koodali

Wednesday, December 1, 2010

నేటి వస్తూత్పత్తి చదువులు.......

 

ఆ మధ్యన నేను ఊరు వెళ్ళాను కదండి. ఎక్కడ చూసినా మురికి,మురికి . వర్షం వస్తే ఇక చెప్పనే అక్కరలేదు. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్స్, పారేసిన సామాను, డబ్బాలు, ఎలక్ట్రానిక్ వేస్ట్ సామాను.


మా చిన్నతనములో మా తాతగారి పల్లెటూరు వెళితే అక్కడ పేదవారి గుడిసె ముందు కూడా శుభ్రంగా కళ్ళాపి జల్లి చక్కగా ముగ్గు వేసి ఉండేది. రోడ్ల పైన ఇలా వాడిపారేసిన సామాన్లు ఉండేవి కాదు.


అంటే మరి, ఇప్పుడంటే యంత్రాలు కనిపెట్టి విపరీతంగా వస్తువులను తయారుచేసి ప్రపంచముపై గుట్టలు పోస్తున్నారు. కానీ,...........
అప్పటికి ప్రపంచం పారిశ్రామికంగా ఇంత అభివృద్ధి చెందలేదు లెండి


ఈ రోజుల్లో చదువు అంటే కూడా అర్ధం మారిపోయింది కదా ! ఇప్పుడు చదువు అంటే ఎన్నిరకాలుగా క్రొత్తవస్తువులను తయారుచేయవచ్చో నేర్చుకోవటమే కదా !

అసలు ఇప్పుడు మనం బ్రతికేదే కొత్త వస్తువులను కొనుక్కోవటానికి, దానికోసం డబ్బు సంపాదించటానికీను. ఆ వస్తువులతో శరీరానికి పనిలేకుండా సుఖంగా ఉండటానికీను.


శరీరానికి శ్రమ తగ్గించాలన్న ఆలోచనతో జీవితములో విపరీతముగా శ్రమిస్తున్నారు. ఉదా...చూడండి.......పిల్లలను పుట్టగానే స్కూల్లో వేసేస్తున్నారు. ఇక బడిలో వేయగానే ప్రొద్దున నుండి రాత్రి వరకూ చదువు పేరుతో రాచిరంపాన పెట్టడము.


ఇక ఉద్యోగములో చేరాక టార్గెట్ ల గోలతో ప్రొద్దున్న నుండి అర్ధరాత్రి వరకూ పని,పని.

ఇక రిటైర్ అవుతారు. అప్పటికి ఇంటినిండా వస్తువులు, డబ్బు ఉన్నా, ఆరోగ్యమే ఉండదు. జరిగిపోయిన జీవితములో ఏమీ ఎంజాయ్ చెయ్యలేదన్న బాధతో , అనారోగ్యముతో, హాస్పిటల్ కే జీవితం అంకితం చచ్చేవరకూ. ఇదీ నేటి జీవితం.


ఇక చాలా కుటుంబములు ఇవ్వాళ ఎలా ఉన్నాయంటే, భార్యాభర్తలు చెరొక దగ్గర ఉద్యోగం, పిల్లలు ఎక్కడో హాస్టల్స్ లో.

ఇదే కుటుంబము అంటే. అదేమిటంటే, ........ ఈ రోజుల్లో అభివృధ్ధి చెందాలంటే ఇవన్నీ తప్పవు కదండీ,,,, అంటారు. నాకు అర్ధము కానిది ఒకటే అసలు అభివృద్ధి అంటే ఏమిటి ? అని......


అసలు విషయం మనకు కోరికలు ఎక్కువ అయిపోయినాయి. అసలు ఇన్ని కొత్త వస్తువులు తయారుచేయటం అవసరమా ?

ఎప్పుడైనా సూర్యతుఫాన్ లాంటిది వచ్చి ఈ సదుపాయములు అన్నీ ఫెయిల్ అయితే అప్పుడు మన పనులు మనం చేసుకోవటానికి శరీరావయములు సహకరిస్తాయా ?


