koodali

Sunday, August 27, 2023

జాతకాలు..కొన్ని నమ్మకాలు..

 

పాతకాలంలో కొందరికి బిడ్దలు జన్మించినప్పుడు,  ఆ బిడ్దల వల్ల తల్లితండ్రికి దోషం.. అని చెబితే ఆ చిన్నపిల్లలను తిట్టేవారట. అలా చేయటం చాలా పాపం.ఎవరు చేసిన కర్మల ప్రకారమే వారి జాతకాలు ఉంటాయి, వారి కర్మల ప్రకారమే బిడ్దలు కూడా జన్మిస్తారు. తమ గతకర్మ ప్రకారం బిడ్దలు జన్మిస్తే ఆ బిడ్డల తప్పు ఏముంటుంది? 

జాతకంలో దోషాలు ఉంటే మంచిపనులు చేసి దోషాలు తగ్గించుకోవాలి. అంతేకానీ, పసిబిడ్దలను తిట్టడం ఇంకో ఘోరమైన పాపం. 

జాతకాలు చూడటంలో ఎన్నో విధానాలు ఉంటాయి. బిడ్ద కడుపులోపడ్ద సమయం ఎవరూ చెప్పలేరు. బయటకు వచ్చాక బొడ్దుత్రాడు కత్తిరించిన తరువాతా, ముందా, ఊపిరిపీల్చిన సమయమా..ఇలా ఎన్నో ఉన్నాయి. 

ఈ రోజుల్లో కొన్ని పంచాంగాలలో ఒకే ఊరికి సంబంధించిన తిధినక్షత్రాల సమయాలలో కూడా చాలా తేడాలు ఉంటున్నాయి. అలాంటప్పుడు జాతకం సరిగ్గా ఎలా తెలుస్తుంది?  ఈ విషయాల గురించి గతంలో బ్లాగులో వ్రాయటం జరిగింది. 

 నాకు ఏమనిపిస్తుందంటే, మనం దైవభక్తి కలిగి ఉండి, సత్ప్రవర్తనతో ఉండటమే  చాలా సమస్యలకు పరిష్కారం.

సతీసావిత్రి, మార్కండేయుల వారు తమ జీవితాలను మార్చుకోగలిగారు. 

 ..........................

ఇక , ఆడపిల్లలు మెచూర్ అయిన సమయాన్ని బట్టి భవిష్యత్తు  చెప్పటం గురించి నాకు ఏమనిపిస్తుందంటే, అసలు మొదటిసారి రజస్వల ఎప్పుడు జరుగుతుందో చెప్పలేము. మొదటిసారి కొద్దిగా కనిపించి కనిపించనట్లు జరిగి ఎవరూ గమనించకపోవచ్చు. ఆ సమయాన్ని ఎలా తెలుసుకోగలం? అందువల్ల అలాంటి వాటికి భయపడనవసరం లేదు.  

మనం మొదట గమనించిన సమయమే మొదటిది కాకపోవచ్చు. రుతుస్రావం మొదట రిలిజ్ అయిన సమయమే అసలైన సమయం. . అయితే, మొదటి బిందువు ఏ సమయంలో వచ్చిందో చెప్పటం కష్టం.

కొందరిలో బహిష్టుకు సుమారు ఒకరోజు ముందు కూడా ఆరెంజ్ రంగులో స్రావం కనిపిస్తుంది. దాన్నిబట్టి కూడా రజస్వల ప్రారంభమయ్యిందని అనుకోవాలా? ఇవన్నీ సందేహాలే.

 అందువల్ల, మనం మొదట గమనించిన సమయాన్ని పట్టుకుని, ఆ అమ్మాయి భవిష్యత్తు అలా ఉంటుంది..ఇలా ఉంటుంది..అని చెప్పటం ఎంతవరకు సరైనది?

