koodali

Wednesday, November 12, 2014

రైతే రాజు...?


భారతదేశం  ఎక్కువగా  వ్యవసాధారిత  దేశం.  పాడిపంటలతో  సిరిసంపదలతో  తులతూగిన  దేశం .  ఇలాంటి  దేశంలో అన్నదాతలు  ఆత్మహత్యలు  చేసుకోవలసి  రావటం  అత్యంత  బాధాకరమైన  విషయం.

 ఒకప్పుడు  రైతుల  వద్ద  పుష్కలంగా  ధనం  ఉండేది. వాళ్ళే  ఇతరులకు  రుణాన్ని  ఇచ్చే  స్థాయిలో  ఉండేవారు. 

......................

ఇప్పుడు  టెక్నాలజీ  పరమైన  ఉపాధి  అవకాశాల పట్ల  ఆసక్తి  ఎక్కువ  అయింది . 


 ఆఫీసులో  పనిచేసే  ఉద్యోగికి  నెలకు  50  వేలు  జీతం  వస్తుంటే , రైతులకు  సంవత్సరానికి  50  వేలు  వచ్చే  పరిస్థితి  వల్ల  యువత  క్రమంగా  వ్యవసాయానికి  దూరమవుతున్నారు.

.................

రైతులు  ఆర్ధికంగా  నిలదొక్కుకోవటానికి  పటిష్టమైన  చర్యలను  చేపట్టాలి. 


దురదృష్టమేమిటంటే, తాను  పండించిన  పంటకు  సరైన  ధరను  నిర్ణయించుకునే  స్వాతంత్ర్యం  రైతులకు  లేదు. 


 రైతుల  వద్ద  పంటలను తక్కువ  ధరలకు  కొని , వాటితో  తయారుచేసే  పదార్ధాలను  తమకు  ఇష్టం  వచ్చిన  ధరకు  అమ్ముకుంటారు  వ్యాపారులు.


రైతుల వద్ద  కిలో  కాయగూరలను  కొనటానికి   బేరాలాడే  వాళ్ళు  కూడా  సూపర్  మార్కెట్ కు  వెళ్తే  బేరాలాడలేరు.  అక్కడ  అలాంటి  అవకాశం  ఉండదు  కదా ! ఏ  వస్తువైనా  వాళ్ళు  చెప్పిన  రేటుకు  చచ్చినట్లు  కొనవలసిందే.


రైతు  వద్ద  కిలో  పొటాటోస్   కొనటానికి  గీచిగీచి  బేరలాడే  జనాలు   చిన్న  పొటాటో  చిప్స్  పేకెట్ ను  ఏ మాత్రం  బేరమాడకుండా   ఎగబడి  కొనేస్తారు. 

.........................

వివిధ  ప్రాంతాలలో  క్వింటాలు  ధాన్యం మరియు  పప్పుల  ధరలు  ఎలా  ఉన్నాయనే  విషయాలను  గురించిన   వార్తలను పరిశీలించితే.. 


  రైతులు  అమ్ముకునే   ధరలకు....   బయట  మార్కెట్ లో  వినియోగదారులకు  అమ్మే   ధరలకు  చాలా  వ్యత్యాసం  ఉందనే  విషయం  స్పష్టంగా  తెలుస్తుంది.


ఎన్నో  కష్టాలకు  ఓర్చి,  ఎంతో  శ్రమించి  పంటలను  పండించుకున్న  రైతులకు  పంటను   అమ్ముకునేటప్పుడు   మాత్రం   తక్కువ  ఆదాయం  లభిస్తోంది. 


రైతులూ  నష్టపోతున్నారు   వినియోగదారులూ  నష్టపోతున్నారు. 


మధ్యలో  దళారీ  వ్యాపారులు  ఎక్కువ  లాభాలను  పొందుతున్నారు. దళారులు మరీ  ఎక్కువ  లాభాలకు  ఆశపడకుండా  ధర్మబద్ధంగా  లాభాలను  వేసుకోవాలి.

...................

పాతకాలంలో ... రైతులకు  విత్తనాలను, ఎరువులను  బయట  కొనవలసిన  పరిస్థితి  ఉండేది  కాదు.  


  రైతులు  తాము పండించిన  పంట  నుంచి  విత్తనాలను  తీసి  వాడుకునేవారు,  తాము  తయారుచేసుకున్న   సేంద్రియ ఎరువులను  వాడుకునేవారు.


 పాతకాలంలో  పురుగుమందుల  వాడే  అవసరం  అంతగా  ఉండేది  కాదు.   కొన్నిసార్లు  అవసరమైతే , వేప  మొదలైన  సహజ మందులను  వాడుకునేవారు.


