koodali

Monday, November 24, 2014

రామాయణం గురించి కొందరి విమర్శలు, నా అభిప్రాయాలు..

 ఇక్కడ నేను వ్రాసిన విషయాలు.. ఒకామె వ్రాసిన పుస్తకంలోని విషయాలకు నా సమాధానాలు. ఆమె పేరు రంగనాయకమ్మ అనుకుంటా..?
 
 ఈ విషయాలలో అంతరార్ధాలు చాలా ఉంటాయి.  అయితే, ఈ రోజుల్లో సామాన్యంగా అర్ధం అయ్యేలా వ్రాయటం జరిగింది.
 
 వాళ్ళ  అభిప్రాయాలు..అబలను ఎలా దుఃఖాల పాలు చేయాలి? ఏ ఆడదాని ముక్కైనా కోసేసుకో. ఏ ఆడదాని పైనైనా బాణం వేయి. ఒక రకంగా చూస్తే స్త్రీని ఏడ్పించడంతోనే రాముని వీరత్వం మొదలయింది. దానితోనే ముగిసింది కూడా.

anrd..స్త్రీ  అయినంత మాత్రాన  ఎంత తప్పు చేసినా  శిక్షించకుండా  వదిలేయాలా?  తాటకి వంటి రాక్షసిని  వధించటంలో ఎటువంటి తప్పూ  లేదు. శూర్పణఖ  రామలక్ష్మణులను  మోహించి  వెంటపడింది.  సీతాదేవిని  మ్రింగివేయబోయింది.  అలాంటి  శూర్పణఖ  ముక్కుచెవులు  కోయటంలో తప్పేమీ  లేదు. తప్పుచేసినవాళ్ళు  స్త్రీలైనా  పురుషులైనా  శిక్షార్హులే.
.....................

వాళ్ళ  అభిప్రాయాలు..ప్రజలు ఏక కంఠంతో సీతను రాజ్యం నుండి బహిష్కరించమని అన్నారే అనుకో, అప్పుడు రాముని కర్తవ్యమేమిటి? మహారాణి నిర్దోషి అనీ, అగ్ని పరీక్షలో ఉత్తీర్ణురాలయిందనీ, ఆయనకు తెలిసినప్పుడు ప్రపంచం ఏమంటే ఏం? తన న్యాయం పైన గట్టిగా నిలబడి ఉండాలి కదా?

anrd.. సీతమ్మవారు మహాత్ములు కాబట్టి అగ్నిపరీక్ష వారికి ఆపద కలిగించలేదు. అన్ని కష్టాలు అనుభవించి, అగ్నిపరీక్ష అనంతరం తిరిగి వచ్చి భార్యాభర్తలు సంతోషంగా ఉంటే , వారిపై  నింద  వేయటం జరిగింది.

 సీత  యొక్క  పాతివ్రత్యం  గురించి  రామునికి  తెలుసు. అయితే, లోకులు  నోటికి  ఏది వస్తే  అది  అంటారు.  లోకుల బుద్ధి  తెలిసే  రాముడు  సీతకు  అగ్నిపరీక్ష  చేయించి  అయోధ్యకు  తీసుకువచ్చాడు. అయినా  తప్పుపట్టారు. ఎన్నోవిధాలుగా  ఆలోచించి   సీతను  అడవులకు  పంపించవలసివచ్చింది. 


 సీతమ్మను అడవులకు పంపించటం విషయంలో  గమనించవలసినది ఏమంటే , ఆ పామరుడు అలా అన్న తరువాత  రాములవారు భార్యను అడవులకు పంపించారు. 


( ఒక వ్యక్తి  యొక్క  భార్య  పరపురుషుని  ఇంటి  వద్ద  కొన్నాళ్ళు  ఉండివచ్చింది. అప్పుడు  ఆ వ్యక్తి  తన  భార్యను  నమ్మలేక  తాను  భార్యను  ఏలుకోలేను  అన్నాడు. అప్పుడు రాముని  ప్రసక్తి తీసుకువచ్చాడు .)



ఇంకొక విషయాన్ని గమనించితే, సీతాదేవిని తిరిగి అయోధ్యకు తీసుకురమ్మని అప్పటి ప్రజలు రాముని ప్రాధేయపడినట్లు అనిపించటం లేదు..

ఈ విషయాన్ని గమనించితే, అప్పటి ప్రజలలో చాలామందికి రాముడు సీతాదేవిని ఏలుకోవటం నచ్చలేదేమో ? అనే సందేహం వస్తోంది.

 సీతాదేవిని అడవులకు పంపారని శ్రీ రాముని తప్పుపడుతున్నారు కొందరు.