( భవిష్యత్తులో సూర్య గోళముపైన తుఫాన్లు రాబోతున్నాయని వాటివల్ల శాటిలైట్ సిస్టంస్ ఫెయిల్ అయ్యి , ఫోన్స్, ఇంటర్నెట్ వగైరాలు అన్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని ఆధునిక శాస్త్రవేత్తలే చెబుతున్నారు,. )

అంతవరకూ ఎందుకు ........ శరీరమును శ్రమ పెట్టకుండా ముద్దు,ముద్దుగా గారాబం చేస్తే మనకే అనారోగ్యం వస్తుందని వైద్యులు చెబుతున్నారు కదా.......... 



కొత్తవస్తువులను కనిపెడుతున్న కొద్దీ వాటిని అందుకోవాలనే కోరికతో జనం జీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. వాటిని కొనటానికి కావాలిసిన డబ్బు సంపాదించటానికే జీవితకాలం సరిపోవటం లేదు. ఇక సుఖం, సంతోషం ఎక్కడ ?


మనకన్నా పాత కాలం వాళ్ళే నింపాదిగా, ప్రశాంతముగా బ్రతికారు అనిపిస్తోందండి. వారికి ఇన్ని కోరికలు లేవు.


అభివృధ్ధి, అభివృధ్ధి అని మనం చెప్పుకుని సంబరపడటమే కానీ, ప్రపంచములో పేదరికం, ఆకలి కేకలు అలాగే ఉన్నాయి. అప్పుడూ వరదలూ, భూకంపాలు , అగ్నిపర్వతాలు బ్రద్దలవటాలు ఉన్నాయి.......ఇప్పుడూ అవన్నీ అలాగే ఉన్నాయి.

పాత సమస్యలు తొలగకపోగా ఎలక్ట్రానిక్ వ్యర్ధములు, ప్లాస్టిక్ చెత్త , గ్లోబల్ వార్మింగ్ లాంటి కొత్త సమస్యలు వచ్చాయి ఈ అభివృధ్ధి వల్ల .


అంగారకుని మీదకు వెళ్ళిపోతున్నాము అంటున్నారు.  మంచిదే, కాని ఈ చెత్త సమస్యలను ఎవరు సాల్వ్ చేస్తారు ?


క్రొత్తవస్తువులను మనకు ఎంత వరకు అవసరమో అంతవరకే వాడుకోవాలి గాని, అవి మన మనుగడకే ఆటంకం కాకూడదు కదా .

 

Monday, November 29, 2010

మేము అమర్‌నాధ్ వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు బాగా సహాయము చేశారు.

 
 
ఈ పోస్ట్ బ్లాగ్ మొదలుపెట్టిన కొత్తలో వ్రాశానండి. మళ్ళీ ఇప్పుడు తిరిగి పోస్ట్ చేస్తున్నాను.

మా కుటుంబం క్రితం సంవత్సరము..... బాబా అమర్‌నాధ్ , మాతా వైష్ణవి దేవి యాత్రకు వెళ్ళాము.అక్కడ చెప్పలేనంత బాగుంది. భగవంతుని దయవలన మావంటి సామాన్యులకు కూడా ఇంత అదృష్టము దక్కింది.


అక్కడ ముస్లిం సోదరుల సహాయము మేము మరిచిపోలేము. వారు మమ్ము చాలా బాగా చూశారు.  ఇంకా మా యాత్రకు సహాయము అందించిన ప్రతి ఒక్కరికి మా క్రుతజ్ఞతలు.



అమర్‌నాధ్ బాబా గుడి కనిపెట్టింది ఒక ముస్లిం సోదరుడు. అక్కడ గుడి దగ్గర షాప్స్ లో పూజా సామాగ్రి ముస్లిం సోదరులు కూడా అమ్ముతారు.
 
నాఉద్దేశ్యములో అమర్నాధ్ గుహ ను ఒక ముస్లిము సోదరుడు కనిపెట్టడము చూస్తే, భగవంతుడు అన్ని మతములవారు మంచిగా కలసి ఉండాలని సందేశము ఇచ్చాడేమో అనిపిస్తుంది.


ఇంకా సాయిబాబా కూడాఇదే చేప్పారు. అయ్యప్పస్వామికి వావర్ అనే పేరున్న ముస్లిం మిత్రుడు ఉన్నట్లు, వారి యొక్క గుడి శబరిమలలో ఉందంటారు. ఏసుప్రభువుకు, హిమాలయములలోని మహావతార్ బాబాజీకు స్నేహంఉందని ఈ మధ్య కొన్నిపుస్తకములలో వ్రాసారండి. .


