koodali

Wednesday, November 4, 2020

కొన్ని విషయములు.. కలశజలాన్ని నేలపై ..ఆహారంలో వెండ్రుకలు కనిపిస్తే..

 

దేవాలయాలలో పూజలు, హోమాలు జరిగినప్పుడు పూజ తరువాత కలశంలోజలాన్ని  భక్తుల శిరస్సులపై చల్లుతారు. 

అలాంటప్పుడు ఆ మంత్రజలం నేలపై పడి  ప్రజలు ఆ నీటిని త్రొక్కడం కూడా జరుగుతుంది. 

పవిత్రంగా భావించే కలశజలాన్ని అలా నేలపై విచ్చలవిడిగా పడేటట్లు చల్లటం మంచిది కాదు.

 పూజ తరువాత అందరూ తీర్ధ ప్రసాదాలు తీసుకుంటారు. తీర్ధం ఇచ్చే దగ్గర  నేలపై చిన్న పట్టా వేసి, పైన స్టూల్ వేసి, దానిపైన కలశం పెట్టి.. తీర్ధం తీసుకోవడానికి వచ్చే భక్తుల శిరస్సులపై  కలశ జలాన్ని ఆకుతో కొద్దిగా చిలకరిస్తే సరిపోతుంది.

ఒక పంతులు గారు  కలశం వద్ద ఉండి,  ఒకటి లేక రెండు మామిడాకులతో ఒక్కొక్క భక్తునిపై  కలశజలాన్ని చిలకరించవచ్చు.  ఇంకొక పంతులుగారు తీర్ధాన్ని ఇవ్వవచ్చు.

 అప్పుడు నేలపై కలశజలం పడటం.. భక్తులు త్రొక్కటం.. అంతగా జరగదు. కొద్దిపాటి జలం పడినా అంతవరకూ తుడిచేస్తే సరిపోతుంది.

*********

వంట చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  ఆహారంలో వెంట్రుకలు కనిపిస్తే మంచిది కాదు. 

దైవానికి నివేదించే పదార్ధాలలో వెంట్రుకలు  కనిపిస్తే ఆ పదార్ధాన్ని దైవానికి నివేదించకూడదు. 

కష్టపడి వంట చేసిన తరువాత వెంట్రుకలు కనిపిస్తే ఎంతో బాధగా ఉంటుంది. 

బంధువులెవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారికి వడ్డించిన భోజనంలో వెంట్రుకలు  కనిపిస్తే బాగోదు కదా..

వంట చేసేటప్పుడు   తలకు కాప్ ధరిస్తే మంచిది.  

ఇంట్లో వంట చేసేటప్పుడు స్త్రీలు జుట్టును పైకి మడిచి కట్టుకుని కాప్  పెట్టుకుంటే సులభంగా ఉంటుంది.

 పెద్ద పెద్ద హోటల్స్ లో వంటచేసే వాళ్ళు(చెఫ్ లు)ధరించే పెద్ద కాప్  ధరించాలంటే అందరికీ కుదరకపోవచ్చు. 

చిన్నగా ఉండే షవర్ కాప్  బాగుంటుంది. ఇది 100 రూపాయలకే లభిస్తుంది. చెవులు కూడా కవర్ చేస్తుంది. ఈ ప్లాస్టిక్ కాప్ ను శుభ్రం చేయటం తేలిక.

వెంట్రుకలు, గోళ్ళు .. ఆహారం ద్వారా కడుపులోకి వెళ్తే అనారోగ్యం వచ్చే అవకాశాలు  ఎక్కువగా ఉన్నాయట.

 జుట్టుకు నూనె రాసి జడ వేసుకుంటే వెండ్రుకలు ఎగిరిపడే అవకాశం తక్కువ. జుత్తు విరబోసుకున్నప్పుడు లేక తలస్నానం చేసి, జుట్టు ఆరటానికి వదిలేసినప్పుడు వెంట్రుకలు రాలిపడే అవకాశాలు ఎక్కువ.

ఇంట్లో వంట చేసేటప్పుడు స్త్రీలు రోజూ కాప్ పెట్టుకోవటం కష్టం అనుకుంటే .. తలస్నానం చేసినప్పుడు జుట్టు వదులుగా ఉండేలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని  కాప్ ధరించవచ్చు. కాప్ ధరించనప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది.

