koodali

Friday, January 18, 2013

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో... నిరుద్యోగ సమస్య కోణం ..

 
ఈ  సినిమాలో  ఇద్దరు  సోదరులు  నిరుద్యోగ  సమస్యతో  ఇబ్బందులు  పడుతుంటారు.

  ఈ  అన్నదమ్ములు  ఉపాధి  కోసం  పట్నం  వెళ్ళి , అక్కడ  ఉపాధి   దొరకక  బాధ  పడుతుంటారు.  సరైన  ఉపాధి  లేక  వాళ్ళ  బాధ  వాళ్ళు  పడుతుంటే ,  ఏం  పని  చేస్తున్నావు  ? అంటూ ఇతరులు  వాళ్ళను  పదేపదే   పరామర్శిస్తుంటారు  .


నాకేమనిపించిందంటే ,  ఈ  అన్నదమ్ములు  పట్నంలో  ఉపాధి  దొరకలేదని  బాధపడటం  కన్నా, తాము ఉన్న  పల్లెలోనే   సొంత పోలంలోనో   లేక  కౌలుకు  తీసుకున్న  పోలంలోనో  చక్కగా  వ్యవసాయం  చేసి , మంచి  దిగుబడులను  సాధించి , నలుగురికీ  ఆదర్శంగా  ఉండవచ్చు  కదా  ! అనిపించింది. లేకపోతే,  కొందరు  నిరుద్యోగులు  కలిసి  లోన్ తీసుకుని , వాళ్ళు  చదువుకున్న  చదువుకు సంబంధించిన విధంగా ఉపాధికోసం ప్రయత్నించవచ్చు. ( అయితే, లోన్  దొరకటం వంటి విషయాలు  అంత  తేలిక  కాదు....)
 
................

ఈ  రోజుల్లో బయట  సమాజంలో  కూడా  ఎందరో  యువకులు  నిరుద్యోగ  సమస్యతో  ఇబ్బందులు  పడుతున్నారు.


 ఇంట్లోని  తల్లితండ్రులు ,  అయ్యో  ! ఇంకా  ఉద్యోగం  రాలేదా  ? అంటూ    బాధపడుతుంటారు. 

 బయట  వాళ్ళు ,  ఏం  చేస్తున్నావురా ?  ఇంకా  పని  దొరకలేదా  ?  అని  పరామర్శిస్తుంటారు .

 ఈ  బాధలు  పడలేక, ఎందరో యువకులు  ఏదో ఒక పట్నం చేరి  గదులు  అద్దెకు  తీసుకుని, చిన్న ఉద్యోగం  దొరికినా చాలనుకుని,   సరిగ్గా  తినీతినకా  ఉద్యోగాన్వేషణలో తిరుగుతూ  అలసిపోతుంటారు.

కొందరు  తల్లితండ్రులు  కూడా   పిల్లలతో,  ఇంట్లో  ఖాళీగా ఉండి  ఏం  చేస్తావు  ? ఎక్కడికయినా  పోయి  పని  వెదుక్కో ... అని  అంటారు.. 


 ఇంటా,  బయటా  ఈ  పోరు   పడలేక  విరక్తితో  కొందరు   యువకులు  మత్తుపదార్ధాలకు  అలవాటుపడటం,  కొందరు  ఆత్మహత్యా  ప్రయత్నాలు ..వంటివి  చేసే  అవకాశం  ఉంది.

  కొంత  కాలం  క్రిందట,  కూరలను  అమ్మే  ఒకామె  తన  ఇంటి  విషయాలను   చెప్పింది. 


  వాళ్ళ  కొడుకు  ఇంజనీరింగ్  చదివాడట.   ఎంత  ప్రయత్నించినా  ఎక్కడా  ఉద్యోగం  దొరకక,  ఇంట్లోనే  ఉన్నాడట. 

ఇంట్లోనే  ఖాళీగా  ఉండకపోతే,  ఎక్కడికయినా  వెళ్ళి  ఉద్యోగం  సంపాదించవచ్చు  కదా  ! అని   తల్లి   అబ్బాయిని  కోప్పడిందట. 

  కొడుకును  కోప్పడినందుకు  బాధపడుతూ  ఆ  వివరాలన్నీ  నాతో  చెప్పి  బాధపడింది. 

 ఇప్పుడు  ప్రపంచమంతటా  నిరుద్యోగ  సమస్య  ఉంది. అబ్బాయి ఏం  చేయగలడు ?  కొన్నాళ్ళు  ఇంట్లో  ఉంటే  తప్పేమిటి ? నెమ్మదిగా  ఉద్యోగం  దొరుకుతుందిలే,  పిల్లవాడిని    కోప్పడవద్దని  నేను  ఆమెను  మందలించాను.

ఇవన్నీ  చూస్తుంటే, పూర్వకాలంలో ఇంత  నిరుద్యోగ  సమస్య   ఉండేదికాదేమో   ? అనిపిస్తుంది. 


పూర్వం  పిల్లలు  తమకు  పరంపరగా  వస్తున్న  వృత్తివిద్యలలోని   మెళకువలను   పెద్దవాళ్ళ  వద్దే   నేర్చుకుని  ఉపాధిని  పొందేవారు.