పెద్దవాళ్ళు ఇలాచెప్తుంటే మనము ఎందుకు కొట్టుకోవాలి.మతమేదయినా భగవంతుడనే ఆ మహాపవర్ ను అందరు ఆరాధించొచ్చు.


అక్కడ ఒక ఆర్మీ అతను మా తెలుగు మాటలువిని,మీరు తెలుగు వాళ్ళా అని ఆప్యాయముగా అడిగాడు. ఏ రాష్ట్రము వాళ్ళయినా వాళ్ళు కుటుంబానికి దూరముగా సరిగ్గా తిండి,నిద్ర లేకుండా త్యాగము చేస్తున్నందువల్లే మనలాంటివాళ్ళము ఇలా ఉన్నాము.


పొలీసులది కూడా ఇలాంటి త్యాగమయిన ఉద్యోగమే. వీళ్ళందరూ ఎక్కువమంది మద్యతరగతి కుటుంబాలనుండే వస్తారు. నాకు అనిపిస్తుంది, కొంతమంది దేశాన్ని దోచుకొనే వాళ్ళు హాయిగా విలాసాలులో బ్రతుకుతున్నారు. ఇదంతా చాలాభాధగా ఉంటుంది. పేదరికం మన ప్రపంచము నుండి ఎప్పుడు పోతుందో..



  స్రుష్టిలో రకరకాల మనుష్యులు ఉన్నట్లే ఎన్నిమతములు ఉన్నా, అందరూ ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి.

ఆర్మీ వాళ్ళను చూసినప్పుడు వీళ్ళింతకష్టపడుతుంటే మనము ఇంట్లో టివి చూస్తూ ,బయట ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉంటాము కదా మనము అని సిగ్గనిపించింది. ఇక మతము విషయానికి వస్తే ఒకే మతములో వాళ్ళు కూడా గొడవలు పడతారు.

 ఈ ప్రపంచములో అంతా  ఒకే మతము  ఉండటము అనేది  ప్రస్తుతానికి  జరగని  పని.
 మతము  అనేది    అసలు   లేకుండా పోవటము   అనేది  ఎప్పటికీ  జరగనిపని.


అందుకని అందరము ఆనందముగా ఉండాలంటే ఒకరినొకరు గౌరవించుకోవటము ఒకటే మార్గము.మన యువత ప్రపంచాన్ని మంచిగామార్చాలి.


  భగవంతుడు అందరికి మంచి బుద్దిని కలిగించాలి.

Friday, November 26, 2010

మనం భగవంతుడిని విసిగిస్తున్నామా ?


అవునండి , ఒకోసారి నాకు ఇలాగే అనిపిస్తుంటుంది. మనము మన మనసును అదుపులో పెట్టుకోలేక అంతులేని కోరికలతో భగవంతుని ఇబ్బంది పెడుతున్నామేమో అని.

మనుష్యులకు కష్టాలు వారు పూర్వం చేసిన తప్పులవల్లనే వస్తాయి. మనం తప్పులు చేసి తీరా కష్టాలు వచ్చాక రక్షించమని భగవంతుని విసిగిస్తాము.


ఎట్లాగంటే ...పిల్లలు గనక తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినక తప్పులు చేసి తీరా ఇబ్బందుల్లో ఇరుక్కున్న తరువాత తల్లిదండ్రులను సహాయం అడుగుతారు. అప్పుడు వాళ్ళు నానా కష్టాలు పడి వారిని రక్షిస్తారు.


ఇక్కడ ఇంకోటి చెప్పాలి మీకు...... మనకు చాలాసార్లు డబ్బులు లేని పేదవారు ఎదురుపడి ఏదైనా దానం చెయ్యమని అడుగుతుంటారు. నాకు జాలి అనిపించి కొన్నిసార్లు దానం చేస్తూంటాను.


కానీ, ఒకసారి ఇలా అడిగినప్పుడు, నాకు చాలా చిరాకు అనిపించింది. అసలు వీళ్ళందరూ పనిచేయకుండా ఇలా విసిగిస్తుంటారు ఏమిటో అనిపించింది. 

