koodali

Friday, June 8, 2012

హరిశ్చంద్రుని గురించి, మరియు ఇంకా కొన్ని విషయాలు....టపా చివర....

లోకహితం కోసం రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేసి కష్టాలను ఆహ్వానించిన హరిశ్చంద్రుడు , వారి కుటుంబసభ్యులు ఎంతో గొప్పవారు. తరతరాల నుంచి ఎందరికో స్పూర్తినిచ్చింది హరిశ్చంద్రుని చరిత్ర.  

హరిశ్చంద్రుని వంటి త్యాగమూర్తుల నుండి స్పూర్తిని పొంది ఎందరో వ్యక్తులు తామూ తమకు చేతనైనంత త్యాగాలు చేసారు.

 

 ధర్మం కోసం రాజ్యసంపదను కూడా అవలీలగా వదిలేసిన హరిశ్చంద్రుని వంటి వారి గురించి తెలుసుకోవటం వల్ల, మోసంచేసి ఇతరులను సంపదను కూడా మింగేసి బతికే వారి సంఖ్య కొంతైనా తగ్గే అవకాశం ఉంది. .( అలాంటి వారు మంచిగా మారే అవకాశం కూడా ఉంది. )  


రాజే అసత్యవంతుడైతే , యధారాజా తధాప్రజా అన్నట్లు ...సమాజం అబధ్ధాలు, మోసాలతో అస్తవ్యస్తమైపోతుంది. ఆ పాపఫలితంగా ప్రజలు నరకానికే పోతారు. ఇలాంటి పాపాలు ప్రజలు చెయ్యకుండా వారికి ధర్మాన్ని నేర్పించటానికి హరిశ్చంద్రుడు వారి కుటుంబసభ్యులు ఎన్నో కష్టాలను సహించారు. 

హరిశ్చంద్రుడు, వారి కుటుంబసభ్యులు బాధలు పడటం బాధాకరమే కానీ, ఇలాంటి వారి త్యాగాల వల్ల లోకం ఇంకా చక్కగా ఉంది. 

 

 స్వాతంత్రోద్యమం సమయంలో ఎందరో దేశ భక్తులు తమ ఆస్తులను కోల్పోయి, తమ కుటుంబసభ్యులను వారి మానాన వారిని వదిలి , తాము దేశం కోసం జైలులో గడిపారు. భగత్ సింగ్ వంటి యువకులు తమ నిండు జీవితాన్ని కోల్పోయారు. ఇలాంటి వారి కుటుంబసభ్యులు కూడా త్యాగాలు చేయవలసి వస్తుంది. ఇలాంటి త్యాగమూర్తులందరి త్యాగాల ఫలితంగా ఇప్పుడు మనందరం స్వేచ్చగా జీవిస్తున్నాము. ( ఎందరో పేదలు తిండిలేక అల్లాడుతుంటే , అర్ధనగ్న దృశ్యాలు ఉన్న సినిమాలు , అర్ధరాత్రి పాటలు వంటివి చూస్తూ కోటిరూపాయల కార్లు, లక్షల విలువ చేసే నగలు ధరించి కులాసాగా బతుకుతున్నాము.. )

 

  హరిశ్చంద్రుని కధలోని కొన్ని విషయాలు. ...విశ్వామిత్రుడు తన బాకీ తీర్చమని అడిగినప్పుడు, హరిశ్చంద్రుడు తన భార్యతో ... దేవీ...సత్యానికే కట్టుబడి ఉందాం. అయితే ఈ రుణం తీర్చే ఉపాయమేమిటి ..? అని వారిద్దరూ పరిపరివిధాలా ఆలోచిస్తారు.  


 విశ్వామిత్రుడు వచ్చి హరిశ్చంద్రునితో ........ రాజా ! ధైర్యంగా బతకాలనుకుంటే ముందు నా అప్పు తీర్చు. సత్యానికి కట్టుబడి ఉండటమంటే మాటలనుకొంటున్నావా ? సత్యం వల్లనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సత్యం వల్లనే భూగోళం నిలబడింది. సత్యంలోనే ఉత్తమ ధర్మం ఉంది. సత్యంలోనే స్వర్గమూ ఉంది. నూరు అశ్వమేధాలనీ ఒక సత్యాన్ని చెరొకవైపూ వేసి తూచితే సత్యం వైపే మొగ్గు ఉంటుంది. ......సూర్యుడు అస్తమించేలోగా నా దక్షిణ నాకివ్వకపోయావో శపించానన్నమాటే.....అని బెదిరించి వెళ్ళిపోయాడు. 