 వండిన గిన్నెలపై మూతలు పెట్టకుండా నేలపై ఉంచితే.. నేలపై ఉన్న వెండ్రుకలు వచ్చి ఆహారపదార్ధంపై పడే అవకాశం ఉంది. అలా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

 తలపైనుంచి రాలిపడే వెండ్రుకలు దుస్తులపై ఉండి, వంట చేసేటప్పుడు ఆ  వెంట్రుకలు  ఆహారంలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా కాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. 

నోటి నుండి తుంపరలు పడకుండా నోటికి మాస్క్ కూడా ధరించవచ్చు.

************

పెద్దవయస్సు వారికి చాలామందికి నిద్ర సరిగ్గా  రాదు.రాత్రి అందరూ నిద్ర పోతుంటే తమకు నిద్ర రావటం లేదని బాధపడుతూ కూర్చుంటారు. నిద్ర బిళ్ళలు వేసుకుంటారు కొందరు. 

నిద్ర త్వరగా రావటానికి ఆయుర్వేద చిట్కాలు చెబుతున్నారు కొందరు.ఇంటర్నెట్ ద్వారా కూడా ఈ చిట్కాలను తెలుసుకోవచ్చు.

నిద్ర పట్టనప్పుడు.. కూర్చుని కాని, పడుకుని కానీ కన్నులు  మూసుకొని  దైవస్మరణ.. ధ్యానం చేస్తే పుణ్యం వస్తుంది. నిద్రకూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నిద్ర రాకపోయినా ..ధ్యానం వల్ల శరీరానికి, మనస్సుకు చాలా విశ్రాంతి లభిస్తుంది.

అయితే, డీప్ మెడిటేషన్ , ప్రాణాయామం వంటివి   తెలిసిన వారి వద్ద నేర్చుకుని ఆచరించటం మంచిది. 

 దైవస్మరణ, దైవస్తోత్రాలు, భక్తిపాటలు మొదలైనవి మెల్లగా  ఎంతసేపైనా చక్కగా అనుకోవచ్చు. 

************
  ఇక, దైవం యొక్క చిత్రాలను ఎక్కడపడితే అక్కడ ప్రింట్ వేసి, తరువాత చెత్త కుప్పలలో పడవేస్తున్నారు. ఇలా చేయటం సరైనది కాదు.

న్యూస్ పేపర్లలోనూ, హారతి కర్పూరం పాకెట్ పైనా, ఇంకా అనేక చోట్ల దైవ చిత్రాలను ముద్రించటం.. తరువాత ఆ పేపర్లను, ప్లాస్టిక్ కవర్లను చెత్తలో వేయటం జరుగుతోంది. 
 ఈ విషయాన్ని ఈ బ్లాగ్ మొదలుపెట్టిన కొత్తలోనే వ్రాయటం జరిగింది. 



   విషయాలను ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా .. ఆచరణ సరిగ్గా ఉంటేనే ప్రయోజనం కలుగుతుంది.


10 comments:


  1. ఆయుర్వేదంలో అశ్వగంధను పెన్నేరు అంటారు. పేరులేని జబ్బుకు కూడా పెన్నేరు చక్కని మందుగా పనికివస్తుందని అంటారు. కొరోనా వైరస్ కు అశ్వగంధ పని చేస్తుందని కొన్ని వార్తలు వచ్చాయి.

    రోగనిరోధకశక్తి పెరగటానికి అశ్వగంధ, త్రిఫల, తిప్పతీగ..వంటివి వైద్యుల సలహాతో వాడుకోవచ్చు.

    చాలామంది ఆయుర్వేద మందులు వాడుకుని రోగనిరోధకశక్తిని పొందారు. ఇప్పుడు రెండోసారి కొరోనా వార్తలు వస్తున్న నేపధ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

    కరోనా వంటివి రాకుండా ఉండటానికి, వస్తే తరువాత సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండటానికి ఎంత డోసేజ్, ఎన్ని రోజులు ఏ విధంగా ..మందులు వాడాలో ఆయుర్వేద వైద్యులు సలహాలను ఇస్తే బాగుంటుంది.