   అప్పటి వాళ్ళకు , ఇప్పటిలా  చిన్నతనం  నుంచి  మార్కుల  కోసం,  తరువాత  ఉద్యోగం  కోసం   ఇతరులమీద  ఎక్కువగా  ఆధారపడే   అవసరం  ఉండేదికాదేమో  అనిపిస్తుంది.


 పూర్వపు  రోజుల్లో   విద్య,  ఉపాధి  వంటివి  వ్యక్తుల  చేతులలో  ఉండేవి.    ఇప్పుడు  విద్య  కోసం  ,  ఉపాధి కోసం   కొన్ని  సంస్థలపై  ఆధారపడవలసి  వస్తోంది.  ఇప్పటి  వాళ్ళకు  ఉద్యోగభద్రత   కూడా  తక్కువే. 

ఈ  రోజుల్లో  యంత్ర వినియోగం  అతిగా  పెరిగిపోవటం  కూడా  నిరుద్యోగం  పెరిగిపోవటానికి  ఒక  ముఖ్యమైన  కారణమనిపిస్తుంది. 



అంటే,  కొన్ని  కష్టమైన పనులకు   యంత్రాల  వినియోగం  అవసరమే  కానీ,     నిరుద్యోగసమస్య  పెరిగిపోయేంతగా  మితిమీరిన   యంత్రవినియోగం  అనవసరం.  అనిపిస్తుంది. 

 అన్ని  పనులను  యంత్రాలే  చేసేస్తే, ఇక  మనుషులకు  చేయటానికి  పనేముంటుంది ?ఇలాంటప్పుడు  నిరుద్యోగం  పెరుగుతుంది.

........................................
 పెద్దవాళ్ళ  ఆర్ధిక  పరిస్థితి మెరుగ్గా  ఉన్న నిరుద్యోగులైన  యువకులు  కొందరు  కలిసి   నగరాల్లో  ఒక  ఇల్లు  అద్దెకు  తీసుకుని,  కుక్కర్లో  అన్నం  వండుకుని  ,  బయట నుంచి  వండిన  కూరలను  కొనుక్కుని  తింటూ  కాలం  గడుపుతారు.  ఈ  యువకులు   కూడా  ఉద్యోగం  లేకుండా  ఎక్కువకాలం  గడపాలంటే  తల్లితండ్రి  వద్ద  డబ్బు  అడగటానికి  సిగ్గుపడి , తినితినకా  ఉద్యోగాన్వేషణలో    తిరుగుతుంటారు.

 ఇక   తల్లితండ్రి  యొక్క  ఆర్ధిక  పరిస్థితి   సరిగ్గాలేని  యువకులు   చిన్న  గదులను  అద్దెకు  తీసుకుని  ఒకే ఇరుకు  గదిలో  10  మంది వరకూ  ఉంటూ,  తినితినకా  ఉద్యోగాన్వేషణలో    తిరుగుతుంటారు.

 ఇలా  ఈ  రోజుల్లో  ఎందరో  యువకులు  నిరుద్యోగ  సమస్యతో  బాధలు  పడుతున్నారు.


 సమాజంలో    నిరుద్యోగం  వంటి సమస్యలకు  పరిష్కారాలను     సీరియస్ గా  ఆలోచించి  చర్యలు  తీసుకునే  శ్రద్ధ ,సహనం ,సమయం   ఎక్కువమంది  మేధావులలో   కనిపించకపోవటం  బాధాకరం.




Wednesday, January 16, 2013

పేర్లు ఎన్నయినా దైవం ఒక్కటే........... మా చంద్రుడు మాత్రమే గొప్ప అని కొందరు అంటే .........మా మూన్ మాత్రమే గొప్ప అనికొందరు .......


గవంతుని నమ్మే వాళ్ళందరూ   తాము పూజిస్తున్న దైవం విశ్వాన్ని సృష్టించారని  నమ్ముతారు. అంటే , ప్రపంచంలో ఉన్న అందరు మానవులనీ  తాము నమ్ముతున్న దైవమే సృష్టిస్తారని నమ్ముతాము.

అలాంటప్పుడు మన ప్రక్కవాళ్ళు కూడా ఆ దైవం సృష్టించిన వాళ్ళే కదా ! వారియందు మనకు భేద భావం ఎందుకు ?

సూర్యుడు, చంద్రుడు ప్రపంచంలో ఒక్కరే.  అయితే, 


సూర్యుని కొందరు సన్ అంటారు, కొందరు సూర్యుడు అంటారు. అలాగే చంద్రుని కొందరు మూన్ అంటారు, కొందరు చంద్రుడు అంటారు.


* ఎవరు ఏ పేరుతో పిలిచినా మానవులందరికీ ' చంద్రుడు ' ఒక్కరే. మానవులందరికీ ' సూర్యుడు ' ఒక్కరే.  అలాగే
ఎవరు ఏ పేరుతో పిలిచినా మానవులందరికీ  దైవం  ఒక్కరే.
 

చంద్రుని, సూర్యుని అన్ని మతములవారు వారివారి పధ్ధతులలో పూజించుకుంటారు.