 సీతాదేవిని ఏలుకున్నందుకు కూడా శ్రీ రాముని తప్పుపట్టారు  కొందరు. 

కొందరు లోకులు తమకు ఏది తోస్తే అది అంటారు.

ఎన్నో కారణాలు, ఎందరో చర్యల వల్ల సీతారాములు కష్టాలను అనుభవించారు.

సీతారాములు అవతారమూర్తులు.  

సీతారాములు  అయోధ్యకు తిరిగి వచ్చి  అన్యోన్యంగా ఉండటం అనేది సీతారాముల విషయంలో సరైనది. 

అయితే, మనుషుల విషయంలో అందరూ గొప్పవారు ఉండరు కదా!

 రకరకాల మనస్తత్వాలు గల స్త్రీలు, పురుషులు ఉంటారు. అనేక రకాల పరిస్థితులు ఉంటాయి. 

అలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని...

 భవిష్యత్తులో దీనిపైన వాదోపవాదములు, అనవసర చర్చలు, అపార్ధములు రాకుండాను, ఒక్కోసారి కొంతమంది అవకాశవాదులు తమ చెడ్డపనులకు ఇలాంటి సంఘటనను తమకు అనుకూలంగా మలచుకుని అధర్మానికి పాల్పడకుండాను, ఇన్ని ఆలోచించి ప్రజల క్షేమం కొరకు సీతారాములు తమ జీవితాలను, సంతోషాలను త్యాగం చేసి ఉండవచ్చు.

 సీతాదేవి  అంటే  మహాపతివ్రత.  లక్ష్మీదేవి అంశావతారం.  అందరు  ఆడవాళ్ళూ  సీత వంటి గొప్పవారు కాదుకదా ! 


ఈ రోజుల్లో  కొందరు  ఆడవాళ్ళు  ఏమంటున్నారంటే, మగవాళ్ళు  పరస్త్రీలతో  తిరిగితే  తప్పులేనప్పుడు, తాము  పరపురుషులతో  తిరిగితే  తప్పేమిటని  ప్రశ్నిస్తున్నారు.


 పురుషులు  పరస్త్రీలతో  తిరగటమే  తప్పు అనుకుంటుంటే, ఆ విషయాన్ని  ప్రశ్నించటం  వదిలి.. తామూ  తిరుగుతామని  కొందరు  స్త్రీలు  అనటం న్యాయం  కాదుకదా ! 


 ఇలాంటి వాళ్ళు కూడా సమాజంలో ఉన్నప్పుడు, ధర్మసంకటం ఏర్పడినప్పుడు  ఎలాంటి నిర్ణయం  తీసుకోవాలి  అనే  విషయంలో  ఎన్నో  ఆలోచించవలసి  ఉంటుంది . 

 ఇవన్నీ  కూడా ఆలోచించి  పెద్దలు  త్యాగాలు  చేసి ఉండవచ్చు. 


 సీతారాములకు  ఒకరంటే  ఒకరికి  అపారమైన  ప్రేమ. సీతను  అడవికి  పంపించిన  తరువాత   రాముడు మళ్లీ  వివాహం  చేసుకోకుండా, రాజ్యాన్ని  పాలిస్తున్నా కూడా రాజభోగాలను, పట్టుపానుపులను వదిలి  దర్భలపై  శయనిస్తూ  ఒక రుషిలా  జీవించాడు. 


 అశ్వమేధయాగ సమయంలో భార్య స్థానంలో సీతాదేవి స్వర్ణప్రతిమను ఉంచి సీతాదేవే తన భార్య అని లోకానికి తెలియజేశాడు రాముడు.


ఒకవేళ  సీతాదేవి  తిరిగి  అయోధ్యకు వెళితే  మళ్ళీ  ఎవరైనా  వ్యక్తులు తమ  ఇష్టం  వచ్చినట్లు  వ్యాఖ్యానించరని  గ్యారంటీ  లేదు  కదా! అప్పుడు  సమస్య  మళ్ళీ  మొదలవుతుంది. ఇవన్నీ  ఆలోచించి సీతాదేవి  లవకుశులను రామునికి  అప్పగించి  తాను  భూప్రవేశం  చేసి ఉంటుంది.


సీతాదేవి  భూప్రవేశం  ఎంతో  బాధాకరమైన  విషయం. తన  భార్యను  తాను ఏలుకోలేని  పరిస్థితి  రామునిది  తన  ఇంటికి  తాను  వెళ్ళలేని  పరిస్థితి  సీతది. 


