శ్రీ లలితా పూజా విధానము పుస్తకము నుండి ...
సంకలనము
డాక్టర్ జి.ఎల్.ఎన్.శాస్త్రి.
శీతాద్రి శిఖరాన
శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు
మాతల్లి లత్తుకకు నీరాజనం-
నిండైన నీరాజనం - భక్తి మెండైన నీరాజనం.
యోగీంద్ర హృదయాల మ్రోగేటి మాతల్లి
బాగైన అందెలకు నీరాజనం
బంగారు నీరాజనం - భక్తి పొంగారు నీరాజనం.
నెలతాల్పుడెందాన వలపు వీణలు మీటు
మాతల్లి గాజులకు నీరాజనం
రాగాల నీరాజనం - భక్తి తాళాల నీరాజనం
మనుజాళి హృదయాల తిమిరాలు కరగించు
మాతల్లి నవ్వులకు నీరాజనం
ముత్యాల నీరాజనం - భక్తి నృత్యాల నీరాజనం.
చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు
మాతల్లి ముంగెరకు నీరాజనం
రతనాల నీరాజనం - భక్తి జతనాల నీరాజనం.
పసిబిడ్డలనుచేసి ప్రజనెల్ల పాలించు
మాతల్లి చూపులకు నీరాజనం
అనురాగ నీరాజనం - భక్తి కనరాగ నీరాజనం.
దహరాన కనిపించు ఇనబింబమనిపించు
మాతల్లి కుంకుమకు నీరాజనం
కెంపైన నీరాజనం - భక్తి పెంపైన నీరాజనం.
తేటిపిల్లలవోలె గాలి కల్లలలాడు
మాతల్లి కురులకు నీరాజనం
నీలాల నీరాజనం - భక్తి భావాల నీరాజనం.
జగదేక మోహినీ సర్వేశదేహినీ
మాతల్లి రూపులకు నీరాజనం
నిలువెత్తు నీరాజనం - భక్తి విలువెత్తు నీరాజనం.
No comments:
Post a Comment