    కోరోనా సోకి అల్లోపతి మందులు వాడేవాళ్ళు.. అశ్వగంధ వంటివి వాడాలంటే ఎలా వాడాలి? అనే సందేహాలుంటే ఆయుర్వేదవైద్యులను సంప్రదించి వాడుకోవాలి.

    రోగాలు వ్యాపించకుండా ఉండాలంటే పర్యావరణాన్ని కలుషితం చేయకుండా ఉండటం..వంటివి కూడా చేయాలి.

    ReplyDelete
    Replies

    1. anrdJanuary 2, 2021 at 1:28 PM

      నాకు తెలిసినంతలో.. అల్లోపతి, ఆయుర్వేదం.. ఒకేసారి వాడుకోవచ్చు.

      అయితే, వైద్యులను కూడా సంప్రదించి వాడుకోవటం మంచిది.

      రెండూ ఒకేసారి వాడేటప్పుడు డోసేజ్ విషయంలో వైద్యుల సలహా ప్రకారం వాడుకోవటం మంచిది.
      ********
      నాకు తెలిసినంతలో పేషెంటుకు మారే రోగలక్షణాలను బట్టి మందులను మార్చే పద్ధతి కూడా ఉంటుంది.

      అలాంటప్పుడు ఆయుర్వేదం, హోమియో, అల్లోపతి అన్నీ కలిపి వాడితే ఏ మందుల వల్ల రోగ లక్షణాలు మారుతున్నాయో తెలియకపోవచ్చు.

      అందువల్ల , వేరే మందులను వాడుతున్నప్పుడు వైద్యులకు ఆ విషయం చెప్పటం మంచిది.

      Delete

    2. anrdFebruary 13, 2021 at 6:52 PM

      ఈ రోజుల్లో చాలామందికి రకరకాల అనారోగ్యాలు వస్తున్నాయి.
      ఎండ సరిగ్గా తగలకపోవటం, జీవితంలో ఎక్కువ ఒత్తిడి, పర్యావరణ కాలుష్యం, హానికరమైన పురుగుమందులు వాడి పెంచిన ఆహారపదార్దాలు తినటం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవటం..వంటి అనేక కారణాల వల్ల అనారోగ్యాలు కలుగుతున్నాయి.

      పాతకాలంలో స్త్రీలు ఎక్కువగా బయటకు వెళ్ళకపోయినా, ఇంటి వద్ద ఎక్కువ స్థలం ఉండేది. దుస్తులు ఉతకటం, గిన్నెలు శుభ్రం చేసుకోవటం..వంటి పనులు ఆరుబయట పెరట్లో చేసేవారు. అందువల్ల నడవటం ద్వారా వ్యాయామం జరిగేది.. ఆరుబయట పనుల వల్ల సూర్యరశ్మి కూడా తగిలేది.ఇప్పుడు గిన్నెలు శుభ్రం చేయటం, దుస్తులు ఉతకటం వంటి పనులు..ఇంట్లోనే జరుగుతున్నాయి.

      పాతకాలంలో మగవారు కూడా ఆరుబయట పనులు చేసుకునేవారు. ఎక్కువగా నడవటం కూడా ఉండేది. ఇప్పుడు తలుపులు మూసిన గదులలోనే ఎక్కువగా పనులు చేస్తున్నారు. వీటన్నింటివలన సూర్యరశ్మి తగలకపోవటం, శరీరానికి వ్యాయామం ఉండకపోవటం జరుగుతోంది.

      దైవభక్తి, ఎక్కువ కోరికలు లేకుండా తృప్తిగా టెన్షన్ లేకుండా జీవించటం, కల్తీలు లేని చక్కటి ఆహారం తినటం, తగినంత వ్యాయామం, తగినంత సూర్యరశ్మి తగలటం, సరైన నిద్ర ..వంటి వాటిని పాటిస్తే అనారోగ్యాలు అంతగా రావు.
      ...........

      మనస్సు ధృఢంగా ఉంటే కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. మనస్సు బలహీనమయితే చిన్న కష్టానికే తట్టుకోలేని పరిస్థితి రావచ్చు. అందువల్ల మానసికంగా బలంగా ఉండాలి.