ముస్లిం మతస్తులు ,రంజాన్ పండుగ సమయాలలో చంద్రోదయానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. హిందూ మతస్తులు , పండుగ సమయాలలో, పూజలలో చంద్రునికి ఇంపార్టెన్స్ ఇస్తారు .

మా చంద్రుడు మాత్రమే గొప్ప అని కొందరు అంటే .........మా మూన్ మాత్రమే గొప్ప అనికొందరు .


అలాగే మా సూర్యుడు మాత్రమే గొప్ప.... అని కొందరు  అంటే ........ మా సన్ మాత్రమే గొప్ప.... అని కొందరు  అంటూ   వాదించుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది.

ఎందుకంటే సూర్యుడు , చంద్రుడు ఎవరికయినా ఒకటే కదా.


అలాగే మానవులందరూ ' దైవం ' ' మతం ' విషయాలలో ఎవరి ఆచారాలను వారు పాటించుకుంటూ ......ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ ........... ఇతరుల మతములను గౌరవిస్తూ,  గొడవలు లేకుండా ఉంటే అందరూ ఆనందంగా ఉంటారు.


  ఏకత్వంలోనే భిన్నత్వం............భిన్నత్వంలోనే ఏకత్వం అన్న మాట..


 అంటే,   ఒకే దైవంలో అన్ని దేవుళ్ళరూపాలను   దర్శించగలగటం...........అన్ని దైవరూపాలలోనూ ఒకే దైవాన్ని దర్శించగలగటం ..అన్నమాట. 


పైన  వ్రాసిన  విషయాలలోని   కొన్ని  విషయాలు   ఇంతకు  ముందు   వేసినవే.
.............


అయితే,    మరికొన్ని  అభిప్రాయాలను  కూడా  చెప్పాలనిపించి  వ్రాస్తున్నాను.

ప్రపంచంలో ఎన్నో  రకాల  ప్రాంతాలున్నాయి.   వివిధ  రకములైన  వాతావరణపరిస్థితులున్నాయి.   వాటిని  బట్టి,  ప్రజలలో  వివిధరకములైన  ఆచారవ్యవహారాలున్నాయి.  దైవం  ఒకరే  అయినా,   ఒకే  దైవాన్ని  ఎవరి  పద్ధతిలో  వారు   భావించి,   ఆరాధించుకుంటారు.  కొందరు  నిరాకారంగా  ఆరాధిస్తే ,  కొందరు  సాకారంగా   భావించి  దైవాన్ని   ఆరాధిస్తారు. 

అన్ని మతాలలోనూ  ఎందరో  పేదవాళ్ళున్నారు.  అన్ని  మతాలవారు  ఒకరితో  ఒకరు  గొడవలు  పడటం  మాని,  తమ  మతాలలోని  పేదవారి  కష్టాలను  తీర్చగలిగే  విధంగా   చర్యలు  చేపడితే  ఎంతో బాగుంటుంది.  మానవసేవే  భగవంతుని సేవ  అని  కూడా  చెబుతున్నాయి   కదా  !  అన్ని మతాలు.
 
 
 ఏ మతం వారైనా,  మతాల పేరుతో  ...ఇతర మతస్తుల పట్ల అన్యాయంగా ప్రవర్తించటం, బాధపెట్టటం తప్పు.



Friday, January 11, 2013

సృష్టి .. కొన్ని విషయములు ..


సృష్టి  ఎలా  ప్రారంభమయ్యింది  ?  అనే  ప్రశ్నకు ,  దైవం  వల్ల   ప్రారంభమయ్యింది.  . అని  ఆస్తికులు   ఖచ్చితమైన   సమాధానం  చెప్పగలరు. 


    సృష్టి  ఎలా  ప్రారంభమయ్యింది  ?  అనే  ప్రశ్నకు ,  నాస్తికులు  సరైన ,
హేతుబద్ధమైన  జవాబు  చెప్పలేరు. 


క్రితం  ఆదివారం  ఈ .. టీవీలో..

  ఆండాళ్  అమ్మవారి  చరిత్ర  ( శ్రీ గోదాదేవి  శ్రీ రంగనాధుల కల్యాణం )  ప్రసారమయ్యింది. 

 ఆ  కధలో,    ఒక  రాజుగారు  నాస్తికులు. 

ఆ  రాజు  ,  ఆస్తికులను ,  దైవం  గురించి   కొన్ని    ప్రశ్నలు  అడుగుతారు.   


సృష్టికర్త  అయిన  దైవాని  కంటే  ముందు  ఏమున్నది ?  అనే  అర్ధం  వచ్చేటట్లు  ప్రశ్న  అడుగుతారు. 


 అప్పుడు ,  ఆండాళ్  మాతకు  తండ్రి  అయిన  విష్ణుచిత్తుల  వారు   రాజుతో ,  ఒకటి  అనే  అంకెకు  ముందు  ఉన్న  అంకె  పేరు  చెప్పమంటారు. 


