాలున్నాయి  కాబట్టి,   తృణధాన్యాలను  కూడా   వాడటం  అలవాటుచేసుకోవాలి.


Wednesday, January 23, 2013

అప్పటి, ఇప్పటి, పారిశుధ్య విషయాల గురించి కొన్ని విషయాలు ...


* కొంత  కాలం  క్రిందట  ఒక  టీవీ  చానల్ లో  ఒక  ప్రోగ్రాం  చూసాను. పెద్ద  స్టార్  హోటల్  వాళ్ళు  తమ  హోటల్లో  టాయిలెట్స్ ను  ఎంత  శుభ్రంగా  ఉంచుతామో  చూపించారు. . 

 అక్కడ  కమోడ్స్  కూడా   చేతిలో  ఒక బట్ట ముక్కను  పట్టుకుని  దానితో  శుభ్రంగా  తుడుస్తున్నారు.  ఆ  శుభ్రం  చేసే  వాళ్ళు  మంచి  దుస్తులు  వేసుకుని , చక్కటి  భాష  మాట్లాడుతున్నారు.  వాళ్ళకు   ఎక్కువ   జీతం  ఇస్తారట.

* ఇదంతా    చూసిన  తరువాత  నాకు   ఎన్నో  ఆలోచనలు  వచ్చాయి.
..........................


*  పూర్వకాలంలో   కొందరు    ప్రజలు,  ఇతరుల  మలినాలను  శుభ్రపరిచేవారు .  ఇది  ఎంతో  బాధాకరమైన  విషయం . 


* అయితే,  ఈ  రోజుల్లో  అలాంటివి   జరగటం  లేదా  ?   అనే   విషయాన్ని   గమనిస్తే,   ఇలాంటి    చర్యలు  అప్పటి  కన్నా,  ఇప్పుడే  ఎక్కువగా  జరుగుతున్నాయని  తెలుస్తుంది.

 *   ఈ  రోజుల్లో  కూడా  ఇతరుల  మలినాలను  సాటి  మనుషులే  శుభ్రం  చేయటం  చూస్తూనే  ఉన్నాము.


* ఉదా...చాలామంది  ఇళ్ళలో ,  గదికో   టాయిలెట్,  గదికో  వాష్ బేసిన్  కట్టించుకుంటున్నారు.  అయితే,  వాటిని  ఇంటి  యజమానులు  శుభ్రం  చేయరు.  పనివాళ్ళతో  శుభ్రం  చేయిస్తారు.   



ఈ  రోజుల్లో  చాలామందికి  ఇంటిపని  చేయటానికి  పనివాళ్ళను  ఏర్పాటుచేసుకుంటున్నారు  కదా  !   వాళ్ళు  యజమానులు  తిన్న  ఎంగిలి  పాత్రలను  శుభ్రం  చేస్తారు. టాయిలెట్స్  శుభ్రం  చేస్తారు. 

అంతేకాదు,  వాటిని   గాఢమైన  రసాయనాలతో  శుభ్రం  చేయవలసి  వస్తుంది.  ఆ  ఘాటు  వల్ల  వాళ్ళ  చేతులకు,  కళ్ళకు  అనారోగ్యం  కలిగే  అవకాశం  కూడా  ఉంది.

*   ఇళ్ళల్లోనే  టాయిలెట్స్, వంటగదిలో  సింకులు    వల్ల    డ్రైనేజ్  సమస్యలు   వచ్చినప్పుడు  కూడా  పారిశుద్య  కార్మికులు  వచ్చి   మలినాలను  శుభ్రం  చేసి  వెళ్తారు.

* పూర్వం    ఇలా  గదికో  టాయిలెట్ ను   శుభ్రం  చేసే  అవసరం  ఉండేది  కాదు. రసాయనాల  బాధ  కూడా  ఉండేది  కాదు.

.......................................


* ఇప్పుడు  చాలా  మంది   సరదాగా  కుటుంబసమేతంగా  హోటల్స్ కు  వెళ్ళి   భోజనం  చేస్తున్నారు. . వాళ్ళు  తిన్న  పళ్ళేలను  అక్కడ   వదిలి  వచ్చేస్తారు  గానీ,  కడగరు  కదా  ! వాటిని  అక్కడి పనివాళ్ళే  కడుగుతారు.