 ఆ తరువాత దక్షిణ ఇవ్వటం ఎలాగా ? అని భార్యాభర్త ఎన్నో విధాలుగా ఆలోచిస్తారు.

 అప్పుడు హరిశ్చంద్రుని భార్య తనని ఎవరికైనా అమ్మి అప్పు తీర్చమని చెప్పి, ..... నాధా ! నా మాట విను. కాదనకు. ఆట్టే వ్యవధి లేదు. సూర్యాస్తమయమే గడువు. విప్ర శాపాగ్నిలో దహించుకుపోయి నీచత్వం పొందకు. నన్ను అమ్ముతున్నది జూదం కోసం కాదు, మద్యం కోసం కాదు, రాజ్యం కోసం కాదు, భోగం కోసం కాదు, గురు ఋణం తీర్చడానికి, సత్యవ్రతం సఫలం చేసుకోడానికి, కాబట్టి కించపడవలసింది లేకపోగా ఇది గర్వించదగిన అంశం. దయచేసి నా మాట ఆలకించు. నన్ను ఎవరికైనా అమ్మేయ్. 

 

 ఇలా ఆమె పోరగా పోరగా కట్టకడపటికి గతిలేక హరిశ్చంద్రుడు అంగీకరించాడు. తరువాత విశ్వామిత్రుడు వచ్చినప్పుడు భార్యను, కొడుకును అమ్మగా వచ్చిన సొమ్మును విశ్వామిత్రునికి ఇవ్వగా ఇంకా కొంచెం బాకీ మిగిలే ఉంటుంది. 

 

మిగిలిన బాకీని తీర్చటం గురించి విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని తీవ్రంగా వత్తిడి చేస్తాడు. హరిశ్చంద్రుడు గడువు పెంచమని అడిగినా ఒప్పుకోడు. హరిశ్చంద్రా ! గడువు పెంచడం కుదరదు. ఈ రోజుకి ఇంకా నాల్గవ భాగం మిగిలి ఉంది. అది ముగిసేలోగా నువ్వు సంపాదించడమూ నాకు చెల్లించడమూ అవ్వాలి. అంతకు మించి క్షణం ఆగను. నువ్వు ఏమి చెప్పకు నేను వినను..అంటాడు విశ్వామిత్రుడు. 

 

 హరిశ్చంద్రునికి.... తనను తాను అమ్ముకోవడం తప్ప వేరే ఉపాయం కనిపించలేదు. అదే అరుగుమీద నిలబడి , తలదించుకుని బిగ్గరగా అరిచాడు. ......"సేవకుడుగా నన్ను కొనుక్కుని సుఖపడదలచిన వారు ఉంటే త్వరపడండి. సూర్యాస్తమయానికి ఇంక ఒక జాము మాత్రమే ఉంది. " అని ప్రకటించాడు. 

వాక్యం ముగిసే సమయానికి యమధర్మరాజు ఒక చండాలుడుగా అక్కడికి వచ్చాడు. విశ్వామిత్రుని బాకీ తీర్చేస్తాడు హరిశ్చంద్రుడు. 

 

 విశ్వామిత్రుడు అటువెళ్ళగానే ప్రవీరుడు హరిశ్చంద్రుడి చేతులకి బంధం వేసి తాడుకొస చేత్తో పట్టుకున్నాడు. ...........అతడిని ప్రవీరుడు తన పేటలోకి లాక్కుపోయాడు. గుడిసె ముందు నిలబెట్టాడు. కాళ్ళకు కూడా బంధం వేశాడు. అలా వదిలేసి తాను వెళ్ళి గుడిసెలో దూరి కుక్కి మంచం మీద హాయిగా పడుకుని నిద్రపోయాడు.

 అయిదవనాడు చండాలుడికి రవ్వంత దయ కలిగినట్టుంది. బంధాలు విప్పేశాడు. ( తరువాత శ్మశానంలో కాటికాపరిగా పని అప్పగించాడు.) 