 అప్పుడు  రాజు  చెప్పలేకపోతారు.  (  ఒకటి  అనే  అంకెకు  ముందు  ఏ  అంకె  లేదు  కదా  !  )


విష్ణుచిత్తుల  వారు  చెప్పిన విషయములో ఎన్నో విషయములు ఉండి ఉంటాయి. అవన్నీ నాలాంటి సామాన్యులకు అర్ధం కాకపోయినా ....నాకు  తోచినంతలో  కొన్ని  అభిప్రాయాలు... 
         
ఒకటి  అనే  అంకెకు  ముందు  ఏ   అంకె   లేదు.  అలాగే,  

 దైవాన్ని  ఎవరూ    సృష్టించనవసరం  లేదు.   దైవం  నిత్యం.  దైవానికి  ఆది అంతమూ  లేదు. అని  చెప్పటం   విష్ణుచిత్తుల వారి  అభిప్రాయం  కావచ్చు .   అనిపిస్తోంది . 

 ............................... 

  సంఖ్యలలో  ఆఖరి  సంఖ్య  ఏది  ?   అనే  ప్రశ్నకు  కూడా  మనకు   జవాబు  తెలియదు. 


ఎందుకంటే,  సంఖ్యలను  అలా  లెక్కవేసుకుంటూ   వెళ్తే    ఒకదానితరువాత  ఒకటి  అంతం  లేకుండా  అలా  వస్తూనే  ఉంటాయి  కదా  !

............................ 


   దైవానికి  ఆది,  అంతమూ  అనేవి  లేవు . అని కూడా   మనకు  తెలుస్తుంది.


  ఆది,  అంతమూ  లేక   అంతటా  వ్యాపించి  ఉన్న  శక్తినే  దైవమని  ఆరాధిస్తారు.  ఆస్తికులు. 

............................

అసలు  ప్రతిదానికి    ఆది ,  అంతమూ  ఉంటుందని   ,  ఉండాలని  మనం  ఎందుకు  అభిప్రాయపడాలి  ? 

సృష్టిలో  మనకు  తెలిసిన  విజ్ఞానం  సముద్రంలో  నీటిబొట్టంత  అయితే, 
మనకు   తెలియని  విజ్ఞానం   సముద్రమంత,  ఇంకా  ఎక్కువ  కూడా.  


  వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.
...............................

 రామకృష్ణపరమహంస  శారదాదేవిల   శిష్యులైన   వివేకానందుని  జయంతి ,  జనవరి  12 న . 

 గోదారంగనాధుల   కల్యాణం జనవరి  13  న. ( భోగి పండుగ).

సంక్రాంతి,  అయ్యప్ప  స్వామి  మకరజ్యోతి  దర్శనం ..జనవరి  14  న.
  అందరికి  శుభాకాంక్షలు.


Wednesday, January 9, 2013

ఈ రోజుల్లోని విపరీతమైన సమాజపోకడల వెనుక ...కొన్ని కారణాలు.

 
సమాజంలో నేరస్తులు  తయారవటానికి , నేరాలు  జరగటానికి   వెనుక ఎన్నో సామాజిక కారణాలు కూడా ఉంటాయి.

  ఈ రోజుల్లో , నైతికవిలువలకు   ప్రాధాన్యత ఇవ్వటం   తగ్గిపోయింది.   పూర్వపు సమాజంలో, త్రాగుడు వంటి చెడ్డ వ్యసనాలు ఉన్నవారికి సమాజంలో అంత గౌరవం లభించేది కాదు. ఇప్పటి సమాజంలో, త్రాగుడు వంటి చెడ్డ వ్యసనాలు లేనివాళ్ళను , నాగరికత   తెలియని  వారిగా చూసే చిత్రమైన వ్యవస్థ నెలకొంది.  మద్యనిషేధాన్ని   ప్రభుత్వం   అమలుచేస్తే,   ఎన్నో  కుటుంబాలు  బాగుపడతాయి.


పాపపు పనులు చేసైనా సరే , ఎక్కువగా డబ్బు సంపాదించి విలాసంగా జీవించాలి. అనుకునేవారు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు.


పూర్వపు సమాజంలో, శృంగారం వంటి దృశ్యాలు చిన్నపిల్లల కంటపడకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. ఇప్పుడు   రోజంతా  మీడియా ద్వారా … ( పత్రికల్లోనూ, టీవీచానల్స్ లోనూ, సినిమాల్లోనూ, అంతర్జాలం , సెల్ ఫోన్స్.. ద్వారా, ) శృంగారపరమైన చిత్రాలు ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ చూస్తూ పెరిగి పెద్దవాళ్ళైన పిల్లలు శీలానికి ( సత్ప్రవర్తనకు ) పెద్దగా విలువ ఇవ్వక్కర్లేదు అనుకునే ప్రమాదముంది.