* పూర్వ  కాలం    కుటుంబసభ్యులు  హోటల్స్ కు  వెళ్ళి  తినటం  అనేది  తక్కువగా  జరిగేది.  ఒకవేళ  బయట  తిన్నా , ఆ  రోజుల్లో  భోజనం  చేయటానికి  అరటాకులు  వంటి  ఆకులను  ఉపయోగించేవారు. 


భోజనం  తరువాత  అరటాకులను   ఇతరులు   శుభ్రం  చేయనవసరం  లేదు,  వాటిని  బయట  పారేస్తే  పర్యావరణానికి  హాని  లేకుండా  చక్కగా  మట్టిలో  కలిసిపోయేవి. 
...................................

*  అప్పటి  వాళ్ళు  సరుకులు  తెచ్చుకోవటానికి  కిరాణా  కొట్టుకు  వెళ్తే  ఇంటినుంచి  సంచిని  తీసుకు  వెళ్ళేవారు. 


పూర్వకాలంలో  ఇప్పుడు  ఉన్నన్ని  రకాల  వస్తువులు  లేవు  కాబట్టి ,  ఇంత  చెత్త  ఉండేది  కాదు.   ఆ  చెత్త కూడా  పర్యావరణానికి  హాని  కలిగించకుండా  మట్టిలో  కలిసిపోయేది. 

 * పూర్వకాలం  వాళ్ళు  ఇంత  చెత్తను  బయట పారబోసేవారు  కాదు.  అంటే, 


ఉదా... ఇంట్లో  మిగిలిన  వ్యర్ధ పదార్ధాలైన  కూరగాయల తొక్కలను , వేరుశనగ  తొక్కలు,  మొక్కజొన్న  పై  తొక్కలు ,  అరటి  వంటి  పండ్ల  తొక్కలు,.... వంటివాటిని  చెత్తలో  వేయకుండా  పశువులకు  మేతగా  వేసేవారు.  మరికొన్ని  పదార్ధాలను  బయట  పారవేస్తే  కాకులు  వంటి  పక్షులు  తిని  పర్యావరణాన్ని  శుభ్రం  చేసేవి.

 * ఇప్పుడు  పెరిగిన  వాతావరణ  కాలుష్యం  వల్ల  కాకులు,  పిచ్చుకలు  వంటి  పక్షులు  ఎక్కువగా  కనిపించటం  లేదు  కదా  ! 


 ఈ  రోజుల్లో  చెత్త  బుట్టల  వద్ద  టన్నుల  కొద్దీ  చెత్త   పోగవుతోంది.  కుళ్ళిపోయిన  ఆ  చెత్తను  సాటి  మనుషులే  శుభ్రం  చేస్తుంటారు. ఈ  పారిశుద్య  కార్మికులు   డ్రైనేజ్  కాలువలను  కూడా  శుభ్రం  చేస్తుంటారు.
....................


* పూర్వకాలంలో   ఎవరి  ఇంటిముందు  వీధిని  వాళ్ళే   ఊడ్చి,  కళ్ళాపి   జల్లి, ముగ్గులు  పెట్టుకునే  పద్ధతి  ఉండేది.  దీనివల్ల  వీధులను  శుభ్రం  చేసే   పారిశుధ్య కార్మికులకు  చాలా  పని తప్పుతుంది.

* ఈ  రోజుల్లో  ఎవరి  ఇంటి ముందు  చెత్తను   వారు  శుభ్రం  చేసే  పద్ధతి  తగ్గిపోయి ,  బాధ్యతంతా  పారిశుధ్య  కార్మికులపై  పడుతోంది.
..............................


* ఇవన్నీ  గమనిస్తే  పూర్వకాలంలో  కన్నా,  ఈ  కాలంలోనే  ఇతరుల  మలినాలను  సాటి  మనుషులు  శుభ్రం  చేసే  పని  ఎక్కువగా  జరుగుతోంది ... అనిపించింది.
..................................


* పూర్వం  ఈ  దేశంలో  టాయిలెట్స్  ఉండేవి  కాదని, అప్పటి  వాళ్ళు  ఆరుబయటకు  వెళ్ళేవారని  ఇప్పటివారంటారు. ఆరుబయట  కాలకృత్యాలకు  వెళ్ళినా  ఆ  వ్యర్ధాలు  మట్టిలో  కలిసి  ఎరువుగా  మారేవి.