సీతాదేవి భూప్రవేశం  చేయకుండా వాల్మీకిమహర్షి  ఆశ్రమంలో  ఉన్నా  బాగుండేది.  లేకపోతే   ఆమె తల్లిదండ్రులు తీసుకువెళ్తే  బాగుండేది. స్త్రీ  కష్టాలలో  చిక్కుకుంటే  భర్తే  ఆదుకోవాలి.  లేకుంటే  ఆమె  తల్లిదండ్రులు గానీ  సోదరులు గానీ ఆదుకోవాలి. ఆమె పిల్లలు  పెద్దవాళ్ళయితే  వారు  చూసుకోవాలి.

 రాముడు  రాజు కాబట్టి  ఎన్నో విషయాల గురించి ఆలోచించి  సీతను అడవులకు  పంపించాడు.  రాముడు  ఒక  సాధారణ  మానవుడు  అయి ఉన్నట్లయితే , లోకం  ఏమన్నాకూడా   సీతను  తప్పక ఏలుకునేవాడని  నా అభిప్రాయం.


( రాముడు  సీతను  ఏమైనా  కోరిక  కోరుకోమని  అడిగితే, వనాలలో  ఉన్న  మున్యాశ్రమాలను  చూడాలని  ఉందనే  కోరికను  కోరిందట  సీతాదేవి. సీతను  అడవుల్లో  వదలలేదు.  వాల్మీకి  మహర్షి  వంటి  ఉత్తములైన  వారి  ఆశ్రమం  సమీపంలో  విడిచివచ్చారు. ఎంతైనా ఇలా జరగటం  అత్యంత  బాధాకరమే. ఇవన్నీ ఇలా జరగటానికి అనేక కారణాలున్నాయి .ఈ కధల  ద్వారా పెద్దలు రాబోయే తరాలకు  ఎన్నో విషయాలను నేర్పించారు .)       

.............

వాళ్ళ  అభిప్రాయాలు.. ప్రజలు తిరుగుబాటు చేస్తారనే అనుమానం ఉంటే మళ్ళీ భరతుణ్ణి సింహాసనం పైన కూర్చోబెట్టి భార్యతో సహా అడవి మార్గం పట్టవలసింది! రామరాజు తన పతిధర్మం కోసం అయోధ్య సింహాసనాన్ని వదులుకోలేకపోయాడు. 

anrd..రాముడు  పతిధర్మం  కోసం  సింహాసనాన్ని  వదుకోలేకపోయాడని  అభాండాలు వేయటం  సరైనది  కాదు..భరతుడు రాజ్యాన్ని  ఏలటానికి ఇష్టపడలేదు.  సీతారాములు  ఎందరికో  స్పూర్తిని  కలిగించారు. ఇలాంటి  వారినుంచి  స్పూర్తిని  పొంది,  తరతరాల  నుండి  ఎందరో  వ్యక్తులు తమ  వ్యక్తిగత ఆశలను  కొంతైనా త్యాగం  చేసి  సమాజంలో  అధర్మం పెరగకుండా కృషి చేస్తున్నారు.  

 ఈ నాటికీ  ఎందరో  సైనికులు  దేశరక్షణ కోసం  తమ కుటుంబాలకు  దూరంగా  మంచు  కొండలలో  విధులను  నిర్వహిస్తున్నారు.  సైనికులు విధులకు  వెళ్ళినప్పుడు  వారి భార్యలు  భర్తలకు  దూరంగా  పిల్లాపాపలతో  జనారణ్యంలో ఒంటరిగా  జీవిస్తున్నారు. 


అధికారం కోసం కొన్నిదేశాల స్వార్ధపరులైన  పాలకులు  సాగించే  యుద్ధాలలో ఎందరో  సైనికులు  ప్రాణాలను  పోగొట్టుకుంటున్నారు. సైనికులు  తమ  కుటుంబాలకు  దూరంగా  ఉంటూ  దేశసరిహద్దులను  కాపలా  కాయకపోతే  దేశంలోని  ప్రజలు  సుఖంగా  కుటుంబాలతో  కలిసి  ఉండగలరా ? 

 పూర్వం రాజులు రాణులు  కూడా, ధర్మాన్ని  రక్షించటం  కోసం మరియు  తమ  రాజ్యప్రజలక్షేమంకోసం ..తమ సొంత క్షేమాన్ని, తమ సుఖసంతోషాలనూ కూడా అంతగా  లెక్కచేసేవారు కాదు. సీతారాములు  అలాంటి  త్యాగమూర్తులు.  