  సమాజంపై  మీడియా  ప్రభావం  చాలా  ఉంటుంది.  మీడియాలో  కొన్ని  చక్కటి  ప్రోగ్రాంస్  వస్తున్నాయి.    సమాజాన్ని  తప్పుదోవపట్టించే 
ఎన్నో  ప్రోగ్రాంస్  కూడా  వస్తున్నాయి.  మంచిసినిమాలు  వస్తున్నాయి.  చెడ్డసినిమాలు  వస్తున్నాయి.   చెడ్డ సినిమాలు  తీసేవారు  ఏమంటారంటే,  ప్రజలు  చూస్తున్నారు   కాబట్టి   మేము  తీస్తున్నాము  అంటారు.    పిల్లలు  తప్పులు  చేస్తుంటే  సరిదిద్దవలసిన  బాధ్యతాయుతమైన  స్థానాల్లో  ఉన్న  పెద్దవాళ్ళు  ఇలా  అనటం  న్యాయం  కాదుకదా  ! 


ఇక ఈ రోజుల్లో చాలామంది పెద్దవాళ్ళకు, తమ పిల్లలను తామే దగ్గరుండి పెంచుకోవటానికి గానీ, పిల్లలతో సరిగ్గా మాట్లాడటానికి గానీ, పిల్లలకు జీవితం గురించి తెలియచేయటానికి గానీ, తగిన సమయం లేనంతగా పెద్దవాళ్ళు బిజీ అయిపోతున్నారు.


ఈ రోజుల్లో ఎన్నో కారణాల వల్ల యువతకు వివాహం జరగటం ఆలస్యమవుతోంది. వివాహం జరిగినా ఎన్నో కారణాల వల్ల భార్యాభర్తల మధ్య వేరు కాపురాలు, విడాకులు, ఎక్కువయ్యాయి. కుటుంబవాతావరణం సరిగ్గా లేని సమాజ వాతావరణంలో ఎవరికీ మనశ్శాంతి ఉండదు. ముఖ్యంగా పిల్లల మనస్తత్వం గందరగోళంగా తయారవుతుంది.
 

నేరాలు జరగటానికి ఇలా ఎన్నో కారణాలున్నాయి. నేరస్తులకు కఠినశిక్షలు వెయ్యటం అవసరమే. అయితే, నేరాలను శాంతిభద్రతల సమస్యగా మాత్రమే భావించి , పోలీసులపైనే పూర్తి భారం వేసెయ్యటం కాకుండా, సమాజంలో సమూలంగా మార్పులు వస్తే , నేరాలు   తగ్గుతాయని అనిపిస్తోంది. 


పోలీసుల   కష్టాలు  పోలీసులకు  ఉంటాయి.  కొందరు  పోలీసులు  తక్కువ   జీతాలతో ,  కుటుంబాలకు  దూరంగా  ప్రమాదకరమైన  పరిస్థితిలో  పనిచేయవలసి  వస్తుంది. ఎందరో  కరడుగట్టిన  నేరస్తులను  చూసి చూసి ,  వారికి  విసుగ్గా  ఉంటుంది.   ప్రజలు  తమ  వంతు  బాధ్యతను 
చక్కగా  పాటించితే,  పోలీసులు  కూడా  తమవంతు  బాధ్యతను  చక్కగా  చేయగలరు. 
 

ఆర్ధికపరమైన అసమానతలు  కూడా  నేరాలు  జరగటానికి  ఒక  ముఖ్యమైన  కారణమే. . కొందరి  దగ్గర  విపరీతమైన  డబ్బు  ఉంటే,   కొందరికి  తినటానికి  కూడా  సంపాదన  చాలదు.  కొందరు  ఇంట్లో  ఉన్న  కుటుంబసభ్యులందరూ  ఉద్యోగాలు   చేసి ,  బోలెడు  డబ్బు  సంపాదించి  , ఖరీదైన  దుస్తులు,  నగలు,  కార్లతో ...... ఆడంబరంగా  జీవిస్తుంటారు.  కొందరికి  ఇంట్లో  ఒక్కరికి   కూడా  ఉద్యోగం  దొరకక  బాధపడుతుంటారు.  


  సమాజంలో  కొందరు,   అందిన   సంపదను   అందినట్లు    దోచుకుని  పదితరాలకు  సరిపడా   కూడబెడుతుంటారు. కొందరు  చేయటానికి  పనిదొరకక,  తినటానికి  తిండి  కూడా  లేక  ఆత్మహత్యా ప్రయత్నాలు  కూడా  చేస్తారు. ఈ  ఆర్ధిక  అసమానతలు  కూడా  ఎన్నో  నేరాలు  జరగటానికి  కారణమవుతున్నాయి.
 

సమాజంలో  నేరాలు జరగటానికి  ఇలా....ఎన్నో కారణాలున్నాయి. చిన్నతనం నుండి నైతికవిలువలతో కూడిన విద్యను అందించటం, చక్కటి కుటుంబ, సమాజ వాతావరణం ఉన్నప్పుడు సమాజంలో చక్కటి పౌరులు తయారవుతారు.



Monday, January 7, 2013

పిల్లల హక్కులు...పెద్దవాళ్ళ హక్కులు.

