koodali

Wednesday, December 1, 2010

నేటి వస్తూత్పత్తి చదువులు.......

 

ఆ మధ్యన నేను ఊరు వెళ్ళాను కదండి. ఎక్కడ చూసినా మురికి,మురికి . వర్షం వస్తే ఇక చెప్పనే అక్కరలేదు. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్స్, పారేసిన సామాను, డబ్బాలు, ఎలక్ట్రానిక్ వేస్ట్ సామాను.


మా చిన్నతనములో మా తాతగారి పల్లెటూరు వెళితే అక్కడ పేదవారి గుడిసె ముందు కూడా శుభ్రంగా కళ్ళాపి జల్లి చక్కగా ముగ్గు వేసి ఉండేది. రోడ్ల పైన ఇలా వాడిపారేసిన సామాన్లు ఉండేవి కాదు.


అంటే మరి, ఇప్పుడంటే యంత్రాలు కనిపెట్టి విపరీతంగా వస్తువులను తయారుచేసి ప్రపంచముపై గుట్టలు పోస్తున్నారు. కానీ,...........
అప్పటికి ప్రపంచం పారిశ్రామికంగా ఇంత అభివృద్ధి చెందలేదు లెండి


ఈ రోజుల్లో చదువు అంటే కూడా అర్ధం మారిపోయింది కదా ! ఇప్పుడు చదువు అంటే ఎన్నిరకాలుగా క్రొత్తవస్తువులను తయారుచేయవచ్చో నేర్చుకోవటమే కదా !

అసలు ఇప్పుడు మనం బ్రతికేదే కొత్త వస్తువులను కొనుక్కోవటానికి, దానికోసం డబ్బు సంపాదించటానికీను. ఆ వస్తువులతో శరీరానికి పనిలేకుండా సుఖంగా ఉండటానికీను.


శరీరానికి శ్రమ తగ్గించాలన్న ఆలోచనతో జీవితములో విపరీతముగా శ్రమిస్తున్నారు. ఉదా...చూడండి.......పిల్లలను పుట్టగానే స్కూల్లో వేసేస్తున్నారు. ఇక బడిలో వేయగానే ప్రొద్దున నుండి రాత్రి వరకూ చదువు పేరుతో రాచిరంపాన పెట్టడము.


ఇక ఉద్యోగములో చేరాక టార్గెట్ ల గోలతో ప్రొద్దున్న నుండి అర్ధరాత్రి వరకూ పని,పని.

ఇక రిటైర్ అవుతారు. అప్పటికి ఇంటినిండా వస్తువులు, డబ్బు ఉన్నా, ఆరోగ్యమే ఉండదు. జరిగిపోయిన జీవితములో ఏమీ ఎంజాయ్ చెయ్యలేదన్న బాధతో , అనారోగ్యముతో, హాస్పిటల్ కే జీవితం అంకితం చచ్చేవరకూ. ఇదీ నేటి జీవితం.


ఇక చాలా కుటుంబములు ఇవ్వాళ ఎలా ఉన్నాయంటే, భార్యాభర్తలు చెరొక దగ్గర ఉద్యోగం, పిల్లలు ఎక్కడో హాస్టల్స్ లో.

ఇదే కుటుంబము అంటే. అదేమిటంటే, ........ ఈ రోజుల్లో అభివృధ్ధి చెందాలంటే ఇవన్నీ తప్పవు కదండీ,,,, అంటారు. నాకు అర్ధము కానిది ఒకటే అసలు అభివృద్ధి అంటే ఏమిటి ? అని......


అసలు విషయం మనకు కోరికలు ఎక్కువ అయిపోయినాయి. అసలు ఇన్ని కొత్త వస్తువులు తయారుచేయటం అవసరమా ?

ఎప్పుడైనా సూర్యతుఫాన్ లాంటిది వచ్చి ఈ సదుపాయములు అన్నీ ఫెయిల్ అయితే అప్పుడు మన పనులు మనం చేసుకోవటానికి శరీరావయములు సహకరిస్తాయా ?


( భవిష్యత్తులో సూర్య గోళముపైన తుఫాన్లు రాబోతున్నాయని వాటివల్ల శాటిలైట్ సిస్టంస్ ఫెయిల్ అయ్యి , ఫోన్స్, ఇంటర్నెట్ వగైరాలు అన్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని ఆధునిక శాస్త్రవేత్తలే చెబుతున్నారు,. )

అంతవరకూ ఎందుకు ........ శరీరమును శ్రమ పెట్టకుండా ముద్దు,ముద్దుగా గారాబం చేస్తే మనకే అనారోగ్యం వస్తుందని వైద్యులు చెబుతున్నారు కదా.......... 



కొత్తవస్తువులను కనిపెడుతున్న కొద్దీ వాటిని అందుకోవాలనే కోరికతో జనం జీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. వాటిని కొనటానికి కావాలిసిన డబ్బు సంపాదించటానికే జీవితకాలం సరిపోవటం లేదు. ఇక సుఖం, సంతోషం ఎక్కడ ?


మనకన్నా పాత కాలం వాళ్ళే నింపాదిగా, ప్రశాంతముగా బ్రతికారు అనిపిస్తోందండి. వారికి ఇన్ని కోరికలు లేవు.


అభివృధ్ధి, అభివృధ్ధి అని మనం చెప్పుకుని సంబరపడటమే కానీ, ప్రపంచములో పేదరికం, ఆకలి కేకలు అలాగే ఉన్నాయి. అప్పుడూ వరదలూ, భూకంపాలు , అగ్నిపర్వతాలు బ్రద్దలవటాలు ఉన్నాయి.......ఇప్పుడూ అవన్నీ అలాగే ఉన్నాయి.

పాత సమస్యలు తొలగకపోగా ఎలక్ట్రానిక్ వ్యర్ధములు, ప్లాస్టిక్ చెత్త , గ్లోబల్ వార్మింగ్ లాంటి కొత్త సమస్యలు వచ్చాయి ఈ అభివృధ్ధి వల్ల .


అంగారకుని మీదకు వెళ్ళిపోతున్నాము అంటున్నారు.  మంచిదే, కాని ఈ చెత్త సమస్యలను ఎవరు సాల్వ్ చేస్తారు ?


క్రొత్తవస్తువులను మనకు ఎంత వరకు అవసరమో అంతవరకే వాడుకోవాలి గాని, అవి మన మనుగడకే ఆటంకం కాకూడదు కదా .

 

2 comments:

  1. "అసలు ఇప్పుడు మనం బ్రతికేదే కొత్త వస్తువులను కొనుక్కోవటానికి, దానికోసం డబ్బు సంపాదించటానికీను. ఆ వస్తువులతో శరీరానికి పనిలేకుండా సుఖంగా ఉండటానికీను."

    చాలా బాగా చెప్పారు.

    ReplyDelete
  2. ఇప్పుడే చూశానండి మీ కామెంట్. మీ అభిప్రాయము తెలిపినందుకు చాలా కృతజ్ఞతలండి.

    ReplyDelete