      కొన్నిసార్లు మానసికంగా బలంగా ఉండాలనుకున్నా ఉండలేరు. అదొక వ్యాధి. మానసిక ఆరోగ్యానికి కూడా మందులు ఉంటాయి. వాటిని వైద్యుల సలహాతో వాడుకోవచ్చు. అయితే, కొన్ని సార్లు ఎక్కువగా మందులు వాడే పరిస్థితి ఉండకపోవచ్చు.

      మనస్సు గజిబిజిగా ఉన్నప్పుడు ..పచ్చటి ప్రకృతిలో ఆహ్లాదంగా గడపటం, చక్కటి పనిలో నిమగ్నమవటం, కష్టాలలో ఉన్నవారికి సహాయం చేసి వారి సంతోషాన్ని చూసి సంతోషించటం, విద్య తెలిసిన గురువు ద్వారా ధ్యానం, ప్రాణాయామం నేర్చుకుని ఆచరించటం....ఇలా ఎన్నో మార్గాల ద్వారా మనస్సును కుదుటపరచుకోవచ్చు.

      ఇంకా, సంగీతాన్ని వినటం, దైవభక్తి పాటలు వినటం ద్వారా.. మనస్సును కుదుటపరుచుకోవచ్చు.

      Delete

    3. anrdMarch 12, 2021 at 2:55 PM

      ఆయుర్వేదం, హోమియోపతి, అల్లోపతి..దేని ప్రత్యేకతలు దానికున్నాయి. ఆయుర్వేదంలో ఎన్నో గొప్ప చికిత్సా విధానాలు ఉన్నాయి. అయితే, ఎన్నో ఆయుర్వేద గ్రంధాలను మనం పోగొట్టుకున్నాము. అయినా ఇప్పటికీ ఎన్నో విషయాలు తెలిసినవారున్నారు.

      ఈ మధ్య కాలంలో కూడా డాక్టర్ ఏల్చూరి గారు ఎన్నో విషయాలను తెలియజేసారు.
      డా..చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు, డా..పెద్ది రమాదేవి గారు, ప్రకృతి విధానంలో డాక్టర్ మంతెన గారు, డాక్టర్ మధుబాబు గారు, డాక్టర్ ఖాదర్ వలీ గారు, డాక్టర్ రామచంద్ర గారు, డాక్టర్ పద్మ గారు..వంటి ఎందరో ఎన్నో చక్కటి విషయాలను తెలియజేస్తున్నారు.

      ఇక్కడ అందరి పేర్లు వ్రాయలేకపోయినా ఇంకా ఎందరో గొప్పవారు ఉన్నారు.

      డాక్టర్ రామచంద్ర గారు, డాక్టర్ పద్మ గారు ఎన్నో చక్కటి విషయాలను తెలియజేస్తున్నారు. సహజ జీవన విధానం, మంచి ఆహారవిధానం ద్వారా ఎన్నో వ్యాధులను తగ్గించుకోవచ్చని తెలియజేస్తున్నారు. జ్యూసులు త్రాగటం మంచిదని తెలియజేస్తున్నారు. పుదీనా, కొత్తిమీర జ్యూసులతో పాటు వాము ఆకు జ్యూస్ కూడా త్రాగవచ్చని నాకు అనిపించింది.

      ఏమైనా తినకముందు ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు.. ఒక 15 నిమిషాలు తడివస్త్రాన్ని( పలుచని టవల్) కడుపు పైన వేసుకోవటం ద్వారా ఎన్నో సమస్యలు తగ్గే అవకాశం ఉందంటున్నారు.

      Delete

  2. పై విషయాలను విన్నతరువాత నాకు ఒక ఆలోచన కలిగింది.

    ఈ రోజుల్లో చాలామంది సెల్ఫోన్లు, కంప్యూటర్లు ఎక్కువగా చూడటం వల్ల...తలనొప్పి, కండ్లు నొప్పి..వంటి సమస్యలతో బాధలు పడుతున్నారు. అందువల్ల కండ్లు మూసుకుని నుదురు, కళ్ళ పైన తడివస్త్రం వేసుకుని 15 నిమిషాలు పడుకుంటే ఉపశమనం కలుగుతుందని అనిపిస్తోంది. కళ్ళు రిలాక్స్ అవుతాయి.