( పని చేతనయిన వాళ్ళకి కూడా చేయటానికి ఈ రోజుల్లో పని దొరకటం లేదు లెండి. నాకు వేరే కారణాలవల్ల మనసు బాగోలేదండి అప్పుడు. మనసు చిరాగ్గా ఉన్నప్పుడు ప్రతిదీ విసుగ్గానే ఉంటుంది. తరువాత అలా చిరాకు పడినందుకు బాధపడ్డాను. )


సరే,........అలా అనిపించిన కాసేపటికి మళ్ళీ ఇలా అనిపించిందండి......... సహాయం చెయ్యమని అన్నందుకు వాళ్ళ గురించి మనసులో చిరాకు పడ్డావు. మరి నువ్వు చేస్తున్నదేమిటి ? చిన్న సమస్య రాగానే సహాయం కోసం దైవాన్ని అర్ధించటం లేదా ? అని నా మనసు నన్ను ప్రశ్నించినట్లు అనిపించిందండి.


ఇంకా, సహాయం చెయ్యమని అడిగిన వాళ్ళను చూసి నాకు చిరాకు అనిపించింది కదా....
రి మనం భగవంతుడిని ఇలా ఎన్నోసార్లు సహాయం అడుగుతూ విసిగిస్తున్నాము కదా....ది ఏం న్యాయం ? పాపం.. అనిపించిందండి.

అందుకే మన కష్టాలు పోవటానికి భగవంతుని వేడుకునే ముందు ఒక యోగ్యతను సంపాదించుకోవాలి.


అంటే ధ్యానం, తపస్సు, ఉపవాసం ద్వారా కొంచెం కష్టపడటం, లేక మన సంపదలో కొంత ఇతరులకు దానం చేయటం, విద్యాదానం, అన్నదానము, భక్తితో పూజలు, వ్రతములను చేయటం, దుష్ప్రవర్తన లేకుండట ............ ఇలా రకరకాల మార్గాల ద్వారా ఇతరులకు సహాయపడటం చేసినప్పుడు .......... మనం పూర్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అప్పుడు భగవంతుని వేడుకోవటానికి మనకు ఒక యోగ్యత వస్తుందని నాకు అనిపించిందండి.

మనం మన పాటికి సోమరితనంతో ఉంటూ భగవంతుడే అన్నీ సమకూర్చాలి అనుకోవటం ఏం న్యాయం ?


ఉదా...మన పిల్లలు వీడియో గేంస్ ఆడుకుంటూ మనల్ని హోంవర్క్ చెయ్యమన్నారనుకోండి, వాళ్ళ హోంవర్క్ మనం చేస్తూపోతే ..... తీరా పరీక్షలో వారేమి రాయగలరు ? అందుకని కష్టపడి చదవటం వాళ్ళకి తప్పనిసరి.


అయితే వాళ్ళకు హోంవర్క్ చెయ్యటములో మనం సహాయంచెయ్యవచ్చు. అలాగే మన పని మనం సరిగ్గా చేస్తూ, మనకు చేతకాని సమయంలో , లేదా పెద్ద కష్టం వచ్చినప్పుడు ..... దైవాన్ని సహాయం చెయ్యమని అడగటంలో తప్పులేదు. అంతేగానీ ప్రతిచిన్న సమస్యకు దైవాన్ని విసిగించటం బాగుండదు.


మన తల్లిదండ్రులు గాని, పిల్లలు గాని ఏదైనా పనిలో కష్టపడుతుంటే ఎంతో బాధపడతాము. అయ్యో వారు ఇంత పనిచేస్తున్నారే అని . వారి పనిని తగ్గించి వారిని సంతోషముగా ఉంచటానికి ప్రయత్నిస్తాము.


మరి భగవంతుడు మాత్రం మన బంధువు కాదా ? చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే. మనం భగవంతుని గురించి కూడా ఆలోచించవద్దా ?


అందుకని మనం మన తల్లిదండ్రులను, పిల్లలను వాళ్ళకు ఇష్టమయిన పనులు చేసి సంతోషపెట్టడానికి ఎలా ప్రయత్నిస్తామో , అలాగే, ......
నము మన అతి కోరికలను అదుపులో పెట్టుకుని , సత్ప్రవర్తనతో జీవించి మన జన్మజన్మల ఆత్మబంధువు అయిన  దైవానికి కూడా ఆనందాన్ని కలిగించాలి.

