koodali

Tuesday, May 1, 2018

జీవితంలో చివరికి ఏం మిగులుతోంది ?



మే డే గురించి చాలామందికి తెలుసు. కొన్ని సంవత్సరాల క్రిందట, శ్రమదోపిడి, సరైన విరామం లేని వరుస పనిగంటలకు వ్యతిరేకంగా పోరాటం జరిపి కొన్ని హక్కులను సాధించుకున్నారు. 


అయితే, యంత్రాల వినియోగం బాగా పెరిగిన ఈ రోజుల్లో కూడా శ్రమదోపిడి, సరైన విరామం లేని వరుస పనిగంటల విధానాలు చాలా చోట్ల ఉంటూనే ఉన్నాయి.  

............................................

ఈ రోజుల్లో కూడా  చాలామందికి  పనిచేసే సమయం , ని వత్తిడి బాగా పెరిగింది . 


పిల్లలు చిన్నతనం నుంచి విపరీతంగా చదవవలసి వస్తోంది. ఉద్యోగం చేస్తున్నవారు విపరీతంగా పనిచేయవలసి వస్తోంది. 



ఐటీలో పనిచేసే ఉద్యోగస్తులు కొన్నిసార్లు  రాత్రి కూడా పనిచేయవలసి వస్తుంది. రాత్రి డ్యూటీకి వెళ్తే ఉదయం  ఇంటికి వచ్చి ఏదో  కొంత  తిని నిద్రపోవలసివస్తుంది. పగలంతా పడుకుని,  సాయంత్రం నిద్రలేచి మళ్లీ రాత్రి డ్యూటీకి  వెళ్ళాలి. 



 వీళ్ళు  కొన్నిసార్లు  ఒకటిన్నర రోజు వరసగా పనిచేయవలసి వస్తుంది. 


 వైద్య విద్యార్ధులలో పీజీ చేసే వాళ్ల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంటుంది.


 నర్సులకు  కూడా వరసగా నెలరోజులు నైట్ డ్యూటీ ఉండే  పరిస్థితి ఉంటుంది. ఇలాంటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి ? కుటుంబాన్ని ఎలా చూసుకుంటారు?


 పిల్లలను ఇంట్లోనో,  పొరుగింట్లోనో   వదిలి  తల్లులు రాత్రి డ్యూటీకి వచ్చేయాల్సి ఉంటుంది. ఇక, రాత్రంతా డ్యూటీ చేసి ఉదయం  ఇంటికి వెళ్ళి  పిల్లల బాగోగులు సరిగ్గా చూసుకోగలరా?


వైద్యవృత్తిలోకి  రావటానికి చాలామంది ఉత్సాహపడుతున్నారు. కొందరు విదేశాలకు వెళ్లి బోలెడు డబ్బు ఖర్చు  చేసి కూడా చదువుకుంటున్నారు. అలాంటప్పుడు దేశంలోని  వైద్యకళాశాలల్లో సీట్లు పెంచవచ్చు కదా!


వైద్యులు, నర్సులు ఎక్కువసంఖ్యలో ఉంటే , ఉన్నవాళ్ళకు పనిభారం తగ్గుతుంది. వైద్యకళాశాలల్లో ఫీజులు కొంత పెంచినా కూడా ఫరవాలేదు.


ఇక , పారిశుధ్య కార్మికులు,  మేము ఆ మధ్య ఊరు వెళ్లి వస్తుంటే రాత్రి సమయంలో కొందరు మహిళా పారిశుధ్య ఉద్యోగులు రోడ్లు శుభ్రం చేస్తున్నారు.  
 

 ( సైనికులు, పోలీసులు..వీళ్ళ పరిస్థితి చెప్పనవసరం లేదు. అయితే, సైనికులు, పోలీసులు..వీళ్ళ పరిస్థితి  పాతకాలంలో కూడా కష్టమే. 