    అయితే, కళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలంటే సెల్ఫోన్లు, కంప్యూటర్ ఎక్కువగా చూడటాన్ని కూడా తగ్గించుకోవాలి.

    (తడివస్త్రం కప్పే విధానాన్ని ఎన్ని రోజులు చేయాలి? రోజూ చేసినా ఫరవాలేదా? అనే విషయాలు నాకు సరిగ్గా తెలియదు. వైద్యులను సంప్రదించి వాడుకోవటం మంచిది.)

    కళ్ళు మూసుకుని ఒక పెద్ద కర్చీఫ్ ను చన్నీటితో తడిపి నుదురు, కండ్లు కవర్ అయ్యేలా కప్పుకోవాలి. అయితే.. ఫ్రిజ్ లోని చల్లటి నీటితో గాని, వేడినీటితో కానీ వస్త్రాన్ని తడపకూడదు. మామూలు నీటితో కర్చీఫ్ ను తడపాలి.

    నుదిటిపైన దేవుని బొట్టు ప్రక్కకు వెళ్తుందని అనుకుంటే.. తడివస్త్రం తీసివేసిన తరువాత దేవుని బొట్టును మరల ధరించవచ్చు.

    ReplyDelete
    Replies

    1. నాకు చిన్నతనంలో టాన్సిల్స్ వల్ల గొంతునొప్పి సమస్యలు ఉండేవి. మందులు వాడినా తగ్గకపోవటం వల్ల, 7వ తరగతి వేసవి సెలవులలో టాన్సిల్స్ ఆపరేషన్ చేయించాలని మా పెద్దవాళ్ళు అనుకున్నారు.

      ఇంతలో ఒక హోమియో డాక్టర్ గారు పరిచయమయ్యి, హోమియో మందులు వాడి చూడమని చెప్పి మందులు ఇచ్చారు. టాన్సిల్స్ సమస్య తగ్గిపోయింది. ఇప్పటివరకూ మళ్ళీ సమస్య రాలేదు.

      నాకు 10వ తరగతి పరీక్షలు తరువాత కామెర్లు( జాండిస్) సమస్య వచ్చింది. చేతివేళ్ళగోళ్ళు కూడా కొంచెం పచ్చగా అయి, పరిస్థితి ప్రమాదకరం గా ఉందన్నారు. అప్పుడు ఒక ఆయుర్వేదం డాక్టర్ గారి వద్ద మందులు వాడగా వ్యాధి తగ్గింది.

      కొంతకాలం తర్వాత నాకు గర్భసంచికి చిన్న ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఒక అల్లోపతి డాక్టర్ గారు ఆపరేషన్ చేసారు. ఆపరేషన్ చేసే సమయాల్లో మత్తుమందు ఇవ్వటం, పేషెంట్ బలహీనంగా ఉంటే సెలైన్ ఇవ్వటం వంటివి అవసరం. అల్లోపతి వైద్యంలో ఇలాంటివి ఉన్నాయి.

      నాకు వ్యాధులు తక్కువగా వచ్చాయి. అంతా దైవం దయ.దైవానికి అనేక కృతజ్ఞతలు.

      ఆయుర్వేదం, అల్లోపతి, హోమియోపతి వైద్యాలలో ..దేని ప్రత్యేకత దానిదే.
      ...
      అల్లోపతిలో కొన్ని మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి.

      అయితే, ఎవరికైనా సడన్ గా యాక్సిడెంట్స్ జరిగిన సంఘటనలు విని ఉంటాము. అప్పుడు వారికి ఎమర్జన్సీ ట్రేట్మెంట్ అవసరం. ఇలాంటప్పుడు అప్పటికప్పుడు వైద్యం కోసం అల్లోపతి ఉపయోగపడుతుంది.

      పాతకాలంలో యుద్ధాలు జరిగే సమయాల్లో ఎందరో సైనికులు గాయపడేవారు. వారికి వైద్యం ఉండేది. ఆయుర్వేదంలో సర్జరీ గురించి వివరాలెన్నో ఉన్నాయని ప్రాచీన గ్రంధాలద్వారా తెలుస్తుంది.