* ఈ  రోజుల్లో అయితే, టాయిలెట్స్  ద్వారా    వచ్చే   వ్యర్ధాలను   పైపుల  ద్వారా, మురుగు కాలువల  ద్వారా......    డైరక్టుగా  నదులలో,  సముద్రాలలో  కలిపేస్తున్నారు. 


ఇలా  కాకుండా   గోబర్  గేస్  ప్లాంట్స్  ఏర్పరిచి ,  ఈ  వ్యర్ధాలను విద్యుత్ గా మార్చి , వీధి  దీపాలు  వెలగటానికి , ఇంకా  ఇతరత్రా  విద్యుత్  అవసరాలకు  వాడుకుంటే  బాగుంటుంది. ( ఇలా  వచ్చిన  గేస్ ను   వంటకు  ఉపయోగించటానికి  ఎక్కువమంది  ఇష్టపడరు  లెండి..  )

*   చాలా  కాలానికి  పూర్వమే ,  భారతదేశంలో   విలసిల్లిన   సింధు  నాగరికత  యొక్క పురావస్తు  త్రవ్వకాలలో  చక్కటి  మురుగునీటిపారుదల  ఏర్పాట్లు  ఉన్న  వ్యవస్థ  బయటపడింది.  దీన్నిబట్టి  చూస్తే  అప్పటి  వాళ్ళకు  ఎంతో  టెక్నాలజి  తెలుసు . అని  తెలుస్తుంది. 


* ఒకప్పుడు  భారత దేశం  ఎంతో  సిరిసంపదలతో  విలసిల్లేది.  ఇక్కడి  వైభవాన్ని గురించి  ఎందరో  విదేశీ  యాత్రికులు  తమ  గ్రంధాలలో  వర్ణించారు.  అయితే,  తరువాత  క్రమంగా  భారతదేశం  పేద  దేశంగా,  మురికితో  నిండిన  దేశంగా  తయారయింది.  

* తిరిగి  ఈ  దేశం   సిరిసంపదలతో, పరిశుద్ధంగా విలసిల్లాలని  ఆకాంక్షిస్తూ .....



Monday, January 21, 2013

సమాజం కూడా , న్యాయంగా సంపాదించిన సొమ్ముతో జీవిస్తున్న వారిని గౌరవించటం నేర్చుకోవాలి.

 
ఈ  బ్లాగ్ ను  ప్రోత్సహిస్తున్న  అందరికి  అనేక  కృతజ్ఞతలండి.
.............................

*  కాలేజీల్లో  చదివి  బయటకు  వచ్చిన   తరువాత   చాలాకాలం  ఉద్యోగాలు  రాకపోతే , యువకులు  ఎంతో  నిరాశానిస్పృహలకు  లోనవుతారు . 

*  ఇలాంటప్పుడు వారి  మనస్తత్వం  ఎలా   ఉంటుందంటే,   ఇంటాబయటా  అందరూ  తమను  తక్కువగా  చూస్తున్నారని  ఫీలవుతుంటారు.   అందరూ  తన  నిరుద్యోగాన్ని  వేలెత్తి చూపినట్లుగా  భావించి  మానసికంగా  క్రుంగిపోతారు.


 ఉదా... తల్లితండ్రి ,అబ్బాయిని  షాప్ కు వెళ్లి   ఏమైనా సరుకులు  తెమ్మని  అడిగితే,  తాము ఉద్యోగం  లేక   ఖాళీగా  ఉన్నాము  కాబట్టే , ఇంట్లో  వాళ్ళు  పనులు  చెబుతున్నారు,  అనుకుని  పెద్దవాళ్ళమీద  విసుక్కునే  అవకాశముంది.

 (పిల్లలు  చదువుకునే  రోజుల్లో విసుక్కున్నా కూడా అప్పటి  విసుగుకి, ఇప్పటి విసుగుకి  తేడా ఉంటుంది.)

* ఇలాంటప్పుడు,  ఇంట్లోని  పెద్దవాళ్ళు  పిల్లలను  తిరిగి  విసుక్కోకుండా,  వాళ్ళ   మానసిక  పరిస్థితిని  అర్ధం  చేసుకుని ,  వాళ్ళకు  మానసికస్థైర్యాన్ని  అందించాలి. వాళ్ళకు  సరైన  సూచనలను,  సలహాలను   తెలియజేసి  సరైనదారిలో  నడిపించాలి.


* యువకులు  కూడా  కుటుంబంలోని   పెద్దవాళ్ళను   అపార్ధం  చేసుకోకూడదు.