అయితే, ఆధునిక కాలంలో  సైనికుల సంఖ్యను  తగ్గించి, వారి స్థానంలో  రోబోట్లను నియమించే పరిస్థితి భవిష్యత్తులో వస్తుందని కొందరు అంటున్నారు.   )


 మైనింగ్, రవాణా రంగం..వంటి ఎన్నో రంగాలలో కూడా  ఎంతో పని ఉంటుంది. 


ఇవన్నీ చూస్తుంటే ఇప్పటికన్నా పాతరోజులే నయమనిపిస్తోంది. అప్పట్లో జనాలు అందరూ ఇంతలా కష్టపడే పరిస్థితి ఉండేది కాదు.


పాతకాలంలో కనీసం స్త్రీలన్నా ఇంటిపట్టున ఉండి ఇంటిబాధ్యత, పిల్లల బాధ్యత  వంటివి.. చూసుకునేవారు. ఈ రోజుల్లో స్త్రీలు కూడా సంపాదించవలసి వస్తోంది.


ఈ రోజుల్లో  ప్రజల ఆలోచనాధోరణిలో వచ్చిన మార్పులు, వస్తువుల ధరలు విపరీతంగా పెరగటంవంటి ఎన్నో కారణాల వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది.



ఈ రోజుల్లో అనేక సంస్థలలో  ఇద్దరు పనిచేయవలసిన చోట ఒకరిని నియమించి సరిపెట్టేస్తున్నారు...ఎక్కువమంది ఉద్యోగస్తులను నియమించుకోవాలి.


 ఒకరికే 60 వేలు జీతం  ఇవ్వటం కన్నా , ఒక్కొక్కరికి 30 వేలు ఇచ్చి ఇద్దరిని నియమిస్తే నిరుద్యోగ సమస్య తగ్గుతుంది, ఉద్యోగుల్లో పని వత్తిడి తగ్గి , పనిలో నాణ్యత పెరిగి,  సంస్థకు లాభాలు పెరుగుతాయి. 
 

ఇక, ధరలు తగ్గితే తక్కువ జీతమైనా సరిపోతుంది.  ధరలు తగ్గే విధంగా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి.


మరీ తక్కువ జీతాలు ఉన్నవాళ్ళకు జీతాలు పెంచాలి.


 ఉద్యోగస్తుల జీతాలు పెరిగాయని వ్యాపారస్తులు ధరలు పెంచటం, ధరలు పెరిగాయని చెప్పి ఉద్యోగస్తులు  మరల  జీతాలు పెంచమనటం,  ..ఇలాంటి పరిస్థితిలో పేదవారు అధిక ధరలతో ఎలా బతకాలి?
 

 ప్రజలు కూడా చాలామంది  డబ్బు సంపాదన లో పడి  తమ ఆరోగ్యాలను , కుటుంబసభ్యుల ఆరోగ్యాలను పణంగా పెడుతున్నారు.


డబ్బుసంపాదనే జీవితం కాదు కదా! ప్రజలు కూడా ఎక్కువ వస్తువులు కొనాలనే  మోజు తగ్గించుకోవాలి.


పాతకాలంలో చాలామంది  జీవితాలు టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండేవి. సాయంత్రం అయితే పిల్లలు కలిసి ఆడుకోవటం జరిగేది. 


ఆరుబయట ఆడుకోవటం, రాత్రి పూట  ఆకాశంలో మబ్బుల వెనుక దోబూచులాడుతున్న చందమామను చూడటం, నక్షత్రాలను చూడటం... ఇలాంటివి ఇప్పటి పిల్లలకు తెలుసా? 


ఎంతసేపూ పోటీ తప్ప ఏమీ ఉండటం లేదు.  ఈ పోటీలను తట్టుకోలేని కొందరు పిల్లలు, పెద్దవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 


ఎందుకో తెలియని పరుగు తప్ప జీవితంలో చివరికి ఏం మిగులుతోంది?




No comments:

Post a Comment