............
వాళ్ళ  అభిప్రాయాలు.. రాముడు ఎక్కువ కాలం...  నిషాదుడు, కేవటుడు, భిల్లిని, గద్ద, ఎలుగుబంటి, కోతి - వీరి మధ్యనే గదా ఉన్నాడు! మూర్ఖపు దాసి మాటలకు తండ్రి కొడుకుకు వనవాసం ఇచ్చాడు. ఈయన మతిలేని చాకలివాని మాటలకు భార్యకు వనవాసం ఇచ్చాడు. వాళ్ళ ఆస్థానంలో చిన్న వాళ్ళదే పెత్తనం. ఇంట్లో మంథర, బయట దుర్ముఖుడు! (రాముని గూఢచారి). 

anrd.. వాళ్ళ ఆస్థానంలో చిన్న వాళ్ళదే పెత్తనం.అనీ అంటారు. శూద్రుడైన  శంభూకుడిని చంపేసాడు.అనీ  అంటారు. రాముడు, శూద్రురాలైన  శబరిని  ఎంతో ఆదరించాడు . లోకానికి  చేటు తెచ్చే  కోరికలతో  తపస్సు  చేస్తుండటం వల్లనే  శంభూకుడిని  వధించాడు.
.............
వాళ్ళ  అభిప్రాయాలు..  వాలిని ఆ విధంగా చెట్టు చాటున దాక్కొని ఎందుకు చంపాడు? ఎదురెదురుగా యుద్ధంచేసి చంపవలసింది? 

anrd..వాలి  తనకు  ఎదురుగా  నిలబడి  యుద్ధంచేసే  వారి  శక్తి క్షీణించాలనే  ప్రత్యేకమైన వరాన్ని  పొందినవాడు. ఇలాంటి ప్రత్యేకమైన వరాల  సహాయంతో ఇతరులను  బాధపెట్టే  వారి విషయంలో  ధర్మసూక్ష్మాలూ  ప్రత్యేకంగానే  ఉంటాయిమరి. ఇలాంటి  సందర్భాలలో   చెట్టుచాటునుండి  సంహరించటంలో  అధర్మమేమీ  లేదు.
..........
వాళ్ళ  అభిప్రాయాలు.. “ఏ పాపానికైతే (సోదరుడు సుగ్రీవుని భార్య తారను కైవసం చేసుకున్నందుకు” వ్యాధుని లాగా వాలిని చంపాడో అదే పాపం తర్వాత వాలి భార్యను తనదానిగా చేసుకుని సుగ్రీవుడు చేశాడు. ఆ దుశ్చేష్టే (రావణ వధానంతరం మండోదరిని కైవసం చేసుకొని ) విభీషణుడు కూడా చేశాడు.

anrd..  మానవులకు, వానరములకు, రాక్షసులకు  ధర్మాలలో  వ్యత్యాసం  ఉండొచ్చదన్నది ఇక్కడ మనం గమనించవలసిన  విషయం. 

వాలి యొక్క భార్య  అయిన తార  సుగ్రీవుని  వివాహం  చేసుకోవటాన్ని  గమనిస్తే అనేక  విషయాలను  గమనించవచ్చు. సంధ్యావందనం చేసే వానర జాతికి, రాజ్యపాలన చేసే వానర జాతికి, మంత్రులచేత సేవింపబడే వానర జాతికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ జాతిలోని స్త్రీలు తమ భర్త మరణిస్తే మరిదిని పునర్వివాహం చేసుకొని, వారితో ఉండచ్చు.

 సుగ్రీవుడు బతికే ఉన్నాడని తెలిసి కూడా ఆయన భార్యతో కామ సుఖాలని అనుభవించడం వాలి యొక్క దోషం.


ఇంకో  విషయమేమిటంటే, వాలికి రావణాసురుడికి స్నేహం ఉంది, వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం వాలి అనుభవించే స్త్రీని రావణుడు అనుభవించచ్చు, వాలికి శత్రువు రావణుడికి శత్రువే..అలా కొన్ని విషయాలలో ఒప్పందం కుదుర్చుకున్నారు ).

(ఈ  విషయాలు  అంతర్జాలంలో  చదివి  వ్రాసినవి.)

 రావణాసురుడు, మండోదరి ..రాక్షసజాతికి రాజు, రాణి.