 

హరిశ్చంద్రుని భార్య బ్రాహ్మణుని ఇంట పని చేసుకుని జీవిస్తోంది. ఒకరోజు హరిశ్చంద్రుని కుమారుడు రోహితుడు విప్రబాలురతో అడవికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు సమిధల మోపును మోస్తూ , ఆ బరువు వల్ల అందరికన్నా వెనకకా నడిచి వస్తుండగా, ఒక చెరువును చూసి దాహం వేసి ఆ మోపును ఒక పుట్టవద్ద జారవిడిచి , దాహం తీర్చుకుని మోపును ఎత్తుకోబోతుండగా , విశ్వామిత్రుని ఆజ్ఞమేరకు ఒక కృష్ణసర్పం రోహితుణ్ణి కాటు వేస్తుంది. అమ్మా ! అని దిక్కులు అదిరేలా అరిచి పిల్లవాడు పడిపోతాడు .

 

ముందు వెడుతున్న బాలురు ఈ కేకను గుర్తు పట్టి రోహితుడికి ఏమో అయ్యిందని పరుగుపరుగున వచ్చారు. ......( జరిగినదంతా చూసారు.) ....భయం వేసింది. .అందరూ ఒక్క ఉదుటున పరుగు లంకించుకున్నారు. రొప్పుతూ రోజుతూ ఇంటికి వచ్చారు. వస్తూనే..... దాసీ ! దాసీ ! మాతో ఆడుకోడానికి వచ్చాడు కదా ! రోహితుడు అడవిలో పాము కరిచింది చనిపోయినట్టున్నాడు . అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి గదిలో దూరి తలుపులు వేసేసుకున్నారు. 

 

కుమారుని మృతి విని శోకిస్తున్న హరిశ్చంద్రుని భార్యను ఆ విప్రుడు , ఏమిటే దాసీదానా ! సందెవేళ ఈ శోకన్నాలు?......ఇలా .... మాట్లాడతాడు. ఇంకా....... ....దుష్టులారా ! కోటి నిష్కాలు నీ మొగుడి మొగాన పోసి కొన్నాను. ఇంకా ఏడాది కాలేదు. అప్పుడే నన్ను ముంచేసేట్టున్నావు. ఇంటిపనులు చెయ్యటానికి అంత ఓపిక లేని దానివైతే నా సొమ్ము ఎందుకు తీసుకున్నారే ? వెళ్ళు, పట్టుకురా నా డబ్బు. నా కోటి టంకాలూ నాకు పడేసి , నీ దారిన నువ్వు పో కొడుకును కూడా తీసుకుపోయేట్టయితే ఆ ధనం కూడా తెచ్చి ఇచ్చేసేయ్. డబ్బు కావాలి , చాకిరీ మాత్రం పనికిరాదు. ..ఎలా కుదురుతుంది ? అవ్వా బువ్వా కావాలంటే వస్తాయా ? ఇలా .... మాట్లాడతాడు. 

 

అప్పుడు ఆమె.,.... నేను పనిచేయలేక ఏడవటం లేదయా! నా కొడుకుని పాము కరిచిందట. అడవిలో పాము కరిచిందట. చచిపోయాడుట. వాణ్ణి చూసొస్తానయా! ఒక్కసారి ఈ పూటకి అనుమతి ఇవ్వు...........అని అడిగినా. .... ఓసీ ! నీచురాలా దుర్వార్తలు చెప్పకు. కల్లబొల్లి కబుర్లూ ఏడుపులూ నా దగ్గర కాదు. పని ఎగ్గొట్టడానికి మీరు ఎంతలేసి అబద్దాలన్నా ఆడతారు. ...........ఇలా మాట్లాడతాడు.

 

 ఇంటి పని అయిన తరువాత , ఒసేవ్ ! ఇప్పుడు వెళ్ళు. నీ కొడుకును చూసుకో. చచ్చిపోయాడు అంటున్నావుగా. వెళ్ళు దహనక్రియలూ అవీ పూర్తి చేసి త్వరగా వచ్చెయ్. తెల్లవారుజామున పాచిపనికి అందుకోవాలి సుమా ! ఆలస్యం అయితే ఊరుకునేది లేదు. వెళ్ళిరా....అన్నాడు. 

 

 హరిశ్చంద్రుని భార్య అడవికి వెళ్లి , కొడుకు మృతదేహాన్ని శ్మశానికి తీసుకురావటం , అక్కడ భార్యాభర్తలు ఒకరినొకరు గుర్తుపట్టి , ఇక ఈ బాధలు పడలేమని నిర్ణయించుకుని మరణించటానికి సిధ్ధపడగా , దేవతలు ప్రత్యక్షమయి వారి కుమారుని బతికించి వారికి ఎన్నో వరాలనిస్తారు. 

