koodali

Thursday, September 5, 2024

కర్నూల్లో వచ్చిన అప్పటి వరద...

 

కర్నూల్లో పెద్ద వరద వచ్చినప్పుడు మేము ఉద్యోగరీత్యా కర్నూల్ లో ఉండేవాళ్లం. సడన్ గా వరదనీరు పెరిగి కర్నూల్ మునిగిపోతుందంటూ వార్తలు వచ్చాయి. 

 డ్యాం సామర్ధ్యం కన్నా ఎక్కువ నీరు వస్తోంది కాబట్టి, ఇంకో కొన్ని గంటలు గడిస్తే తప్ప కర్నూలు ఏమవుతుందో ఏమీ చెప్పలేము..తాటిచెట్టు అంత ఎత్తు నీళ్ళు ఊళ్ళోకి వస్తోందంటూ..వార్తలు వచ్చాయి. 

 ఈ వార్తలు విన్న ప్రజలు కొందరు,  వేరే ఊర్లలోని బంధువుల వద్దకు వెళ్లారు. కొందరు వేరే ఊళ్ళలోని హోటల్ రూంస్ తీసుకుని ఉన్నారు. బాగా ట్రాఫిక్ జాం కూడా  అయ్యి,   వెళ్లలేక చాలామంది తిరిగి వచ్చేసారన్నారు.

 వర్షాలు తగ్గితే తప్ప ఏమీ చెయ్యలేము...అనే పరిస్థితి. భయాందోళనతో దైవాన్ని స్మరించుకున్నాము. దైవం దయ వల్ల డ్యాంకు ఏమీ కాలేదు.

వరదద్వారా వచ్చిన బురద తీయటం చాలా కష్టమయ్యింది.  
మా ఇల్లు ఎత్తుగా ఉంది  కాబట్టి, మాకు వరదనీరు రాలేదు.

 మా ఇంటిచుట్టుపక్కవాళ్ళం కొందరం కలిసి వరదబాధితుల వద్దకు వెళ్ళి కొన్ని పులిహోర పొట్లాలు ఇచ్చాము.  నేను
కొద్దిమందికి.. అన్నం, కొబ్బరిపచ్చడి, టమేటో పప్పు, వంకాయ కూర.. పేపర్ ప్లేట్లలో పెట్టి  ..ఇవ్వటం జరిగింది. 


 అప్పుడు చాలామంది రోడ్లపైన నడుచుకుంటూ వెళ్ళారు. వరదబాధితులకు చాలామంది ఇతరప్రాంతాల వారు సహాయం చేసారు. దైవం దయవల్ల
డ్యాముకు ఏమీకాలేదు..కర్నూల్ కు భారీ ముప్పు జరగలేదు.

************ 

మనదేశంలో అనేకరాష్ట్రాలలో పెద్దడ్యాములు ఉన్నాయి...వాన పెరిగితే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. 

గతకొద్దిరోజులుగా విజయవాడ ప్రకాశం బ్యారెజ్ గురించి, వానలు పెరిగితే బ్యారేజ్ నీటిమట్టం పెరుగుతుంది కాబట్టి,  ఆ ప్రవాహాన్ని బ్యారేజ్ తట్టుకుంటుందా? లేదా?  బ్యారేజ్  కు ఏదో ప్రమాదం జరిగిపోతుందంటూ ..వార్తలు వచ్చాయి. 

 ఇలాంటప్పుడు ఎవరికైనా ఎంతో భయాందోళనలు కలుగుతాయి. ప్రజలు పానిక్ అవుతారు.   ఇలాంటివార్తలు విన్నప్పుడు.. డ్యాంల,  బ్యారేజీల భద్రత ఎంత? అనే సందేహాలు ,భయాందోళనలు కలుగుతున్నాయి. ఎవరైనా కుట్రలు చేసినా చాలా ప్రమాదం.

   ఏమైనా జరిగితే  ఆ వినాశనాన్ని ఊహించగలమా? ఇవన్నీ గమనిస్తే, భారీ డ్యాములు నిర్మించటం కన్నా, చిన్నడ్యాములు నిర్మిస్తే మంచిదనిపిస్తుంది. 

 ఏ కారణం చేతైనా భారీ డ్యాములు నిర్మిస్తే, ఆ డ్యాములకు ఎక్కువ నీరు వచ్చినా ప్రమాదం జరగకుండా ..ముందు జాగ్రత్తలు తీసుకుని నిర్మించాలి. ఒక పెద్ద డ్యాము కన్నా, రెండు లేక మూడు చిన్న డ్యాంలలో( రిజర్వాయర్లలో ) నీటిని నిల్వ చేసుకుంటే మంచిదనిపిస్తుంది.

 *************

 ప్రతిఊరిలో చెరువులను పద్ధతిగా ఉంచుకోవాలి. కాలువలను చక్కగా ఉంచుకోవాలి. చెక్ డ్యాములు నిర్మించుకోవాలి. ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలి. డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి.

 

No comments:

Post a Comment