రావణుడు ఎన్నో  అధర్మాలు  చేశాడు. దేవతలను  పీడించేవాడు.వేదవతిని అపహరించటానికి  ప్రయత్నించి  ఆమె మృతికి  కారణమయ్యాడు.  వాలిని, రావణుణ్ణి సంహరించటమే  సరైనది.
..............
వాళ్ళ  అభిప్రాయాలు.. లంకకు తీసుకెళ్ళి కూడా రావణుడు సీతను అవమానించలేదు. రాణివాసంలోకి తీసుకెళ్ళలేదు. అశోకవాటికలో ఉంచాడు. అందరూ రాక్షసుడనవచ్చు. కానీ, అంత సభ్యతతో కూడిన ప్రవర్తన మనుషుల్లో అరుదుగానే కనిపిస్తుంది.

anrd..ఇష్టంలేని  స్త్రీని  బలవంతం  చేస్తే  రావణుని  తల  బ్రద్దలవుతుందని  రావణునికి  ఒక  శాపం  ఉంది....అందుకే  రావణుడు  తనను  వివాహం  చేసుకోమని   సీతాదేవిని ప్రాధేయపడటం,  బెదిరించటం  వరకే  చేసేవాడు.అంతేకానీ రావణుడికి సభ్యతతో కూడిన ప్రవర్తన  ఉండటం  వల్ల కాదు.
............................... 

వాళ్ళ  అభిప్రాయాలు.. ఇద్దరు పట్టమహిషులుండగా ముసలితనంలో మూడో పెళ్ళి చేసుకోవాలనే సరదా దశరథునికి ఎందుకు పుట్టింది?

anrd..పురాణేతిహాసాల  ద్వారా  ఇంకో విషయం  కూడా  తెలుసుకోవచ్చు.   కైకేయి   కోరిన  వరాల  వల్ల  రాముడు  అరణ్యాలకు  వెళ్ళవలసి  వచ్చింది. ఎక్కువ  వివాహాల  వల్ల ఎక్కువ  కష్టాలు  వచ్చే  అవకాశముందని  తెలుసుకోవచ్చు.
 ....................  

వాళ్ళ  అభిప్రాయాలు.. అయోధ్య నుండి  సైన్యం సన్నద్ధం చేసుకొని భరతుడు  వెళ్ళి ఉంటే రామునికి కోతుల సహాయం ఎందుకు తీసుకోవలసి వచ్చేది?

anrd.. భరతుడు  సైన్యంతో  రాకుండా  వానరుల  సహకారంతో  రావణ వధ  జరగటం ద్వారా ఎన్నో గొప్ప సందేశాలను తెలుసుకోవచ్చు. 

 క్రూరులు, బలవంతులూ  అయిన  రాక్షసులు  సౌమ్యులైన  వానరుల చేతిలో పరాజయాన్ని  పొందిన  కధ  ఇది. ధర్మాన్ని  ఆచరించేవారికి  మానసికధైర్యాన్ని  అందించే  కధ  ఇది. రామతత్వం  రావణతత్వంపై  విజయాన్ని సాధించిన కధ ఇది. లోకంలో అంతిమ  విజయం  ధర్మానిదే అని  చాటిచెప్పిన  కధ ఇది.

.................
వాళ్ళ  అభిప్రాయాలు.. హనుమంతుడు  మొదటి యజమాని సుగ్రీవుణ్ణి వదిలిపెట్టి రాముని సేవకు అంకితమైపోయాడు.

anrd..హనుమంతుడు  రామలక్ష్మణుల  సహాయంతో  తన  రాజు  అయిన  సుగ్రీవుని కాపాడాడు.ఆ విధంగా సుగ్రీవుని  పట్ల  తన స్వామిభక్తిని  నిరూపించుకున్నాడు. సీతాదేవిని వెదకటానికి సాయం చేస్తానని  సుగ్రీవుడు  ఇచ్చిన మాటలో భాగంగా కూడా హనుమంతుడు  సీతాదేవిని వెదకటంలో సాయం చేసారు.   
 ..........................
 వాళ్ళ  అభిప్రాయాలు.. విభీషణుడు ఎలాంటి ఆదర్శం ? ‘ఇంటి గూఢచారి లంకను ధ్వంసం చేస్తాడు’ అనే సామెతకు కారకుడయ్యాడు. 

anrd..రావణుడు ఎన్నో  అధర్మాలు  చేశాడు.  ఇలాంటివాని మరణానికి  సహాయం  చేయటంలో  ఎలాంటి తప్పూ  లేదు. అధర్మవర్తనులను శిక్షించటంలో బంధు ప్రీతి ఉండరాదు అంటారు  కదా ! 
..................... 
( పురాణేతిహాసాల  ద్వారా , పెద్దలు రాబోయే  తరాలకు  ఎన్నో  విషయాలను నేర్పించారు .) 
.........  
ఆసక్తి  ఉన్నవారు  క్రింది  లింకు కూడా చూడగలరు .

No comments:

Post a Comment