 
*ఈ  మధ్య విదేశాల్లో  , తమ  పిల్లవాడిని  కొట్టారని  తల్లితండ్రులను  శిక్షించిన  సంఘటన  గురించి  విన్నాం.  ఆ  పిల్లవాడు స్కూల్  వాన్లో  మూత్రవిసర్జనను  ఆపుకోలేకపోవటం  వల్ల , విషయాన్ని  స్కూల్  వాళ్ళు  చెప్పటం ...తల్లితండ్రులు  పిల్లవాడిని   దండించటం  జరిగిందని  వార్తలు  వచ్చాయి. ( అసలు  ఏం  జరిగిందో  మనకు  సరిగ్గా  తెలియదు.  )


* పిల్లలు   అలా   చేయటానికి ఎన్నో కారణాలుండవచ్చు.   పిల్లలకు  ఏదైనా  అనారోగ్య సమస్య   ఉన్నప్పుడు కూడా   టాయిలెట్ కు   వెళ్ళేలోపు  ఆపుకోలేకపోతారు.    ఇలాంటప్పుడు వైద్యులను సంప్రదించి   ట్రీట్మెంట్ చెయ్యించాలి.  అంతేకానీ,  పిల్లలను   కొట్టటం    తప్పు.



* కొన్ని  స్కూల్స్ లో కూడా , అర్జంట్ గా   బాత్రూం కు  వెళ్ళాలని   పిల్లలు  ప్రాధేయపడినా , కొందరు  టీచర్లు  పర్మిషన్  ఇవ్వరు.   పాఠం పూర్తయిన   తరువాత  మాత్రమే  వెళ్ళటానికి  పర్మిషన్ ఇస్తారు.   అంతవరకు  ఆపుకోలేని పిల్లలు  క్లాస్ రూంలోనే   మూత్రవిసర్జన  చేస్తారు.    అప్పుడు మళ్ళీ  పిల్లల్నే చితకబాదుతారు  టీచర్లు.



*  కొందరు    ఆకతాయి పిల్లలు టాయిలెట్ పేరు చెప్పి బయటకు వెళ్ళి   కాలక్షేపం చేసే మాట నిజమే కానీ, అటువంటి పిల్లలను దృష్టిలో పెట్టుకుని , నిజంగా టాయిలెట్ కు వెళ్ళవలసిన అవసరం ఉన్న విద్యార్ధులను  కూడా ఆపటం న్యాయం కాదు కదా ! 



* కొన్ని సార్లు విపరీతమైన ట్రాఫిక్ వల్ల, స్కూల్ నుంచి ఇంటి కెళ్ళేవరకూ   కాలకృత్యాలను ఆపుకోలేని పిల్లలకు కూడా   ఇలా జరిగే   అవకాశం ఉంది. ఇలాంటప్పుడు   పెద్దవాళ్ళదే  తప్పు  కదా  ! స్కూల్  బస్  లో  కూడా 
టాయిలెట్  సౌకర్యం  ఉండాలి. 


* కొన్నిదేశాల్లో అయితే ,   పెద్దవాళ్ళు కూడా   నాప్కిన్స్  వేసుకుంటారట.
( లోకల్ ట్రైన్స్ లో   టాయిలెట్స్   ఉన్నా కూడా,  టాయిలెట్ కు   వెళ్ళటానికి కూడా   వీలులేనంత రష్ ఉంటుందట ట్రయిన్స్లో. )



* ఈ అబ్బాయి కేసులో తల్లితండ్రులను   జైల్లో పెడితే , మరి ఆ బాబును ఎవరు చూసుకుంటారు ? ఆ పిల్లవాడు   తల్లితండ్రులు  కావాలని   ఏడిస్తే   ఏం  చేస్తారు ?      పిల్లవాడికి తల్లితండ్రులను దూరం చేయటం కూడా పిల్లల హక్కుకు భంగం కలిగించటమే కదా !



* నిజంగా పిల్లలను శాడిజంగా హింసించే తల్లితండ్రులను జైల్లో పెట్టవలసిందే. కానీ, ఈ తల్లితండ్రులు తాత్కాలిక ఆవేశంలో పిల్లవాడిని శిక్షించారే కానీ, అబ్బాయి అంటే ప్రేమ ఉన్నవారిగానే కనిపిస్తున్నారు. దీనిని  మొదటి తప్పుగా భావించి, తల్లితండ్రులను విడిచిపెడితే బాగుంటుందనిపిస్తోంది. 



*  మనదేశంలో  అయితే,  సమావేశాలంటూ  స్కూల్  పిల్లలను   గంటలతరబడి  ఎండలో  నిలబెట్టేస్తారు. కొన్నిసార్లు    రోడ్ల   వెంబడి  ఊరేగింపులంటూ   తిప్పుతారు.   ఆ  సమయంలో   పిల్లలకు  టాయ్ లెట్ కు  వెళ్ళటానికి  కూడా  అవకాశం  ఉండదు.  అంతసేపు   ఎండలో  నిలబడి ,  నడిచి ,   పెద్దవాళ్ళు  చెప్పే  స్పీచులు   వినలేక  పిల్లలు  కళ్ళుతిరిగి  పడిపోతారు  కూడా. 



* చదువు  పేరుతో  గంటల  తరబడి  కూర్చోబెట్టి,  ప్రపంచంలో  జరిగే   విషయాలన్నీ   పిల్లల  మెదళ్ళలో  కూరటం  వల్ల    కూడా,   పిల్లలకు  ఆటలాడుకునే  సమయం  లేక,  తమ  బంగారు  బాల్యాన్ని  కోల్పోయి , యంత్రాల్లా  తయారవుతున్నారు.