 


Wednesday, November 24, 2010

అమ్మవారు కనురెప్పలను అలా అన్నట్లుగా.....................

 

ఇది కొన్ని సంవత్సరముల క్రితం జరిగిన సంగతి అండి. సంవత్సరం ఎప్పుడన్నది సరిగ్గా గుర్తు లేదండి.

ఒక రోజు సాయంత్రం సుమారు 5 గంటలు ఆ సమయము అప్పుడు నేను అమ్మవారి గుడికి వెళ్ళటం జరిగిందండండి.


నేను మామూలుగా అమ్మవారి ముందు నిలబడి చూస్తున్నప్పుడు, ఉన్నట్లుండి ఆమె కనురెప్పలను ఒక్కసారి అలా అన్నట్లు అనిపించిందండి. అంటే కనురెప్పల కదలిక అనిపించిందండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది.


ఇది చూడటానికి చాలా సహజం... నిజంగా ఒక మనిషి రెప్పలు ఆడిస్తే ఎలా ఉంటుందో, అంత సహజంగా అనిపించిందండి. అప్పుడు నాకు చెప్పలేని ఆనందం కలిగిందండి. ( ఆ దృశ్యము అనుభూతి చెందటమే గాని వర్ణించటానికి నాకు కుదరటం లేదండి. )


అయితే నేను .... అది నా భ్రమ అనుకుని కొంచెంసేపు అక్కడ ఉండి ఇంటికి వచ్చేశానండి.

అయితే మరుసటి రోజు పేపరులో వార్త ఏమిటంటేనండి, ముందటి రోజున సాయంత్రం ఫలానా 5 గంటల సమయములో దేవాలయమునకు వెళ్ళినవాళ్ళు కొంతమంది అమ్మవారి కనురెప్పల కదలికను ...దర్శించిన అనుభూతి పొందినట్లుగా వార్తా సారాంశం.


నేను అది చదివి ఎంతో ఆశ్చర్య పడ్డాను. నేను మాత్రమే కాకుండా , మరికొంతమంది కూడా ఇలా భావించటం కాకతాళీయం ఎలా అవుతుంది ?

ఇలాంటి విషయాన్ని ఇంకెవరయినా చెబితే నేను కూడా ఒక పట్టాన నమ్మనేమో..... కానీ, నాకే జరిగింది కాబట్టి ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నానండి.

ఒకోసారి ఇలా జరుగుతూంటాయి.....

Monday, November 22, 2010

ప్లేగు జ్వరము నయమగుట.

 

ఈ విషయం శిరిడి శ్రీ సాయిబాబా జీవితచరిత్రము లో చెప్పబడినదండి.

ఒకానొకప్పుడు బాంద్రాలో నుండు బాబా భక్తుని కొమార్తె వేరొక గ్రామమున ప్లేగు జ్వరముతో బాధపడుచుండెను.

తనవద్ద ఊదీ లేదనియు, కనుక ఊదీ పంపుమనియు నానాసాహెబు చాందోర్కరు గారికి అతడు కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబుకు ఠాణా రైల్వేస్టేషను వద్ద తెలిసెను.

అప్పుడతడు భార్యతో కూడ 'కల్యాణ్' పోవుచుండెను. వారివద్ద అప్పుడు ఊదీ లేకుండెను. కావున రోడ్డు పైని మట్టిని కొంచెము తీసి, సాయి నామజపము చేసి, సహాయము నభ్యర్ధించి నానాసాహెబు తన భార్య నుదిటిపై రాసెను.

ఆ భక్తుడిదంతయు జూ చెను. అతడు తన కొమార్తె యింటికి పోవుసరికి మూడురోజులనుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబు తనభార్య నుదిటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గెనని విని మిక్కిలి సంతసించెను..
..

 

Friday, November 19, 2010

ఎవరింటికయినా వ్రతము చూడటానికి వెళ్ళినప్పుడు మధ్యలో వేరే పని వస్తే ఎలా...................... ..

 

ఒకోసారి మనకు కొన్ని ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. ఉదా...మనకు తెలిసినవారు మనల్ని వారు చేయబోయే పూజలకు, వ్రతములకు పిలుస్తుంటారు కదా !

