శ్రీ వేంకటేశ్వరస్వామికి సమర్పించే పదార్ధాలలో వాడే ఆవునేతిలో కల్తీ జరిగిందని అంటున్నారు. ఇలా కల్తీ చేయటం మహాపరాధం.
దైవానికి సమర్పించే పదార్ధాలలో కల్తీ చేసే వారు, దైవం పట్లకానీ, సాటి జీవులపట్ల కానీ అధర్మం చేసినవారు దైవన్యాయస్థానం నుంచి తప్పించుకోలేరు.
*************
ఆవునేతిని వేరే సంస్థల నుంచి కొనటం కాకుండా, దేవస్థానం నిర్వాహకులు ఆవులను పెంచి, పాలను సేకరించి, నేతిని తీసి వాడవచ్చు.
పశుగ్రాసం కొరకు కొంత భూమిని కొని (దేవాలయ భూములు కూడా ఉంటాయి ..) చక్కగా పశువులను పెంచితే, స్వచ్చమైన నేయి లభిస్తుంది. ఆ నెయ్యి మిగిలితే ఇతర దేవాలయాలకు కూడా సరఫరా చేయవచ్చు.
లేదంటే, జాగ్రత్తగా పరీక్షించి..కల్తీ చేయని వారి వద్ద నుండి నేతిని తీసుకోవచ్చు.
***********
దేవాలయాలకు కొందరు గోవులను దానం చేస్తారు. అయితే, గోవులను పోషించటానికి, వాటిని చక్కగా చూసుకోవడానికి సరైన వ్యవస్థ ఉండాలి. అందుకు చాలా ధనం అవసరం. గోవులను చక్కగా చూసుకునే మనుషులు కూడా ఉండాలి.
*************
ఇంకొక విషయమేమిటంటే, హిందుధర్మాన్ని నమ్మిన హిందువులే దేవస్థానాల వద్ద పనిచేయాలి. హిందుధర్మాన్ని నమ్మని వారిని దేవస్థానాలలో నియమించటం ఏమిటో అర్ధం కాదు.
అయితే, కొందరు హిందువులు కూడా పాపభీతి లేకుండా, దేవాలయాల వద్ద అధర్మంగా ప్రవర్తించటం వార్తల ద్వారా తెలుస్తుంది. ఇలాంటి వారిని కూడా దేవాలయాల పనుల నుండి దూరంగా ఉంచాలి.
*************
సహజంగా పశువులు ఆరుబయట తిరుగుతూ మేత మేస్తాయి. పాతకాలంలో ఆవులను పెంచేవారు కూడా, మేత మేయడానికి వాటిని పచ్చికబయళ్లకు తీసుకువెళ్ళేవారని తెలుస్తుంది.
ఈ రోజుల్లో చాలాచోట్ల గోవులను ఒక దగ్గర కట్టేసి మేత వేసి పెంచుతున్నారు.
గోవులు మేతకు వెళ్లి తిరిగివచ్చే సమయాన్ని గోధూళి సమయంగా చెబుతారు. ఆ సమయం విలువైనదని ప్రాచీనులు తెలియజేసారు.
నాకు ఆవుల పెంపకం గురించి సరిగ్గా తెలియదు. నాకు తెలిసినంతలో, ఈ మధ్యకాలంలో ఆవులను, గేదెలను పెంచేవారు ..అవి ఉండే స్థలంలో నేలను సిమెంటుతో చేయిస్తున్నారట. అలా సిమెంట్ నేలపై పడుకోవటం అనేది వాటికి కష్టంగా ఉంటుందట.
మూగజీవులు వాటి బాధలను చెప్పలేవు కదా.. మనుషులు ఆలోచించి వాటికి ఎలా సౌకర్యంగా ఉంటుందో అలా ఏర్పాటు చేయాలి.
***************
ఆవులు పవిత్రమైనవి, ఆవులను పూజించాలి..అని చెబుతారు . కానీ, ఈ రోజుల్లో పాలు, నెయ్యి వాడేవారిలో... ఎంతమంది గోవులను చక్కగా పెంచి, వాటి పాలను, నేతిని వాడుతున్నారు?
అందరూ ఆవులను చక్కగా చూసేవాళ్లయితే, ఆవులు ఆహారం కొరకు రోడ్లపై ఎందుకు తిరుగుతాయి? కబేళాలకు అన్ని పశువులు ఎందుకు తీసుకుపోబడతాయి?
పెద్ద వయస్సు వచ్చిన ఆవుల పేడను ఎరువుగా చేసి మొక్కలకు వేయవచ్చు.
***********
పాతరోజుల్లో తిరుమలకు ఎందరు భక్తులు వచ్చేవారో తెలియదు కానీ, రవాణావసతులు పెరిగిన ఈ రోజుల్లో రోజూ వేలమంది తిరుమలకు వస్తున్నారు. ఎక్కువమంది దైవదర్శనానికి రావటం మంచిదే. అయితే, అంతమందికి లడ్డూలను ఇవ్వాలంటే, వేల కిలోల నెయ్యి అవసరమవుతుందట.
స్వచ్ఛమైన నెయ్యి బోలెడు లభించటం
కష్టమనుకుంటే, తిరుమలలో దైవానికి స్వచ్ఛమైన నేతితో కొన్ని లడ్డూలను
నివేదించి, తీపిబూందీని కూడా దైవానికి నివేదించి, భక్తులకు చిన్న లడ్డును
లేక తీపిబూంది వంటివి ప్రసాదంగా ఇవ్వవచ్చు. పాతకాలంలో తిరుమలలో తీపిబూందీని
కూడా ప్రసాదంగా ఇచ్చేవారని అంటున్నారు.
గుడినుంచి తెచ్చిన లడ్డు వంటి ప్రసాదాన్ని.. చాలామందికి కొద్దిగా పంచాలన్నా కష్టమే.
బోలెడు ప్రసాదం తయారీకి బోలెడు నెయ్యి ..అవసరమవుతుంది. అందువల్ల, ఎక్కువమందికి ఇవ్వాలంటే కొద్దిగా ఇస్తే సరిపోతుంది.
**********
దైవమే దిక్కు.
మనుషులు దైవభక్తి కలిగి.. ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తే దైవకృపను పొందగలరు.