 కొన్ని సమయాలలో రజస్వల అయితే, ఆ అమ్మాయి భవిష్యత్తులో విధవ అవుతుందని, ఇంకా ఏదేదో అవుతుందని భయంకరంగా పుస్తకాల్లో రాస్తే, ఆ అమ్మాయి, అమ్మాయి తల్లితండ్రి, వారిని వివాహం చేసుకున్నవాళ్ళు చాలా బాధపడతారు. ఇంట్లో గొడవలు కూడా రావచ్చు. సరిగ్గా తెలియని విషయాల గురించి ఏదేదో చెప్పి  జీవితాలను గందరగోళం చేయటం సరైనది కాదు.

జాతకం ఎలా ఉన్నా, దైవభక్తి కలిగి దైవస్మరణ చేయటం..సత్ప్రవర్తనతో జీవించటానికి ప్రయత్నించటం..కష్టాలలో ఉన్న జీవులకు సాయం చేయటం..చేస్తూఉంటే కష్టాలు తగ్గే అవకాశం ఉంటుంది.

................................

 పాతకాలంలో శూద్రులు జాతకాలపొంతన అంత పట్టించుకునేవారు కాదు. అప్పట్లో చాలామందికి జన్మసమయమే సరిగ్గా చూసేవారు కాదు. ఇప్పుడు సోషల్మీడియా వచ్చాక జాతకాల పొంతన వంటివి చెప్పటం వల్ల అందరూ చూస్తున్నారు.

 కొన్నిసార్లు జాతకాలు కలవలేదని ఇష్టమయిన సంబంధాలను కూడా వదులుకోవలసి వస్తోంది. కొందరి విషయంలో జాతకాలు బాగా కలిసాయని వివాహం చేసుకున్నా కూడా,  గొడవలుపడటం, విడిపోవటం జరుగుతోంది. 

సూర్యోదయం ఊరిని బట్టి మారుతుంది. కొన్ని పంచాంగాల్లో ఒకే ఊరిలో కూడా నక్షత్రం సమయం విషయంలో గంట కూడా తేడా ఉంటోంది. ఆ సమయంలో జన్మించిన వారిది ఏ నక్షత్రం అనుకోవాలో? నక్షత్రమే మారినప్పుడు వివాహపొంతన, తారాబలం సరిగ్గా ఎలా కుదురుతుంది? ఆ సమయంలో ముహూర్తం పెడితే ఫలితం ఎలా ఉంటుందో? తెలియదు. 

 konni links..

 * జాతకంలో రాసిపెట్టి ఉన్నది అనుభవించక తప్పదా ?

 * జాతకాలు విషయంలో నాకు కలిగిన కొన్ని సందేహాలు....

 

2 comments:

  1. >> కొన్ని పంచాంగాలలో ఒకే ఊరికి సంబంధించిన తిధినక్షత్రాల సమయాలలో కూడా చాలా తేడాలు ఉంటున్నాయి. ఇక జాతకం ఎలా సరిగ్గా చెప్పగలరు?

    ఇంకా కొందరు రకరకాలకరణగ్రంథాల ఆధారంగా బీజసంస్కారాలు చేయకుండానే గణితం చేయటం వలనా దృక్సిధ్ధాంతం ప్రకారం కాకుండా తాతలనాటినుండి ఇలాగే చేస్తున్నాం అంటూ పాతపధ్ధతిలో చేయటం వలనా వారు చేసే పంచాంగాలు తప్పులతడకలు అవుతున్నాయి. ఐనా ఈరూజుల్లో ఋక్షాద్యంతాలు చూసుకుంటూ జాతకగణితం ఎవరూ చేయటం లేదు లెండి. దానికి తోడు సవాలక్షరకాలుగా ఆయనాంశను లెక్కిస్తున్నారు లాహిరీ, రామన్, కృష్ణమూర్తి ఇంకా రకరకాలు. ఇకపోతే వీరు సరైన సమయాలకే జన్మసమయం లెక్కిస్తున్నారా? తత్సంబంధమైన సంస్కారాలు చేసి సరిచూసుకుంటున్నారా? అలాంటిదేమీ లేదే! ఐనా ఇంకా వాటి మంచిచెడ్డలను ఎలా చెప్పేదీ?

    ReplyDelete
  2. మీకు ధన్యవాదములండి.

    ReplyDelete