 ఈ రోజుల్లో .. ఎరువులు,  పురుగుమందులు,  విత్తనాలకు   బోలెడు  డబ్బు పెట్టి  బయట  కొనవలసి  రావటం  వల్ల  రైతులకు  బోలెడు  డబ్బు  ఖర్చవుతోంది. దీనికి  తోడు  అతివృష్టి,  అనావృష్టి  వంటి  వల్ల  కష్టాలు. 


 ఇన్ని  కష్టాలు  పడి ,అప్పు  చేసి    వ్యవసాయం  చేసినా  గిట్టుబాటు  ధర  విషయంలో    రైతుకు  స్వాతంత్ర్యం  లేదు.

................

ఈ  రోజుల్లో  కూడా   సేంద్రియపద్ధతిలో  వ్యవసాయం  చేస్తూ  అధిక  దిగుబడులను  పొందుతున్న  రైతుల  గురించి  వార్తలను  చూస్తున్నాము.


 ఇతర  రైతులు  కూడా  సేంద్రియపద్ధతులను  తిరిగి  అలవాటు  చేసుకుంటే  బాగుంటుంది. సేంద్రియ  పద్ధతిలో  పండించిన  పంటలకు  మార్కెటులో  బాగా  డిమాండ్  ఉంది.

..................

అన్నదాతలను  ఆదుకునే  విషయంలో  ప్రభుత్వాలు   శ్రద్ధ  చూపించాలి . 


దళారీల  దోపిడీ  లేకుండా  రైతులను  ఆదుకోవాలి.

రైతులకు  సోలార్  పంప్  సెట్లను  ఇప్పించవచ్చు.


పంటను  నిల్వ  చేసుకోవటానికి  తగినన్ని   శీతల  గిడ్డంగులను    నిర్మించే   విషయంలో  జాప్యం  జరుగుతోంది. 


పండిన  పంటలను  ఎండబెట్టి  నిల్వ  ఉంచుకోవటానికి  వీలుగా  సోలార్  డ్రయ్యర్లను   కూడా   అందించవచ్చు. 

.......................... 

వరి  పండించటానికి  ఎక్కువనీరు  వాడుతుంటారు.  అయితే,  వరిని  కూడా  తక్కువ  నీటితో  పండించవచ్చని  అంటున్నారు.
..............

పండిన  పంటలను చక్కటి   రేటు  లభించేలా   ప్రభుత్వమే  మార్కెటింగ్  అవకాశాలను  కల్పించాలి.


 వ్యవసాయాధారిత  పరిశ్రమలను  ఎక్కువగా  నెలకొల్పి  రైతులకు  ఎక్కువ  ఆదాయం  వచ్చేటట్లు  చేయవచ్చు.

....................

అన్నం  పెట్టే  రైతులకు  రుణమాఫీ చేయటం  సబబే  కానీ,  దీనికన్నా..... 


రైతులు  రుణమాఫీ   కోసం  ఎదురుచూసే   పరిస్థితి  లేకుండా  ప్రభుత్వాలు  చేయూత నివ్వాలి.




2 comments:

  1. రైతు బాగో లేడు. ప్రభుత్వాలన్నీ రైతు కోసమే అంటున్నాయి కాని చేసేది కనపడటం లేదు. గత పది, పదిహేనేళ్ళుగా ఏళ్ళుగా రైతు పని పెనం మీంచి పొయ్యిలో పడినట్టే ఉంది.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమేనండి. ప్రభుత్వాలన్నీ రైతుల కష్టాలను మరియు పేదప్రజల కష్టాలను తీర్చేస్తాము .. అని హామీలను గుప్పిస్తూ అధికారంలోకి వస్తాయి.

    అయితే, ఆచరణలో మాత్రం సరైన ఫలితాలు కనిపించటం లేదు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా పేదరికం పెరిగిందే తప్ప తరిగినట్లు కనిపించటం లేదు.

    దేశంలోని సమస్యలు తీరకపోవటానికి మీరు కారణమంటే మీరే కారణమని ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకోవటానికే ఎక్కడి సమయమూ చాలటం లేదు.

    అన్ని రంగాలూ క్రమంగా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తుంటే పేద, మధ్యతరగతి ప్రజలు కార్పోరేట్ శక్తుల వద్ద ఉద్యోగస్తులుగా పనిచేస్తూ .. ఉపాధి కోసం వారిపై ఆధారపడే పరిస్థితి పెరిగేలా కనిపిస్తోంది.

    ఉపాధి కోసం కార్పొరేట్ సంస్థలపై ఆధారపడకుండా స్వయం ఉపాధి సాధించటానికి యువతకు చేయూత ఇచ్చే అవకాశాలు సన్నగిల్లే సూచనలు కనిపిస్తున్నాయి.

    ReplyDelete