      ఇంకా మనకు తెలిసిన, తెలియని వైద్యాలెన్నో ఉన్నాయి. ఉదా..ప్రాణిక్ హీలింగ్, రేకి, పిరమిడ్ థెరపి, ఆక్యుప్రెషర్..ఇలాంటివెన్నో ఉన్నాయి.

      వేదములు ఎంతో పవిత్రమైనవి.ఆయుర్వేదం వేదాలలో భాగమే.
      ...............

      అనారోగ్యం తగ్గటానికి మందులు వాడుతున్నప్పుడు..మందులు వాడటంతోపాటు ఆహారవిహారాల్లో సరైన నియమాలను కూడా పాటించవలసి ఉంటుంది.

      కొందరు ఎంత డబ్బు ఖర్చుపెట్టి వైద్యం చేయించుకుంటున్నా కూడా వ్యాధి ఒక పట్టాన తగ్గదు.
      గతంలో చేసిన పాపకర్మల ఫలితంగా కూడా వ్యాధులు వచ్చి బాధలు కలుగుతాయంటారు.

      ఏ విషయానికైనా దైవకృప అవసరం. మందులు సరిగ్గా పనిచేసి అనారోగ్యం తగ్గాలన్నా.. దైవకృప ఎంతో అవసరం.
      దైవాన్ని నమ్మి వ్యాధులను తగ్గించుకున్న వారు ఎందరో ఉంటారు.

      Delete

    2. అయితే, కళ్ళపైన తడిబట్టను వేసుకునేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ క్లాథ్ ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతికి ఆరబెట్టుకోవాలి.

      శుభ్రంగా లేని క్లాథ్ ను కళ్ళపైన వేస్తే ఆ బట్టకు ఉన్న మురికి వల్ల కళ్ళకు వ్యాధులు వచ్చే అవకాశముంది.

      Delete

  3. కాళ్ళు నొప్పిగా ఉన్నప్పుడు నాకు తెలిసిన ఒక చిట్కా..

    ఎక్కువసేపు నడిచినప్పుడు కాళ్ళు నొప్పులు వస్తే ఒక బకెట్లో గోరువెచ్చటి నీరు పోసి అందులో పాదాలు మునిగేలా కాళ్ళు ఉంచితే రిలాక్స్ గా ఉంటుంది. అయితే నీరు మరీ వేడిలేకుండా చూసుకోవాలి.

    ఇలా ఎన్నో వైద్యవిధానాల ద్వారా అనారోగ్యాలను తగ్గించుకోవచ్చు.

    జీవితంలో దైవభక్తి, ధర్మాచరణ..ఉండేలా చూసుకోవాలి.దైవాన్ని ప్రార్ధించుకోవాలి.

    ReplyDelete
    Replies

    1. కొందరు పడుకున్నప్పుడు నుదుటిపైన చేతిని పెట్టుకుంటారు. ఇలా నుదుటిపైన చేతిని పెట్టి పడుకుంటే చేతి బరువు తలపై పడుతుంది.

      ఈ అలవాటు మానుకోకుంటే తరువాత ..తల నొప్పి, తలతిరగటం..వంటివి వచ్చే అవకాశం ఉంది.

      కొందరు పడుకున్నప్పుడు టీవీ చూస్తూ టీవీ కనిపించటం లేదని తలక్రింద బాగా ఎత్తుగా దిండు పైన ఇంకో దిండును కానీ, చేతిని కానీ పెట్టుకుంటారు.

      ఇలా ఇష్టం వచ్చినట్లు పడుకోవటం వల్ల మెడ వద్ద నొప్పులు రావటం, కళ్ళు నొప్పి రావటం, తల త్రిప్పటం..వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి.

      Delete

  4. కుటుంబాలలో సమస్యలు తీరటానికి దైవభక్తి, ధర్మాచరణ వల్ల క్రమంగా కష్టాలు తీరే అవకాశం ఉంది.

    అంతేకానీ..కష్టాలు పోవటానికి, కోరికలు తీరటానికి.. మూఢనమ్మకాలతో కూడిన కార్యక్రమాల జోలికి వెళ్ళటం మంచిది కాదు. సమాజంలో మూఢనమ్మకాలు పెంచేవిధంగా సలహాలను ఇచ్చేవారిని కూడా ప్రోత్సహించకూడదు.

    ReplyDelete