ఉదా....సత్యన్నారాయణ స్వామి వారి వ్రతమునకు పిలిచారనుకోండి ! పూజకు వెళ్ళినా ఒక్కోసారి పూజ పూర్తి అయ్యేవరకూ ఉండటానికి మనకు కుదరకపోవచ్చు. మనకు పూజ మధ్యలో నుండి తప్పనిసరిగా వెళ్ళవలసిన పనులు ఉండవచ్చు.

అలాంటప్పుడు ఇలా ధర్మ సందేహాలు వస్తూంటాయి. ....ప్రసాదం తీసుకోకుండా మధ్యలో వెళ్తే ఏమవుతుందో అని. అలా అని వెళ్ళకపోతే మరి మన పనులు ఎలా ? అని......

పూజను స్వయముగా చేస్తున్న వాళ్ళు ఎలాగూ వీలయినంత నియమముగానే చేయటానికి ప్రయత్నిస్తారు. నియమముగా చేస్తే వాళ్ళకే ఎంతో మంచిది.


కానీ పూజను చూడటానికి వెళ్ళేవాళ్ళకు పూజ పూర్తి అయ్యే వరకూ ఉండాలంటే ఒకోసారి కుదరదు కదండి.

కుదిరితే , పూజ పూర్తి అయ్యేవరకూ ఉండి , తీర్ధ,ప్రసాదములు తీసుకుని రాగలిగితే ఎంతో అదృష్టము. కానీ కుదరనప్పుడు ఏమి చెయ్యాలి అన్నదే ఇక్కడ చెప్పుకుంటున్న సమస్య.


ఇలాంటప్పుడు ఏమి చెయ్యాలో తెలియక నేను రకరకములుగా అలోచిస్తూంటాను. ఈ విధముగా............

1. ప్రసాదం తీసుకోకుండా పూజ మధ్యలో వచ్చేయటం వల్ల ఏదైనా దోషం వస్తుందేమో ? అందుకే అసలు పూజకే వెళ్ళకుండా ఉంటే ఎలా ఉంటుంది ? ...అని.... ( పూజకు పిలిస్తే వెళ్ళకపోతే ఎలా .... ? అని ) మళ్ళీ..


2. దేవుని పూజకు పూర్తిగా వెళ్ళకుండా మానటం కంటే ..... మనకు వీలుకుదిరినంతవరకూ చూసి ఆ తరువాత భగవంతుని పైన భారం వేసి మన పనికి మనం వెళ్ళటం. ( దేవుని పూజ చూసే భాగ్యం కొద్దిసేపు దొరికినా అదృష్టమే కదా ! )

( దోషం గురించి అలోచించి దైవానికి దూరమవటం వివేకము అనిపించుకోదు. అలా చేసే కన్నా, దైవాన్నే నమ్ముకుని మనకు వీలయినంత వరకు పూజలో పాల్గొంటే, తరువాత అంతా దైవమే చూసుకోవటం జరుగుతుంది కదా ! )

ఇలా... రకరకాల ఆలోచనలతో ఏమి చెయ్యాలో అర్ధం కాదండి.

ఇలాంటప్పుడు పైన రెండు ఆలోచనలలో, నాకు రెండవదే మంచిదని అనిపించిందండి.

అయితే ఇలాంటప్పుడు ప్రసాదం తీసుకోకుండా వచ్చేశామే .... అని మనసు పీకుతుంది.

ఒకోసారి ఒక్కోసారి మనము అప్పుడే వేరే ఊరు వెళ్ళవలసి వస్తుందనుకోండి. మళ్ళీ వచ్చి అదే రోజు ప్రసాదం తీసుకోవటం కుదరదు,.


దీనికి నాకు ఇలా చేస్తే బాగుంటుంది అనిపించిందండి.

అక్కడ పూజ పూర్తి అయ్యే సమయాన్ని సుమారుగా లెక్కవేసుకుని మనము ఎక్కడ ఉన్నా, ఒకవేళ ప్రయాణములో ఉన్నా, అక్కడ దొరికే మామూలు నీటిని, ఆహారపదార్ధాన్ని తీర్ధము, ప్రసాదముగా భావించి దైవాన్ని స్మరించి , వాటిని ప్రసాదముగా తీసుకోవచ్చు.