*  పిల్లలను  పెంచటానికి  కూడా  సమయం  లేని  తల్లితండ్రులు ,  ఏడుస్తున్న   చంటిపిల్లలను  కూడా  క్రెచ్లో  వదిలి  వెళ్తారు . 



* తల్లితండ్రులతో  కలిసి  జీవించటం  పిల్లల  జన్మహక్కు....  అయితే,  తల్లితండ్రులు  తమలోతాము కొట్లాడుకుని  విడిపోవటం  వల్ల  పిల్లలకు  ఆ  ఆశ  తీరదు. ఇలాంటివాళ్ళు   విడాకులు  తీసుకోవటంతో  ఆగకుండా,  తమకు  నచ్చిన  వాళ్ళను  మళ్ళీ  పెళ్ళి  చేసుకుని ,  పిల్లలకు   కొత్త  తల్లితండ్రులను  తెస్తారు. ఇది  పిల్లలను  మానసికంగా  ఎంత  బాధ పెట్టినా  పట్టించుకోరు. 



*  పిల్లలు  స్కూల్  నుంచి   ఇంటికి  వెళ్ళగానే , సొంత  అమ్మకు  బదులు  కొత్త  అమ్మ,  సొంత నాన్నకు  బదులు  కొత్త  నాన్న  ఉంటే....  ఆ  బాధ  ఎలా  ఉంటుందో  ఊహించుకుంటేనే  బాధగా  ఉంటుంది. ఆడపిల్లలు  ఉన్న తల్లి    మళ్ళీ  పెళ్ళి  చేసుకుంటే , వచ్చే  కొత్తనాన్న  వల్ల ,  ఆ  పిల్లలకు  కొత్తరకం  సమస్యలు  వచ్చే  అవకాశం  కూడా  ఉంది. 



* ఇలా.... ఈ  రోజుల్లో  ఎందరో   పిల్లలు  ఎన్నో  కష్టాలను  అనుభవిస్తున్నారు.  పిల్లల  భావాలకు  సమాజంలో  విలువ  ఇస్తున్నట్లుగా  అనిపించటం  లేదు.   పెద్దవాళ్ళు తమ హక్కులను  గోల చేసి సాధించుకుంటారు.  పిల్లలకూ హక్కులుంటాయి. అని అందరూ గుర్తించాలి.




Friday, January 4, 2013

శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం గురించి సినిమా ...కొన్ని విషయాలు...


ఓం.
శ్రీ  అనంతలక్ష్మీసత్యవతీదేవి సమేత శ్రీ హరిహరహిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక శ్రీ వీర  వేంకట  సత్యనారాయణ స్వామి వారికి  నమస్కారములు. 


 శ్రీ  అనఘాదేవీ శ్రీ  దత్తాత్రేయస్వామి  వార్లకు  నమస్కారములు.
  శ్రీపాదశ్రీవల్లభ  స్వామి  వారికి  నమస్కారములు.



పురాణేతిహాసాలలోని  వారి  చరిత్రల  ద్వారా  మనము  ఎన్నో  విషయాలను  తెలుసుకోవచ్చు. 



శ్రీ  సత్యనారాయణ స్వామి వారి  వ్రత మహాత్మ్యంలో  చెప్పే  కధల  ద్వారా  కూడా  మనము  ఎన్నో  విషయాలను  తెలుసుకోవచ్చు.

ప్రసాదం  అంటే, భగవంతుని   అనుగ్రహం.

శ్రీ సత్యనారాయణ స్వామి  వారి  వ్రతం  గురించి  సినిమా  కూడా  వచ్చింది. 


 ఈ  సినిమా  యొక్క  లింక్  ఇక్కడ  ఇస్తున్నానండి.

Sri Satyanarayana Swamy - YouTube.



 

Wednesday, January 2, 2013

చరిత్రలో ఎందరో మహానుభావులైన స్త్రీపురుషులున్నారు.

* ఓం.

*ఈమధ్య  ఒక బ్లాగ్ లోని  టపాకు  నేను  వ్రాసిన   వ్యాఖ్యలో.............

* ..జీవితంలో  ఎవరినీ  ఎప్పుడూ  విసుక్కోని,  కసురుకోని,  తిట్టని,  ఒక్క  స్త్రీని  నాకూ  చూడాలనుంది... అని  వ్రాసాను.

* తరువాత  ఆలోచిస్తే,   ధర్మరక్షణ  కోసం   జీవితాలలో  ఎన్నో  కష్టాలను  సహించిన  ఎందరో  మహానుభావులైన  స్త్రీలు,  పురుషులు  చరిత్రలో   ఉన్నారు.  అందుకని    పైవిధంగా  నేను  వ్రాయటం  తప్పని  నాకు  అనిపించింది. 



 * తెల్లవారితే  పట్టాభిషేకానికి  బదులు  వనవాసానికి  వెళ్ళవలసివచ్చినప్పుడు  సీతారాములు  ఎంతో  నిబ్బరంగా  వ్యవహరించారు. 