*  మనదేశంలో  కొందరు  యువత   ఉద్యోగం  దొరకకపోతే,   వేరే  రంగాలలో   ఉపాధిని  పొందటాన్ని  నామోషీగా  భావిస్తారు.   అంత  చదువు  చదివి  వేరే  పనులు  చేయటమెలా ?  అనుకుంటారు.  ఇలా  అనుకోకూడదు.

*  భారతదేశంలో   ఉన్నతస్థానాలలో  ఉన్న  వాళ్ళలో,  పేదరికం  నుంచి  ఎంతో  కష్టపడి  ఉన్నత  స్థానాలకు  వచ్చిన  వాళ్ళెందరో  ఉన్నారు. 


* నా  అభిప్రాయం  ఏమిటంటే,  ఏ  పనీ  తక్కువది  కాదు.  అన్ని  పనులూ  గొప్పవే. 


*  యువత  తమకు  ఉద్యోగం  దొరకనప్పుడు  డీలా  పడిపోకుండా   ధైర్యంగా   నిలదొక్కుకోవాలి. మేం  ఎక్కువగా  చదువుకున్నాం  కదా  ! తక్కువ  ఆదాయం  వచ్చే  ఉద్యోగాన్ని  లేక  వ్యాపారాన్ని  లేక  వ్యవసాయాన్ని  లేక  చేతి  వృత్తులను   చేస్తే  ఎవరైనా  నవ్వుతారేమోననే  భావజాలాన్ని  విడనాడాలి. 


* తల్లితండ్రి  కూడా ,  పిల్లలు  ఎక్కువ  జీతం  వచ్చే  ఉద్యోగమే  చేయాలని  కండిషన్స్  పెట్టకూడదు.


* భారతదేశం  నుంచి  విదేశాలకు  వెళ్ళిన  వారిలో  కొందరు ,  అక్కడ  ఇతరత్రా  చిన్న  ఉద్యోగాలను  చేస్తూ  డబ్బు  సంపాదించుకుంటూ  కూడా  చదువుకుంటారట. 


* పురాణేతిహాసాల్లో  గొప్పగొప్ప  వాళ్ళే  ఎన్నో  పనులను  చేసారు. హరిశ్చంద్రుడు  అంతటి  మహారాజే  కాటికాపరిగా  విధులను  నిర్వహించారు.  నేను   గొప్ప  చక్రవర్తిని  కాటికాపరిగా  ఎందుకు  చేయాలి  ?  అని  ఆయన  వెనక్కి  తగ్గలేదు.   సత్యవాక్కు  కోసం  ఆయన  రాజ్యభోగాలను  విడిచిపెట్టి  కాటికాపరిగా  విధులను  నిర్వహించారు.


*  శ్రీరాముడు  సాధారణ  వ్యక్తిగా  అడవుల్లో  జీవించారు. ......తాను  గొప్ప  రాజ్యానికి  యువరాజును  మరి,  సామాన్యుడిగా  ఎందుకు  అడవుల్లో  కష్టాలు  పడాలి  ?  అని  వెనక్కితగ్గలేదు. 


* పాండవులు  వనాల్లో  సాధారణంగా  జీవించారు,   కొంత కాలం  విరాటుని  కొలువులో  సామాన్య  వ్యక్తులుగా  ఉద్యోగాలను  చేసారు.  


*  అంత   గొప్పవాళ్ళే   పరిస్థితులు  అనుకూలించనప్పుడు  సాధారణజీవితాలను  గడిపారు. వాళ్ళనుంచి  మనం  ఎంతో  నేర్చుకోవాలి.  


*  సమాజం కూడా  ఎంతో  మారాలి.  అన్యాయంగా  సంపాదించిన  సొమ్ముతో  విలాసంగా  జీవిస్తున్న  వారిని  గౌరవించటాన్ని  మానుకోవాలి.   న్యాయంగా  సంపాదించిన  సొమ్ముతో  సాధారణంగా  జీవిస్తున్న  వారిని  గౌరవించటం  నేర్చుకోవాలి.


*  అన్యాయంగా  సంపాదించిన  సొమ్ముతో  పంచభక్ష్యపరమాణ్ణాలను  తినే  వారికన్నా , న్యాయంగా  సంపాదించిన  సొమ్ముతో  పచ్చడి  మెతుకులు  తినే  వారే  గొప్పవారు.