 

హరిశ్చంద్రుడు , వారి కుటుంబసభ్యులు కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా , ధర్మరక్షణ కోసం సహించి , చరిత్రలో నిలిచిపోయారు. 

  ( ఈ విప్రుడు ఇదంతా విశ్వామిత్రుని ఏర్పాటే. ఇలా సతాయిస్తే తట్టుకోలేక హరిశ్చంద్రుడు మాట తప్పుతాడని విశ్వామిత్రుని అయిడియా..) 

 

( హరిశ్చంద్రుని భార్యను కొన్న విప్రుడు తన డబ్బులు తనకు ఇచ్చేసి హరిశ్చంద్రుని భార్యను, కొడుకును వెళ్ళిపొమ్మనటం గమనిస్తే .... డబ్బు ఇస్తే హరిశ్చంద్రుడు తన భార్యా , కుమారుని తిరిగి తెచ్చుకోవచ్చు కాబట్టి ..... ఇది అమ్మకం కాదు అనిపిస్తుంది. ) 

 

ఈ రోజులలో కూడా.. కొందరు ఆర్ధికంగా సమస్యలలో ఉన్నప్పుడు ఎవరిదగ్గరైనా పనిలో చేరి, ఎక్కువ మొత్తం ధనాన్ని(జీతాన్ని) ముందే తీసుకుని... ధనాన్ని(జీతాన్ని)ఇచ్చినవారివద్ద..ధనాన్ని(జీతాన్ని) తీసుకున్నవారి కుటుంబసభ్యులు కూడా పని చేయటం అనే సంఘటనల గురించి వింటుంటాము.ఇలాంటప్పుడు, వారితో కొందరు యజమానులు విపరీతంగా పనిచేయించుకుంటారు. ఇది బాధాకరం. అయితే, ఈ పద్ధతి బానిస పద్ధతిలో వ్యక్తులను అమ్మటం వంటిది కాదు. 

 

 ఇంకా కొన్ని విషయాలు.. 1... Yuga - Wikipedia, the free encyclopedia............ Sri Yukteswar's teachings on the yugas............అన్న దగ్గర చూస్తే సత్యయుగం., త్రేతాయుగం ,ద్వాపరయుగం, కలియుగం .....వీటి గురించి వివరాలున్నాయి. ......................... 2... Floating Buddhist Monk Woman of Kanchanaburi, ,Thailand Woman of Kanchanaburi, ,Thailand ....ఇది వీడియో. ............

 

8 comments:

  1. చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. నాకు ఇప్పటి వరకు సినిమా knowledge మాత్రమే ఉంది. ఇంత detailed గా తెలియదు.
    మీకు ధన్యవాదములు.
    :venkat.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. శ్రీ దేవీ భాగవతము లో హరిశ్చంద్రుని కధ ఉందండి..

    ReplyDelete
  3. హరిశ్చంద్రుని కధలో రోహితుణ్ణి పాము కరిచిన తరువాత విప్రబాలురు ఆ వార్తను ఇంటికి వచ్చి మాధవీదేవికి చెప్పటం......ఇలా మరి కొన్ని విషయాలు రాసానండి.

    ReplyDelete
  4. మీరు మనుషులను సన్మార్గం వైపు నడిపే పోస్ట్ లను బ్లాగులలో వ్రాస్తూ గొప్ప ప్రేరణ గా నిలుస్తున్నారు.హరిశ్చంద్రుడి కథ చిన్నప్పట్నుండి వింటున్నాము.చాలా బాగా వ్రాశారు .అంత కంటే అందులోని ధర్మాన్ని చెప్పారు.

    ReplyDelete
  5. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    అంతా దైవం దయ. ఇదంతా నా గొప్పతనం కాదండి. పత్రికలు, పుస్తకాలు , ఇంకా మీడియా ద్వారా ఎందరో తమకు తెలిసిన విషయాలను ప్రపంచానికి అందిస్తున్నారు. ఆ విధంగా నేను ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నాను.

    మీ బ్లాగ్ లో కూడా మీరు చక్కటి విషయాలను రాస్తున్నారు.

    ReplyDelete
  6. చాలా బాగుంది. ఇది కథ మాత్రమెనా? నిజంగానే చరిత్రలో జరిగిందా??

    ReplyDelete
  7. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    నిజంగానే జరిగిందని నేను భావిస్తున్నానండి..

    ReplyDelete