ఆఖరికి ఏదీ దొరకకపోతే ఒక ఆకునైనా ప్రసాదముగా భావించి తీసుకోవచ్చు. దేనికైనా భావన ముఖ్యమని పెద్దలు చెబుతున్నారు కదండి. ( అలా అని పేరు తెలియని ఆకులు తినకూడదు లెండి. )


అలా పూజ పూర్తి అయ్యేవరకూ ఉండి , ప్రసాదము తీసుకుని వచ్చే సమయము లేనప్పుడు ఇలా చేయవచ్చని నాకు అనిపించిందండి.

ఇలాంటి సందర్భములలో ఏమి చెయ్యాలని శాస్త్రములో చెప్పారో నాకు తెలియదండి. నాకు పెద్ద పాండిత్యం లేదు. ఏదో నాకు తోచినంతవరకు ఆలోచనలు మీకు చెప్పుకోవటానికి ఇలా వ్రాస్తున్నానండి...


అయితే ఎవరయినా పూజలను చూడటానికి వెళ్ళినప్పుడు సాధ్యమయినంతవరకూ ఆ పూజ పూర్తి అయ్యేవరకూ ఉండి ప్రసాదం స్వీకరించటం వల్ల వారికి మంచి జరుగుతుందని అందరికి తెలిసిన విషయమే.

Wednesday, November 17, 2010

ఆడపిల్లలే పుట్టారని బాధపడవద్దు.

 

మనలో చాలా మంది మగపిల్లలు పుడితే చాలా సంతోషిస్తారు. అదే ఆడ పిల్లలు పుడితే చాలా బాధపడతారు. దీనివల్ల ఎన్నో కుటుంబాలలో సమస్యలు వస్తున్నాయి.

నాకు ఏమని అనిపిస్తుందంటేనండి , నాకు తెలిసినంతలో సీతాదేవికి తండ్రి అయిన జనకమహారాజు వారి సంతానం ఆడపిల్లలే కదా ! ( నేను చదివినంతలో వారికి పుత్రసంతానం ఉన్నట్లు ఎక్కడా చదవలేదండి మరి. )

జనకమహారాజు ఎంతో గొప్పవారు. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మియే వారికి కుమార్తెగా అవతరించటం జరిగింది. జనకులవారు భగవంతుని కృపను ఎంతగా పొందారో ఈ విషయాన్ని గమనిస్తే తెలుస్తోంది.


వ్యాసమహర్షి అంతటి వారే తన పుత్రుడైన శుకుడంతటి వారిని జనకులవారి వద్దకు పంపటం జరిగింది. జనకులవారు నిష్కామ కర్మ యోగిగా జీవించిన మహాత్ములని , అలా వారు భగవంతుని కృపకు ఎంతగానో పాత్రులయ్యారని, పెద్దలు చెబుతారు.

అందుకని పుత్రులు లేనివారు బాధపడవలసిన పనిలేదు.


అసలు ఎవరైనా, సంతానము లేనివారుకూడా భగవంతుని పుత్రునిగా, పుత్రికగా కూడా భావించవచ్చు. భావనలోనే ఎంతో ఉందని పెద్దలు చెబుతున్నారు..

కొంతమంది పుత్రులవల్లనే పున్నామ నరకం తప్పుతుందని అనుకుంటూ, కుటుంబములలో కలతలు సృష్టించుకుంటున్నారు.

ఎవరికైనా వారి ప్రవర్తన ఆధారంగానే భగవంతుని దయ ఉంటుంది కానీ, వారికి సంతానమున్నదా ? ఉంటే ఆడపిల్లలా ? మగపిల్లలా ? ఇలాంటి వాటి పైన ఆధారపడి మాత్రమే భగవంతుని దయ, స్వర్గం, నరకం ఇత్యాదులు ఉండవు.....

ధర్మమును, భక్తిని కలిగినంతలోనే భగవంతుడు ఎందరినో అనుగ్రహించిన కధలు ఎన్నో మనకు తెలుసు. పుత్రులు లేనివారిని, అసలు సంతానమే లేనివారిని కూడా ఆ భగవంతుడు తప్పక అనుగ్రహిస్తారు..