*
నేను  వనవాసానికి  వెళ్ళను.....  అని  రాముడు  అంటే  ఎవరూ  చేయగలిగిందేమీలేదు.  అయితే,   శ్రీ రాముడు  అడవులకు  వెళ్ళకపోతే  ,  కైకేయికిచ్చిన  మాటను  నిలబెట్టుకోలేక   మాటతప్పిన  వాడనే  చెడ్డపేరు  దశరధునికి  వచ్చి  ఉండేది.


* నేను  రాజ్యాన్ని దానంగా  ఇవ్వను....అని  హరిశ్చంద్రుడు  అంటే  ఎవరూ  చేయగలిగిందేమీలేదు.   అయితే, రాజ్యాన్ని
దానంగా ఇవ్వకపోతే,   విశ్వామిత్రునకు  ఇచ్చిన   మాటను  నిలబెట్టుకోలేక   మాటతప్పిన  వాడనే  చెడ్డపేరు  హరిశ్చంద్రునకు  వచ్చి  ఉండేది.

 * వాళ్ళు   ధర్మపరిరక్షణకు  ఎంతో  ప్రాధాన్యతను  ఇచ్చేవారు.


* సమాజంలో  బాధ్యతాయుతస్థానాల్లో  ఉన్నవారు  అసత్యవాదులు,  అధర్మపరులు  అయితే ,   ప్రజలు  కూడా  అసత్యం,  అధర్మం  చేయటానికి  వెనకాడరు.    అప్పుడు  సమాజమంతా  అబద్ధాలకోర్లు,  మోసగాళ్ళతో  నిండిపోయి   అస్తవ్యస్తమవుతుంది.      అధర్మం  పెరిగిపోతుంది.     సమాజంలో   ఎన్నో  నేరాలు  జరుగుతాయి.



*  అందుకే  సత్య  హరిశ్చంద్రుడు,  శ్రీరాముడు, వంటి  వారు  లోకహితం  కోరి,  ధర్మ  పరిరక్షణ  కొరకు  రాజభోగాలను   కూడా   అవలీలగా  త్యజించి , ఎన్నో  కష్టాలను  సహించారు.  వారి  భార్యలు  కూడా  ఎన్నో  కష్టాలను  భరించారు.


* రామ,లక్ష్మణ,భరత,శత్రుఘ్నులు...  వారి  భార్యలు  ...  రాజ్యాధికారం  కోసం  తమలో  తాము  
కలహించుకోకుండా  ప్రజలకు  శాంతినిచ్చి  తాము  కష్టాలను  భరించారు.

* భారతంలో  భీష్ములవారు  రాజ్యాధికారాన్ని,  వివాహాన్ని  అవలీలగా  త్యజించి  జీవితాంతం  తాను  చేసిన  ప్రతిజ్ఞకే  కట్టుబడ్డారు.



* లోకక్షేమం  కోసం  వెన్నెముక  కావాలని   దేవతలు   అడిగితే  అవలీలగా  అర్పించారు  దధీచి  మహర్షి.


*  ఇలా    ధర్మరక్షణ  కోసం  జీవితాలలో  ఎన్నో  కష్టాలను  సహించిన  స్త్రీలు,  పురుషులు   పురాణేతిహాసాలలో  ఎందరో   ఉన్నారు. 



* పురాణేతిహాసాల  ద్వారా  వీరి  చరిత్రలను  తెలుసుకుని ,  స్వార్ధాన్ని  తగ్గించుకుని  జీవితాలను  తీర్చిదిద్దుకున్న  వారెందరో   తరువాత   కాలంలో  కూడా   ఉన్నారు.



* ఇంత  మంది  మహనీయులైన  స్త్రీలు,  పురుషులు  చరిత్రలో  ఉన్నప్పుడు ,  జీవితంలో  ఎవరినీ  ఎప్పుడూ  విసుక్కోని,  కసురుకోని,  తిట్టని,  ఒక్క  స్త్రీని  నాకూ  చూడాలనుంది...... అని  నేను  వ్రాయటం  ఎంతో  తప్పే  . * అలా  వ్రాసినందుకు  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.


.................................
* ఈ  మధ్య   నేను  కురువపురం  వెళ్ళి  శ్రీపాదశ్రీవల్లభుల  వారి  దర్శనం  చేసుకు  వచ్చాను.

* ఇంతకుముందు  కూడా  ఒకసారి  కురువపురం  సందర్శన  భాగ్యం  కలిగింది.   మళ్ళీ  నాకు   కురువపురం  సందర్శన  భాగ్యం   కల్పించినందుకు  దైవానికి  అనేక  నమస్కారములు.


* శ్రీ  అనఘాదేవీ శ్రీ  దత్తాత్రేయస్వామి  వార్లకు  అనేక  నమస్కారములు.

*  శ్రీపాదశ్రీవల్లభ  స్వామి  వారికి  అనేక నమస్కారములు.

........................

 * ఆంగ్ల  నూతన సంవత్సర  సందర్భంగా .... ప్రపంచమంతటా  శాంతిభద్రతలు  విలసిల్లాలని  ఆకాంక్షిస్తున్నాను.